వీక్లీ సీరియల్
పాతాళస్వర్గం-17
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘మిస్టర్ నాయక్! ఇప్పుడేం చేద్దాం?’ అన్నాడు మెల్లగా.
నాయక్ తన అనుమానాలు చెప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసి రెండు గంటలపాటు ఏవో రహస్య చర్చలు జరిపారు. మరి కాస్సేపు తర్వాత ఇల్లు చేరుకున్నాడు నాయక్.
అప్పటికే వచ్చి, అతని కోసం చూస్తూ కూర్చుంది లూసీ. అతన్ని చూడగానే లేచి, ఇంత మొహం చేసుకుని విష్ చేసింది. అతను హుందాగా తలపంకించి, ఆమెని వెంటబెట్టుకుని తన ఆఫీస్ రూమ్‌లోకెళ్లి, అటుకేసి ఎవర్నీ రానివ్వద్దని హెచ్చరించి, తను కూర్చుని ఆమెని కూర్చోమని సైగ చేశాడు. తర్వాత గొంతు విప్పాడు.
రెండు గంటల తర్వాత చిన్నబుచ్చుకున్న మొహంతో, నీరసంగా బైటికొచ్చి ఆటోలో హాస్పిటల్ చేరుకుంది లూసీ.
‘ఏం జరిగింది లూసీ?’ ఆమె మొహం చూసి కంగారుగా అడిగాడు అనిల్.
‘ఐ.జి. గారు నన్ను ఇంటరాగేట్ చేశారు’ దుఃఖం వచ్చేసింది లూసీకి. అతను కంగారుపడిపోయాడు.
‘ఏవన్నారు లూసీ? ఆయన నిన్ను ఇంటరాగేట్ చెయ్యడం ఏమిటి?’ అన్నాడు.
‘మేడమ్ ప్రిస్క్రిప్షన్ గురించి అడిగారు. నేను మీకు చెప్పినట్టే చెప్పాను. కానీ ఆయన మీలా థాంక్స్ చెప్పకపోగా ‘అసలు వాళ్లు నీకెలా తెలుసు? వాళ్లకీ నీకూ ఏవిటి సంబంధం? వాళ్లెక్కడుంటారు?’ అంటూ నానారకాల ప్రశ్నలూ వేసి ఉక్కిరిబిక్కిరి చేసేశారు. అసలు ఈ అనర్థాలన్నిటికీ కారణం నేనే అన్నట్టు మాట్లాడారు. ఆ ప్రభుగారు వెళ్లి తిరిగి రాలేదుట. ఆయనెక్కడో తిరిగి షికార్లు కొడుతుంటే, దానిక్కూడా నేనే బాధ్యురాలన్నట్టు మాట్లాడారు. నేను కూటికి పేదదానే్న కావచ్చు, గుణానికి పేదదాన్ని కాదు. ఎంత పోలీసులైనా అంత దారుణంగా అవమానిస్తే సహించలేను.’ దాదాపు ఏడుస్తూ అంది లూసీ. నిర్ఘాంతపోయాడతను.
విజయ నాయక్ మీద పిచ్చి కోపం వచ్చింది. కానీ ఏం చెయ్యగలడు? అదీగాక గౌతమిని వెతకడంలో అతనికి మంచి పట్టు ఉందని అనిల్‌కి బాగా తెలుసు. అందుకే లూసీని అనునయించడానికి ప్రయత్నించి ఓడిపోయాడు.
‘సారీ సర్! దిక్కుతోచని పరిస్థితుల్లో మేడమ్, మీరు కూడా నాకింత నీడనిచ్చి కాపాడారు. నా కేరెక్టర్ గురించి తెలిసిన వాళ్లు మీకు చెప్పినా పెద్ద మనసుతో క్షమించి నన్ను రోడ్డున పడకుండా కాపాడారు. అయినా చెప్పక తప్పదు. నేనీ జాబ్ వదిలేసి కేరళ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. అసలీ విషయం నినే్న చెప్పాలనుకున్నాను. కానీ ఎలా చెప్పాలా అని మధనపడ్డాను. ఇవాళ ఆ ఐ.జి. గారి ధర్మమా అని ధైర్యంగా చెప్పేస్తున్నాను’ అంది లూసీ. అనిల్ నోట మాట రాలేదో క్షణం. తర్వాత-
‘నినే్న చెప్పాలనుకున్నావా? ఏం జరిగింది?’ అన్నాడు మెల్లగా.
‘మంచే జరిగింది సర్. కేరళ నించి మా బావ టెలిగ్రామ్ ఇచ్చాడు. వెంటనే బయల్దేరి రమ్మని. రేపు టెన్త్‌న నన్ను పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం పెట్టించానని, అందుకే ఎవరూ లేని నేను మా బావని పెళ్లి చేసుకుని అతని నీడలోనే నిశ్చింతగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను’ మెరుస్తున్న కళ్లతో అంది లూసీ.
‘నీకో బావ వున్నాడా? ఈ విషయం నాకెప్పుడూ చెప్పలేదే?’
‘తనెక్కడో కేరళలో ఓ హోటల్‌లో చిన్న జాబ్ చేసుకుంటున్నాడు. నేనంటే అతనికి ప్రాణం. మొన్నటిదాకా అతనంటే నాకంత ఇష్టం ఉండేది కాదు. ఇటీవల నాలో మార్పొచ్చింది. ఆ మధ్య ఫోన్ చేసి చెప్పాడు. ఫ్లయిట్ టికెట్ అవీ పంపిస్తాను. వచ్చెయ్యమని’ అంటూ టెలిగ్రాం, ఫ్లయిట్ టికెట్ చూపించింది లూసీ.
అతనికేం అనాలో అర్థంకాలేదు.
‘మేడమ్ వచ్చేదాకా అయినా వుండకూడదా?’ అని మాత్రం అన్నాడు.
‘క్షమించండి సర్! ఇప్పుడు వెళ్లకపోతే బావ మనసు మారిపోవచ్చు. అయినా మీరు కొత్తగా అపాయింట్ చేసిన నర్స్ కూడా చాలా మంచిది. మేడమ్ వస్తే ఆవిడతో కూడా క్షమించమన్నానని చెప్పండి’ అందామె రెండు చేతులూ జోడించి.
ఇంకేం అనలేని అనిల్ రెండు నెలల జీతం ఇచ్చి ఆమెని రిలీవ్ చేశాడు. అతనికి థాంక్స్ చెప్పి, మిగతా స్ట్ఫాకి విషయం చెప్పి, తన వస్తువులన్నీ వార్డ్‌బోయ్ లాంటి వాళ్లకిచ్చేసి వెళ్లిపోయింది లూసీ.
* * *
దొరకి పూర్తి ఆరోగ్యం చిక్కలేదు. అతనికెలాంటి లోటు రాకుండా కావల్సిన మందులు తెప్పించి ట్రీట్ చేస్తూనే అతన్ని ప్రశాంతంగా వుంచడానికి ప్రయత్నిస్తోంది గౌతమి. తమ ప్రాణదాతకి ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నానని తృప్తిగా కూడా ఉందామెకి. దొర కాస్త కోలుకోగానే, అతని దగ్గరున్న అమ్మవారి నగల్ని అడగాలనీ నిర్ణయించుకుంది. తమ దొర బతకటానికి గౌతమే కారణం అని తెలిసిన ఆటవికులంతా ఆమెని ప్రాణంగా చూసుకుంటున్నా, జింబోతోనే ఆమెకి ప్రాబ్లమ్‌గా ఉంది.
అలాంటి సమయంలోనే పోలీసు మనిషి అంటూ ప్రభుని తెచ్చి మునుపు జింబో గౌతమిని బంధించిన గుహలోనే పడేసి విషయం చెప్పడానికి దొర దగ్గరికి పరిగెత్తుకొచ్చారు అతన్ని తెచ్చినవాళ్లు. వాళ్ల నవతలగా తీసికెళ్లి విషయం తెలుసుకుని-
‘ఇలాంటివి దొరకి ఇప్పుడు చెప్పడం మంచిది కాదు. తర్వాత మెల్లగా చెప్దాం’ అంటూ వాళ్లనవతలికి పంపేసింది గౌతమి. మిగతా వాళ్లక్కూడా అదే మంచిదనిపించింది. చిన్ని మాత్రం-
‘ఏంటి గౌతమీ! ఎంతోమంది ఊహించడానికే భయంతో వొణికిపోయే ఈ అడవిలోకి ఆడపిల్లవి నువ్వొచ్చావ్. తర్వాత ఆ పోలీసు మనిషి. రేపింకొకళ్లు. ఇదంతా చూస్తుంటే మా సింగపడవికి నూకలు చెల్లిపోయేట్టున్నాయనిపిస్తోంది’ అంది భయంగా.
గౌతమి తుళ్లిపడింది.
‘కొంపదీసి నా కోసం పోలీసుల చేత వెతికిస్తున్నారేమో. ఏది ఏమైనా తనవల్ల దొర వాళ్లగ్గానీ, ఈ అడవిగ్గానీ హాని జరక్కూడదు’ అనుకుని, చిన్ని చెయ్యి పట్టుకుని ప్రభుని బంధించిన గుహకేసి నడిచింది. లోపల తాళ్లతో కట్టిలేకపోయినా, గుహకున్న కటకటాలకి తాళం వేసి ఉంది. అక్కడంతా మసకమసగ్గా ఉంది.
‘హలో’ అంది గౌతమి కాస్త గట్టిగా. నీరసంగా పడుకున్న అతను తుళ్లిపడి లేచాడు. అతన్ని వెలుగులో చూసిన గౌతమి క్షణం కొయ్యబారిపోయింది.
‘ప్రభూ! మీరా?’ అంది తేరుకుని.
ఆమెని చూసిన ప్రభు మొహం వెలిగిపోయింది.
‘గౌతమీ! ఎలా వున్నారు? ఈ జన్మలో మిమ్మల్ని చూస్తాననుకోలేదు. థాంక్ గాడ్. మీరు క్షేమంగా ఉన్నారు’ అన్నాడు ఆనందంగా.
‘ఈయన నీకు తెలుసా?’ కళ్లు చిట్లిస్తూ అంది చిన్ని.
‘ఊఁ.. ఈయన నా ఫ్రెండ్. అంటే స్నేహితుడు’
‘ఏవిఁటి ప్రభూ! ఈ పరిస్థితి?’ అంది గౌతమి బాధగా.
‘ఇలా రావాలని, మిమ్మల్ని కలవాలని రాసి పెట్టాడా దేవుడు’ నవ్వాడతను.
అతనికి ఆటవికుల చేతికి దొరికిపోయానన్న బాధ కన్నా గౌతమి కనిపించిందన్న ఆనందమే ఎక్కువగా ఉంది.
‘నన్ను వెతుకుతూ వచ్చారా?’
‘అవును. మీ ప్రిస్క్రిన్ వల్ల అనిల్, విజయనాయక్ సి.ఎం. గారిక్కూడా తెలిసిపోయింది. నువ్విక్కడ చక్కడిపోయావని.. సారీ! మీరిక్కడ చిక్కుకున్నారని’ అన్నాడతను.
‘పర్లేదు. వియార్ ఫ్రెండ్స్. మీరు నన్ను పేరు పెట్టి చనువుగా పిలవచ్చు’ అంది గౌతమి.
అతని మొహంలోకి కొత్త కాంతి వచ్చింది.
‘మరైతే మీరూ.. అదే నువ్వూ నన్ను పేరు పెట్టి పిలవాలి’ అన్నాడు ఉత్సాహంగా.
‘అలాగే.. కానీ నువీ ఆటవికుల చేతికి చిక్కిపోయావే.. ఇప్పుడెలా?’ అంది గౌతమి కంగారుగా.
‘దాన్ని గురించి నాకేం బాధగా లేదు గానీ, నా సరంజామా అంతా వున్న బ్యాగ్ వాళ్లదగ్గరుండి పోయింది’ అన్నాడు ప్రభు నవ్వుతూనే.
‘గౌతమీ! నీలాగే ప్రభుగారిక్కూడా ధైర్యం ఎక్కువే’ అంది చిన్ని.
‘అవును. ప్రభు సామాన్యుడను కుంటున్నారేమిటి ఇతను.. అదే ప్రభు చాలా ధైర్యస్థుడు’ ఏదో చెప్పబోయిన గౌతమి మాట మార్చేసింది.
‘పాపం! ఆ ధైర్యమే ఈయన్ని కష్టాల్లో పడేసింది’ బాధగా అంది చిన్ని. చిన్నిని అతనికి పరిచయం చేసి-
‘డోంట్‌వర్రీ ప్రభూ! ఇక్కడి వాళ్లంతా మనం అనుకున్నంత దుర్మార్గులు కారు సరికదా స్నేహపాత్రులు కూడా! నా కోసం ప్రాణాలకి తెగించి వచ్చావని చెప్తే దూర క్షమించి తేలిగ్గా వదిలేస్తాడు’ అంది గౌతమి.
‘గౌతమిని వెతుక్కుంటూ వచ్చారు సరే. ఎవరికీ తెలియని రహస్య మార్గంలోంచి ఎందుకొచ్చారు?’ అంది చిన్ని ఏదో ఆలోచిస్తూ.
‘నా కోసమే చిన్నీ! నేనంటే తనకి చాలా ఇష్టం. ఎవరో అది దగ్గరి దారి అని చెప్పుంటారు. ముందు వెనక చూడకుండా వచ్చేశాడు. దొర అనుమతి తీసుకుని ఇద్దరం వెళ్లిపోతాం’ అంది గౌతమి మనసులో భయపడుతూనే.
చిన్ని నవ్వింది.
‘నాకు తెలిసిందిలే! నువ్వు ప్రేమించింది ఈయనే్నగా?’ అంది అల్లరిగా. కంగారుగా చూశాడు ప్రభు.
‘అయితే నువ్వేం కంగారుపడకు. మీ ఇద్దర్నీ బాబా క్షేమంగా అడవి దాటిస్తాడు’ అంటూ గబగబా వెళ్లి అతనికి తినడానికేదో ఇచ్చి-
‘సరే.. మాట్లాడి తొందరగా వచ్చెయ్యి. మళ్లీ ఎవరైనా వస్తే గొడవ?’ అంటూ వెళ్లిపోయింది చిన్ని. గౌతమి తండ్రి ఆరోగ్యం గురించి, అక్కడి పరిస్థితుల గురించీ అడిగింది. తండ్రి ఆరోగ్యం మెరుగైందని విని తేలిగ్గా ఊపిరి తీసుకుని తన అనుభవాలు చెప్పింది. ఆటవికుల మంచితనం గురించి చెప్పింది.
‘అయితే నువ్వు పాతాళస్వర్గం చూసుండాలే’
‘ఏవిఁటీ?’ తుళ్లిపడింది గౌతమి.
‘అదే ఇక్కడ పాతాళ స్వర్గం’
అతని మాట పూర్తి కాకుండానే కటకటాల్లోంచే అతని నోరు మూసేసింది గౌతమి.
‘ప్లీజ్! ఇంక నీ నోట్నించి ఆ పేరు రాకూడదు. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మరి నేను వస్తాను. ఇప్పుడే దొరతో మాట్లాడతాను. నీ బేగ్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాను’ అంది.
అతను ‘సరే’ అన్నట్టు తలూపాడు. ఆమె వెనుతిరిగింది.
ఆమె వెళ్లేసరికి దొర మంచం మీద కూర్చుని ఏదో జావ తాగుతున్నాడు. గౌతమిని చూసి సన్నగా నవ్వి-
‘ఇంకా ఈ ట్యూబులూ అదీ ఎన్నాళ్లు తల్లీ?’ అన్నాడు.
‘ఇంక కొన్నాళ్లే దొరా! అన్నట్టు నిన్ను నేనూ చిన్నిలా బాబా అని పిలవనా?’ అతని పక్కన కూర్చుని, అతని చేతులు పట్టుకుంటూ పసిపిల్లలా అంది గౌతమి.
దొర కళ్లు తళుక్కుమన్నాయి.
‘పిలువ్ తల్లీ! నువ్వెలా పిల్చినా నా బిడ్డవే. నువ్వు నా పెద్ద కూతురివి’ ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ అన్నాడు దొర.
‘బాబా! నీ కూతురిగా ఓ కానుక అడుగుతాను. ఇస్తావా?’ అంది గౌతమి గోముగా.
‘నువ్వడిగితే నేను కాదంటానా తల్లీ. చెప్పు! ఏం కావాలి? నిన్ను మీ ఇంటికి చేర్చాలా?’ అన్నాడతను నవ్వుతూ.
‘అమ్మో! ఇప్పుడా? నిన్నీ స్థితిలో వదిలిపోవడానికా నిన్నింత కష్టపడి బతికించుకున్నది. నీకు పూర్తిగా నయం అయ్యేదాకా నువ్వు తరిమినా నేను వెళ్లను’ చిన్నపిల్లలా అతని నడుం చుట్టూ చేతులు వేసి ఊగుతూ అంది గౌతమి.
‘మరి నీకేం కావాలి? ఏదో అడుగుతాను అడుగుతాను అన్నావుగా. నేను బానే వున్నాను. అడుగు’ నవ్వుతూ అన్నాడతను.
‘అది తర్వాత అడుగుతాను’
‘మరిప్పుడేం కావాలి?’
‘ఏం లేదు బాబా! మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేదని చెప్పాను కదా. ఆయన నా కోసం బెంగతో మరింత పాడైపోయారట. అందుకే నా కోసం వెతుకుతూ మా ఫ్రెండొచ్చాడు’ అంటూ ప్రభుని గురించి చెప్పింది గౌతమి.
క్షణం దొర మొహం గంభీరంగా అయిపోయింది.
‘క్షమించు బాబా! నా మూలంగా అతను బందీగా మారడం నాకు చాలా బాధగా ఉంది. నా క్షేమం గురించి తెలిసింది కాబట్టి వెళ్లి నాన్నగారికి చెప్తాడు. ఇక్కడి విషయాలుగానీ, మీ గురించి గానీ నోరు విప్పడని నేను మాట ఇస్తున్నాను. అతన్ని క్షేమంగా అడవి దాటించండి’ అంది గౌతమి దీనంగా.
మళ్లీ దొర మొహం ప్రసన్నంగా అయిపోయింది. చిన్ని అనుకున్నట్టే వచ్చినతను గౌతమికి చాలా కావల్సిన మనిషే అనుకున్నాడు. అదీగాక గౌతమి మీద అతనికి నమ్మకం ఉంది.
వెంటనే ప్రభుని తీసుకురమ్మని తన మనుషులకి ఆజ్ఞాపించాడు.
అంతే! క్షణాల మీద అన్నట్టు ప్రభుని వెంటబెట్టుకుని వచ్చాడు సిద్దు.
‘ఈయన సింగపడవికి నాయకుడు. నాకు ఆత్మీయుడు’ అంటూ దొరని ప్రభుకి,
‘ఇతను నా ఫ్రెండ్ ప్రభు. నేనంటే ప్రాణం. అందుకే తెగించి నా కోసం ఇక్కడికొచ్చాడు’ అంటూ దొరకి పరిచయం చేసింది గౌతమి. ప్రభు సి.ఎం.కి సంబంధించిన మనిషని మాత్రం చెప్పలేదు. ప్రభు వినయంగా కాళ్లంటి నమస్కరిస్తుంటే మురిసిపోయాడు దొర.
‘గౌతమికి తగినవాడే’ అనుకుంటూ అతన్ని ఆప్యాయంగా కౌగలించుకుని కూర్చోబెట్టి, అతని బేగ్ అతనికిప్పించేసి,
‘సరే, నీ ఫ్రెండ్‌ని కూడా నీతోపాటే వుండనీ మిగతా విషయాలు తీరిగ్గా మాట్లాడదాం’ అన్నాడు ప్రసన్నవదనంతో.
పొంగిపోతూ దొరకి థాంక్స్ చెప్పి ఇద్దరూ బైటికొచ్చేశారు. గౌతమి చనువుగా అతని చెయ్యి పట్టుకుని ఏటి ఒడ్డున ఓ పొద దగ్గరికి తీసుకెళ్లింది. ఇద్దరూ ఓ రాతి మీద కూర్చున్నారు.
‘ఇది కలా, నిజమా?’ అన్నట్టు అదోలాంటి మైకంలో పడిపోయాడు ప్రభు.
‘నా కోసం ఎంత రిస్క్ తీసుకున్నావు ప్రభూ! ఇప్పుడు నా కళ్లకి నువ్వో ఐఎఎస్ ఆఫీసర్‌లా గానీ, ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగివని కానీ, ముఖ్యంగా సి.ఎం.గారి ప్రాణ స్నేహితుడిలా గానీ కనిపించడంలేదు. నా కోసమే పుట్టిన ఆత్మబంధువులా కనిపిస్తున్నావ్’ అంది గౌతమి అతని చేతులు పట్టుకుంటూ.
అతను పొంగిపోయాడు.
‘నాకూ నువ్వో డాక్టర్‌గా గానీ, దోషులకి సింహస్వప్నంలా గడగడలాడించగల సాహస యువతిలా కానీ, అర్ధరాత్రి ఫోన్లు చేసి సి.ఎం.నే హడలగొట్టిన ‘క్లూ’లా గానీ అనిపించడంలేదు. ఏనాడో వదిలిపోయిన ఆత్మీయురాలు హఠాత్తుగా ఎదురైనట్టుంది’ అన్నాడు హాయిగా నవ్వేస్తూ. ఆమె కూడా నవ్వింది.
‘కానీ కిరాతకుల్లా పేరు పొందిన ఈ ఆటవికుల్లో ఇంత మంచితనం ఉండడమే ఆశ్చర్యంగా ఉంది’ అన్నాడతను ఏదో ఆలోచిస్తూ.
‘అవును. మొదట్లో నాకూ అలాగే అనిపించింది. వీళ్లేనా ఇన్ని దారుణాలు చేసేది’ అని. కానీ వీళ్లు చాలా మంచివాళ్లు’ అందామె మనస్ఫూర్తిగా.
‘అయితే నీకు పాతాళ స్వర్గం కూడా’
‘ష్!’ అతని మాట పూర్తి కాకుండానే కంగారుగా అతని నోరు మూసేసిందామె.
ప్రభు గొంతు తగ్గించి మళ్లీ పాతాళస్వర్గం గురించే అడిగాడు. గౌతమి కంగారుగా పరిసరాలు చూసి-
‘ప్రభూ! దయచేసి ఆ పాతాళ స్వర్గం గురించి మర్చిపో. ఆ మాట ఎవరైనా వింటే కొంపలంటుకుంటాయి. అది వాళ్లకి అతి రహస్యమైన ప్లేస్ అని విన్నాను. ఓసారి నేను దాన్ని గుర్తించి ఎత్తితే చిన్ని కూడా సీరియస్ అయిపోయింది. అదీగాక దొరకి జింబో అన్న మేనల్లుడున్నాడు. అతను మహా కోపిష్టి. దొర ఆదరించాడని విన్నా, నన్ను నిన్ను బంధించిన గదిలోనే బంధించాడు. బాబా ఊళ్లో లేని సమయం చూసి, తర్వాత వదిలేశాడనుకో’ అంటూ ఆనాటి సంఘటనలన్నీ చెప్పింది గౌతమి.
‘నాకోసారి ఆ పాతాళ స్వర్గం చూడాలనుంది గౌతమీ’
‘అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నిన్ను, నన్ను కూడా శాశ్వత బందీలుగా చేసేస్తారు. నా మాట విని నువ్వెళ్లి పోయి నా క్షేమం గురించి మన వాళ్లందరికీ చెప్పు. దొర కాస్త కోలుకోగానే నేనొచ్చేస్తాను’ అంది గౌతమి అనునయంగా.
‘నువ్వతనికి ప్రాణదానం చేశావు. నువ్వడిగితే దొర కాదనడని నా నమ్మకం. ఒక్కసారి చూసి వెళ్లిపోతాను’ వేడికోలుగా అన్నాడు ప్రభు.
‘మృత్యుముఖం నించి రెండుసార్లు తప్పించాడు. అంత మాత్రం చేత కోరరానిది కోరి ఇబ్బంది పెట్టాడా? అది చాలా రహస్య స్థావరమనీ, బైటి వాళ్లెవరూ దాని ఛాయలకే వెళ్లకూడదనీ ఇక్కడ చాలామంది చెప్పారు. అందుకే నేను దాన్ని గురించి ఆలోచించడం మానేశాను. నువ్వూ ఆ విషయం గురించి ఆలోచించడం మానెయ్’ అంది గౌతమి.
‘ఆఁ అక్కడేవుందో నాకు తెలుసులే’ అన్నాడతను నవ్వుతూ.
‘ఏం వుందనుకుంటున్నావ్?’
‘అక్కడ బ్లాక్‌టైగర్ ఉంటూ, ఆ దొర వాళ్లచేత దోపిడీలు చేయిస్తున్నాడన్న మాట’ అన్నాడు ప్రభు.
గౌతమి ఫక్కున నవ్వింది.
చిత్రంగా చూశాడతను.
‘ప్రభూ! నువ్వెంతో తెలివిగలవాడి వనుకున్నాను. కానీ నువ్వూ బోల్తా పడ్డావ్. అందుకే బ్లాక్‌టైగర్ భయంతో పాతాళ స్వర్గంలో దాక్కుని తనవాళ్లచేత దోపిడీలు చేయిస్తున్నాడను కుంటున్నావ్ కదూ’ అంది గౌతమి.
‘అంటే ఈ అడవిలో బ్లాక్‌టైగర్ అన్నతను లేడా?’ అన్నాడు ప్రభు నీరసంగా.
‘ఎందుకు లేడూ?’
‘వున్నాడా? ఎక్కడ?’
‘ఏం? అతన్ని చూడాలనుందా?’ ఓరగా చూస్తూ అంది గౌతమి.
‘అవును గౌతమీ! పాతాళస్వర్గం చూడకపోయినా అతన్ని చూసైనా తృప్తిపడతాను’ అన్నాడతను నవ్వుతూ.
‘అయితే విను. నువ్వతన్ని చూడ్డమే కాదు. మాట్లాడావు కూడా.. ఏవిఁటలా చూస్తావ్. మనం చూసి మాట్లాడిన దొరే బ్లాక్‌టైగర్!’
‘వ్వాట్?’ అదిరిపడ్డాడు ప్రభు.
‘నిజం ప్రభూ! ఆయనే బ్లాక్‌టైగర్. అందరూ అతన్ని ‘దొరా’ అని పిలుస్తారు’
‘కిరాతక చర్యలు చేస్తూ దేశానే్న గడగడ లాడిస్తున్న బ్లాక్‌టైగర్ అతనా? చూస్తే చెయ్యెత్తి నమస్కరించాలనిపించే రూపం, కరుణరసం వొలికించినట్టుండే కళ్లు.. ఓహ్! నమ్మలేక పోతున్నాను. ఈ అడవిలో బైటివాళ్లెవరు అడుగుపెట్టినా అంతుతేల్చే బ్లాక్‌టైగర్ ముక్కూ మొహం తెలియని నాక్కూడా ఆనందంగా ఆశ్రయం ఇచ్చాడంటే.. అందరూ అనుకుంటున్న అతను దుర్మార్ముడు కాదన్నమాట!’ అన్నాడు ప్రభు ఏదో ఆలోచిస్తూ.
గౌతమి మొహం గంభీరంగా అయిపోయింది.
‘అంత తొందరగా ఓ నిర్ణయానికి రాకు. నన్ను, నా వల్ల నిన్ను ఆదరించడానికో కథ ఉంది’ అంది మెల్లగా.
‘అతనికి ప్రాణదానం చేశావనా?’
‘దానివల్ల అందరికీ ఆప్తురాల్నయి పోయాననుకో. అది కాదు. ఆ మాటకొస్తే నాకు రెండుసార్లు ప్రాణదానం చేశాడతను. ముఖ్యంగా దొరది.. అదే బ్లాక్‌టైగర్‌ది చాలా జాలిగుండె. ఎంత కర్కశంగా ఉంటాడో అంత దయగానూ ఉంటాడు. ఆ దయాగుణమే నన్ను మా కుటుంబాన్నీ కూడా కాపాడింది’ అంటూ చిన్నతనంలో తమనతనెలా కాపాడిందీ అవీ వివరంగా చెప్పింది గౌతమి.
గౌతమి చెప్పిన విషయాలనీ వినేసరికి ప్రభు ఉత్సాహం పెరిగిపోయింది. అతని మనసులో వున్న కోరిక తీరిపోతుందన్న నమ్మకం వచ్చేసింది కూడా.
‘అయితే మనం పాతాళ స్వర్గం తేలిగ్గా చూసి రావచ్చు’ అన్నాడు.
నీరసం వచ్చేసింది గౌతమికి.
‘ప్లీజ్ ప్రభూ! ఆ పాతాళస్వర్గం గురించి మర్చిపో. దొర నన్ను నమ్మాడు. నువ్వు సి.ఎం. తాలూకు మనిషివని తెలిస్తే మనకీ స్వేచ్ఛ సంగతలా వుంచి, మనల్నీ అడవిలోనే సమాధి చేసేస్తారు. నా మాట విని నువ్వెళ్లి నా గురించి మన వాళ్లందరికీ చెప్పు. దొర ఆరోగ్యం కుదుటపడ్డాక వాళ్లే నన్ను క్షేమంగా అడవి దాటిస్తారు’ అంది వేడికోలుగా.
‘నిజంగా నువ్వు పాతాళస్వర్గం చూడలేదా?’
‘లేదు. విన్నానంతే. అది చాలా రహస్య ప్రదేశం అనీ, అక్కడికి ఆటవికులందరికీ కూడా ప్రవేశం వుండదనీ చిన్ని చెప్పింది. అదృష్టవశాత్తూ జింబో లేడు గానీ వుంటే చిందులు తొక్కేసేవాడు’ అంది గౌతమి గొంతు తగ్గించి.
‘జింబో? అతనెవరు?’
‘దొర మేనల్లుడు. అతనే్న అందరూ బ్లాక్‌టైగర్ అనుకుంటారు. ఆటవికులు మాత్రం ముద్దుగా టైగర్ అంటూంటారు. అతను చాలా కోపిష్టి కూడా’ అంది గౌతమి. అతను తనని ప్రేమిస్తున్నాడన్న సంగతి మాత్రం చెప్పలేదు.
‘ననే్న పొమ్మంటున్నావ్! నీ ప్రిస్క్రిప్షన్ చూసిన విజయ నాయక్ వాళ్లు కూడా ఇక్కడికి రావచ్చు’ అన్నాడు ప్రభు కాస్త నిష్ఠూరంగా.
‘అమ్మో.. ఆయన్ని మాత్రం రానీకండి. ప్రభూ ప్లీజ్! నువ్వెళ్లి నా గురించి చెప్పెయ్యి. ఇంక నా కోసం వెతకరు’ కంగారుగా అంది గౌతమి. అతను మాట్లాడలేదు.
(ఇంకా ఉంది)