S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమయోచితం (కథ)

మగధ రాజ్యాన్ని శూరసేనుడనే రాజు, నీతి నియమాలు పాటిస్తూ, ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తూ.. ప్రజారంజకంగా పాలిస్తూ ఉండేవాడు. ప్రజలు కూడా ధర్మనిరతులై, సదా రాజు క్షేమాన్ని కోరుకుంటూ వినయ విధేయతలతో జీవనం సాగిస్తూండేవారు. అకస్మాత్తుగా అనుకోని సంఘటన జరిగి రాజు చింతలో పడ్డాడు. రాజ్య ధనాగారాన్ని కడు సమర్థవంతంగా నిర్వహించే సత్యపాలుడు హఠాత్తుగా మరణించాడు. ఎంతో నమ్మకంగా పని చేస్తున్న అధికారి మరణించడం రాజును ఆలోచనలో పడేసింది.
మళ్లీ అటువంటి మనిషిని నియమించుకోవడం కష్టమే. ధనాగారానికి అధికారి కావాలని, ఆ పదవికి కావలసిన అర్హతలను తెలుపుతూ, రాజుగారు నిర్వహించే పరీక్షకు హాజరు కావల్సిందిగా చాటింపు వేయించాడు.
అర్హతలు కలిగిన చాలామందే పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష జరిగింది. ఫలితాలు పరిశీలించగా అందరిలో ఇద్దరు యువకులు అర్హులుగా ఎంపిక చేయబడ్డారు. కానీ వారి ఫలితాలు సమఉజ్జీగా ఉన్నాయి. అందులో ఎవరిని ఎంపిక చెయ్యాలో పాలుపోక రాజుగారు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.
రాజు ఆ ఇద్దరు యువకుల్ని - విక్రముడు, త్రివిక్రముడు.. పిలిపించి వారిని వెంటబెట్టుకొని ధనాగారానికి చేరాడు. అక్కడ మొదట విక్రముని ధనాగారంలోకి పంపి, బయట గొళ్లెం పెట్టి, త్రివిక్రముడు, రాజుగారు బయట నిలబడ్డారు. కొంతసేపయిన తరువాత తలుపు తీసి విక్రముని బయటకు రమ్మని, త్రివిక్రముని లోపలకు పంపి తలుపు బయట గొళ్లెం పెట్టాడు. కొంతసేపయ్యాక తలుపు తీసి విక్రముని బయటకు రమ్మని, రాజు వారితో ‘ఆ కనపడే చెట్టు దాకా ఇద్దరూ పరుగెత్తండి’ అన్నాడు.
ఆ విధంగానే ఆ ఇద్దరూ పరుగుపెట్టారు.
పరుగెత్తేటప్పుడు విక్రముని అంగీలోంచి బంగారు నాణెలు కిందపడ్డాయి.
అది గమనించిన రాజు ‘విక్రమా! ధనాగారానికి అధికారిగా ఉండవలసిన వానికి దొంగ బుద్ధి కూడదు తెలుసా? నువ్వు ధనం మీద ఆశతో నాణెలు దొంగిలించావు. కాబట్టి ఈ పదవికి నువ్వు అనర్హుడవు’ అన్నాడు.
దానికి విక్రముడు జంకూ గొంకూ లేకుండా, తడబడకుండా,
ధైర్యంగా, ‘మహాప్రభూ! బంగారు నాణెలను తీసుకొన్నది ధనం మీద ఆశతో కాదు, దొంగతనమూ కాదు. నా ఉద్దేశం అసలు అది కానే కాదు. కారణం చెబుతా వినండి.. ‘్ధనాగారానికి అధికారిగా ఉండబోయేవాడు, అలా నాణేలు అంగీలో వేసుకొని పరుగుపెడితే, పరుగెత్తేటప్పుడు నాణేలు భూమి మీద పడితే, ఆ దేశపు రాజుకి క్షేమం, దేశం సుభిక్షంగా ఉంటుందని అనుభవజ్ఞుడైన మా తాతగారు చెబుతూ ఉండేవారు. అదృష్టవశాత్తూ ఆ అవకాశం నాకు దొరికింది. మా తాతగారు చెప్పినట్లు ప్రయత్నం చేశాను. ఇది మీ క్షేమం, రాజ్య క్షేమం కోరేగానీ, ఇందులో నా స్వార్థం.. దొంగబుద్ధితో మాత్రం కాదు’ అన్నాడు ధీమాగా.
అతని ధైర్యానికి సమయానుగుణంగా తన పనిని సమర్థించుకోగలిగిన నేర్పుకు లోపల సంతోషించాడు రాజు.
అయినా, నియమానుసారం త్రివిక్రముడినే ధనాగారానికి అధికారిగా నియమించాడు.
అలా అని విక్రముని వదిలిపెట్టలేదు. అతని ధైర్యాన్ని, సమయస్ఫూర్తికి మెచ్చి అతనిని తన ఆంతరంగిక సహాయకుడిగా నియమించుకున్నాడు. అన్ని విధాలా అర్హతలున్న ఆ యువకులకు తగిన ఉద్యోగాలిచ్చి, సమయోచితంగా వ్యవహరించి రాజు ఇద్దరికీ న్యాయం చేసి, వారి సేవలను ఉపయోగించుకున్నాడు.
ఆ యువకులిద్దరూ ‘నా ఎంపిక వమ్ము కాలేదు’ అని రాజు సంతోషించేలా తమ విధులు నిర్వర్తించుకుంటూ అటు ప్రజల, ఇటు రాజు మెప్పు సంపాదించుకున్నారు.
*
- రేవతి

రేవతి