స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఈ మంత్రంలో ఆత్మకు పర్యాయపదాలుగా ‘దేవ, సుజాత’ శబ్దాలు చెప్పబడ్డాయి. దేశ శబ్దం సాధారణంగా దేవతలకు వర్తించినా దివ్యభావాలు కలవారికి కూడా వర్తిస్తుంది. అట్టివారే దివ్యాత్మలుగల మహాత్ములు. వారే సుజాతులు. ఉత్తమ జన్మకలవారు. దీనిని బట్టి జీవులు సహజంగా జన్మతః దివ్య భావాలుగల దివ్యపురుషులే.అయినా జీవనమార్గంలో కలిగిన అజ్ఞానంవలన అసురీభావాలకు వశపడుతున్నారు. అందుచేత ఓ జీవులారా! మీరు మీ సహజ స్వభావాన్ని గుర్తించండి. దేవతా శక్తిగల నేత్రాది జ్ఞానేంద్రియాలు మీ వెంట ఉన్నాయి. జడ ప్రకృతి మిమ్మేమీ చేయజాలదు. మీరు మీపై విశ్వాసముంచి సదా శరీర సంరక్షణ రూపమైన శారీరక యజ్ఞాన్ని నిర్వహించండి. ఇదే దేవయజ్ఞమై మీకు కల్యాణకారకమవుతుంది.
మనిషి జన్మ జీవన సమరాన్ని ఎదుర్కొనేందుకే
జాతో జాయతే సుదినత్వే అహ్నం సమర్య ఆ విధథే వర్ధమానః
పునంతి ధీరా అపసో మనీషా దేవయా విప్ర ఉదియర్తి వాచమ్‌॥ ఋ.3-8-5.
ప్రతిపదార్థం:- జాతః= శరీర ధారియైన మానవుడు; అహ్నామ్= దినాలను; సుదినత్వే= శుభ దినాలుగా చేసుకొనుటకై; జాయతే= జన్మిస్తాడు; స= అతడు (అధ్యాహార్యం); సమర్యే= జీవన సమరాన్ని ఎదుర్కొనుటకు; విదథే= జీవిత ప్రధాన లక్ష్యాన్ని సాధించేందుకు; ఆ= అన్ని విధాలుగా; వర్ధమానః= దినదినాభివృద్ధిని చెందుతాడు; ధీరాః= దైవ ధ్యానపరులు; మనీషా= తమ బుద్ధిచేత; అపసః= కర్మలను; పునంతి= పవిత్రీకరిస్తారు; దేవయా= దివ్య ఆకాంక్షతో; వాచమ్= శుభ వచనాలను; ఉత్+ఇయర్తి= పలుకుతాడు;
భావం:- దినాలన్ని ఒకే రీతిగా ఉంటాయి. వానిని తనకు శుభదినాలుగా చేసుకొనేందుకే మనిషి జన్మనెత్తుతాడు. జీవితమే ఒక సమరం. దాని నెదుర్కొనేందుకే క్రమంగా ఎదుగుతాడు. ప్రతి జీవితానికి ఒక లక్ష్యముంటుంది. దానిని సాధించేందుకే ప్రయత్నిస్తాడు. దైవధ్యాన తత్పరులు తమ బుద్ధిచేతను, మేధావియైన బ్రాహ్మణుడు దివ్య ఆకాంక్ష తోడను శుభ వచనాలను పలుకుతారు.
వివరణ:- మంత్రంలోని ప్రథమ వాక్యం మానవ జీవన ప్రయోజనాన్ని సుందరమైన ఆలంకారిక కావ్య భాషలో వర్ణించింది. నిత్యమూ సహజంగా సంభవించే దినాలను శుభదినాలుగా- ఆనందమయంగా తీర్చిదిద్దుకొనేందుకే భగవంతుడు మానవుడికి జన్మనిచ్చాడు. పశుపక్ష్యాదులకు దైవాన్ని ఆరాధించే అవకాశమే లేదు. అందుచేత అవి తమ జన్మను సార్థకం చేసుకోలేవు. తమ దినాలను శుభదినాలుగా దిద్దుకోలేవు. అవి కేవలం పశుపక్ష్యాదులుగానే మరణిస్తాయి. కాని జీవులకు ఉత్తమమైన మానవజన్మ లభిస్తే తమ ఉన్నతికి తగిన సాధనం లభించినట్లే. అప్పుడు కూడ జీవిత సార్థక్యానికి ప్రయత్నించకుంటె మరెప్పుడు ప్రయత్నం చేస్తారు?
చిత్రమేమంటె ఈ మానవ జీవితం ఆషామాషీ అయినది కాదు. ఎందరితోనో ఎన్నింటితోనో తలపడి యుద్ధం చేయవలసి యుంటుంది. జీవన సమరం చేయకుండా జీవనం సుజీవనం కాదు. దినం సుదినం కాదు. దుర్యోధనుడు దుష్టతతుష్టయంలోని వాడయినా ‘‘సూచ్యగ్రం నైన దాస్వామి వినా యుద్ధేన కేశవ!’’ యుద్ధం చేయకుండ వాడి సూది మొనమోపినంత నేలను కూడ పాండవుల కీయను’’అని చెప్పిన మాటకు సందర్భం వేరయినా జీవన యుద్ధం చేయకుండా ఎవరికి ఏమీ లభించదన్న సత్యాన్ని నిర్ద్వంద్వంగా చెప్పిందే.
ఎవడైనా తానేమీ పనిచేయకనే సోమరిగా ఉండి జీవితంలో సౌఖ్యాలను పొందాలని కాంక్షించేవాడు మాయలో పడ్డట్టే. ఈ జీవన రహస్యానే్న ఋగ్వేదం ‘‘న ఋతే శ్రాంతస్య సఖ్యాయ దేవాః’’ (ఋ.4-33-11) ‘‘కష్టించి పనిచేయని వానికి దైవీ శక్తులు సహితం సుఖాలననుగ్రహించవు’’అని స్పష్టంగా హెచ్చరించింది.
ఈ హెచ్చరికనే సమర్థిస్తూ ‘‘నైవశ్రమో న విశ్రమః’’ శ్రమలేదు కాబట్టి విశ్రామం కూడ లేదు అన్న సూక్తి పుట్టింది. అందుకే ఈ వేదర్షి ‘‘సమర్య ఆ విదథే వర్థమానః’’ జీవిత సంగ్రామంలో లక్ష్యసిద్ధిని సాధించేందుకు సర్వవిధాల ప్రయత్నించి అభివృద్ధి పొందుము’’అని జీవిత లక్ష్యాన్ని నిర్దేశించాడు. ఈ లక్ష్యానికి ప్రయత్నించినవాడు జన్మనెత్తి మాత్రం ప్రయోజనమేముంది? జీవిత పురషార్థానికై ప్రయత్నమే చేయని వానికి జీవితమే సాగదు. అతడికి ఎప్పుడూ సుజీవనం మరియు సుదినం ఈ రెండూ దూరంగానే ఉంటాయి. ప్రయత్నంలోనే జీవిత సార్థక్యముంది. అభివృద్ధి యుంది. చురుకుగా లేని పిల్లల్ని చూడండి. వాళ్లెప్పుడూ తోడివారి కంటె వెనుకబడియే ఉంటారు. ఇక ఆరోగ్యంగా ఉండే పిల్లల్లో! వాళ్లెప్పుడూ పరుగిడుతూ, గెంతుతూ, కేరింతలు కొడుతూ ఉల్లాసంగా ఉంటారు. అదే వాళ్ళ ఎదుగుదలకు సంకేతం. ఇదే విధంగా జీవితంలో పెద్దలు కూడ ఉల్లాసంగా ఉంటూ పైపైకి ఎదిగిపోతుంటారు. వేదం ఈ విషయానే్న, ‘విదధే’ జీవిత ప్రధాన లక్ష్యాలను చేరుకొనేందుకు, ‘సమర్య’జీవితంలో ఎదురయ్యే సమరాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడి యుంటారు అని వివరించింది.
అభివృద్ధి చెందడమంటే ఏమిటి?- ఎదురయ్యే సమస్యలతో తలపడటం- పురుషుడుగా జీవితంలో సాధించవలసిన లక్ష్యాన్ని చేరుకోవడమే.
*
ఇంకావుంది...