వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా దగ్గరున్న నగలన్నీ మీకిచ్చేస్తాను. నన్ను అరెస్ట్ చెయ్యండి. అంతేకాదు ఏ శిక్ష వేసినా ఆనందంగా అనుభవిస్తాను. కానీ దయచేసి మా అమ్మాయిని మాత్రం ఈ రొంపిలోకి ఈడవకండి’ అన్నాడు శంకరయ్య దీనాతి దీనంగా వేడుకుంటూ.
‘అయితే ఈ దోపిడీలో డాక్టర్ గౌతమిగారికి ఎలాంటి సంబంధం లేదంటారు’ ఓరగా గౌతమికేసి చూస్తూ అన్నాడు ప్రయాగ.
‘లేదు లేదు’ అనేశాడు శంకరయ్య.
‘సరే! ఆ విషయం మళ్లీ ఆలోచిద్దాం. ముందు నగలు చూపించండి’ అన్నాడు ప్రయాగ నిర్మొహమాటంగా.
‘నా మాట కాస్త వింటారా?’ అంతవరకూ వౌనంగా ఉన్న గౌతమి కాస్త సీరియస్‌గా అంది.
‘ఏవిటి? మీకు తెలియకుండానే మీ నాన్నగారే దోపిడీ చేశారంటారా?’ అన్నాడు ప్రయాగ వ్యంగ్యంగా.
‘కాదు. మా నాన్నగారు కూడా దోపిడీ చెయ్యలేదు’
‘మళ్లీ అదే మాట! ఓ మూల ఆయన తన నేరాన్ని ఒప్పుకుని, నగలు హేండోవర్ చెయ్యడానికి సిద్ధంగా ఉంటే మీరు మళ్లీ మొదటికొచ్చారేమిటి?’ చిరాగ్గా అన్నాడు ప్రయాగ.
‘ఆయన నేరాన్ని ఒప్పుకోలేదు. నగలున్నాయన్నారంతే’ స్థిరంగా ఉంది గౌతమి గొంతు.
‘ఈవిడకి మతి చలించిందా?’ అన్నట్టు చూశాడు ప్రయాగ.
‘నిజంగానే ఈ దోపిడీకీ, మా నాన్నగారికీ ఎలాంటి సంబంధం లేదు. ఆ దోపిడీ ఎవరు చేశారో కూడా మాకు తెలియదు’ పాత పాటే పాడింది గౌతమి.
‘తెలియకుండానే ఇంత డ్రామా ప్లే చేశారా?’
‘డ్రామానా?’
‘మరి? ఆ రోజు మీ నాన్నగారి మీద ఎవరూ దెబ్బ తియ్యలేదని, డాక్టరైన మీరే తెలివిగా స్పృహ తప్పించి కట్టి పడేసి ఎవరో దాడి చేసినట్టు సీన్ క్రియేట్ చేశారని నాకు తెలిసిపోయింది. అంతేకాదు. ఆ నగలు ఈ కొండ మీదే ఉన్నాయని కూడా తెలుసు. నా అనుమానాన్ని గ్రహించిన మీరు ఆ నగల్ని మరో చోటికి తరలిస్తారని ఊహించాను. నా అంచనా తప్పు కాలేదు. ఇంక మాటలు మాని నగలు ఎక్కడున్నాయో చూపించండి’ అన్నాడు ప్రయాగ కులాసాగా నవ్వుతూ.
శంకరయ్య, గౌతమిల మొహాలు మరింత పాలిపోయాయి. తప్పనిసరిగా బైటికొచ్చాడు. ప్రయాగ సైగ చూసి కొందరు జీపు దిగి బిలబిలా వచ్చేశారు.
శంకరయ్య, గౌతమీ తూలుతున్నట్టు కొండ వెనక్కి నడుస్తుంటే మిగతా వాళ్లు వాళ్ల ననుసరించారు. అందరూ కొండ వెనుక వున్న ఓ ముళ్లపొద దగ్గర ఆగారు. కాస్త గొయ్యిలా వున్న చోటుని చూపించి-
‘నగల బేగ్ ఈ పొదలోనే భద్రపరిచాను’ అంటూ గోతిలోకి దిగబోతున్న శంకరయ్యని ఆపేసి, తన మనుషుల చేతే గొయ్యే కాక గోతి పరిసరాలన్నింటినీ తవ్వించాడు ప్రయాగ. కానీ నగల తాలూకు బేగ్ కనిపించలేదు. బిత్తరపోయారు గౌతమి, శంకరయ్య.
‘ఏవిటీ నాటకం?’ కఠినంగా అన్నాడు ప్రయాగ.
‘్భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. ఆ బేగ్ ఇక్కడే పెట్టాను’ దాదాపు ఏడుస్తూ అన్నాడు శంకరయ్య. గౌతమికి వణుకు వచ్చేసింది. అంతవరకూ వున్న ధైర్యం అందనంత దూరం పారిపోయింది. నోట మాట రానట్టు అలా నిల్చుండిపోయింది.
‘ఇప్పుడు అరెస్ట్ చెయ్యచ్చుగా డాక్టర్?’ అన్నాడు ప్రయాగ ఆవేశాన్ని అణచుకుంటూ. ఆమె మాట్లాడలేదు.
జరిగేదంతా చూస్తున్న శంకరయ్య, తను చేసిన పని, తన బిడ్డ జీవితానే్న నాశనం చేస్తుందన్న బాధతో నిల్చున్న పళాన కుప్పకూలిపోయాడు. గొల్లుమంది గౌతమి. శంకరయ్య పరిస్థితి చూసిన ప్రయాగ, అతన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గరికి చేర్పించాడు. గౌతమి తండ్రి మొహం తుడిచి, ఏడుస్తూనే ఆయన చేత కాసిని నీళ్లు తాగించింది. ఆయన కాస్త తేరుకున్నాక-
‘మీ నాన్నగారి కోరిక మేరకు ప్రస్తుతం ఈయన్ని మాత్రమే తీసికెళ్తున్నాం. ఈయనకి మంచి ట్రీట్‌మెంట్ జరుగుతుంది. మీరేం కంగారు పడకండి. అన్నట్టు మరో మాట. మీరు కూడా ఒంటరిగా ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. కొండ కింద మీ ఉడ్‌బీ ఉన్నట్టున్నారుగా. కొన్నాళ్లపాటు అక్కడుండండి’ అన్నాడు ప్రయాగ.
‘అంటే.. ఇప్పుడీయన్ని తీసికెళ్తారా?’ దుఃఖం నిండిన గొంతుతో అంది గౌతమి.
‘తప్పదు మేడమ్! మా డ్యూటీ మాకుంటుందిగా. అయినా మీరేం కంగారుపడకండి. మాకు సంబంధించిన హాస్పిటల్లో చేర్చి జాగ్రత్తగా చూసుకుంటాం’ అంటూ శంకరయ్యతో సహా జీప్‌లో కూర్చున్నాడు ప్రయాగ. గౌతమికి వణుకు వచ్చేసింది.
‘మీరు ఓసారి మా ఆఫీసుకి వస్తే బాగుంటుంది. అసలు దొంగలు, నగలు దొరికేదాకా ఈయన మా ఆధీనంలో ఉండక తప్పదు మిస్.. కాదు.. మిసెస్ క్లూ ఎవిడెన్స్!’ అంటూ శంకరయ్యతో సహా వెళ్లిపోయాడు ప్రయాగ.
బిగుసుకు పోయింది గౌతమి - ఎలియాస్ క్లూ ఎవిడెన్స్!
* * *
శంకరయ్య జైలుకి సంబంధించిన హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉన్నాడు. పెద్దపెద్ద డాక్టర్లు అతి శ్రద్ధగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఆఘమేఘాల మీద వచ్చిన గౌతమి తండ్రిని చూస్తే దుఃఖం ఆగలేదు. డాక్టర్ల సలహా మేరకు దూరం నించే చూస్తూ దుఃఖాన్ని ఆపుకోవాలని ప్రయత్నిస్తోంది.
‘బాధపడకండి. మా నాన్నగారికేం భయం లేదు. మత్తుమందు ఇవ్వడం వల్ల అలా పడుకున్నారు’ మృదువుగా వినిపించిందో గొంతు. చివ్వున తిరిగి చూసింది గౌతమి. ఏదో నేరం చేసినట్టు తలదించుకుని ఆమెని చూస్తున్న ప్రభు కనిపించాడు. ఆమె మొహంలోని దుఃఖం పోయి ఆవేశం వచ్చేసింది.
‘నేను మీకు చేసిన సహాయానికి మీరు నాకిచ్చే బహుమతి ఇదా మిస్టర్ ప్రభూ?’ అంది తీక్షణంగా.
‘సారీ డాక్టర్! మీకు మేలు జరుగుతుందనే...’
‘ఏవిటా మేలు? మమ్మల్ని దొంగలుగా అరెస్ట్ చెయ్యడమా? మా నాన్నని మృత్యు ముఖంలోకి లాక్కెళ్ళడమా? నా గురించి సీఎం గారికి తప్ప ఇంకెవరికీ చెప్పనని ప్రామిస్ చేశారు. కానీ మీరు అందరికీ చెప్పి నన్నో ఫూల్‌ని చేశారు. ప్రయాగ గారు ఆ పేరుతో సంబోధించగానే నా గుండె ఆగినంత పనైంది. నిజంగా మా మేలు కోరేవారే అయితే ఇంత మోసం చేస్తారా?’ మళ్లీ దుఃఖం వచ్చేసిందామెకి.
‘లేదు గౌతమిగారూ. మీ నాన్నగారిని మృత్యుముఖం నించి తప్పించడానికి, నిర్దోషులుగా నిరూపించడానికి ప్రయాగ గారికి కొన్ని నిజాలు చెప్పక తప్పలేదు. కానీ అన్నీ చెప్పలేదు. ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మధ్యలో ఈ చంద్రయ్య గొడవొకటి, అతను బతికి నోరు తెరిస్తే మరికొన్ని విషయాలు బైట పడచ్చని మా ఆశ’ అంటూ కొన్ని విషయాలు గొంతు తగ్గించి చెప్పాడు ప్రభు. గౌతమి కళ్లు విశాలమయ్యాయి. ‘నాకూ ప్రయాగ గారితో మాట్లాడాలనుంది. ఇప్పుడు వీలవుతుందా?’ అంది ఆతృతగా.
‘రండి. ఆయనా మీరెప్పుడొస్తారా అని చూస్తున్నారు’ అంటూ ప్రయాగ గారున్న రూమ్‌లోకి తీసికెళ్లాడు ప్రభు.
ఆయన ఇంత మొహం చేసుకుని ఆహ్వానించాడు. ‘సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పలేదు. మీ నాన్నగారిని అరెస్ట్ చేసి తీసుకు రావడానికీ ఓ కారణం ఉంది. అయినా ఆయన కెలాంటి ఇబ్బందీ కలగదని మీకు మాట ఇస్తున్నాను. మీరు కూడా ఆ గుట్ట మీద వుండొద్దని నా సలహా.
ఇంక మీ అనుమానాలు, అనుభవాలూ అన్నీ నాకు చెప్పండి. తాత్కాలికంగా అందరూ మిమ్మల్ని దోషులనుకున్నా నిజం నిప్పు లాంటిది. అది దాచాలన్నా దాగదు’ అంటూ ఆమెని కూర్చోబెట్టి కూల్‌డ్రింక్ తాగించి మరీ చెప్పాడివన్నీ.
‘ఈయన నిన్నటి దాకా తమతో మాట్లాడిన మనిషేనా’ అని విస్తుపోయింది గౌతమి.
‘ఏదో ఆలోచిస్తున్నారు. మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి. మీరు కోపరేట్ చేస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అయి పంతులుగారు క్షేమంగా గుట్టమీదికి చేరేది. ప్రభుగారి ఫ్రెండ్ నాకూ ఫ్రెండే అనుకుని చెప్తున్నాను.’ అన్నాడు ప్రయాగ. ‘అంతేకాదు. నిజంగా ఈవిడ వెరీ ఇంటలిజెంట్. ఇలాంటి వాళ్లు మా డిపార్ట్‌మెంట్‌లో ఉంటే ఎంత బావుండేది’ అని కూడా అనుకున్నాడు.
మనసులోని ఆవేదన, అనుమానాలు చెప్పాక గౌతమి మనసు తేలికయింది.
‘సరే. ఇవన్నీ గోప్యంగానే ఉంచండి. కానీ తరచూ మిమ్మల్ని కలిసే అవకాశం మాత్రం నాకివ్వండి’ అంది ఉత్సాహంగా.
‘విత్‌ప్లెజర్. మీలాంటి వారు కలిసి మాట్లాడితే అదే ఓ ఎడ్యుకేషన్’ అన్నాడు ప్రయాగ నవ్వుతూ. ఆమె సిగ్గుపడిపోయింది.
* * *
చంద్రయ్యకి ప్రాణ గండం తప్పింది. అయితే కదిలే పరిస్థితి రాలేదు. అప్పుడు రాత్రి పనె్నండు గంటలయింది. హాస్పిటల్ పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. గేటు దగ్గర పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. లోపల ఓ గదిలో పడుకుని ఉన్న చంద్రయ్య మందుల వల్ల మత్తుగా పడున్నాడు. ఆ గది గుమ్మం దగ్గర కూడా సెక్యూరిటీ ఉంది.
లోపల ఓ గదిలో కూర్చున్నారు ప్రయాగ, గౌతమి, ప్రభు. వాళ్ళిప్పుడు ప్రత్యర్థుల్లా లేరు. ముఖ్యంగా ప్రయాగకి గౌతమి అంటే అభిమానం ఏర్పడింది. ముగ్గురూ కూర్చుని ఏదో రహస్య చర్చలు జరుపుకుంటున్నారు.
‘చంద్రయ్య మీద మళ్లీ ఎటాక్ చేసే అవకాశం ఉందా సర్?’ అంది గౌతమి.
‘ప్రయత్నం చెయ్యొచ్చు. కానీ ఆ అవకాశం మనం ఇవ్వంగా!’ నవ్వాడు ప్రయాగ.
‘మిసెస్ క్లూ ఎవిడెన్స్ మూలంగా మనకి చాలా విషయాలు తెలిశాయి’ ఓరగా గౌతమి కేసి చూస్తూ అన్నాడు ప్రభు.
‘మిస్టర్ ప్రభూ! ఆ క్లూకి ఇంకా పెళ్లి కాలేదు. ఆవిడ మనసే ఎవిడెన్స్!’ అంది గౌతమి చిరుకోపం నటిస్తూ.
‘ఇవాళ కాకపోతే రేపు. ఎవిడెన్స్ కాకపోతే అనిల్.. అదే.. క్లూ వరించిన వరుడు ఉన్నాడుగా’ అన్నాడతను.
‘ఎసెస్! అతనితో ఓసారి మాట్లాడాలనుంది ప్రభూ.. ఒకటి రెండుసార్లు మన గౌతమిగారి తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడాడనుకోండి. అప్పుడు కోల్డ్ వార్. ఇప్పుడు హేపీగా మాట్లాడాలనుంది’ అన్నాడు ప్రయాగ నవ్వుతూ.
గౌతమి చెంపలు ఎందుకో ఎర్రబడ్డాయి. ‘అవన్నీ తర్వాత. ముందు మా నాన్నగారు నిర్దోషిగా లోకానికి తెలియాలి’ అంది గంభీరంగా.
‘అసలు విషయం అప్పుడే చెప్తే ఇంత దాకా వచ్చేది కాదు!’
‘నేను చెప్పాలనే ప్రయత్నించాను. కానీ మీరు నాకా అవకాశం ఇవ్వందే’ అంది గౌతమి. ఆమెకి ప్రయాగ దగ్గర కాస్త చనువు ఏర్పడింది.
ఇంతలో పేషెంట్‌కి స్పృహ వచ్చిందన్న వార్త తీసుకొచ్చింది అక్కడి సిస్టర్. ముగ్గురూ ఆతృతగా చంద్రయ్య దగ్గరికెళ్లారు. ఒంటినిండా కట్లతో, ట్యూబులతో శవాకారంలా పడున్న అతన్ని చూస్తుంటే గౌతమి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మృదువుగా పిల్చింది. అతను కళ్లు తెరిచి సన్నగా నవ్వాడు. ఆ నవ్వు ప్రయాగ వాళ్లకెంతో ఉత్సాహాన్నిచ్చింది. మెల్లగా వివరాలడిగారు. గుర్తున్నంత వరకూ చెప్పాడు. తనని కాల్చిన వ్యక్తి అడవి మనిషిలా వున్నాడనీ, మళ్లీ చూస్తే గుర్తు పట్టగలననీ నమ్మకంగా చెప్పాడు. మొహాలు చూసుకున్నారు ముగ్గురూ. ఇంక మాట్లాడించటం అంత మంచిది కాదనుకుని, అతన్ని పడుకోమని చెప్పి బైటికొచ్చేశారు. మళ్లీ కాస్సేపు మాట్లాడుకుని, వెలుగురేఖలు వస్తుండగానే,
సెక్యూరిటీతో జాగ్రత్తలు చెప్పి బైటికొచ్చారు. ప్రయాగ దగ్గర సెలవు తీసుకుని ప్రభు కార్లోనే శంకరయ్య వున్న హాస్పిటల్ దగ్గరకొచ్చింది గౌతమి.
‘్థంక్స్ ప్రభూ! మా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు మీరు. సీఎం గారు కూడా. నేను నాన్న దగ్గరికెళ్తాను’ అంటూ చేతులు జోడించింది.
‘మీకే మేము థాంక్స్ చెప్పాలి. జాగ్రత్తగా వుండండి’ అని కారు స్టార్ట్ చేశాడు ప్రభు.
ఆమె లోపలికెళ్తుండగా అనిల్ కారు వచ్చి ఆగింది. నీరసంగా వున్న ఆమెని చూసి కంగారు పడిపోయాడు అనిల్.
‘ఎక్కడికెళ్లావ్ గౌతమీ? అక్కడ కొండ మీద లేక, ఇక్కడ హాస్పిటల్లోనూ లేక ఎక్కడ తిరుగుతున్నావ్? అసలే రోజులు బాగోలేవు. నాన్నగారు కూడా చాలా కంగారు పడుతున్నారు. పద. ముందు వెళ్లి ఆయనక్కనిపించు’ అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి నడుస్తూ. ఆమె ఏదో చెప్పబోతుంటే-
‘అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు పద’ అన్నాడతను ఆప్యాయంగా.
ఇద్దరూ కలిసి శంకరయ్య దగ్గరికెళ్లారు. నింగానే ఆయన చాలా కంగారు పడుతున్నాడు కూతురు గురించి.
‘రాత్రంతా ఎక్కడున్నావు తల్లీ. మన ఇంట్లోనూ లేవని అనిల్ చెప్పాడు. ఎక్కడికెళ్లావ్?’ అన్నాడు ఆమె చేతులు పట్టుకుని. తండ్రి కళ్లల్లో నీళ్లు చూసిన గౌతమిక్కూడా దుఃఖం పొంగుకొచ్చింది. అయినా తేలకుండా-
‘చంద్రయ్య దగ్గరున్నాం నాన్నా. నేనే కాదు. ప్రయాగగారూ, ప్రభుగారూ కూడా ఉన్నారు. నా గురించి నువ్వసలు బెంగపడొద్దు. నా మంచి చెడులు చూసుకోవడానికి ఈ హీరో వుండనే వున్నాడు’ అంది తడి కళ్లతోనే నవ్వుతూ.
‘అదేనమ్మా నా ధైర్యం. సరే. ఇంటికెళ్లి స్నానం చేసి ఏదైనా తిని రా’ అన్నాడు శంకరయ్య.
‘స్నానం చెయ్యడానికి అక్కడికెందుకంకుల్! మన హాస్పిటల్‌లో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. బాగా అలసిపోయింది. స్నానం చేసి కాస్సేపు రెస్ట్ తీసుకుని వస్తుంది. ఫర్వాలేదుగా’ అన్నాడు అనిల్ వినయంగా.
‘అంతకన్నానా? ఇవాళ కాకపోతే రేపైనా అక్కడికి రావల్సిందేగా. నన్ను చూసుకోవడానికిక్కడ చాలా మందున్నారు. వెళ్లి రండి’ అన్నాడాయన మనస్ఫూర్తిగా.
‘కాఫీ తాగావా నాన్నా?’ అడిగింది గౌతమి.
‘ఇంతదాకానా పూర్తిగా తెల్లవారకుండానే ప్రియ మొహం కడిగించి కాఫీ ఇచ్చి మరీ వెళ్లింది’ నవ్వాడాయన.
‘ప్రియ? ప్రియ ఎవరు?’ అన్నాడు అనిల్.
‘ప్రియంవద. నా చిన్ననాటి ఫ్రెండ్. మొనే్న బెంగుళూరు నించి వచ్చి, నాన్న పరిస్థితి చూసి ఇక్కడే సెటిలయిపోయింది. తనుంది కాబట్టే నేనింత నిశ్చింతగా వుండగలుగుతున్నాను’ అంది గౌతమి.
‘హమ్మయ్య! ఇంక నువ్వక్కడ ఎంతసేపున్నా బాధ లేదు’ ఉత్సాహంగా అన్నాడు అనిల్.
తర్వాత ఇద్దరూ శంకరయ్యకి జాగ్రత్తలు చెప్పి అనిల్ హాస్పిటల్ కొచ్చేశారు.
వాళ్లని చూసిన లూసీ చిరునవ్వుతో విష్ చేసింది.
‘బావున్నావా?’ అంది గౌతమి తనూ నవ్వుతూ. అయితే అనిల్, కనీసం తలైనా వూపకుండా-
‘మాకు కాఫీలు పంపు. నువ్వు తేనక్కర్లేదు. ఎవరిచేతైనా పంపు’ అనేసి, గౌతమి చెయ్యి పట్టుకుని తన పర్సనల్ రూమ్‌లోకెళ్లిపోయాడు.
‘ఏంటనిల్? ఎంత మన దగ్గర పనిచేసే మనిషైతే మాత్రం వినయంగా విష్ చేస్తే కూడా అంత పరుషంగా మాట్లాడావ్?’ అంది గౌతమి కాస్త చిరాగ్గా.
అతని మొహం మరింత గంభీరంగా అయిపోయింది.
‘నీకు తెలియదు గౌతమీ. లూసీ మనం అనుకున్నంత మంచిది కాదు’ అన్నాడు మెల్లగా.
‘ఏం చేసింది?’ కంగారుగా అంది గౌతమి.
‘చాలా చేసింది. చేస్తోంది. తనకి బాయ్‌ఫ్రెండ్స్ ఎంతమందున్నారో తనకే తెలియదు’
‘ఓ! అదా! ఏజ్ అలాంటిది. అదీగాక మనిషి చాలా అందంగా ఉంటుంది. అన్నింటికీ మించి పేదరికం.. అయినా ఆమె ఎలాంటిదైతే మనకెందుకు. నర్స్‌గా నీకెంత ఉపయోగపడుతోంది?’
‘ఆ విషయంలో ఎలాంటి బాధ లేదు. ఎమర్జెన్సీ కేసెస్ కూడా నన్ను డిస్టర్బ్ చెయ్యకుండా మేనేజ్ చేస్తోంది. కానీ ఆమె కోసం రకరకాల మగాళ్లు రావడం, గదుల్లో చేరి గుసగుసలాడుకోవటం.. ఛ! భరించలేక పోతున్నాను. నువ్వు పంపిన మనిషే కాకపోతే ఎప్పుడో పీకేసేవాణ్ని’ అన్నాడతను కాస్త కోపంగా.
‘మరి ఇవన్నీ చూసినప్పుడు అడగలేక పోయావా?’
‘నేను చూస్తే కడిగేసేవాణ్ని. నేను లేనప్పుడు రప్పించుకుంటోంది. వాచ్‌మెన్ చెప్పకపోతే నాకూ తెలిసేది కాదు’
‘వాచ్‌మెన్ చెప్పాడా?’ తేలిగ్గా అంది గౌతమి.
‘వాడసలు అబద్ధం చెప్పడు. ఒకసారి నేనూ చూశాను. బలిష్టుడైన ఓ నల్లజాతికి చెందిన యువకుడు వచ్చాడు. ఇద్దరూ నా గదిలో నించి రావడం కళ్లారా చూశాను. తర్వాత నిలదీస్తే తెలిసిన వాడనీ కేరళ నించి వచ్చి చూసి వెళ్లాడనీ చెప్పింది. అసలిదంతా నా తప్పే. ముందామెకి ఔట్‌హౌస్ ఇచ్చాను. ఆమె పనితీరు చూసి హాస్పిటల్‌లో ఉండమన్నాను. కానీ తన మర్యాద నిలుపుకోవడం లేదు’ కంపరంగా అన్నాడు అనిల్.
ఆలోచనలో పడిపోయింది గౌతమి.
‘సరే.. ఈ గొడవలకేం గానీ నువ్వు స్నానం చేసి ఫ్రెషప్ అయిరా’ అంటూ ఓ రూమ్‌లోకి తీసికెళ్లి బీరువా తెరిచాడు. అందులో రకరకాల చీరలు, బ్లౌజ్‌లూ వగైరాలన్నీ పొందిగ్గా పెట్టి ఉన్నాయి.
‘ఇవన్నీ నా అర్ధాంగి గౌతమి కోసం కొన్నాను. వీటిలో నీకు నచ్చింది కట్టుకురా! నీతో చాలా విషయాలు మాట్లాడాలి’ అన్నాడతను ఆప్యాయంగా.
‘నా కోసం ఇంత శ్రమ తీసుకున్నావా?’ విస్మయంగా అంది గౌతమి.
‘శ్రమ కాదు, తృప్తి! నా తృప్తి కోసం ఏమైనా చేస్తాను. నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తానని నీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడూ చెప్తున్నాను’ అన్నాడతను ఆరాధనగా ఆమె కళ్లల్లోకి చూస్తూ.
‘్థంక్స్ అనిల్! థాంక్యూ వెరీమచ్’ అందామె అతని చేతులు పట్టుకుని కళ్లకద్దుకుంటూ.
‘ఏయ్ పిచ్చీ! ఏమిటంతలా మాడ్ అయిపోతున్నావ్. ముందు స్నానం చేసిరా డియర్’ అంటూ ఆమెని బాత్‌రూమ్‌లోకి నెట్టి నవ్వుకుంటూ హాల్లోకొచ్చి కూర్చున్నాడు అనిల్.
నౌకరు ఫ్లాస్క్, కప్పులు టేబిల్ మీద పెట్టి వెళ్లిపోయాడు.
కాస్సేపటిలో నీట్‌గా తయారై వచ్చింది గౌతమి. ఆమె అందాన్ని అలా చూస్తూండిపోయాడతను.
‘మహానుభావా! చూసింది చాలు. కాఫీ తాగుదాం’ గోముగా అంది గౌతమి. అతను నవ్వేసి కప్పుల్లోకి కాఫీ వంచి, ఆమెకొకటి అందించాడు. కాఫీలు తాగాక మళ్లీ లూసీ గురించి టాపిక్ వచ్చింది.
‘ఓకే అనిల్! ఇదంతా చూస్తుంటే నాకూ చిరాగ్గానే ఉంది. అయినా మనకి మంచి నర్స్ దొరికేదాకా తొందరపడకు. అయ్ మీన్ తనంటే ఇష్టం లేనట్టు ప్రవర్తించకు. తొందరలో తనని ఏదో వంకన పంపేద్దాం’ అంది గౌతమి. అతను అంగీకారంగా తలూపాడు. తర్వాత ఆ రోజు అక్కడే ఉంటానని ఫోన్ చేసింది తండ్రికి.
‘నువ్వక్కడుంటేనే మంచిది. రోజూ వచ్చి చూసెళ్తూండు. అదే నాకు తృప్తి’ అన్నాడాయన ఉత్సాహంగా.
కాస్సేపు తర్వాత టిఫిన్ అవీ తెప్పించి-
‘నువ్వు రెస్ట్ తీసుకో గౌతమీ. లంచ్ తెస్తాడు తినేసెయ్. నేను రావడం ఆలస్యం కావచ్చు’ అన్నాడు అనిల్ తనూ ఫ్రెషప్పయి వచ్చి.
‘నువ్వెక్కడికెళ్తావ్?’ కంగారుగా అందామె.
‘బైట చాలా పనులుండి పోయాయి గౌతమీ. ఈ మధ్య మీ గురించి, నాన్నగారి ఆరోగ్యం గురించి, ముఖ్యంగా చంద్రయ్యని గురించి టెన్షన్‌తో ఏం చెయ్యలేక పోయాను. ఇప్పుడన్నీ ఓ కొలిక్కొస్తున్నాయి. ముఖ్యంగా చంద్రయ్యకి ప్రాణభయం తప్పడమే కాక, తనని కాల్చిన వాళ్లని గుర్తు పడతాడని కూడా విన్నాక నేను నార్మల్ స్థితికొచ్చాను. ఇంక ఇక్కడే ఉండమని నాన్నగారు పర్మిషన్ ఇచ్చేశారుగా. నేనూ ఇక్కడే పడుకుంటాను’ అల్లరిగా అన్నాడతను.
‘నత్తింగ్ డూయింగ్! పగలు ఇద్దరం కలిసి కలిసి పని చేద్దాం. రాత్రిళ్లు మాత్రం తమరు మీ బంగళాలో, నేను ఈ హాస్పిటల్‌లో. దానికి ఓకే! అంటే నేనిక్కడుండేది. లేకపోతే ఇప్పుడే వెళ్లిపోతాను’ బెదిరించింది గౌతమి.
‘అలాగే తల్లీ. రాత్రి పొద్దుపోయిందని తరిమెయ్యవు కదా!’ భయం నటించాడతను.
‘ఓకే’ అంటూ నవ్వేసిందామె.
ఆ నవ్వుల్లో రవ్వలేరుకుంటూ వెళ్లిపోయాడు అనిల్.
తర్వాత వాచ్‌మెన్‌ని పిలిచి ఫ్రూట్స్ తెమ్మని మార్కెట్‌కి పంపింది గౌతమి. మార్కెట్ చాలా దూరం అని ఆమెకి తెలుసు.
అతను వెళ్లాక లూసీకి క్లాస్ పీకాలనుకుందో ఏమో లూసీని పిల్చింది. ఆమె భయంభయంగా గదిలోకొచ్చింది.
‘పేషెంట్స్ పన్లయిపోయాయా?’ అంది గౌతమి.
‘అయిపోయాయి’ అన్నట్టు తలూపిందామె.
వెంటనే తలుపులు మూసేసి గడియ పెట్టింది గౌతమి.
(ఇంకా ఉంది )

-రావినూతల సువర్నాకన్నన్