రాష్ట్రీయం

గెలిచింది 15 మంది.. మిగిలింది ఆరుగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిడిపి నుంచి మారేందుకు మరికొందరు సిద్ధం గవర్నర్‌కు ఫిర్యాదు చేసినవారే గోడ దూకేస్తున్నారు

హైదరాబాద్, డిసెంబర్ 3: ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ మా పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీని స్తంబింపజేశారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. గవర్నర్ పట్టించుకోవడం లేదని రాజ్‌భవన్‌లో బైటాయించారు. ఇంత హడావుడి చేసిన ఆ ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు గోడ దూకేస్తున్నారు. ఇది తెలంగాణ టిడిపిలో నెలకొన్న గడ్డుపరిస్థితి. వరంగల్ పార్లమెంటు ఉపఎన్నికల్లో ఘనవిజయం సాధించి, గ్రేటర్ ఎన్నికలకు ఉత్సాహంగా సిద్ధమవుతున్న టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా టిడిపి, కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. శాసనమండలిలో స్థానిక సంస్థల కోటా కింద 12 స్థానాలకు జరిగే ఎన్నికలకోసం ఒకవైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీలోకి చేర్చుకుంటున్న టిఆర్‌ఎస్ మరోవైపు ఎమ్మెల్యేలపై దృష్టిసారించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థులను బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మేయర్ ఎన్నికల్లో కార్పొరేటర్లతో పాటు ప్రజాప్రతినిధులకూ ఓటు హక్కు ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై గురిపెట్టింది. రెండు పార్టీలకు చెందిన చాలామంది నాయకులు టిఆర్‌ఎస్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారు. అయితే ఒకరి తరువాత ఒకరిని వ్యూహాత్మకంగా చేర్చుకుంటున్నారు.
ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై అసెంబ్లీలో పోడియం వద్ద బైఠాయించి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలే ఒకరి తరువాత ఒకరు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తొలుత పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి చేరారు. వీరి చేరికపై శాసన సభలో టిడిపి సభ్యులు ఆందోళన చేశారు. పోడియం వద్ద బైఠాయించి ఆందోళన చేసిన ఎమ్మెల్యేలు, తరువాత గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు సైతం ఒకరి తరువాత ఒకరు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, గురువారం నాడు సాయన్న టిఆర్‌ఎస్‌లో చేరారు. గత సాధారణ ఎన్నికల్లో టిడిపి నుంచి మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా, వీరిలో ఆర్ కృష్ణయ్య పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టిడిపికి ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వీరిలో మరికొందరు టిఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఆరుగురిలో రేవంత్‌రెడ్డిది ఒక గ్రూపు కాగా, శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుది మరోవర్గం. మరో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పలు సందర్భాల్లో తన నియోజకవర్గంలో నీటి సమస్య తీరిస్తే టిఆర్‌ఎస్‌లో చేరుతానని ప్రకటిస్తూ వచ్చారు. అరెకెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, వివేకానంద తమ నియోజక వర్గాల్లో పట్టునిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాయన్నతో గతంలోనే టిఆర్‌ఎస్ నాయకులు సంప్రదింపులు జరుపుతూ వచ్చారు.
అయితే చంద్రబాబు పిలిచి చర్చించడంతోపాటు టిటిడి ట్రస్ట్‌బోర్డు సభ్యునిగా నియమించారు. టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కూడా సికింద్రాబాద్ కంటోనె్మంట్ బోర్డును ఆ పార్టీ కైవసం చేసుకోలేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికల్లో కంటోనె్మంట్ బోర్డు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఏకపక్షంగా విజయం సాధించడం, టిడిపి తరఫున ఒక్క సభ్యుడు కూడా విజయం సాధించక పోవడంతో టిడిపివారికి ఆందోళన కలిగించింది. మరోవైపు టిఆర్‌ఎస్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తిరిగి ప్రయత్నాలు ప్రారంభించడంతో సాయన్న టిఆర్‌ఎస్ చేరాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేయడంతో పార్టీలో చేరారు.
మరింత మంది చేరుతారు: జగదీశ్‌రెడ్డి
టిడిపి ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే ఉన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంకొంత మంది నాయకులు కూడా టిఆర్‌ఎస్‌లో చేరనున్నారని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలు చేస్తున్న పథకాలను చూసి వివిధ పార్టీల నాయకులు ఆలోచనలో పడ్డారని అన్నారు. వరంగల్ ఫలితాలు చూసిన తరువాత ప్రజల స్పందన ప్రభుత్వానికి అనుకూలంగా ఎలా ఉందో అర్థమయిందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ ఇదే విధంగా టిఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.