Others

సినిమా రిస్క్‌కు ఎక్కడుంది.. చెక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల భారతీయ చలనచిత్రరంగంలో అత్యుత్తమ నటుడుగా నీరాజనాలందుకుంటున్న కమల్‌హాసన్, తాను నిర్మిస్తున్న భారతీయుడు-2 షూటింగ్ సందర్భంగా ఘోర ప్రమాదం జరిగి ముగ్గురు యూనిట్ సభ్యులు మరణించడం విచారకరం. సినిమారంగం యావత్తు సానుభూతి ప్రకటించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంతాపం ప్రకటించింది. కోట్ల వ్యాపారం చేసే చిత్రరంగం యూనిట్ సభ్యులకు బీమా(ఎల్‌ఐసి) చేయించకపోడం వారి నిర్లక్ష్యానికి దర్పణం పడుతుంది. రిస్క్ సీన్స్, ఫైట్ సీన్లు చిత్రీకరించేటప్పుడు దాదాపు దర్శకులందరూ డూప్‌లను వాడుకోవడం మనకు తెలియంది కాదు. అయినా వారూ మనుషులేగా! వారి వారి ప్రాణం వారికి తీపే కదా! మన హీరోలు వీరాభిమానుల పొగడ్తలకోసం, తాము హీరోయిజం చూపించాలన్న తపనతో డూప్ లేకుండా ఆయా రిస్క్ సీన్లలో తామే నటించాలన్న తపనతో సాహసం చేయడం చూస్తూనే వున్నాం. సినిమా చూసే ప్రేక్షకులకు, అభిమానులకు అలాంటి రిస్కులు కనిపించదు. ఓసారి దర్శకునితో హీరో పాత్రదారి, ‘సార్, ఈ దినం చిత్రీకరించే రేప్ సీన్‌లో డూప్‌లేకుండా సహజంగా నటిస్తాను అని అడిగాడట సంబరంగా. అందుకు దర్శకుడు ‘మరునాడు చిత్రీకరణలో నీవు విషం తాగే సీనూ వుంది. నీవు రేపు సహజంగా నటిస్తానంటే, ఈ రోజు రేప్ సీనుకు ఓకె’ అన్నాడట. చిత్రరంగ బీమా విషయం ఆలోచించకపోవడం పెద్ద తప్పుగా భావించవచ్చు. బీమా వుంటే అగ్నిప్రమాదాల ద్వారా, పెనుగాలుల ద్వారా, తుపాన్ల ద్వారా, సమ్మెల కారణంగా, బంద్‌ల కారణంగా జరిగిన నష్టాలను పూడ్చుకునే అవకాశం వుంటుంది. రిస్క్ సీన్ల ద్వారా డూప్ వ్యక్తికిగాని, నటీనటులకు గానీ ఆపద సంభవిస్తే, కలిగే నష్టం అంగవైకల్యం లేదా మరణం సంభవించినా బీమా వున్నట్లయితే నష్టపరిహార పైకం అందుతుంది. బీమా లేకపోతే కష్టనష్టాలు భరించవలసి వస్తుంది. 1980 సంవత్సర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా సూపర్‌మెన్ చిత్రాలను నిర్మించింది హాలీవుడ్ చిత్రరంగం. మొదటి సూపర్‌మెన్ పాత్రధారి క్రిస్ట్ఫోర్ రీవ్స్ దాదాపు ఐదు చిత్రాలలో సూపర్‌మెన్‌గా నటించి ప్రపంచ ప్రేక్షకులతో నీరాజనాలందుకున్నాడు. కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నాడు. చివరి చిత్రంలో నటిస్తూ, గుర్రపు స్వారీ చేస్తూ కిందపడటంతో వెన్నుపూస విరిగి వీల్‌ఛెయిర్‌కే జీవితాంతం పరిమితమయ్యాడు. ఆ యూనిట్‌లో అందరికీ బీమా వున్నందున అతనికి కోట్ల రూపాయలు బీమా పరిహారం దక్కింది. ఆ పిదప ఆ నటుడు దర్శకుని అవతారం ఎత్తి తన ప్రతిభను చాటుకుంటూ అనేక ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించి అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల ఆ సూపర్‌మెన్ మరణించాడు. ఇక మన సినిమా రంగానికి వస్తే, కూలీ నెం.1 చిత్రం షూటింగ్‌లో అమితాబ్‌బచ్చన్ గాయపడి దాదాపు ఆరు నెలలపాటు మంచానికే పరిమితమయ్యాడు. ఆయన ఆరోగ్యం కోసం అభిమానులు పూజలు చేశారు. దేవుళ్లకు మొక్కులు మ్రొక్కారు. ఫలితంగా ఆయన కోలుకోగలిగాడు. తిరిగి ఆరోగ్యవంతునిగా వెండితెరపై మెరిసాడు. వారంతా బీమా పట్టించుకోలేదు కనుక ఆయన ఆర్థికంగా చితికిపోయారు. మన తెలుగు చిత్ర రంగంలో హీరో రాజశేఖర్, మగాడు చిత్రంలో నటిస్తూ పెద్ద ప్రమాదం తప్పి గాయాలతో బయటపడ్డాడు. అతని అభిమానులు సైతం ఆయన ఆరోగ్యంతో బయటపడాలని కోరుకున్నారు. ఆ తరువాత ఆయన యాంగ్రీయంగ్‌మెన్‌గా నిలదొక్కుకున్నారు. బీమా చేయనందువల్ల ఆయన ఆర్థిక నష్టం భరించవలసి వచ్చింది. కానీ నటి జీవిత ఆయనకు ఆ సమయాన సేవలు చేసి అభిమానం చాటుకోగలిగారు. జీవితను వివాహం చేసుకోగలిగాడు. 101 జిల్లాల అందగాడు నూతనప్రసాద్ కూడా కారుదిద్దిన కాపురం చిత్రంలో నటిస్తూ ప్రమాదానికి గురై రెండు కాళ్ళూ పోగొట్టుకుని కుర్చీకే పరిమితమై చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ దర్శకుల దయపై వచ్చిన పైకంతో చివరి రోజులు భారంగా గడిపి కన్నుమూశాడు. బీమాను పట్టించుకోలేదు కనుక ఆర్థిక వనరులు సమకూరలేదు. గత మాసంలో గోపీచంద్ సైతం షూటింగ్‌లో భాగంగా సాహసం చేయబోయి గాయాలపాలై బెడ్‌పై విశ్రాంతి తీసుకున్నాడు. వీరు కూడా బీమాను గురించి ఆలోచించలేదు. సావిత్రితో మొదలైన నటన సౌందర్యతో అంతమైందని చెప్పవచ్చు. ఆ నటి సహజం ఎన్నికల ప్రచారంకోసం చాపర్ ఎక్కడం, అది పేలడంతో అర్థాంతరంగా సౌందర్య మరణించింది. ఆమె మరణం తరువాత నటిగా నేటి తారలెవరూ ఆ స్థాయిని అందుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా సినీ కళాకారులు బీమా చేసుకుంటే ఆర్థిక వనరులు అదనంగా వచ్చి చేరుతాయి. వైద్య ఖర్చులు వెళ్లిపోవాలి. ప్రపంచ స్థాయి క్రీడాకారులు హుసేన్‌బోల్డ్, షూమేకర్, మెస్సీ, రోనాల్డో, సూరజ్, నేమూర్, డ్వేన్ జాన్సన్ లాంటి ప్రపంచ స్థాయి సెలబ్రిటీలు తమ తమ ప్రాణాలకు మిలియన్ డాలర్లకు బీమా చేసి ఉంచుకున్నారు. పొరపాటున ఎక్కడైనా ఏం జరిగినా వారికి మిలియన్ల డాలర్లు ఇంటికి వస్తాయి. బీమా అంటే వాయిదాలవారీగా సదరు ఆఫీసులో పైకం చెల్లించవలసి వస్తుంది. ఆ చెల్లింపులు చెల్లించలేక డబ్బు అనవసరంగా పోతుందని పిసినిగొట్టుతనంతో మనవారు బీమాను దూరంగా పెట్టేశారనుకోవచ్చు. బీమా భవిష్యత్తుకు వెలుగని మనవారు గ్రహించి బీమా సౌకర్యం పొందితే ఎంతోమంది సినీ పరిశ్రమలో వున్న కళాకారులు చివరి రోజుల్లో హాయిగా బ్రతకగలరు. చిన్న చిన్న జాగ్రత్తలతో సినీనటులు ఎంతో విలువైన తమ ప్రాణాలను కాపాడుకోవాలి. ఏదైనా ప్రమాదం జరక్కముందే ముందు జాగ్రత్తతో బీమాలాంటి పద్ధతులు పాటించి తమ తదనంతరం కూడా తమ వారసులకు ఎంతో కొంత ముట్టజెప్పినవారవుతారు. సినీ పరిశ్రమలో ప్రతిఒక్కరూ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దర్శక నిర్మాతలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తోంది.

-మురహరి ఆనందరావు