రాష్ట్రీయం

తెరాస గూటికి గీతారెడ్డి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్‌లో జోరుగా ప్రచారం
సంగారెడ్డి, డిసెంబర్ 4: కాంగ్రెస్ అంటే గీతారెడ్డి, గీతారెడ్డి అంటే కాంగ్రెస్ అలాంటి కరుడుగట్టిన గాంధేయవాదం కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి, జహీరాబాద్ ఎమ్మెల్యే జెట్టి గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టిఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. 1989లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గీతారెడ్డి చెన్నారెడ్డి, కోట్ల విజయబాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, కోనిజేటి రోశయ్య, కిరన్‌కుమార్‌రెడ్డి తదితర ముఖ్యమంత్రుల మంత్రి వర్గాల్లో క్యాబినెట్ హోదా కలిగిన వివిధ శాఖలకు మంత్రి పదవులను చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల వరకు ఆమె మంత్రిగా పని చేయడం గమనార్హం. 2009 ఎన్నికలకు ముందు గజ్వేల్ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో తన రాజకీయ చతురతను ప్రదర్శించిన గీతారెడ్డి, 2009 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్‌డుగా మారిన జహీరాబాద్ నియోజకవర్గానికి మకాం మార్చారు. ఇక్కడి నుంచి గెలుపొందిన గీతారెడ్డి గడచిన ఎన్నికల్లో సైతం అతికష్టం మీద తక్కువ మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటుండటంతో గీతారెడ్డి కూడా అదే పంథాను అనుసరిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాట్సప్‌లు, ఫోన్ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా గీతారెడ్డి త్వరలోనే టిఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో ఆమె ఎక్కడ కూడా నోనుమెదపకపోవడం గమనార్హం. గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో కీర్తించడంతో గీతారెడ్డి టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతుందన్న సంకేతాలకు బలాన్ని చేకూర్చుతోంది. కొనసాగుతున్న ప్రచారం ప్రకారంగా గీతారెడ్డి టిఆర్‌ఎస్‌లోకి చేరితే ఆమెను వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి ఫరీదోద్దీన్ పరిస్థితి ఏమిటన్న వాదనలకు తెరలేచింది. గడచిన ఎన్నికల్లో గీతారెడ్డికి వ్యతిరేకంగా పని చేసి ఆమెను ఓడించేందుకు ఫరీద్ విఫలయత్నం చేసారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఫరీదోద్దీన్ టిఆర్‌ఎస్ కండువా ధరించారు. హైదరాబాద్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు దానం నాగేందర్ టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న ప్రచారం కాంగ్రెస్ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో మెదక్ జిల్లాలోనే సీనియర్ నాయకురాలైన గీతారెడ్డి పేరు కూడా వినిపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతగులుతుందని చెప్పవచ్చు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి సన్నిహితురాలుగా, దాదాపు మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్రను పోషించిన గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారనే వార్తలను నమ్మలేకపోతున్నారు.