వీక్లీ సీరియల్

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నువ్వేమనుకుంటున్నావో ముందు చెప్పు.’’
‘‘ఏం అర్థంకావడం లేదు.నిట్టూ గాడికొక తాయెత్తు కట్టింవ్వాలని నా ఆలోచన. ఇదో ప్రయత్నం. తల్లిగా వాడి ఆవేదన చూస్తూ తల్లడిల్లి పోయేకంటే, ఆ విధంగానైనా వాడి జబ్బు కుదిరితే అంతకంటే సంతోషమేముంటుంది’’ ఆర్ధ్రత నిండిన గొంతుతో అంది నివేదిత.
‘‘అరరే! ఇంత చిన్న విషయానికే వర్రీ అవడమెందుకే. సమస్యల్ని పంచుకుంటే బాధలు తుంచబడాయంటారు. మనసులో ఉంచుకుంటే పెరిగిపోతుంటాయంటారు. కాబట్టి అతిగా ఊహించుకొని నీలో నీవే కుమిలిపోకు’’ అనునయంగా అంది ప్రణిత.
‘‘నా కష్టం నీకర్థం కానిది.’’
‘‘లోకంలో కష్టాలు రానిదెవరికి చెప్పు? అందరికీ వస్తుంటాయి. గుండె నిబ్బరం చేసుకోవాలి. సమస్యని సానుకూలంగా సాల్వ్ చేసుకోవాలి. అయినా ఇదొక అంతర్జాతీయ సమస్యలా బెదిరిపోకు.’’
కాసేపు ఇద్దరి మధ్యా నిశ్శశ్దం.
నివేదిత ఏదో చెప్పబోతుంటే ముందుగా ప్రణిత పెదవి విప్పింది.
‘‘నాకు తెలిసిన వేద బ్రాహ్మణుడొకాయన ఉన్నాడు. ఆయన రామాలయానికి పూజారి. చాలామందికి తగిలిన ‘గాలి’వదలగొట్టాడన్న పేరుంది. ఎందరికో అతనంటే మంచి గురి. తాయెత్తులు కడతాడు. ఆయన మీ ఇంటికి వచ్చేలా ఏర్పాటుచేయిస్తాను. ఇక నువ్వు కంగారుపడాల్సిన పనేం లేదు.’’
‘‘చాలా థాంక్స్!’’ చెబుతోంటే కొద్దిగా నివేదిత ముఖం వికసించింది.
‘‘నీ మొహం! మనమధ్య కొత్తగా అదేమిటి. అన్నీ మరచిపోయి హాయిగా వుండు. శుభమే జరుగుతుంది.
నీకెలాంటి అవసరం ఉన్నా నే పరుగెత్తుకు వస్తాను’’ ఫ్రెండ్‌కి ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది ప్రణిత.
***
‘‘గుడ్ మార్నింగ్ సర్!’’
ద్వివేదికి విష్ చేసాడు వేదవ్యాస్.
‘‘మాణింగ్. కమాన్’’. ఆహ్వానించాడతన్ని.
ద్వివేదికి ఎదురు కుర్చీలో కూర్చున్నాడు వేద.
‘‘ఏంటీ? ఇంత ఉదయానే్న వచ్చేశావ్?’’ నవ్వుతూ ప్రశ్నించాడాయన.
తనకంటే మరీ జూనియర్ కావడంతో ఇద్దరూ ఉన్నప్పుడు వేదవ్యాస్‌ని చనువుగా ఏకవచనంతో సంబోధిస్తాడాయన.
‘‘నథింగ్ సర్!’’ అంటూ షర్ట్ పాకెట్‌లోంచి చిన్న స్లిప్ బయటకు తీశాడు.
‘‘ఈ పేపర్ న్యూస్ చదివారా?’’ అంటూ ఆ పేపర్ కటింగ్ ఆయన కందించాడు.
దాన్నందుకొని, ‘‘ఊహూ.. చూళ్ళేదు.’’ అని అడ్డంగా తరూపాడు.
పట్టపగలు ఆంధ్రా బ్యాంక్‌లో రూ.6.8 లక్షల దోపిడి అనే హెడ్డింగ్‌తో ఉందా వార్త.
దాన్ని కళ్ళతో చదవడం ప్రారంభించాడు.
విశాఖప్నం, ఫిబ్రవరి 1. ఇక్కడి రామకృష్ణా బీచ్ సమీపంలో ఆంధ్రా బ్యాంక్ ఆర్.కె. మిషన్ శాఖను సాయుధులైన దుండగులు శనివారం పట్టపగలు దోచుకున్నారు. కత్తులు, పిస్తోళ్ళు, ఇనుపరాడ్లు ధరించిన దుండగులు శనివారం ఉదయం బ్యాంక్‌లోకి ప్రవేశించి, సిబ్బందిని గాయపరిచి 6.8 లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. ఈ సంఘటనలో బ్యాంకుకు చెందిన నలగురు ఉద్యోగులు గాయపడగా వారిని కె.జి హాస్పిటల్‌లో చేర్పించారు. విశాఖ నగర పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం గాలిస్తున్నారు.
- అని వుందా మ్యాటర్.
వార్త చదివాక ‘‘ఇదా విశాఖపట్నం న్యూస్ కదా, నాకెందుకు చూపావ్?’’ అనడిగాడు ద్వివేది.
‘‘ఆ న్యూస్ ఎక్కడిదైనా జరిగింది దోపిడీ కదా! మీకు తెలియాలని కావాలనే దాన్ని మీ చేత చదివించాను.’’ ఆ కటింగ్‌ని తిరిగి పాకెట్‌లో పెట్టుకుంటూ అన్నాడు వేదవ్యాస్.
‘‘విశాఖ నగర పోలీస్ విభాగంనుండి మీకేమైనా ఫోన్ గాని, ఇన్‌ఫర్మేషన్‌గానీ వచ్చిందా? హెల్ప్ చేయమని.’’
వ్యాస్ ఉద్దేశమేంటో ఆయనకి అర్థం కావడం లేదు.
‘‘నో సర్! బ్యాంక్ దోపిడీ అవడంతో నేనే ఆ కటింగ్‌ని భద్రపరిచాను. చాలారోజుల తర్వాత.. దాదాపు ఏడెనిమిది సంవత్సరాల అనంతరం మళ్ళీ బ్యాంక్ దోపిడీ జరిగింది.
‘‘అయితే? ఆ బ్యాంక్ దోపిడీకి.. విశాఖపట్నం బ్రాంచ్‌కి.. మనకి లింకేటి? కన్‌ఫ్యూజ్ చేయకుండా విషయం సూటిగా చెప్పు.’’
‘‘దొంగలు దోపిడీదారులు పోలీసుల సమర్థతని సవాల్ చేస్తున్నట్టున్నారు సార్. నాడు అంత ధైర్యంగా మనీ మనీ బ్యాంక్‌ని పట్టపగలే దోచారు. మళ్ళీ నేడు విశాఖలో ఆంధ్రా బ్యాంక్. బహుశా మనీ మనీ బ్యాంక్‌ని దోచిన నేరస్థుల్ని మనమింకా కనుక్కోలేక పోయామనే అలసత్వం కావచ్చు, మిగతా దొంగలూ పెట్రేగిపోతున్నారు.’’
వేదవ్యాస్ చెబుతోంటే వౌనంగా వింటున్నాడాయన.
‘‘మళ్ళీ ఇలాంటి దొంగతనాలు జరగకుండా వాళ్ళకి తగిన బుద్ధిచెప్పాలి సార్!’’
‘‘నేరస్థులే చేతికి చిక్కనప్పుడు ఎలా శిక్షించగలం?’’
‘‘వెతికి వెతికి వెంటాడి వేటాడుదాం సార్.’’
‘‘...’’
‘‘మనీ మనీ బ్యాంక్ దోపిడీ కేసు మన స్టేషన్ పరిధిలోనే వస్తుంది కదా సార్!’’
‘‘అవును. ఇప్పుడా విషయం దేనికి?’’
‘‘కేసుని ఇన్‌వెస్టిగేషన్ చేయడానికి!’’
‘‘ఆ ఫైల్ క్లోజ్ అయ్యిందెప్పుడో!’’
‘‘లేద్సార్. మళ్ళీ తెరవబోతున్నాను.’’
అది విని ఉలిక్కిపడ్డాడు ద్వివేది.
వేదవ్యాస్ ఎంతటి సమర్థుడో, పట్టుదల గల మనిషో తెలుసాయనకి. అందుకని అతని అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేయలేకపోయాడు.
మరి కొన్ని విషయాలు బాస్‌తో మాట్లాడి వెళ్లిపోయాడు వేద.
***
సాయంత్రం భర్త ఆఫీసు నుండి రాగానే ప్రశ్నించింది నివేదిత.
‘‘నిట్టూ గురించి ఏమాలోచించారు?’’ అని.
‘‘ఇంకా ఆలోచించడమేంటి? డిసైడ్ కూడా అయిపోయింది. తమరు ఆర్డర్ పాస్ చేశాక పని పూర్తికాకపోవడమా? నెవ్వర్!’’ అన్నాడు వసంత్.
‘‘వాడిని డాక్టర్‌కి చూపెట్టాలని అనుకున్నాంగా. దాని గురించి ఏం చేశారు?’’ ప్రశ్నించింది నివేదిత.
‘‘మంచి డాక్టర్ గురించి ఎంక్వైరీ చేశాను. చాలామంది డాక్టర్ నవనీతం గారి పేరు సజస్ట్ చేశారు. ఎలాంటి టిపికల్ కేసునైనా హాండిల్ చేసి సక్సెస్ అయ్యాడని పేరుంది ఆయనకు.’’
‘‘ఇంకేం మన అఖిల్‌ని ఆ డాక్టర్‌కి చూపెడదాం.’’
‘‘నేననుకున్నదీ అదే! నవనీతం గారిని కన్సల్ట్ చేసి బాబుని టెస్ట్ చేయిస్తే నీ అనుమానాలన్నీ తీరుతాయ్.’’
‘‘నాది అనుమానమో బాబుది వ్యాధో తర్వాత ఎలాగూ తెలుస్తుంది. డాక్టర్ దగ్గరకు ఎప్పుడు తీసుకెళ్దామో అది చెప్పండి ముందు.’’
‘‘ఎప్పుడో కాదు. ఈ రోజే! డాక్టర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకొచ్చాను. రాత్రి ఎనిమిది గంటలకు టైమ్ ఇచ్చారాయన. సో ఇంకా చాలా టైమ్ ఉంది. ఈలోగా నువ్వు వంట కార్యక్రమం త్వరగా ముగించుకుంటే కరెక్ట్ సమయానికి వెళ్లి డాక్టర్‌ని మీట్ అవ్వొచ్చు’’ చెప్పాడు వసంత్.
మరింకేం మాట్లాడలేదు నివేదిత. వౌనంగా లోపలికి వెళ్లిపోయింది.
***
సరిగ్గా 8.05 నిమిషాలకి డాక్టర్ నవనీతం కన్సల్టింగ్ రూమ్‌లోకి వసంత్ ఫ్యామిలీ ఎంటరయ్యింది.
డాక్టర్‌కి భార్యని, కొడుకుని పరిచయం చేశాడు.
అఖిల్ ప్రవర్తనని, అతని చుట్టూ అల్లుకున్న ప్రత్యేక సంఘటనల్ని వివరించింది నివేదిత. వసంత్ మరికొంత సమాచారం డాక్టర్‌కి అందించాడు.
భార్యాభర్తలు చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వింటున్నాడు.
మరో వైపు అఖిల్ అంతరంగంలో ఏదైనా సంఘర్షణ జరిగి ఆ భావాలు కుర్రాడి మొహంలో ప్రతిబింబిస్తే వాటిని పసిగట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడా డాక్టర్.
నవనీతం అంచనాలని తారుమారు చేస్తూ వాళ్ల ఉనికినే పట్టించుకోని వాడిలా చాలా కామ్‌గా ఓ కుర్చీలో ఒదిగి కూర్చున్నాడు అఖిల్.
భార్యాభర్తలిద్దరూ చెప్పినవి విన్నాక డాక్టర్ క్షణకాలం ఆలోచనలో పడ్డాడు.
‘‘మీరందించిన సమాచారాన్ని సమీక్షిస్తుంటే మీ వాడు భిన్నఒత్తిడులకి గురవుతున్నాడన్న విషయం స్పష్టమవుతోంది. మనసులో తీవ్ర అలజడులు ప్రేరేపితమైనపుడు ఏవేవో స్మృతులు లీలగా మదిలో మెదిలి మెరిసి మాయమవుతుంటాయి.
మనిషి కనే కలలు ఆ పరిధిలోకే వస్తాయి. గతజన్మ జ్ఞాపకాలు వెంటాడుతుంటే, వాటి వివరాల్ని వెల్లడించిన వారెందరో ఉన్నారు. కొందరు భవిష్యత్‌లో జరగబోయే వాటిని ముందుగానే ప్రపంచానికి తెలిపి తమ విశిష్టతని చాటుకున్నారు. ఇలాంటి అరుదైన వ్యక్తుల అద్భుత శక్తుల గూర్చి మనం విని ఉన్నాం. వాస్తవానికివన్నీ సైన్స్‌నే సవాల్ చేస్తున్న విడ్డూరాలు. ఇలాంటి వాటికి సరైన కారణాలు కానరావు. దెరీజ్ నో రీజన్. శాస్తవ్రేత్తలు వీటిని ప్రాక్టికల్‌గా నిరూపించలేకపోయినా కళ్ల ముందు కదలాడే సజీవ నిదర్శనాలను మనం నమ్మాల్సిందే. తప్పదు’’ అంటూ ఆగాడొక్క నిమిషం.
డాక్టర్ చెప్పేది దంపతులు వింటున్నారు. అఖిల్ మాత్రం పరధ్యానంగా ఉన్నాడు. అదే మంచిదయ్యింది కూడా. డాక్టర్‌కి అడ్డుపడి అడుగడుగునా ఎన్ని రకాలుగా ప్రశ్నించి ఉండేవాడో?
‘‘ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు... అక్కడేదైనా చారిత్రాత్మక ఘటన జరిగి ఉంటే... దాన్ని కళ్లకు కట్టినట్టు చెబుతాడని అంటున్నారు. నో డౌట్. నిజంగా ఇది కూడా మానవ మేథస్సుకి అందని విచిత్రం. మేధావుల్ని సైతం అబ్బురపరిచే అపురూపమైన విషయం’’ ఆగి తిరిగి కంటిన్యూ చేశాడిలా.
‘‘పేపర్లో వచ్చిన వార్తొకటి వినండి. మీకు తెలిసే ఉంటుందేమో.
పూర్తి ఆరోగ్యవంతంగా యాభై సంవత్సరాలు బ్రతకడమే ఈ రోజుల్లో అతికష్టమైపోతోంది. అనారోగ్యం, ఆక్సిడెంట్స్ తదితర కారణాల వలన మానవుడి ఆయుఃప్రమాణాలు తగ్గిపోతున్నాయి. అలాంటిది మలేషియా వాస్తవ్యుడైన ఒమర్ అటాస్ 140 వసంతాలు పూర్తి చేసుకొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.
ఆ దైవలీలలకి ప్రతినిధిగా నిలుస్తూ అత్యధిక వయస్సు గల వ్యక్తిగా ప్రపంచ రికార్డ్ స్థాపించాడు.
మీరు ఇన్ని సంవత్సరాలెలా బ్రతగ్గలిగారంటే మంచి నిద్ర, సరైన ఆహారం అని ఆయన చెప్పాడే గానీ ఒక వ్యక్తి అన్ని సంవత్సరాలు జీవించగలగడానికి గల కారణాన్ని ఎవరూ క్లారిఫై చేయలేకపోయారు.
‘‘బికాజ్ దేరీజ్ నో ఆన్సర్’’ తను చెప్పడం పూర్తి చేశాడాయన.
డాక్టర్ చెప్పింది విన్నారు తప్ప పెదవి విప్పలేదు వాళ్లు.
‘‘ముందీ కుర్రాడ్ని హెల్త్ చెకప్ చేస్తాను’’ అంటూ అఖిల్‌ని చెక్ చేశాడు.
పరీక్షించిన అనంతరం...
‘‘ఏయ్ హీరో నిన్నో గదిలోకి తీసుకెళ్తాను. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడొక విషాదకర సంఘటన జరిగింది. జరిగిందేమిటో నువ్వు చెప్పాలి. ఆర్ యూ రెడీ’’ అనడిగాడు అఖిల్ కళ్లలోకి చూస్తూ.
‘‘మరి నాకెలా తెలుస్తుంది డాక్టర్’’ కుడి చేతిని ప్రశ్నార్థకంగా మలుస్తూ ఆశ్చర్యంగా అడిగాడా బాలుడు.
‘‘నీకు తెలియదు. నిజమే కానీ తెలిస్తేనే చెప్పు. ఓ.కే. మైడియర్ బాయ్’ అంటూ భుజం తట్టాడు.
పేరెంట్స్ వెంట రాగా కుర్రాడ్ని తీసుకొని హార్ట్ ఆపరేషన్స్ చేసి సెల్ వైపు దారితీశాడు నవనీతం.
ఆ గది ఎప్పుడో లాక్ చేయబడింది. రూమ్ ఓపెన్ చేయించి అందర్నీ లోపలికి తీసుకెళ్లాడు.
‘‘చూడు బాబూ ఇక్కడొక హత్య జరిగింది. ఐ మీన్ మెర్సీ కిల్లింగ్. అది ఎలా జరిగిందో నీవు చెప్పాలిప్పుడు.’’
బదులు పలుక లేదా కుర్రాడు.
‘‘సర్ ఒక్క విషయం...’’ అంటూ డాక్టర్‌ని ఓ పక్కకి రమ్మన్నాడు వసంత్.
‘‘ఆ రోజు జరిగిన సంఘటనని గుర్తుకు తెచ్చే ఆనవాలేదైనా ఇక్కడ కనిపిస్తే తప్ప ఏదీ చెప్పలేడు సార్’’ అని చెప్పాడు. గతానుభవం దృష్ట్యా భార్య తనకందించిన సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.
తక్షణం కాంపౌండర్‌ని పిలిపించి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆక్సిజన్ ట్యూబ్‌ని తగిలించాడు. నర్స్‌తో ఆపరేషన్ కిట్ తెప్పించి ఓపెన్ చేయించాడు. ఇదంతా పూర్తవ్వడానికి పదిహేను నిముషాలు పట్టింది.
అనంతరం ఆపరేషన్ జరిపినంత హడావిడి చేసేస్తుంటే..
అదిగో అప్పుడు-
అనాలోచితంగా ఆ తతంగాన్ని గమనిస్తున్న అఖిల్ ముఖంలో రంగులు మారసాగాయి.
ముక్కుపుటాలదురుతున్నాయ్. ఆ చిన్ని కళ్లల్లోంచి వింతకాంతి ప్రసరిస్తోంది.
శరీరంలోని అణువణువూ రెట్టింపు చైతన్యాన్ని సంతరించుకుంటున్న భ్రాంతి. తన మెదడులోకి సంకేతాలేవో ఇంజక్టవుతుంటే భారంగా తలపట్టుకున్నాడు. చెవుల్లో శబ్ద తరంగాల హోరు.
కళ్లు మూసి కణతల్ని చిట్టి చేతుల్తో నొక్కుకుంటూ అరిచాడు వేద భరితంగా వొద్దొద్దని...
అఖిల్ అలా అరుస్తూంటే వసంత్ గుండె కలుక్కుమంది. బాధతో సుడులు తిరిగిపోయాడు. నివేదిత కళ్లు చెమర్చాయి అప్రయత్నంగా.
క్షణకాలమనంతరం బాబు వదనంలో ప్రశాంతత. తేజోవంతమైన ప్రశాంతత.
ఒక యోగిలా పవిత్రమూర్తిలా గోచరిస్తున్నాడిప్పుడు.
ఆపరేషన్ చేస్తున్నట్లు నటించడాన్ని ఆపి క్షణక్షణానికి పిల్లవాడిలో కలుగుతున్న అనూహ్యమైన మార్పులని డాక్టర్ రెప్పార్పకుండా గమనిస్తున్నాడు. తన ప్రయత్నం ఫలిస్తున్నందుకు వాడి వైపు నిశితంగా దృష్టి సారించాడు.
నెమ్మదిగా, నెమ్మదిగా, నెమ్మదిగా..
తనను మరచి, కళ్లు తెరచి, పెదవులు విప్పాడా కుర్రాడు.
కంటి పొరల ముందు ఏవో దృశ్యాలు లీలగా కదలాడుతుంటే గంభీరంగా మారిపోయాడు. అప్పటికీ పూర్తిగా ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాడు.
భార్యని పొదివి పట్టుకొని దగ్గరకు తీసుకున్నాడు వసంత్.
గతంలో జరిగిన మెర్సీకిల్లింగ్‌ని అఖిల్ సంక్షిప్తంగా చెప్పుకుపోయాడిలా.
1972వ సంవత్సరం.
ఆమె పేరు సుమలత. వయసు ఇరవై రెండు.
ఈ మహిళకి మొదటిసారి, రెండవసారి, ఇలా వరుసగా మూడు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది.
ఇంత చిన్న వయసులో ఇలా గుండె నొప్పి రావడం అరుదైన విషయం.
మూడవ సారి చిన్న ఆపరేషన్ చేయబోతే ఆమె మెదడు తీవ్రంగా దెబ్బతింది. ఊహించని రీతిలో కోమాలోకి వెళ్లిపోయింది. సుమలతకి అలా జరగడంతో ఆ పేషెంట్ బంధువుల కంటే ముందుగా తాను హర్టయ్యాడు ఆ కేసు డీల్ చేస్తున్న డాక్టర్ మూర్తి.
అలా ఇరవై మూడు సంవత్సరాలూ కోమాలోనే గడచిపోయాయి.
కోమాలో ఉన్నన్నాళ్లూ పేషెంట్‌కి గొట్టం ద్వారా ఆహారం లోపలికి అందించబడేది. జీవితమే అతి దుర్భరమై.. నిజంగా ఆమెకి అదో ప్రత్యక్ష నరకయాతన.
ఆ యాతన చూడలేక ఆమె బంధువులు కోర్టుకి ఒక పిటిషన్ పట్టుకున్నారు. ఆ పిటిషన్‌కి స్పందిస్తూ, హైకోర్టు ఓ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుని సమర్ధిస్తూ ఆమెని మెర్సీకిల్లింగ్ చేయడానికి సుప్రీంకోర్టు సైతం అనుమతి ఇచ్చింది.
ఆ పేషెంటలా తన నలభై మూడవ ఏట బలవంతంగా చంపబడింది.
(ఐర్లాండ్‌లో జరిగిందీ సంఘటన)
చెప్పడం పూర్తి చేసి ఆయాసంతో ఆగిపోయాడు అఖిల్.
అప్పటి వరకు కళ్ల ముందు కదలాడిన దృశ్యాలు అదృశ్యమయ్యాయి. సంకేతాలు మెదడుకి అందడం ఆగిపోయాయి. చెవుల్లో హోరు తగ్గింది.
అంతర్గత అలజడి లేదు. ముఖంలో తేజస్సు మటుమాయమైంది.
క్షణంలో సాధారణ బాలుడిలా మారిపోయాడతను.
నెమ్మదిగా కళ్లు తెరిచాడు. చూపులు నిర్మలంగా ఉన్నాయి.
బాధతో కుమిలిపోతూ జరుగుతున్నది నిస్తేజంగా గమనిస్తున్న దంపతులిద్దర్నీ బయటకు వెళ్లమని సైగ చేశాడు నవనీతం.
కాంపౌండర్‌ని నర్స్‌ని బయటకు పంపించేశాడు.
క్షణం ఆలస్యం చేయకుండా అక్కడే అఖిల్ ప్రస్తుత మానసిక స్థితి అంచనా వేయడానికి ఉద్యుక్తుడయ్యాడు డాక్టర్.
అఖిల్ అమాయకంగా నిలబడ్డాడు.
ఆ సమయాన్ని సద్వినియోగ పర్చుకోవడానికి తక్షణం అఖిల్‌ని నవనీతం ప్రశ్నించసాగాడిలా.
* * *
కుంటుపడే దశకు చేరుకున్న మనీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్ చుట్టూ అల్లుకున్న విఘాతాలన్నీ తొలగిపోయే శుభతరుణం ఆసన్నమవుతోంది.
అందులో భాగంగానే.
పాండవీయం అభ్యర్థన మేరకు సెక్యూరిటీ కొంత వరకు తగ్గించబడింది.
సిటీలో ఉన్న బిజినెస్ మాగ్నెట్స్ లిస్ట్ తయారు చేయించడానికి పాండవీయానికి పది రోజుల సమయం పడితే, వాళ్లంతా ఏయే బ్యాంకులతో ఎక్కువగా లావాదేవీలు జరుపుతున్నారు తదితర వివరాలు సేకరించడానికి మరో వారం పట్టింది.
పాండవీయం కంప్యూటర్ ఆపరేట్ చేశాడు.
బిజినెస్ మాగ్నెట్స్‌ల పేర్లు, వారు నిర్వహిస్తున్న వ్యాపార వివరాలున్న జాబితా స్క్రీన్ మీదకి వచ్చింది.
ఆయా వ్యక్తుల ఆదాయాలు, బిజినెస్ టర్నోవర్ల పరంగా వరుసగా ఇలా ఉన్నారు.
1. రామ్‌గోపాలరావు (‘రావు’ కంప్యూటర్స్)
2. సత్యనారాయణ మూర్తి (‘హెల్త్’ హాస్పిటల్స్)
3. దీపక్ రాజ్ (కంట్రాక్టర్)
అలా సాగిందా లిస్ట్.
పబ్లిక్ ఫిగర్స్ అయిన సినిమా ఫీల్డ్ వాళ్లని, రాజకీయ నాయకులని, క్రీడాకారుల్ని వదిలివేసి తయారు చేయబడిన మనీ మేకర్ల జాబితా అది.
పాండవీయం ఒక్కొక్కరి గురించి నిదానంగా పరిశీలిస్తూ ముందుకు వెళుతుంటే ఎనిమిదవ నెంబర్ దగ్గర షణ్ముగం అని మాత్రమే ఉంది.
అక్కడే ఆగిపోయాడు పాండవీయం.
ఎందుకంటే ఆ వ్యక్తి పక్కన స్పెసిఫిక్‌గా ఏ బిజినెస్ చేస్తున్నాడో పాయింటవుట్ కాకపోవడంతో అతడి దృష్టి ఆ వ్యక్తి మీద పడింది.
షణ్ముగానికి అన్ని రకాల వ్యవహారాలతో లింక్ ఉండడంతో అతడి వివరాల్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా పరిశీలించసాగాడు.
ఎందుకో ఆ క్షణాన పాండవీయం మనసుకి అనిపించింది. షణ్ముగంతో తన జైత్రయాత్ర ప్రారంభించాలని.
ఆ లిస్ట్ స్క్రీన్ మీద నుండి తొలగించి.. సిటీలోని ప్రభుత్వ కార్యాలయాలు, అందులో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య తదితర వివరాలున్న జాబితా ముందేసుకున్నాడు.
దానిని గమనిస్తుంటే ఎందుకో చప్పున వసంత్ జ్ఞప్తికి వచ్చాడా సమయంలో. ముందుగా వసంత్‌ని కలిసి అతడి సలహా తీసుకుంటే బావుంటుందనుకున్నాడు పాండవీయం.
అతడ్ని కలవాలని నిశ్చయించుకున్న అనంతరం కంప్యూటర్‌ని ఆఫ్ చేసి కాసేపు రిలాక్సయ్యాడు.
* * *
అఖిల్‌ని తనకెదురుగా కూర్చోబెట్టుకున్నాడు నవనీతం.
ఆ కుర్రాడి కళ్లలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించడం ప్రారంభించాడు.
‘‘బాబూ! నీ పేరేంటి?’’
‘‘అఖిల్ విహారీ రాజ్.’’
‘‘ఏం చదువుతున్నావు?’’
‘‘్థర్డ్ క్లాస్.’’
‘‘నీకెవరంటే ఇష్టం?’’
అడిగి మళ్లీ చప్పున.
‘‘మమీ, డాడీ కాకుండా...’’ అన్నాడు.
‘‘బంటీ’’
‘‘బంటీ అంటే కుక్కపిల్లా?’’
‘‘కాదు. నా క్లాస్‌మేట్ శృతికీర్తి.’’
‘‘ఐసీ! మరి సుమలత ఎవరు?’’
‘‘...’’
‘‘మాట్లాడవేం?’’
‘‘సుమలతా?’’ అని క్వశ్చన్‌మార్క్ ఫేసు పెట్టాడు.
‘‘ఆమెవరో నాకు తెలీదు.’’ అన్నాడు మళ్లీ.
‘‘తెలీదా?’’
అడ్డంగా తలూపాడు.
‘‘ఇందాక నువ్వే చెప్పావుగా. హార్ట్ పేషెంట్ అని.’’
‘‘నేనె్చప్పానా?’’ విస్మయం ప్రకటించాడు.
‘‘మరే, అస్సలావిడెవరో తెలీందే నేనెలా చెప్పగలను?’’ ఎదురు ప్రశ్నించాడు.
క్షణకాలం వౌనం వహించి నవనీతం అడిగాడు.
‘‘సరే. ఆ విషయం వదిలేయ్. పెద్దయ్యాక ఏం చదవాలని ఉంది?’’
‘‘కంప్యూటర్స్ గురించి.’’
‘‘ఎందుకని?’’
‘‘బిల్‌గేట్ అంతటి వాడినవ్వాలని.’’
‘‘ఎలా?’’
‘‘కంప్యూటర్స్ మీద ప్రయోగాలు చేసి.’’
‘‘ఎలాంటి ప్రయోగాలు?’’
‘‘మరే. కొత్త రకం రోబోట్స్‌ని తయారు చేస్తా.’’
‘‘కొత్త రకమంటే...’’
‘‘మనిషిలా స్వంతంగా ఆలోచించగలిగే రోబోట్స్‌ని.’’
అదిగో అప్పుడు ఉలిక్కిపడ్డాడు డాక్టర్ నవనీతం.
ఆ కుర్రాడి సమాధానం విని ఆయన ఎంతగా ఆశ్చర్యపోయాడంటే.
పేషెంట్ నాడిని పరీక్షించే ఆ డాక్టర్ నాడీ వేగం సైతం ఉధృతమయ్యిందా క్షణాన.
అతను అంతలా కదిలిపోవడానికి కారణం.
20-1-1998 నాడు నెహ్రూ ప్లానిటోరియంలో జరిగిన సదస్సుకి హాజరయ్యాడు డాక్టర్ నవనీతం.
అమెరికాలో రోబోటిక్స్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అందులో పనిచేస్తున్న సైంటిస్ట్ లలితేష్ కె. కాట్రగడ్డ గారు ఈ సదస్సుకు ప్రత్యేకంగా పిలిపించబడ్డారు.
ఆయన ఆ సదస్సులో మాట్లాడుతూ.
‘‘అర్థం చేసుకోవడం, ఆలోచించడం, జ్ఞాపకశక్తి, స్వంతంగా లెక్కలు చేయగలగడం... తదితర అంశాల్లో మానవ మేథస్సుతో సరిసమానమైన శక్తి కలిగిన కంప్యూటర్ చిప్ పొందుపర్చబడిన రోబో దాదాపు 2025 సంవత్సరం నాటికి తయారవుతుంది. తదుపరి తరాల వారికి మనిషికీ రోబోలకి తేడా తెలిసే అవకాశం లేకుండా పోతుంది’’ అని తెలిపారాయన.
ఆయన చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నవనీతానికి.
స్వగతాన్ని వదిలి వెంటనే అఖిల్‌ని ప్రశ్నించాడు.
‘‘అసలు అలాంటి రోబోట్‌ను తయారు చేయాలి నీకెందుకు అనిపించింది?’’
‘‘ఒకరోజు కలకత్తా నుండి ఒక రోబోట్ తెచ్చిచ్చారు డాడీ. నేనెలా చెబితే అలా చేస్తుందది. ఎంచక్కా ఆడుతుంది. పాడుతుంది. రిమోట్ కంట్రోల్‌తో! స్వంతంగా పనిచేయడం మాత్రం రాదు దానికి. ఈసారి ఊరెళ్లినప్పుడు స్వంతంగా పనే్చసే రోబోట్ తీసుకురండని డాడీకి చెప్పాను. అలాంటివి ఉండవు అన్నారాయన. అందుకే నేనే తయారు చేయాలని నిశ్చయించుకున్నా.’’
తడుముకోకుండా వాడు చెబుతుంటే ఆసక్తిగా వింటుండిపోయాడాయన.
ఆ కుర్రాడి మనసులో ఈ ఆలోచన రూపుదిద్దుకోవడానికి అదే కారణమన్న మాట. ఇంత చిన్న వయసులో ఎంత ఇంటెలిజెన్స్ ప్రదర్శిస్తున్నాడు? ‘రియల్లీ వండర్’! అనుకున్నాడు నవనీతం.
అఖిల్‌నింక ప్రశ్నించదలచుకోలేదాయన. తన ఆలోచన్లని కట్టిపెట్టి, కుర్రాడిని వెంటేసుకుని కన్సల్టింగ్ రూమ్ వైపు కదిలాడు.
వసంత్, నివేదిత వెయిట్ చేస్తున్నారక్కడ.
‘‘మా వాడికి ట్రీట్‌మెంట్ అవసరమంటారా?’’ అడిగాడు వసంత్.
‘‘ఏ ట్రీట్‌మెంట్ అయినా జస్ట్ ఫర్ యువర్ శాటిస్‌ఫేక్షన్ వోన్లీ. వుయ్ విల్ వెయిట్ ఫర్ సమ్‌టైమ్.’’ అన్నాడు.
‘‘మానవుడి గొంతు భాగంలో థైరాయిడ్ గ్రంథి ఒకటుంటుంది. ఈ గ్రంథి చేసే పనేంటంటే థైరాక్సిన్ అనే స్రావాన్ని ఉత్పత్తి చేయడం. ఈ థైరాక్సిన్ ఉత్పత్తి గనుక తక్కువైతే వ్యక్తిలో మానసికంగా మార్పులేర్పడతాయి. ఒక రకంగా చెప్పాలంటే మానసికాభివృద్ధి కుంటుపడుతుంది. అలాంటి మనో దౌర్భల్యం అఖిల్‌లో అగుపించడం లేదు. హీ ఈజ్ ఆల్‌రైట్. శారీరకంగా కూడా గుడ్!

(ఇంకా వుంది)

-ఎనుగంటి వేణుగోపాల్ 9440236055