Others

శకుంతల (ఫ్లాష్‌బ్యాక్‌@ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన:
సముద్రాల సీనియర్
కళ:
టివిఎస్ శర్మ
నృత్యం:
హీరాలాల్, వెంపటి సత్యం
ఎడిటింగ్:
ఎస్‌పిఎస్ వీరప్ప
ఛాయాగ్రహణం:
ఎంఎ రెహమాన్
సంగీతం:
ఘంటసాల
దర్శకత్వం:
కమలాకర కామేశ్వర రావు

---
1920లో యస్‌యన్ పాటంకర్ -ది ఫేట్‌పుల్ రింగ్, ది లాస్ట్‌రింగ్ పేరిట చిత్రంగా నిర్మించారు. 1929లో నిర్మింపబడిన ‘శకుంకల’ చిత్రంలో తొలి మహిళా దర్శకురాలు, నటి ఫాతిమాబేగం శకుంతలగా నటించింది. 1931లో హిందీలో ఎం భవనానీ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించబడింది. కళాత్మక చిత్రాల దర్శకుడు వి శాంతారాం 1943లో తన భార్య జయశ్రీ, చంద్రమోహన్‌లతో ‘శకుంతల’ చిత్రాన్ని, ఇదే కథతో 1961లో ‘స్ర్తి’ పేరిట నిర్మించిన చిత్రంలో జయశ్రీ కుమార్తె రాజశ్రీ శకుంతలగా నటించటం విశేషం. ఈ చిత్రంలో దుష్యంతుని పాత్ర పోషించమని వి శాంతారామ్ హీరో ఎన్టీ రామారావును సంప్రదించారు. దానికి ఆయన మద్రాసులో షూటింగులలో బిజీగా ఉండటంతో, బాంబే రావటం కుదరదని చెప్పగా, శాంతారామే ఈ చిత్రంలో దుష్యంతునిగా నటించారు. అస్సామి భాషలో రచయిత, నిర్మాత, దర్శకుడు, గాయకుడు భూపేన్ హజారికా ‘శకుంతల’ చిత్రం నిర్మించారు. దీనికి రాష్టప్రతి రజిత పతకం లభించింది. కెఆర్ విజయ, ప్రేమనజీర్‌లతో, యం కుంజకూ స్వీయ దర్శకత్వంలో మలయాళంలో నిర్మించిన ‘శకుంతల’ విజయం సాధించింది. సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి, మరో సంగీత విద్వాంసుడు జిఎన్ బాలసుబ్రమణ్యం జంటగా నటించిన తమిళ చిత్రం ‘శకుంతల’. 1940లో ఎల్లిస్ ఆర్ డంగన్ అనే అమెరికన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తొలిసారి తెలుగులో సర్వోత్తమ్ బాదామి దర్శకత్వంలో చున్నీబాయి నిర్మాతగా, సాగర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై 1932లో ‘శకుంతల’ రూపొందించారు. యడవల్లి సూర్యనారాయణ, సురభి కమలాబాయి జంటగా నటించారు.

---
మహాభారతంలో నన్నయభట్టారకుడు రచించిన ఆదిపర్వంలోనిదీ శకుంతలోపాఖ్యానం. కథను మహాకవి కాళిదాసు -అభిజ్ఞాన శాకుంతలమ్ పేరిట నాటకంగా రచించారు. ‘కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతలమ్’ అని ప్రాచుర్యం పొందిన ఈ నాటకం భారతీయులనేకాక విదేశీ కవుల, నాటకకర్తలెందరి ప్రశంసలో పొందింది. అంతేకాక భారతదేశంలో పలు భాషల్లో మూకీల కాలంనుంచీ చిత్రాలుగా నిర్మించబడటం విశేషం.
రాజ్యం పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతలు శ్రీ్ధర్‌రావు, లక్ష్మీరాజ్యం 1966లో రూపొందించిన చిత్రం ‘శకుంతల’. మార్చి 23 1966లో చిత్రం విడుదలైంది. యన్టీ రామారావు దుష్యంతునిగా, బి సరోజాదేవి శకుంతలగా నటించిన ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు.
మేనక (ఇవి సరోజ) విశ్వామిత్రుని (ముక్కామల) తన నృత్యంతో మురిపించి తపోభంగం కావించటంతో చిత్రం ప్రారంభమవుతుంది. ఆ ప్రక్రియలో మేనకకు ఆడపిల్ల జన్మిస్తుంది. బిడ్డను వదిలి మేనక, విశ్వామిత్రులు తమదారిని తాము వెళ్లిపోతారు. కణ్వమహర్షి (నాగయ్య) ఆ బిడ్డను తెచ్చి శకుంతల పేరు పెట్టి పెంచుకుంటాడు. కణ్వమహర్షి తపస్సుకై వెళ్ళిన సమయంలో హస్తినాపుర మహరాజు దుష్యంతుడు, అడవికి వేటకు వస్తాడు. ఆశ్రమంలో శకుంతలను చూసి ప్రేమించి, గాంధర్వ వివాహం చేసుకుంటాడు. కొద్దిరోజుల్లో నగరానికి రాజలాంఛనాలతో తీసుకెళ్తానని, తన గుర్తుగా ఉంగరాన్ని ఇచ్చి వెళ్తాడు. కణ్వాశ్రమానికి వచ్చిన దుర్వాస మహాముని (కెవియస్ శర్మ) తన రాకను పట్టించుకోలేదని శకుంతలను, ఆమె భర్త మరచిపోవుగాక అని శపిస్తాడు. ఆమె చెలులు అనసూయ (గీతాంజలి), ప్రియంవద (శారద)లు మునిని క్షమించమని వేడగా, ఆనవాలుగా ఇచ్చిన ఉంగరం చూపితే శాప విమోచనం కలుగుతుందని చెబుతాడు. కణ్వమహర్షి, గర్భవతియైన శకుంతలను తన శిష్యులు, ఆర్య గౌతమి (నిర్మల)లతో దుష్యంతుని వద్దకు పంపుతాడు. దారిలో నదిలో శకుంతల తన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. ఆనవాలులేని కారణంగా ఆమెను గుర్తించని దుష్యంతుడు శకుంతలను తిరస్కరిస్తాడు. వేదనతో ఒంటరిగా ప్రయాణమైన శకుంతల మరీచ మహర్షి ఆశ్రమం చేరుతుంది. ఒక మగ పిల్లాడిని ప్రసవిస్తుంది. నదిలోపడిన ఉంగరం బెస్తవాళ్ళకు చేప కడుపులో దొరికి, అది మహరాజుకు చేరుతుంది. ఉంగరం చూడగానే గతం గుర్తుకొచ్చిన దుష్యంతుడు శకుంతలకై దుఃఖిస్తుంటాడు.
ఆశ్రమంలో భరతుడనే పేరుతో శకుంతల కుమారుడు పెరిగి, ఆరేళ్లప్రాయంలో విలువిద్యలో ప్రావీణ్యం పొందుతాడు. అతనికి రక్షగా మరీచ మహర్షి ‘అపరాజిత’ కట్టి తలిదండ్రులు తప్ప అన్యులు తాకితే ఆ రక్ష పాముగామారి కాటువేస్తుందని చెబుతాడు. ఇంద్రునికి సాయంగా రాక్షస సంహారానికి వెళ్ళిన దుష్యంతుడు, తిరిగి వస్తూ దారిలో మరీచ ముని ఆశ్రమానికి రావటం, రక్షద్వారా అతడే తన కుమారుడని గ్రహించి శకుంతలను కలిసి క్షమాపణ కోరటం, కణ్వమహర్షి, మహమునుల ఆశీస్సులలో భరతునికి యువరాజ పట్ట్భాషేకం జరపటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో రాజమాతగా పుష్పవల్లి, వేమూరి రామయ్య శారజ్గగా, గోపాలరాజు శరద్వతగా, మాధవ్యగా పద్మనాభం, భరతుడిగా బేబీ పద్మిని, బేస్తలుగా రేలంగి, రమణారెడ్డి, పడవవానిగా లంక సత్యం, రాజ పురోహితుడిగా వంగర, మరీచ మహర్షిగా డి రామరాజు నటించారు.
దర్శకులు కమలాకర కామేశ్వరరావు చిత్రాన్ని మూలకథకు భంగం రానీయక, ఆసక్తికరంగా అలరించేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. పూలసజ్జపై శకుంతల విరహతాపం, దానికి దుష్యంతుని ప్రతిస్పందన, తామరాకుపై ప్రేమలేఖ వ్రాయటం, హస్తినాపురికి దుష్యంతుడు వెళ్ళాక శకుంతల విచారం, గర్భవతిగా అత్తింటికి వెళుతూ మాలతీలత వద్ద, తండ్రివద్ద శెలవుతీసుకోవటం, నదిలో ఆమె చేతినుండి జారిన ఉంగరం చేప మ్రింగటం ఎంతో విపులంగా చిత్రీకరించారు. యాగశాలలో దుష్యంతుడు, శకుంతలను కలుసుకునే సన్నివేశం ఎంతో భావయుక్తంగా, కరుణరస పూరితంగా చిత్రీకరించారు. దుష్యంతుడు శకుంతల సౌందర్యానికి అచ్చెరువొందటం, ఆమె తన భార్యకాదని ప్రమాణం చేయటం, శకుంతల అగ్నిప్రవేశం చేయబోగా రాజపురోహితుడు వారించటం, శిష్యులు శకుంతలను ఆశ్రమానికి తిరిగి రావద్దని చెప్పటం, రాజమాత ఈ సన్నివేశంలో కుమారుని శకుంతల ప్రసవం అయ్యేవరకూ ఆశ్రయ మిమ్మని కోరటం, శకుంతల కాదని వారించి ఒంటరిగా కొండల్లో పయనించి మరీచ మహర్షి ఆశ్రమం చేరటం లాంటి సన్నివేశాలను మరింత అర్ధవంతంగా, ఆకట్టుకునేలా, ఔచిత్య భంగం లేకుండా తీర్చిదిద్దటం దర్శకుడి ప్రతిభకు తార్కాణం. సముద్రాల సీనియర్ భావగర్భితమైన, సందర్భోచితమైన సంభాషణలతో, ఇతర సాంకేతిక నిపుణుల సామర్థ్యంతో శకుంతల చిత్రం అలరించేలా సాగింది.
దుష్యంతునిగా ఎన్టీ రామారావు సన్నివేశానుగుణమైన సాత్విక రాజస లక్షణాలను, తన భార్యకాదని శకుంతలతో వాదించే సన్నివేశంలో ఎంతో నిగ్రహం, సున్నితత్వం, స్థిరత్వం ఆమె అందాన్ని చూచి అచ్చెరువొందటం, ఉంగరం లభించాక, శకుంతలకై విలపించి, విచారించే సన్నివేశంలో మనోవేదన ఎంతో పరిణితితో ప్రదర్శించి మెప్పించారు. శకుంతలగా బి సరోజాదేవి చిలిపిచూపులు, మెల్లని మాటలు, స్థిరమైన నిర్ణయం, ప్రణయం, విరహం, వేదన మొదలైన భావాలను నిండుతనంతో కూడిన నటనతో ప్రదర్శించారు. మిగిలిన పాత్రధారులందరూ పాత్రోచితంగా నటించి మెప్పించారు. చక్కని సాహిత్యానికి, ఘంటసాల అందించిన సంగీతం మనోరంజకంగా సాగింది.
శకుంతల చిత్ర గీతాలు:
చిత్ర ప్రారంభంలో మేనకపై చిత్రీకరించిన నృత్య గీతం -కనరా మునిశేఖరా నినుకోరి దరిజేరి నానురా (పి సుశీల- సముద్రాల సీనియర్). ఆశ్రమంలో శకుంతల, చెలులపై చిత్రీకరించిన గీతం -మధుర మధుర సుమసీమ సుధలు కురియు వనసీమ (పి సుశీల బృందం- ఆరుద్ర). దుష్యంతునిపై చిత్రీకరించిన పద్యం -అనాఘ్రాతం పుష్పంకిసలయ (ఘంటసాల- మూలం కాళిదాసు). శకుంతల వ్రాసే ప్రేమలేఖ పద్యం -నిర్ధయా నీ మనంబేమో నేనెరుంగ కాని (పి సుశీల- సముద్రాల). దుష్యంతుని స్పందన పద్యం -చెలియా! నీ మేను తపియింపజేయుగాని (ఘంటసాల, సముద్రాల). శకుంతలను గాంధర్వ వివాహంచేసుకునే తరుణంలో దుష్యంతుడు ఆలపించిన పద్యం -తరతమ భేదంబు తలపక ధర్మముద్ఘాటించు పంచభూతముల సాక్షి (ఘంటసాల- సముద్రాల). శకుంతల, దుష్యంతులపై పచ్చని ప్రకృతి అడవిలో రమణీయంగా చిత్రీకరించిన యుగళగీతం -నీవూనేనూ కలిసిననాడే నింగినేలా కలిసెనులే (ఘంటసాల, పి సుశీల- సినారె). గర్భవతియైన శకుంతలకు ఆశ్రమంలో సీమంతం జరుపుతూ చెలులు అందరూ పాడే గీతం -చెలులారా, శకుంతల సీమంతము సేయరే (లీల, వైదేహి సముద్రాల). అత్తవారింటికి శకుంతలను పంపుతూ కణ్వమహర్షి నీతులు చెబుతూ మిగిలినవారి వీడ్కోలుతో సాగే గీతం (అత్తవారింట చూపవలసిన అణుకువను, శకుంతల చిన్ననాటినుంచి పెరిగిన తీరు వర్ణిస్తూ సాగుతుంది) -గురుజనముల వినయముతో కొలువుమా/ ఆనంద వౌనమ్మా అపరంజి బొమ్మా (ఘంటసాల, బృందం- సముద్రాల). శిష్యుడు శార్గవుడు కణ్వసందేశం వినిపించే పద్యం -నమ్మి నీమాట తన మనసమ్ము కొనియే (ఘంటసాల- సముద్రాల). శకుంతల నది దాటుతుండగా పడవవాడు, మిగిలిన వారిపై చిత్రీకరించిన గీతం -చెంగాయి కట్టిన చిన్నది చారెడేసి కళ్ళువున్నది (ఘంటసాల బృందం- రచన కొసరాజు). బెస్తవాళ్లు రేలంగి, రమణారెడ్డి, బొడ్డపాటిలపై చిత్రీకరించిన గీతం -పాతకాలంనాటి బ్రహ్మదేవుడా (పిఠాపురం, మాధవపెద్ది, రాఘవుల బృందం- కొసరాజు). దుష్యంతునిపై చిత్రీకరించిన గీతం -మదిలో వౌనముగా కదిలే మధురవీణా (ఘంటసాల, సినారె). దుష్యంతునివద్ద నుండి శకుంతల ఒంటరిగా వెళ్తున్న నేపధ్యంలో విన్పించే గీతం -అమ్మా శకుంతలా ఎందుకీ శోకము పొందుమా ధైర్యము (పి.లీల-రచన శ్రీశ్రీ). కుమారుని లాలిస్తూ ఆశ్రమంలో శకుంతల పాడే గీతం -నీ కంటి పాపవైనా, నా ఇంటి దీపమైనా నీవేరా సుకుమారా (పి.సుశీల- రచన దాశరథి). ఆశ్రమంలో శివపార్వతుల విగ్రహం వద్ద శకుంతల అమ్మవారిని వేడుకునే గీతం -అమ్మా శరణమ్మా, ఇకనైనా కరుణ గనవమ్మా (పి సుశీల- సముద్రాల). ‘శకుంతల’ చిత్రంలోని మనోరంజకమైన యుగళ గీతం.. దుష్యంతుడు, రాజ్యానికి వెళ్ళాక అతన్ని తలపోస్తూ శకుంతల ఊహలో వచ్చే గీతం. శకుంతల, దుష్యంతుల చక్కని రాజోచిత అలంకరణ, ఆకసంలో నిండు జాబిలి, మంటపం, చక్కని సెట్టింగ్స్, పాన్పుతో తొలిరేయిలాంటి గీతం -సరసన నీవుంటే జాబిలి నాకేలా మనసున నీవుంటే స్వర్గమునాకేలా (ఘంటసాల, పి సుశీల- సినారె) మధురంగా సాగుతుంది. ‘శకుంతల’ చిత్రం ఒక కమనీయ చిత్రంగా నిలిచి, రసజ్ఞులైన ప్రేక్షకుల ఆదరణ పొందింది.

చిత్రం ఎన్టీఆర్, బి సరోజాదేవి నటించిన చిత్రంలోనిది

-సివిఆర్ మాణిక్యేశ్వరి