వీక్లీ సీరియల్

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏమిటా పొరపాట్లు?’’ నిలదీసినట్లు అడిగాడో రిపోర్టర్.
‘‘నాకు తెలీదు’’ అంటూ నవ్వి ‘‘వాటినిప్పుడే వెల్లడి చేస్తానని మీరెలా భావిస్తున్నారు? ఇప్పుడిప్పుడే ఈ మహా యజ్ఞానికి సంసిద్ధమవుతున్నాను. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలూ వాటంతట అవే తెరమీదకి వచ్చేస్తాయి. ప్రస్తుతం దర్యాప్తుకి శ్రీకారం చుట్టబడుతోందంటే’’ అని సమాధానమిచ్చాడు.
‘‘మరి అలాంటప్పుడు తిరిగి దర్యాప్తు మొదలయ్యిందని మీరిలా బహిరంగ ప్రకటన చేయడం నేరస్థులు జాగ్రత్తపడటానికి అవకాశం ఇచ్చినట్లు కాదా?’’ సందేహం వెలిబుచ్చాడో రిపోర్టర్.
‘‘నో నెవ్వర్. నేరం చేసిన నేరస్థుడు మన్ను తిన్న పాములా ఎక్కడో ఒక చోట చడీ చప్పుడు కాకుండా దాగి ఉంటాడు. నేరస్థులు ఏ చోట దాగినా వెతికి వెతికి చట్టానికి పట్టిస్తాం’’ దృఢంగా పలికాడాయన.
‘‘తలా తోకా లేదంటున్న ఈ కేసు దర్యాప్తుకి ఎలా ప్రొసీడవ్వాలని మీ ప్లాన్?’’
‘‘అది మాత్రం అడగకండి. నేరస్తులు చట్టపరిధిలోకి రావడానికి మరెంతో సమయం లేదు. వివరాలు అడగొద్దు. అది మాత్రం సీక్రెట్. పరిశోధన ఎలా కొనసాగుతుందనేది పూర్తిగా రహస్యంగా ఉంచుతున్నాం.’’ జవాబిచ్చాడు వేద.
అత్యున్నత స్థాయి అవినీతిపరుల వలనో, రాజకీయ నాయకుల ప్రాబల్యం వల్లనో, నేరస్థుల పరోక్ష ఒత్తిడితోనో, దర్యాప్తుకి తొలిదశలోనే వేదగారికి తీవ్ర అంతరాయం కలిగితే?’’ ఈసారి ద్వివేదిని ప్రశ్నించారు...
‘‘వేద ఎలాంటి వాడో మీకు తెలుసు. అసలీ ప్రశ్న రాకూడదు. ఎవరికీ బెదరని లొంగని ఆఫీసర్ వేదవ్యాస్.
మీ అంచనా ప్రకారం అలా జరిగితే... దర్యాప్తు సజావుగా కొనసాగడానికి... అవసరమైతే సుప్రీంకోర్టు నుండి కూడా అనుమతి తెచ్చుకుంటాం. అందుకు వెనుకాడేది లేదు’’ తీవ్ర స్వరంతో బదులిచ్చాడాయన.
‘‘మనీ మనీ బ్యాంక్ దోపిడీ కేసు దర్యాప్తుకి నియమింపబడిన స్పెషల్ ఆఫీసర్‌గా ఎలాంటి ఒత్తిళ్లు బెదిరింపులకు లొంగకుండా నా విధి నిర్వహణను పారదర్శకంగా నిర్వర్తిస్తానని మీకు హామీ ఇస్తూ ప్రతిన బూనుతున్నాను’’ నిజాయితీ ధ్వనించింది వేద మాటల్లో.
ఆ హాలంతా చప్పట్లతో మార్మోగింది.
‘‘నేను స్వేచ్ఛగా ముందుకు సాగాలంటే మీ సహకారం కూడా ఎంతో అవసరం’’ విలేకరుల వైపు చూస్తూ అన్నాడు వేదవ్యాస్.
‘‘పత్రికా ప్రతినిధులుగా మా సహాయ సహకారాలు మీకూ మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లకు ఎల్లప్పుడూ ఉంటాయి’’ అన్నారంతా ముక్తకంఠంతో.
యస్సై ఆనందంతో తలూపాడు.
కాసేపు హాలంతా నిశ్శబ్దమైంది.
‘‘ఎనీ మోర్ క్వశ్చన్స్?’’ ప్రశ్నించాడు ద్వివేది. లేవన్నట్టుగా తల అడ్డంగా ఊపారంతా.
థాంక్స్ చెప్పి లేచాడు ద్వివేది.
యస్సై వేదవ్యాస్ అతని వెంట కదిలాడు.
వాళ్లిద్దరూ నిష్క్రమించడంతో ఆనాటి ప్రెస్ మీటింగ్ కార్యక్రమం ముగిసింది.
* * *
‘ఉడ్‌కాక్’ అనే ఒక రకమైన జాతి పక్షికి వానపాములు ఆహారం. భూమి లోపల ఉండే ఈ వానపాములు వర్షాలు పడితేగానీ భూమి పైకి రావు.
అందుకని వాటిని పైకి రప్పించడానికి ‘ఉడ్‌కాక్’ పక్షి ఓ ఎత్తుగడ వేస్తుంది!
ఆ పక్షి భూమిపై తన రెక్కలు బాగా దాచి పడుకొని వాటిని తపతపా నేలకేసి బలంగా కొడుతుంది.
అలా కొట్టడం వలన అచ్చం వాన పడినట్లే శబ్దం వస్తుంది. వర్షం కురుస్తున్నట్లు అనిపించడంతో లోపల దాగి ఉన్న వానపాములు మెల్లగా భూమి పైకి తరలి వస్తాయి.
అలా అవి పైకి రాగానే ‘ఉడ్‌కాక్’ వెంటనే పొడవాటి తన ముక్కుతో వాటిని పట్టి తింటుంది. ఆ విధంగా తన ఆహారాన్ని తెలివిగా సంపాదించుకుంటుందా పక్షి.
అదే ‘ఉడ్‌కాక్’ జాతి పక్షుల ఎత్తుగడని అనుసరించబోతున్నాడు వేదవ్యాస్.
అండర్‌గ్రౌండ్‌లో దాగి తప్పించుకు తిరుగుతున్న నేరస్థులకి, దోపిడీ కేసు తిరగదోడబడుతుందనే వాసన తెలిస్తే చాలు, మరింత జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తుంటారు. ఆ అతి జాగ్రత్తలో తప్పిదాలు చేస్తుంటారు.
ఆ కదలికలు చాలు.
వారి ఉనికిని పసికట్డడానికి!
ఆమాత్రం చాలు.
నేరస్థుల్ని పట్టి చట్టానికి అప్పగించడానికి!
నేరస్థులకి దర్యాప్తు విషయం తెలియాలని కావాలనే తెలివిగా... చాలా ప్లాన్డ్‌గా... ముందుచూపుతో ద్వివేది గారి చేత బలవంతంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయించాడు.
మరునాడు ద్వివేది, వేదవ్యాస్‌ల ఇంటర్వ్యూ వివిధ పత్రికల్లో పతాక శీర్షికలతో ప్రచురించబడింది.
అలాగే పలు టీవీ ఛానెల్స్ ప్రత్యేకంగా ప్రసారం చేశాయి.
ఆ కార్యక్రమం టీవీలో టెలికాస్ట్ కాబడుతున్న సమయాన
దానిని అత్యంత ఉద్విగ్నతతో ఆలకిస్తున్న లక్షలాది మంది ప్రేక్షకుల్లో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు.
ఆ ఇద్దరూ మనీ మనీ బాంక్‌కు బొమ్మ బొరుసు లాంటి వారు.
ఒకరు పాజిటివ్ అయితే... మరొకరు నెగెటివ్!
వారెవరంటే...
ఒకరు..
నాటకీయంగా ఒకనాడు దోపిడీకి గురై... దారుణంగా ఖాతాదార్లు విశ్వాసాన్ని కోల్పోయి... నేటికీ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోలేకపోతున్న మనీ మనీ బ్యాంక్ కొత్త మేనేజర్... మిస్టర్ పాండవీయం!
ఆ వార్తలో అతనెంతగా రియాక్టయ్యాడంటే ఆశ్చర్యంతో తబ్బిబ్బైపోయాడు.
దోపిడీ ఋజువులు దొరకవు. నేరస్థులు పట్టుబడరు అనుకుంటున్న తరుణంలో తిరిగి దర్యాప్తు మొదలవ్వడం... వేదవ్యాస్ స్వయంగా ఈ మహా యజ్ఞానికి పూనుకోడం... మనీ మనీ బ్యాంక్‌కి శుభ సూచకంగా భావించాడు పాండవీయం.
మరొకరు-
సాక్ష్యాధారాలు లేకుండా అతి జాగ్రత్తగా మరింత ప్లాన్డ్‌గా వ్యవహరించి తన బలగంతో మనీ మనీ బ్యాంక్‌ని దోపిడీకి గురి చేసి...
ప్రజలు అపురూపంగా దాచుకున్న సొమ్ముతో తన విలాస జీవితానికి పునాదులు వేసుకొని, పెద్దమనిషిగా సమాజంలో చలామణి అవుతున్న నేర చరిత్ర గల వ్యక్తి!
చాలా రోజుల తర్వాత మనీ మనీ బ్యాంక్ దోపిడీ ప్రస్తావన వినబడడంతో ఉలిక్కిపడ్డాడా వ్యక్తి. మరుగున పడిపోయిందనుకున్న దోపిడీ కేసు వెనుతిరిగి సరికొత్త మలుపులు తిరుగుతుండడంతో హతాశయుడయ్యాడు. టీవీలో ప్రోగ్రామ్ పూర్తవ్వగానే...
ఆ ఇద్దరూ ఎవరి ధోరణిలో వాళ్లు రియాక్టయ్యారు.
తమ బాంక్ పరపతిని పెంచి... ప్రజల్లో విశ్వాసం కలిగించబోయే ఆశ చిగురించబోతోందని పాండవీయం ఆలోచించాడు.
తమ ఉనికికే ప్రమాదం రాబోతోందనడానికి ఈ న్యూస్ సంకేతంగా భావించి తక్షణమే ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా అలర్టయ్యాడు రెండవ వ్యక్తి.
అతని క్రిమినల్ బుర్రలో ఓ పథకం రూపుదిద్దుకోగానే
అప్పుడు... అప్పుడు అతని పెదాలపై చిరునవ్వు మెరిసింది. నల్లత్రాచు పడగమీద పడి పరావర్తనం చెందిన వెలుగు కిరణంలా!
* * *
ఫోన్ చేసి కబురందివ్వకుండానే వసంత్ ఇంటికి వెళ్లాడు పాండవీయం.
‘‘అదేంటన్నయ్యగారూ! మీరొక్కరే వచ్చారా?’’ కాఫీ కప్పు అందిస్తూ అడిగింది నివేదిత.
వసంత్‌తో మాట్లాడుతున్న వాడల్లా అవునన్నట్లు తలూపాడు పాండవీయం.
‘‘మా దయ్యాన్ని కూడా తీసుకు వస్తే బాగుండేదిగా!’’ అంది.
‘‘ఇక్కడికి వస్తానని నేనే ముందుగా అనుకోలేదు. సడన్‌గా వచ్చాను. అసలు నేనిక్కడికి వస్తున్నట్లే మీ ఫ్రెండ్‌కి తెలీదు. నే వెళ్లాక ఈ విషయం చెబితే, ఆమెని మీ ఇంటికి తీసుకురానందుకు నేను చీవాట్లు తినడం ఖాయం’’ చెప్పాడు పాండవీయం నవ్వుతూ.
‘‘అలాంటప్పుడు ఇద్దరూ కలిసి వస్తే బావుండేది. దానిక్కూడా టైమ్ పాస్ అయ్యేదిగా!’’ అందామె.
‘‘ఓ అఫీషియల్ వర్క్ మీద వచ్చాను’’ అన్నాడు పాండవీయం.
‘‘మీరు బ్యాంక్ పని మీద వచ్చారంటున్నారు అలా అయితే నేనిక్కడ అక్కర్లేదనుకుంటా. మీరు మాట్లాడ్తూ ఉండండీ’’ అంటూ కదలబోయిందక్కడి నుండి.
‘‘నో నో అదేం లేదు. మీకు తెలీకుండా మేం మాట్లాడుకునే సీక్రెట్స్ ఏమీ లేవు. కూర్చోవచ్చు’’ ఆమెని వారించాడు పాండవీయం.
‘‘నా ఉద్దేశ్యం అది కాదు. నే వంటింట్లోకి వెళ్లి తినడానికేమైనా రెడీ చేసుకు వస్తా’’ అంటూ వెళ్లిపోయిందామె.
‘‘ఇంట్లో పనీ పాటా లేకుండా ఉంటుందిగా. మీలాంటి ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చినప్పుడేగా ఆవిడకు కాస్త పని. వెళ్లనీయండి’’ అన్నాడు నవ్వుతూ.
భర్త కామెంట్ నివేదితకి వినపడ్డా వినిపించుకోనట్టు కామ్‌గా కదిలిపోయింది వంటింట్లోకి.
‘‘చాల్రోజులయ్యింది మనం కలుసుకోక. ఇప్పుడు మీరు మా ఇంటికి రావడం హాపీగా ఉంది’’ అన్నాడు వసంత్.
‘‘మన డిపార్ట్‌మెంట్స్ వేరవ్వడం, అపార్ట్‌మెంట్స్ కూడా దూరం దూరంగా ఉండడం మనం తరచూ కలుసుకోకపోవడానికి కారణాలై ఉంటాయి. ఎనీహౌ ఇన్నాళ్లకి మిమ్మల్ని కలిసే అవకాశం చిక్కింది’’ అన్నాడు పాండవీయం.
‘‘చెప్పండి. మీ రాకకి కారణమేంటి? ఇందాక ఏదో అఫీషియల్ పని మీద వచ్చానని మా ఆవిడతో అన్నారు’’ అడిగాడు వసంత్.
‘‘మనీ మనీ బ్యాంక్ పేరు మీరు వినే ఉంటారు.’’
పాండవీయం పూర్తిగా చెప్పనే లేదు. అది విని ఉలిక్కిపడ్డాడు వసంత్.
‘‘ఒకనాడు నగరంలో నెంబర్ వన్ బ్యాంక్‌గా పేరు పొందిన ఈ బ్యాంక్ దారుణంగా దోపిడీకి గురయ్యింది.’’
మధ్యలోనే అడ్డుపడ్డాడు వసంత్.
‘‘అవునవును, మా పెళ్లయిన కొత్తలో ఆ సంఘటన జరిగిందనుకుంటాను. చిన్న మొత్తంలో డిపాజిట్ కూడా చేశామందులో.’’
‘‘ఐసీ! ఆ బ్యాంక్‌కి కొత్త మేనేజర్‌గా వచ్చింది నేనే!’’
‘‘ఆ బ్యాంక్‌ని మళ్లీ ఎప్పుడు రీఓపెన్ చేశారు?’’ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశ్నించాడు వసంత్.
విస్తుపోవడం ఈసారి పాండవీయం వంతయ్యింది.
‘‘కనీసం బ్యాంక్ రన్‌లో ఉందన్న విషయం ప్రభుత్వోద్యోగులకే తెలియకుండా ఉందంటే మిగతా వాళ్ల విషయం చెప్పనే అక్కర్లేదు. దీనిని బట్టి బ్యాంక్ ప్రచారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.’’ అనుకున్నాడు పాండవీయం.
‘‘రీ ఓపెన్ చేయడం కాదు. కంటిన్యూ అవుతోంది’’ అన్నాడు పాండవీయం.
‘‘అలాగా’’ అన్నాడు వసంత్.
‘‘మీరు బోర్‌గా ఫీలవ్వను అంటే మా బ్యాంక్ గురించి కొన్ని వివరాలు చెబుతాను’’ వసంత్‌ని కొంచెం ప్రిపేర్ చేయడం అవసరం అని భావించాడు పాండవీయం.
‘‘చెప్పండి’’ అన్నాడు వసంత్.
‘‘మనీ మనీ బ్యాంక్ నుండి 26 కోట్ల డబ్బుని దోపిడీ చేశారు. దోపిడీకి గురైంది పెద్ద మొత్తం కాబట్టి అంత డబ్బుని సొంతదార్లకి చెల్లించడంలో విఫలమైంది. దాంతో మనీ రికవరీ గూర్చి బ్యాంక్ మీద ఎన్నో కేసులు రాష్ట్ర హైకోర్టులో దాఖలయ్యాయి...’’
‘‘మా డిపాజిట్ ఎవౌంట్ రికవరీ అయ్యిందిగా’’ అడ్డు తగిలాడు వసంత్.
‘‘నిజమే యాభై వేల లోపు డిపాజిట్‌దార్లందరికీ డబ్బు వాపస్ ఇవ్వగలిగింది బ్యాంక్. మనీ మనీ బ్యాంక్‌లో లక్షల్లో డిపాజిట్ చేసిన వాళ్లే ఎక్కువమంది. వాళ్లే కేసు పెట్టింది.
బ్యాంక్ పరిస్థితి వివరిస్తూ కోర్టుకి సరెండర్ కావడంతో ఆ కేసులన్నింటినీ కొట్టివేసింది. బ్యాంక్‌కి ఒక షరతు విధిస్తూ.
ఏనాటికైనా దోపిడీదారులు దొరికి ఎవౌంట్ కలెక్ట్ కాబడితే దాన్ని ఖాతాదార్లకి చెల్లించాల్సి ఉంటుంది.
కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతోనే మనీ మనీ బ్యాంక్ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది’’ చెప్పాడు పాండవీయం.
‘‘అందరూ ఆ బ్యాంక్ గురించి దాదాపుగా మర్చిపోయారు. డబ్బు నష్టపోయిన వారు సైతం.’’
‘‘నిజమే! దోపిడీ గుట్టు రట్టు చేసి దొపిడీదార్లని చట్టానికి అప్పగించాల్సిన పోలీసులు కూడా చేతులెత్తేయడంతో మనీ మనీ బ్యాంక్‌కి కష్టాలు ప్రారంభమయ్యాయి.’’
‘‘ఒకప్పుడు బర్నింగ్ టాపిక్ ఈ బాంక్ మ్యాటర్. పేపర్లో కూడా పేజీలు పేజీలు వ్యాసాలు కూడా వచ్చాయి’’ అన్నాడు వసంత్.
‘‘మీ సహాయం కోరి ఆ బ్యాంక్ మేనేజర్‌గా మీ దగ్గరకు వచ్చాను. అందుకే ఆ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చింది’’ అన్నాడు పాండవీయం.’’
వసంత్ భృకుటి ముడిపడింది.
‘‘నా సహాయమా?’’ అంటూ ఆశ్చర్యపోయాడు.
* * *
వాళ్లిద్దరూ అక్కడ బ్యాంక్ గురించి ముచ్చటించుకుంటున్న సమయాన.
ఇక్కడ
షణ్ముగం కూడా మనీ మనీ బ్యాంక్ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
బ్యాంక్ గురించి అంటే...
పాండవీయం వేయమని అభ్యర్థించిన మనీ డిపాజిట్స్‌ని ఎలా సేకరించాలా అని!
కేవలం మనీ మనీ బ్యాంక్‌తో లావాదేవీలు జరపడం కోసమే అతనో సరికొత్త బిజినెస్ ప్రారంభించాలని యోచిస్తున్నాడు.
దటీజ్ షణ్ముగం!
జీవితంలో తను తలపెట్టిన ఏ కార్యమైనా ఇంతవరకు నిర్విఘ్నంగా కొనసాగిందని... దిగ్విజయంగా కొనసాగుతుందని.,.. అతని నమ్మకం.
వాస్తవానికి అతని మేథస్సు కూడా అలాంటిదే.
కానీ షణ్ముగానికి తెలీదు.
తాను వ్యూహరచన చేస్తోన్న ఈ న్యూ బిజినెస్ మాత్రం తొలిసారిగా తన అంచనాలని తల క్రిందుల చేయబోతోందని!
* * *
‘‘చెప్పండి. మీకు నేనే విధంగా సాయపడగలను?’’ అడిగాడు వసంత్.
చెప్పడానికి ఎందుకో పాండవీయం తటపటాయించాడు.
అది గమనించి.
‘‘మీరు ఏ విధంగా కో-ఆపరేట్ చేయమంటే అలా చేస్తాను. ష్యూర్! అందులో సందేహం లేదు’’ హామీ ఇచ్చాడు.
‘‘నాకా నమ్మకం ఉంది’’ అంటూ ఆగి, ‘‘కొంత ఎవౌంట్‌ని మా బ్యాంక్‌లో డిపాజిట్ చేయండి’’ అన్నాడు పాండవీయం.
ఇబ్బందిగా ముఖం పెట్టాడు. ‘‘పాత డిపాజిట్లే తిరిగి ఇవ్వలేదంటాడు. మళ్లీ డిపాజిట్స్ చేయమంటాడేంటి?’’ అనుకున్నాడు వసంత్.
‘‘శంకిస్తున్నారా?’’ సూటిగా ప్రశ్నించాడు పాండవీయం.
ఏం సమాధానమివ్వాలో అర్థం కాలేదు వసంత్‌కి.
‘‘ఇట్స్ ఓకే. బలవంతమేమీ లేదు. పోనీ మీ కొలీగ్స్‌ని ఇన్‌వాల్వ్ చేయించండి. కనీసం వాళ్ల చేత సేవింగ్ ఖాతాలు ఓపెన్ చేయించినా ఫర్వాలేదు.’’
డిపాజిట్ కంటే సేవింగ్ ఖాతా కొంత బెటర్ అనుకున్నాడు వసంత్.
‘‘నా వరకు ఓకే. మా వాళ్లందరి చేత అంటే కాస్త డౌటే!’’ అన్నాడు మనసు మార్చుకుంటూ.
నివేదితకి ప్రణీతకి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ని దృష్టిలో పెట్టుకొని బ్యాంక్‌లో ఖతా ఓపెన్ చేయడానికైనా ఒప్పుకున్నాడు. అంతే తప్ప మనీ మనీ బ్యాంక్ అంటే వసంత్‌కి సదభిప్రాయం లేదు.
‘‘నోనో! అలా అనకండి. ఈ బాధ్యత మీ ఒక్కరిమీదే మోపడం లేదు. నేనూ మీ వెంట ఉంటాను. లేదా మీరే నా వెంట ఉండండి చాలు. మిగతా వర్క్ నేను చూసుకుంటాను. నాతో పాటుగా మీరూ కాస్త రిస్క్ తీసుకుంటారన్న నమ్మకంతో వచ్చానిక్కడికి. మీరు నన్ను డిస్సప్పాయింట్ చేయకండి’’ అన్నాడు పాండవీయం.
‘‘ఇందులో నేను డిస్సప్పాయింట్ చేసేదేముంది? పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి అడ్రస్ లేకుండా పోయిన ఫైనాన్స్‌లు జనాల్ని ఆర్థికంగా ముంచేశాయి. ఆ సంక్షోభం నుండే ఎవరూ కోలుకోలేదింకా. మధ్య మనీ మనీ బ్యాంక్ దోపిడీ! భద్రత లేని బ్యాంకునెలా నమ్మగలరు?’’ మొహమాటం కొంచెం తన మనోభిప్రాయాన్ని వెల్లడించాడు.
‘‘మీరన్న దాంట్లో కొంచెం వాస్తవం లేకపోలేదు. అంతెందుకు మొన్నటికిమొన్న సిటీలోని ఓ పోస్ట్ఫాస్ బ్రాంచ్‌లో ఉద్యోగస్థులే అవకతవకలు జరిపారు. జమ చేసిన మొత్తాన్ని కస్టమర్ల పాస్‌బుక్స్‌లో రాయడం, ఆఫీసు రిజిస్టర్‌లో ఎంట్రీ చేయకపోవడం. అలా డబ్బుని స్వాహా చేశారు. ఒక్కచోట జరిగిన మోసానికి రాష్ట్రంలోని దేశంలోని పోస్ట్ఫాసులన్నింటిని తప్పు పట్టలేం కదా.’’
‘‘మనీ మనీ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టడమంటే...’’ గొణిగాడు వసంత్.
‘‘బ్యాంక్ అంతర్గత విషయాన్నొకటి మీకు చెబుతాను. రహస్యంగానే ఉంచండి. దోపిడీ జరిగిన నాటి నుండి పది సంవత్సరాలులోగా దోపిడీ ఎవౌంట్ కలెక్ట్ కాకుంటే మనీ మనీ బ్యాంక్ ఆ డబ్బుని రిజర్వ్ బ్యాంక్ నుండి అప్పు తేవాలనుకుంటోంది. అలా నష్టాన్ని స్వయంగా భరించాలనుకుంటోంది.’’
గడువు ప్రకారం ఇంకా రెండేళ్లుంది. ఈలోగా బ్యాంక్ టర్నోవర్ పెంచి దోపిడీ నష్టాన్ని పూడ్చుకోవాలని అభిప్రాయ పడుతున్నాం. అందుకే కస్టమర్లలో కదలికలు తేవాలని నా వంతు ప్రయత్నం’’ చెప్పాడు పాండవీయం.
వసంత్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.
‘‘చూద్దాం. వేదవ్యాస్ లాంటి డైనమిక్ కేసు టేకప్ చేశాడు. సమర్ధుడైన పాండవీయం మేనేజర్‌గా వచ్చాడు’’ అనుకొన్నాడు మనసులో.
(ఇంకా వుంది)

-ఎనుగంటి వేణుగోపాల్ 9440236055