రాష్ట్రీయం

చనిపోయిందన్న డాక్టర్లు! లేచికూర్చున్న వృద్ధురాలు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, డిసెంబర్ 16: డాక్టర్లు చనిపోయిందన్న వృద్ధురాలు లేచి కూర్చున్న సంఘటన కడప జిల్లా రాజంపేటలో బుధవారం జరిగింది. రాజంపేట మండలం ములక్కాయలపల్లెకు చెందిన నిమ్మరాజు గాయత్రి(65) మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండగా బంధువులు బుధవారం తిరుపతిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాధమిక చికిత్స అనంతరం గాయత్రి చనిపోయిందని, ఇంటికి తీసుకెళ్ళమని డాక్టర్లు చెప్పడంతో బంధువులు విలపిస్తూ స్వగ్రామానికి వాహనం తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె దిగ్గున లేచి కూర్చుని మాట్లాడడంతో అంతా అవాక్కయ్యారు. వెంటనే హుటాహుటిన రాజంపేటలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించారు. కాగా తొలుత గాయత్రి చనిపోయిందని తిరుపతి ఆసుపత్రి వైద్యులు చెప్పగానే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు సైతం చేశారు. బంధువులు సైతం ఇంటివద్దకు చేరుకున్నారు. అయితే గాయత్రి బతికే ఉన్నట్లు తెలుసుకున్న ఉబ్బితబ్బిబ్బయి ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు.

బోగీల నుంచి విడిపోయిన కోరబా రైలింజన్
గుత్తి, డిసెంబర్ 16: అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ పరిధిలోని పగిడిరాయి, బసినేపల్లి గ్రామాల మధ్య బుధవారం తెల్లవారుజామున కోరబా ఎక్స్‌ప్రెస్ రైలింజన్ నుంచి బోగీలు ఒక్కసారిగా విడిపోయాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం కోరబా నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు పగిడిరాయి దాటి గుత్తి మండలం బసినేపల్లి వద్దకు రాగానే రైలింజన్‌కు సంబంధించిన కప్లింగ్ తెగిపోయింది. దీంతో రైలింజన్ సుమారు కిలోమీటరు దూరం వెళ్లింది. బోగీలు అర కిలోమీటరు దూరం ఇంజిన్ వెంట వచ్చి నిలిచిపోయాయి. ఐదు నిమిషాల అనంతరం వెనక్కు చూసిన డీజిల్ లోకో డ్రైవర్ బోగీలు లేకపోవడంతో సమాచారాన్ని ట్రైన్‌గార్డుకు అందజేశారు. వెంటనే గుత్తి నుంచి సాంకేతిక సిబ్బంది చేరుకుని మరమ్మతులు చేసిన అనంతరం రైలు ముందుకు వెళ్లింది.
సముద్రంలో ఇద్దరు మెడికోలు మునక
శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 16: శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరానికి విహారానికి వెళ్లిన ఇద్దరు వైద్య విద్యార్థులు అలల ఉద్ధృతికి మునిగిపోయి మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(రిమ్స్)కు చెందిన పది మంది విద్యార్థులు బుధవారం గార మండలం మత్స్యలేశం బీచ్‌కు విహారానికి వెళ్లారు. వీరిలో విశాఖపట్నానికి చెందిన ఎన్ అనిల్(21), సందీప్(21) స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి మునిగిపోయారు. వీరిని రక్షించేందుకు సుభాష్ అనే విద్యార్థి ప్రయత్నించి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే 108 ద్వారా ఇతనిని రిమ్స్‌కు తరలించి చికిత్సను అందిస్తున్నారు.
508.5 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్, డిసెంబర్ 16: శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోవడంతో బుధవారం సాయంత్రానికి 508.5 అడుగుల వద్ద సాగర్ జలాశయం ఉంది. ఇది 129.1385 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుండి కుడి, ఎడమ కాలువలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్‌కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 835.3 అడుగుల వద్ద ఉంది. ఇది 55.4618 టీఎంసీలకు సమానం. ఎగువ జలాశయాలైన రోజా, తుంగభద్ర ప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది.
గుట్కాల అమ్మకాలపై దాడులు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 16: రాష్ట్ర రాజధాని విజయవాడ కేంద్రంగా కల్తీ నెయ్యి అమ్మకాలపై కొందరు కోట్లాది రూపాయలు గడించినట్లుగా పోలీసు, టాస్క్ఫోర్స్ దాడుల్లో తేటతెల్లమైన నేపథ్యంలో బుధవారం కృష్ణాజిల్లా వ్యాప్తంగా కల్తీ ఆహారదార్థాలు, గుట్కా అమ్మే వ్యాపారులపై విస్తృతంగా దాడులు జరిగాయి. ఈ సందర్భంగా 157 కేసులు నమోదు చేసి ఒక కోటి, 18 లక్షల రూపాయల విలువైన సరుకును సీజ్ చేయటం జరిగింది. గుట్కా అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ 77 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 70 లక్ష రూపాయల విలువైన సరుకును సీజ్ చేసి తగులబెట్టడం జరిగిందని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ సందర్భంగా 49 మంది వ్యక్తులకు రూ. 10.33 లక్షల అపరాధ రుసుం వసూలు చేశామన్నారు.
ఏసిబి వలలో టౌన్ ప్లానింగ్ అధికారి
పార్వతీపురం, డిసెంబర్ 16: విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న మృత్యుంజయ పట్నాయకుని జనార్థన్ రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు బుధవారం రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడ్డాడు. పట్టణానికి చెందిన గూనల త్రినాథ ఇంటి ప్లాన్ అప్రూవల్ కోసం జనార్థన్ 20 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో 15 వేల రూపాయలు ఇస్తానని చెప్పిన త్రినాథ ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు బుధవారం లంచం డబ్బులు ఇస్తుండగా ఎసిబి డిఎస్సీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి జనార్థనను అరెస్టు చేశారు.