S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంతోషానికి కారణం

ఆవ్యక్తిని ఊళ్లో అందరూ ఇష్టపడేవాళ్లు. ఎప్పుడూ మధురంగా మాట్లాడుతూ చెరగని చిరునవ్వుతో ఉల్లాసంగా ఉండేవాడు. ఖరీదయినవి కాకపోయినా శుభ్రమయిన వస్త్రాలు ధరించేవాడు. అప్పుడప్పుడూ ఒక షాపునకు వచ్చి సరుకులు తీసుకునేవాడు. ఆ షాపు యజమాని అయిన వ్యాపారికి అతనంటే ఇష్టం. అతను వచ్చినప్పుడల్లా అతన్ని కూర్చోబెట్టుకొని కబుర్లాడేవాడు.
వ్యాపారి ఆ వ్యక్తి పెదాలపై చెరగని చిరునవ్వుని చూసి ఆశ్చర్యపోయేవాడు. అన్నీ అమరిన, ఏ లోటూ లేని అదృష్టవంతుడనుకునేవాడు. ఆ వ్యక్తి ఎన్నో మంచి విషయాల్ని వ్యాపారికి చెప్పేవాడు. ఆ మాటల్తో వ్యాపారి ఎంతో ఆహ్లాదాన్ని పొందేవాడు. ఎప్పుడూ అతని రాక కోసం ఎదురుచూసేవాడు.
ఒకసారి ఆ వ్యక్తి వారం రోజులు గడిచినా షాపునకు రాలేదు. వ్యాపారికి ఆందోళన కలిగింది. ఏమైంది? కనీసం రెండు మూడు రోజుల కొకసారయినా వచ్చేవాడే. ఏదో ఇబ్బంది కలిగినట్లుంది అని వెతుక్కుంటూ, అతని ఇంటి ఆచూకీ తెలుసుకుని వెళ్లాడు.
అతన్ని చూడాలని వ్యాపారికి ఉబలాటంగా ఉంది. వ్యాపారిని చూస్తూనే అతను సంతోషంతో తన ఇంటిలోకి ఆహ్వానించి కుర్చీ వేసి కూచోబెట్టాడు. వ్యాపారి ఇల్లంతా కలియజూశాడు. అది రెండు గదుల ఇల్లు. అయితే ప్రతిదీ ఎక్కడ ఉండాలో అక్కడ పద్ధతిగా పెట్టినట్లుంది. అతను సామాన్య కుటుంబీకుడు. సంపన్నుడు కాడు.
మంచం మీద ఒక కుర్రవాడు పడుకుని ఉంటే అతను ఆ కుర్రవాడి తలకు తైలం పెడుతున్నాడు. ఏమైందని అడిగాడు వ్యాపారి. ‘వీడు నా చిన్నకొడుకు. నాలుగు రోజుల నించి జ్వరం వచ్చి మంచమెక్కాడు. వాడికి సేవలు చేస్తున్నా’ అన్నాడు.
వ్యాపారి ‘మీ ఆవిడ లేదా?’ అడిగాడు.
‘పక్క గదిలో ఉంది. మతిస్థిమితం ఉండదు. నేనే వంట చేసి అందరికీ పెడతాను. మా రెండో వాడు స్కూలుకు వెళ్లాడు. పెద్దవాడు పనీపాటా లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఆకలి వేస్తే ఇంటికి వచ్చి తిని మళ్లీ వెళ్లిపోతాడు’ అన్నాడు. ఇవన్నీ నవ్వుతూనే చెప్పాడు.
వాతావరణం, పరిస్థితులు చూసి వ్యాపారికి దిమ్మ తిరిగిపోయింది. అతను ‘కొద్దిగా పొలం ఉందని, తిండి గింజలు వస్తాయని, ఇంకో దగ్గర పద్దులు రాస్తే కొద్దిగా ధనం వస్తుందని, దాంతో జీవితం నిశ్చింతగా గడిచిపోతోందని’ అన్నాడు.
వ్యాపారి ‘ఇన్ని కష్టాలలో వుంటూ మీరు ఎట్లా ఆనందంగా ఉండగలుగుతున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతారు?’ అని అడిగాడు.
ఆ మాటలకు అతను నవ్వి ‘మనం ప్రపంచంలో మనుషులయి పుట్టినందుకు మొదట నవ్వుతూ ఉండాలి. మన బాధల్ని పదిమందికి చెప్పుకుంటూ, ఏడుస్తూ, ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్లని హింసిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. నా భార్యలాగే నేనూ మతిస్థిమితం లేనివాణ్ణవుతాను. నేను పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. పరిష్కరించలేకపోతే ఆమోదిస్తాను. ఆ ఆమోదంలో ఆనందముంది. అది మన సహనానికి గీటురాయి అనుకుంటాను. నా కర్తవ్యాన్ని వంద శాతం బాధ్యతగా నిర్వహిస్తాను. ఫలితంగా నాకు సంతృప్తి, సంతోషం మిగులుతాయి. నేను రెండు వందల ఏళ్లు బతకలేను. అది నా చేతిలో లేదు. అట్లాగే మనం దాటలేనివి జీవితంలో కొన్ని ఉంటాయి. వాటిని విధికి వదిలెయ్యాలి. సంతోషంగా వున్న మనిషిని చూసి స్వర్గం కూడా ఈర్ష్య పడుతుంది’ అన్నాడు.
ఆ వివేకవంతునికి వ్యాపారి తలవంచి నమస్కరించాడు. *

- సౌభాగ్య, 9848157909