S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. మీరే డిటెక్టివ్ 29

ఆపదా మపహర్తారాం దాతారాం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
భావం: మనకు కలిగే అన్ని ఆపదలని చంపేవాడు, మన మనస్సుకి ఆనందం కలిగించేంత అందమైన వాడు అయిన శ్రీరామ చంద్రునికి సదా నేను నమస్కరిస్తున్నాను.
* * *
హరిదాసు మంచినీళ్లు తాగి హరికథని ఆరంభించాడు.
‘శ్రీరాముడి దయ వల్ల నిన్నటితో బాలకాండని ముగించాను. ఇవ్వాళ నించి అయోధ్యకాండని ఆరంభిస్తాను. భరతుడు తన తాత ఇంటికి వెళ్తూ శతృఘు్నడ్ని కూడా ప్రేమగా వెంట తీసుకెళ్లాడు. అశ్వ సంపద గల మేనమామ యుధాజిత్తు దగ్గర వారు ఉండసాగారు. తాత గారింట్లో బస చేసిన ఆ సోదరులు ఇద్దరూ తరచూ తమ తండ్రిని గుర్తు తెచ్చుకోసాగారు. దశరథుడు కూడా భరత, శతృఘు్నలని సదా గుర్తు చేసుకునేవాడు. దశరథుడు తన నలుగురు కొడుకుల్నీ తన శరీరం నించి పుట్టిన నాలుగు చేతులుగా సమానంగా ప్రేమించేవాడు. ఐతే తన కొడుకులు అందరిలోకీ ఆయనకి రాముడి మీదే అధిక ప్రేమ ఉండేది. దుష్టుడైన రావణుడ్ని చంపడానికి దేవతలు ప్రార్థించగా భూలోకంలో పుట్టిన విష్ణుమూర్తి కదా ఆ రాముడు! ఇప్పుడు ఆ రాముడి గుణగణాలు చెప్తాను వినండి.
‘రాముడు అందగాడు. వీరుడు, అసూయ లేనివాడు. తండ్రికి ఉన్న మంచి గుణాలన్నీ గలవాడు. అతనితో సమానమైన ఇంకో కొడుకు భూమి మీద లేనే లేడు. ఎప్పుడూ శాంతంగా ఉండే రాముడు మృదువుగా మాట్లాడేవాడు. ఎవరైనా కోపంగా మాట్లాడినా తిరిగి తను కోపంగా బదులు చెప్పేవాడు కాదు. మంచి మనసు గల రాముడు ఎవరు చిన్న ఉపకారం చేసినా దానికి సంతోషించేవాడు. తనకి చేసిన అపారాలని గుర్తుంచుకునే వాడు కాదు. అస్త్భ్య్రాసం చేసే సమయంలో అవకాశం లభిస్తే రాముడు శీలంలో, జ్ఞానంలో, వయసులో వృద్ధులైన వారి దగ్గరికి, మంచి వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడేవాడు. తెలివిగలవాడు, పరాక్రమవంతుడైనా, అందుకు గర్వపడేవాడు కాదు. ఎన్నడూ అబద్ధం ఆడలేదు. అన్నీ తెలిసిన వాడు. బ్రాహ్మణులని, పెద్దలని గౌరవించేవాడు. ప్రజలకి అతని మీద ఎంత ప్రేమ ఉందో అతనికీ ప్రజల మీద అంత ప్రేమా ఉంది. దయగల అతను బాధల్లో ఉన్నవారిని చూసి జాలిపడేవాడు. అన్ని ధర్మాలు తెలిసిన వాడు. తనని సదా అదుపులో ఉంచుకునేవాడు. క్షత్రియ ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ, అందువల్ల స్వర్గం లభిస్తుందని నమ్మేవాడు. ధర్మవిరుద్ధమైన, ప్రయోజనం లేని పనుల మీద ఆసక్తి ఉండేది కాదు. ఆరోగ్యవంతుడు, యువకుడు, మంచి వాక్చాతుర్యంగల పండితుడైన రాముడు, యుక్తుల్లో, సంభాషణల్లో, మాటల్లో ఇంద్రుడు లాంటివాడు. ఏ సమయంలో, ఏ ప్రదేశంలో ఏయే పనులు చేయాలో తెలిసిన రాముడు అందమైన దేహం కలవాడు. లోకంలోని ఏకైక సత్పురుషుడు. ఇతరుల స్వభావాన్ని ఇట్టే గ్రహించగలిగేవాడు. అలాంటి రాముడ్ని ప్రజలంతా బయట సంచరించే తమ ప్రాణంగా భావించేవారు.
వేదాలు, విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న రాముడు విలువిద్యలో తండ్రిని మించాడు. మంచి వంశంలో పుట్టిన రాముడు సాధు స్వభావుడు. దైన్యం లేనివాడు. ధర్మపరులు, వృద్ధులు అయిన బ్రాహ్మణుల నించి విద్యాబుద్ధులని నేర్చుకున్నాడు. ధర్మార్థ కామాల స్వరూపాలని చక్కగా అర్థం చేసుకున్నాడు. మతిమరుపు లేదు. సమయస్ఫూర్తితో లోక వ్యవహారాలని చక్కబెట్టే రాముడు అణకువ కలవాడు. మనసులోని భావాలని మొహం మీద తెలీనివ్వకుండా రహస్యంగా ఉంచేవాడు. ఇతరులకి సహాయం చేసేవాడు. అతని కోపం, సంతోషం వృథా అయ్యేవి కావు. బీదలకి దానం చేసేవాడు. మొండి పట్టుదల కాని, చపలత్వం కాని లేనివాడు. చెడు మాటలని మాట్లాడేవాడు కాదు. సోమరితనం, ఏమరుపాటు లేనివాడు. ఇతరుల్లోని తప్పులనే కాక తనలోని తప్పులని కూడా గుర్తించగలిగేవాడు. చేసిన మేలు మరిచేవాడు కాదు. మనుషుల మధ్య తేడాని గమనించి న్యాయప్రకారం దుర్మార్గులని నిగ్రహించి, మంచి వాళ్లని అనుగ్రహించేవాడు.
మంచి వాళ్లని చేరదీసేవాడు. ధనాన్ని సంపాదించే మార్గాలు, వాటిని శాస్త్ర ప్రకారం ఖర్చు చేసే విధానం తెలిసిన వాడు. శాస్త్రాల్లో, అనేక విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. భోగాలకు ధనాన్ని వృధా చేసేవాడు కాదు.
విలువిద్యలో గొప్పవాడుగా అతిరథులు అతన్ని మెచ్చుకునేవారు. సేనని చక్కగా నడిపి శత్రువులపై దండెత్తి వాళ్లని చంపేవాడు. దేవతలు, రాక్షసులు కూడా అతన్ని జయించలేరు. గర్వంలేని రాముడు కాలాన్ని బట్టి మారేవాడు. ఎవర్నీ అవమానించేవాడు కాదు. రాముడు కోపాన్ని జయించిన వాడు.
ఇన్ని మంచి గుణాలు గల రాముడు ప్రజలకి తగిన విధంగా ప్రవర్తిస్తూ మూడు లోకాల్లో పూజ్యుడు అయ్యాడు. ఓర్పులో భూమాతతో, బుద్ధిలో బృహస్పతితో, పరాక్రమంలో ఇంద్రుడితో సమానంగా ఉండేవాడు. ఇవేకాక ఇంకా ఎన్నో మంచి గుణాలు గల రాముడు ప్రజలకి, తండ్రికి ఆనందం కల్గిస్తూ మంచి గుణాలనే కిరణాలతో సూర్యుడిలా ప్రకాశించసాగాడు. అలాంటి రాముడు తనని పాలించాలని భూమాత కోరిక.
తను జీవించి ఉండగానే రాముడ్ని రాజు చేయాలని ఓ రోజు దశరథుడికి ఆలోచన కలిగింది. రాముడు తనకన్నా మంచి గుణాలు కలవాడని, అతను భూమిని పాలిస్తూండగా చూస్తూ మరణించాలనే ఆలోచన కలగడంతో దశరథుడు మంత్రులతో ఆలోచించి రాముడ్ని యువరాజుగా చేయాలని నిశ్చయించాడు. ఆకాశంలో, భూమి మీద కలిగే ఉత్పాతాలు ఘోరమైనదేదో జరగబోతోందని సూచిస్తున్నాయని, కాబట్టి, రాముడికి పట్ట్భాషేకం చేస్తే తనకు ఇక విచారం ఉండదని వారితో చెప్పాడు. ఇతర రాజులని, నగర, గ్రామ ప్రముఖ పౌరులని వేరువేరుగా పిలిపించాడు. దశరథుడి నించి తగిన సత్కారాలు అందుకుని, వారంతా ఆయనతో సమావేశం అయ్యారు. అయోధ్య కాండలో, మొదటి సర్గలోని మిగిలిన కథని రేపు కొనసాగిస్తాను.’ (అయోధ్యకాండ సర్గ 1)
ఇంటికి తిరిగి వచ్చాక ఆశే్లష తన తల్లి శారదాంబకి తను విన్న కథని చెప్తే ఆవిడ ఇలా చెప్పింది.
‘చూడు. నేను ఎన్ని వేళ్లు ముడిచానో హరిదాసు అన్ని తప్పులు చెప్పాడు. అవేమిటో కనుక్కోగలవా?’
వెంటనే ఆశే్లష రామాయణాన్ని తీసి అయోధ్య కాండలోని మొదటి కాండని చదివి చెప్పాడు.
‘ఆ తప్పులు తెలిసాయి. చెప్తా విను’
**
మీకో ప్రశ్న
అబద్ధం ఆడమని రాముడు
ఎవరికి ఏ కాండలో
సలహా ఇచ్చాడు?
**
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
**
మిథిలా నగరానికి గల ఇంకో పేరు ఏమిటి?
జనక్‌పూర్
**
కిందటి వారం ప్రశ్నలకు జవాబులు
**
1.కేకయ రాకుమారుడు వచ్చాడు అని హరిదాసు చెప్పాడు. కాని అతని పేరు యుధాజిత్తు అని చెప్పలేదు.
2.్భరతుడు శ్రుతకీర్తి చేతిని పట్టుకుని, శత్రుఘు్నడు మాండవి చేతిని పట్టుకుని పెళ్లి చేసుకున్నారని హరిదాసు చెప్పాడు. నిజానికి భరతుడు మాండవి చేతిని పట్టుకుని, శతృఘు్నడు శ్రుతకీర్తి చేతిని పట్టుకుని పెళ్లి చేసుకున్నారు.
3.విశ్వామిత్రుడు వెళ్లింది హిమాలయాలకి. ఇది హరిదాసు చెప్పలేదు.
4.పక్షులు అనుకూలంగా, మృగాలు ప్రతికూలంగా ఉన్నాయి అని హరిదాసు చెప్పడం తప్పు. పక్షులు ప్రతికూలంగా, మృగాలు అనుకూలంగా ఉన్నాయి.
5.పరశురాముడి దగ్గర విల్లు, బాణాలు కూడా ఉన్నాయి. ఇది హరిదాసు చెప్పలేదు.
6.పూర్వం కార్తవీర్యార్జునుడు చంపింది పరశురాముడి తల్లిని కాదు. అతని తండ్రిని.
7.బాలకాండలోని ఆఖరి సర్గ 77,78 కాదు. హరిదాసు తప్పు చెప్పాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి