వీక్లీ సీరియల్

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హీరో సిల్వెస్టర్ స్టాలెన్‌ని తన పార్టనర్‌గా ప్రకటించి న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్స్ కట్టే ప్రకటన చేశాడొక వ్యక్తి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశం న్యూయార్క్‌లోని మాన్‌హటన్. ఇక్కడికి సమీపంలో అపార్ట్‌మెంట్స్ అనేసరికి ఆకర్మాతులైన కోటీశ్వరులందరూ క్యూ కట్టారు.
కొందరు ఉన్న ఇండ్లని అమ్మేసి, మరికొందరు అప్పులు చేసి మరీ అక్కడి ప్లాట్‌లని బుక్ చేసుకున్నారు. మిగతా ప్రదేశాలతో పోలిస్తే నాలుగు రెట్లు ఉంటుంది అక్కడి రేటు. కానీ ఉన్న రేటుని ఏకంగా పది రెట్లకి పెంచారు. అయినా కేవలం మూడే మూడు రోజుల్లో ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్లు మొత్తం డబ్బంతా కట్టేశారు.
ఇండ్లతో పాటుగా స్విమ్మింగ్ పూల్, పార్క్, షాపింగ్ కాంప్లెక్స్, స్కూల్, బార్ వంటివి కూడా ఉంటాయని ప్రకటించారు. అందుకే కొనుగోలుదార్ల నుండి ఆ ప్రకటనదారుడికి మొత్తం 15 కోట్ల డాలర్లు చేతులు మారాయి.
అసలా ప్రకటన ఇచ్చి సొమ్ము చేసుకుంది మరెవరో కాదు. సిల్విస్టర్ స్టాలెన్ బాల్య మిత్రుడట!
తర్వాత ఈ ప్రహసనమంతా మోసమని, హీరో సిల్వెస్టర్‌కి దీనితో ఎలాంటి సంబంధం లేదని తెలిసిన జనం రియల్ ఎస్టేట్ బిల్డర్ పైన కోర్టులో దావా వేశారు. అది వేరే విషయమనుకోండి’’ ఆగాడు క్షణకాలం.
అందరూ ఊపిరి బిగపట్టి షణ్ముగం చెప్పేది టెన్షన్‌గా వింటున్నారు.
ఒకసారి కలయచూసి కంటిన్యూ చేశాడిలా.
‘‘సినీ స్టార్లంటే విదేశీయులకి సైతం ఎంత మోజు ఉందో ఇక్కడ మనం గుర్తించాల్సిన మెయిన్ పాయింట్. అదే సినిమా స్టార్లపైన మన వాళ్లకి ఉండే క్రేజ్‌ని బలహీనతగా చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వాలి. అయితే అక్కడ ఆ వ్యక్తి చేసిన పొరపాటు మన దగ్గర తిరిగి దొర్లకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాననుకోం...’’
అతనా వాక్యం పూర్తి చేయక ముందే మెరుపు వేగంతో షణ్ముగానికి చేరిందో న్యూస్... వాళ్ల సమావేశానికి తీవ్ర అంతరాయం కల్పిస్తూ.
ఆ న్యూస్‌కి అతనెంతలా కదిలిపోయాడండే-
ఇమీడియెట్‌గా ఆ కాన్ఫరెన్స్‌ని వాయిదా వేసి తన ప్రైవేట్ ఛాంబర్‌లోకి వెళ్లిపోయాడు.
తన ఉనికి ఏమాత్రం తెలియకుండా పొదలమాటున సంచరిస్తున్నాననుకుంటున్న నల్లత్రాచు పొంచి ఉన్న ప్రమాదం తన వైపు దూసుకు వస్తోందని పసిగడితే కసిగా బుసలు కొడ్తుంది. అలర్ట్ అయితే బయటపడుతుంది. అశక్తురాలైతే ప్రమాదానికి బలి అయిపోతుంది.
తనకి అందిన న్యూస్ వింటూనే కాళ్ల కింద భూభాగం కదలినట్లు భయకంపితుడయ్యాడు షణ్ముగం. ఒక భయానక పిడుగు స్లోగా తనమీదే పడిన ఫీలింగ్. భూభాగం బ్రద్దలై అందులో కూరుకుపోతున్న అనుభూతి.
షాక్‌కి గురైన వాడిలా విలవిల్లాడాడు కాసేపు. అయినా మనోధైర్యం కోల్పోలేదతను. అదే షణ్ముగం ప్రత్యేకత. తుఫానులో చిక్కుకున్నా నిబ్బరంగా ఉండగలడు.
తన మెదడుకి పదును పెట్టాడు. చివరికి... తనకి అందిన వార్తకి ప్రతిగా ఎదురు దెమ్బ తీయడమా, తోక ముడిచి పలాయనం చిత్తగించడమా... అనే మీమాంసలో పడిపోయాడు చాలాసేపు.
* * *
అక్కడ-
‘‘ఆ వివరాలు నాకెలా తెలుసు అంకుల్?’
వాడి ముఖంలో ప్రశ్నార్థకం. చూపుల్లో అమాయకత్వం.
అఖిల్ సమాధానం వినగానే వ్యాస్ ఉత్సాహం చప్పున చల్లారింది.
‘‘పర్వాలేదు. నీకెంత టైమ్ కావాలంటే అంత టైమ్ తీసుకో. నిన్నిక్కడ ఎవ్వరూ ఏమీ అనరు. దేనికీ అడ్డు చెప్పరు. జరిగింది జరిగినట్లు చెప్పు.’’
వేద మైండ్ పజిల్డ్‌గా మారుతుంటే కూల్ అవుతూ అడిగాడు.
నిస్సహాయంగా చూస్తుండిపోయాడా కుర్రాడు.
‘‘కమాన్...కమాన్...’’
‘‘నాకేమీ తెలియడం లేదంకుల్.’’
ఇబ్బందిగా ముఖం పెట్టాడు. గతి తప్పిన స్వరంలా ఉంది వాడి గొంతు.
‘‘తొందరేమీ లేదు. ఈ పరిసరాలన్నింటినీ బాగా గమనించు. నెమ్మది నెమ్మదిగా గుర్తు తెచ్చుకో.’’
అఖిల్‌ని మూడ్‌లోకి తెచ్చే ప్రయత్నమే తప్ప మరో విషయం ఆలోచించడం లేదతను.
ఆ దోపిడీ సంఘటన ఎలాగైనా వాడి చేత చెప్పించాలన్న తపనతో ఉన్నాడు.
‘‘సారీ అంకుల్, నాకేదో భయం భయంగా ఉంది. మీరేం అడుగుతున్నారో నేనేం చెప్పాలో అస్సలు అర్థం కావడం లేదు’’ అన్నాడు.
పిరికితనం ప్రవేశించింది వాడిలో.
‘‘్భయం దేనికి? నేనున్నాగా! ఇక్కడ గుర్తుకు రాకుంటే అటు వైపు పద.’’
అంటూ అఖిల్‌ని లాకర్ల గది వైపు తీసుకుపోయాడు.
‘‘ఇదిగో... ఈ లాకర్స్‌ని బాగా పరిశీలించు. ప్రదేశంలోకి ఎవరో చొరబడి, ఏదో చేశారు. గుర్తుకు తెచ్చుకో నిట్టూ, యు.ఆర్. ఎ గుడ్ బాయ్. ట్రై చేయ్.’’
అఖిల్‌ని ఊపిరి సలపనివ్వనంత తొందరపెట్టేస్తున్నాడతను.
బెదిరిపోయిన ఆ కుర్రాడి కళ్లు నీటి కుండలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
‘‘అఖిల్! డోన్ట్ వేస్ట్ టైమ్! త్వరగా చెప్పేసెయ్!’’
టెన్షన్...కుర్రాడి ద్వారా నేరం తెలుసుకోవాలన్న తొందరపాటు...ఎందుకు పెదవి విప్పడం లేదన్న శంక...
వీటితో వివేచన కోల్పోయిన వేద బలవంతపెట్టేస్తున్నాడా పిల్లవాడ్ని.
గుండెలో గూడు కట్టుకున్న గుబులు కుదిపేసింది అఖిల్‌ని.
‘‘మరే నాకేమీ గుర్తుకు రావడం లేదంకుల్. మమీ డాడీ గుర్తుకు వస్తున్నారంతే. ఇక్కడుండొద్దు. ఇంటికి వెళదాం అంకుల్...’’ అంటూ భోరుమని ఏడ్చేశాడు వాడు.
అప్పుడు...అప్పుడు... తన వైపు నుండి కాక, పిల్లాడి పరంగా ఆలోచించాడు వేదవ్యాస్.
అఖిల్‌ని అనవసరంగా మానసికంగా హింసిస్తున్నానేమోనన్న తలంపు రావడంతో వేద విచలితుడయ్యాడు.
చప్పున వాడిని దగ్గరకు తీసుకున్నాడు.
చెమర్చిన వాడి కళ్లని ఆప్యాయతతో తుడిచాడు.
‘‘నిట్టూ ఏడవకు. వెంటనే మమీ డాడీల దగ్గరికి వెళ్లిపోదాం సరేనా?’’ అంటూ ఓదార్చాడు.
తన ప్లాన్ వికటించడంతో హర్ట్ అయిన వేద తొలిసారిగా తన కర్తవ్య నిర్వహణలో ఎదురైన అపజయాన్ని జీర్ణించుకోలేక భారంగా కదిలాడక్కడి నుండి.
ఆ క్షణంలో అతను తీసుకున్న సరైన నిర్ణయమేంటంటే-
అఖిల్‌ని ఇంకా విసిగించకుండా, కష్టపెట్టకుండా అడిగిన వెంటనే వాళ్లింటికి చేర్చడం.
వేదవ్యాస్‌కి మరొక విషయం తెలియదు.
అతి త్వరలో రెండవ పరాజయాన్ని చవిచూడబోతున్నానని.
* * *
అత్యవసర సమావేశ నిమిత్తమై యస్సై వేదవ్యాస్‌ని పిలిపించాడు సి.ఐ. ద్వివేది. ఆఫీసుకు కాదు తన ఇంటికి.
మనీ మనీ బ్యాంక్ దోపిడీ ఇనె్వస్టిగేషన్‌కు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఆయనకు అందడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే వేదవ్యాస్ కూడా ద్వివేదిని అధికారికంగా అనధికారికంగా కలవక చాలా రోజులయ్యింది.
పాయింట్ టు పాయింట్ ఎవ్విరీ మూవ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ తనకి అందజేయమని యస్సైని ఆదేశించకపోయినా పై అధికారిగా సంబంధిత సమాచారం తెలుసుకోవాలనే ఉద్దేశంతో అతన్ని రమ్మన్నాడు ద్వివేది.
‘‘వాట్ ఈజ్ ద మ్యాటర్? సడెన్‌గా పిలిపించారేంటి’’ అడిగాడు.
‘‘నీ ఇనె్వస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చిందో తెలుసుకుందామని’’ చెప్పాడు ద్వివేది.
‘‘జరుగుతోంది. బలమైన సాక్ష్యాధారాల కొరకు ప్రయత్నిస్తున్నాను.’’
‘‘యూ మీన్... నేరస్థులెవరో తెలిసిందా.’’
అలా ప్రశ్నిస్తున్న ద్వివేది అంతరంగం ఉత్కంఠభరితమైంది.
పెదవి విప్పి ఏదో చెప్పబోయిన వేద సిక్స్త్‌సెన్స్ హెచ్చరికతో చప్పున మాట మార్చాడు.
‘‘నో సార్!’’ అంటూ అఖిల్‌ని బ్యాంక్‌కి తీసుకెళ్లిన విషయం మాత్రం చెప్పాడు.
‘‘కేవలం ఆ కుర్రాడి మీదే ఆధారపడి నీ ఇనె్వస్టిగేషన్ కొనసాగుతోందా?’’ సి.ఐ. భృకుటి ముడివడింది.
‘‘ఏదీ ఇదమిద్దంగా చెప్పలేను. కావచ్చు. కాకపోవచ్చు. ఈ కేసుని టేకప్ చేసే ముందే మీకు చెప్పాను.
దర్యాప్తుని ఎలా కొనసాగిస్తానో చెప్పను అని. ఇప్పుడు అదే చెబుతున్నాను. చెప్పబోనని ప్లీజ్... అండర్‌స్టాండ్ మీ సర్.’’
అతడి అభ్యర్థనని మన్నిస్తున్నట్టు సరేనని తలూపాడు ద్వివేది.
‘‘బట్... ఫస్ట్ చాయిస్ టు మాస్టర్ అఖిల్. ఆ పిల్లవాడి ద్వారానే ఈ కేసు మిస్టరీ ఛేదించబడుతుంది. దెరీజ్ నో డౌట్.’’
‘‘అఖిల్ ద్వారా క్లూ దొరకకుంటే?’’ సందిగ్ధతని పెనవేసుకున్నాయా చూపులు.
‘‘అలా జరగని క్షణాన మరో కోణం నుండి నా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ వేద దేన్నైనా ప్రారంభించాడంటే దాని అంతు... అంతం చూడాల్సిందే తప్ప తోకముడిచి వెనుదిరగడం నా లైఫ్ డైరీలోనే లేదు సర్’’ కాస్త ఎగ్జైట్‌మెంట్‌కి లోనయ్యాడు.
‘‘డోంట్ బి రెయిజ్!’’ చిన్నగా నవ్వాడు ద్వివేది.
మనిషికి ఎదురుగాలి తగిలినప్పుడు టెన్షన్‌కి లోనవ్వడం సహజాతి సహజం. అనుకున్నది అనుకున్నట్టుగా కేసు దర్యాప్తు సాఫీగా జరగకపోవడంతో వేద పరిస్థితి అలాగే ఉండి ఉంటుందని భావించాడాయన.
‘‘నాకు తెలుసు. నీది మొసలి పట్టని. నీటిలోకి వచ్చి చేరిన ఎంతటి బలమైన జంతువైనా మొసలిపట్టుకు గింజుకోవలసిందే! అలాగే నీలో ఊపిరి ఉన్నంత కాలం నీ లక్ష్యం నెరవేరేదాకా ఎవరినీ వదిలిపెట్టవని నాకు తెలీదా?’’
అపజయంలో ఒక చిన్న ఓదార్పు ఆ వ్యక్తి ఆత్మస్థయిర్యానికి ఆయుధం అవుతుంది. అందుకే వేదవ్యాస్‌ని ఉత్తేజపరిచాడా ఆఫీసర్.
ఒక్క క్షణం కళ్లు మూసుకొని తన అంతరంగ అలజడిని తగ్గించుకున్నాడు వేదవ్యాస్.
‘‘అఖిల్ ద్వారా దోపిడీ వ్యవహారం బట్టబయలవుతోందనే రహస్యం నేరస్థులకి తెలిసి అఖిల్‌కి ఏదైనా ప్రమాదం తలపెడితే. జరగరానిది జరిగినప్పుడు... వాళ్ల తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోగలమా?’’ ప్రశ్నించాడు సి.ఐ.
‘‘తెలిసే అవకాశం లేదు. అయినా ఆ కుర్రాడికి ఫుల్ స్పెషల్ ప్రొటెక్షన్ చేశాను. వాడికెలాంటి ప్రమాదం లేదు. వాటిల్లదు. సారీ సార్ మీకీ విషయం చెప్పడం మరిచాను. నేరస్థుల నీడ కూడా వాడి మీద పడకుండా గట్టి బందోబస్తు జరిగింది. ఈ విషయం సీక్రెట్‌గా ఉంచాను.’’
‘‘ఇట్స్ ఓకే! ఫుల్ పవర్స్ నీకే ఇచ్చాగా! దానికి సారీ ఎందుకు? మనకి కావాల్సింది దోపిడీదారులు పట్టుబడడం.’’
‘‘్థంక్యూ సర్.’’
‘‘మళ్లీ మాస్‌మీడియాకి ఏదైనా సమాచారం అందిద్దామా.’’
‘‘అక్కర్లేదు సర్! ఈ మూవ్‌మెంట్‌లో వద్దు. అఖిల్ ఫోకస్ అవుతాడేమోనని! అందుకే ఆ బ్యాంక్‌కి అఖిల్‌ని తీసుకువెళ్లిన విషయం పేపర్స్‌లో కవర్ కాకుండా జాగ్రత్త పడ్డాను. నా అనుమానం ఏంటంటే మనీ మనీ బ్యాంక్ దోపిడీకి ఈ సిటీలోని కొందరు బడా వ్యక్తులకి లింక్ ఉందేమోనని. అది కూడా ప్రత్యక్షంగానో!... పరోక్షంగానో.... లేదా ఎలాంటి సంబంధమూ ఉండకపోవచ్చు. ఆ రకంగా కూడా నా దర్యాప్తు కదులుతోంది.’’
‘‘కొందరు వ్యక్తులపై అనుమానం ఉన్నప్పుడు అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ ప్రారంభం చేయవచ్చు కదా! మార్గం సులువు అవుతుందేమో అలోచించు.’’’
‘‘నో సార్! రంగంలోకి దిగాక అనుమానితుల్ని అడ్డు పెట్టుకొని సాక్ష్యాలను వెతకదల్చుకోలేదు. జరిగిన దోపిడీ మూలాల నుండి ఆధారాల వైపు దర్యాప్తును తీసుకువెళ్తాను. బలమైన ఆధారాలు లభించాకే నేరస్థుల్ని ఇంటరాగేట్ చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. అందుకే ఏ చిన్న క్లూ దొరికినా ఆ వ్యక్తి బయోడేటా, దైనందిన కార్యకలాపాలు, అలా ప్రతి మూవ్‌మెంట్‌ని నా స్పెషల్ రూమ్‌లోని కంప్యూటర్‌లో భద్రపరుస్తున్నాను.’’
‘‘గుడ్! నువ్వు నేరస్థుల్ని చట్టానికి పట్టివ్వడమే లక్ష్యంగా ఈ యజ్ఞాన్ని చేపట్టావు. సో నీ అంతస్సాక్షి ప్రకారమే అత్యంత ధైర్యంగా మరింత పారదర్శకంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను.’’
‘‘మీరిచ్చిన స్ఫూర్తి నన్ను కార్యోన్ముఖున్ని చేస్తోంది సర్. నా ఇనె్వస్టిగేషన్‌లో ఎలాంటి రాజకీయాలకు తావుండకూడదని, రాజకీయ నాయకుల ప్రమేయం అసలే ఉండకూడదని నేను కోరిన మరుక్షణం నా షరతులని మన్నించారు. నా దర్యాప్తు స్వచ్ఛందంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగేందుకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నందుకు వెరీ వెరీ థాంక్స్ సర్.’’
(ఇంకా ఉంది)

-ఎనుగంటి వేణుగోపాల్ 9440236055