రాష్ట్రీయం

ఆగిన మిగులు జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్‌ఫ్లో 5800 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో 6100
ఆగని పట్టిసీమ ఎత్తిపోతలు
డెల్టాలో రబీకి సాగునీటి ముప్పు

రాజమండ్రి, డిసెంబర్ 5: మొదటి నుంచి అంచనా వేస్తున్నట్టే గోదావరి ప్రధాన ప్రవాహం బాగాతగ్గింది. శనివారం సాయంత్రానికి ధవళేశ్వరంలోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజీ నుంచి మిగులు జలాలు విడుదల నిలిచిపోయింది. దాంతో బ్యారేజీ గేట్లన్నీ మూసేశారు. చుక్క నీరు కూడా కిందికి వెళ్లకుండా జలవనరుల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రానికి గోదావరి ప్రధాన ప్రవాహంలో 5,832 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదైంది. తూర్పు డెల్టాకు 800, సెంట్రల్ డెల్టాకు 800, పశ్చిమడెల్టాకు 4500 క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. అయితే ఇన్‌ఫ్లోస్ కన్నా అవుట్‌ఫ్లోస్ ఎక్కువ కనిపిస్తోంది. బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లోస్ 5,832 క్యూసెక్కులు నమోదవుతుంటే, అవుట్‌ఫ్లోస్ మాత్రం 6100 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ఇలాంటి పరిస్థితి రానున్న రోజుల్లో గోదావరి డెల్టాలో రబీ పంటకు తీవ్ర సాగునీటి ఎద్దడికి దారితీస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ నుండి సాధారణంగా జనవరి రెండోవారంలో మిగులు జలాలు విడుదల ఆగేది. వర్షాభావ పరిస్థితులు కారణంగా ఈసారి డిసెంబర్ మొదటివారంలో ఆగింది.
గోదావరి ప్రధాన ప్రవాహం ఇంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నది నుండి నీటిని తోడటం ఆగలేదు. పట్టిసీమ పథకంలోని ఐదు మోటార్లు ద్వారా సుమారు 1500 క్యూసెక్కులను పంపింగ్ చేయటం ద్వారా కృష్ణా నదికి తరలిస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద గోదావరి నీటిమట్టం 14 మీటర్లుకు తగ్గినా, కాటన్ బ్యారేజీ గేట్ల నుండి మిగులు జలాలు విడుదల ఆగినా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి నీటిని పంపింగ్ చేయటం నిలిపివేసే విధంగా పట్టిసీమ పథకం విధి విధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. కానీ అందుకు విరుద్ధంగా కాటన్ బ్యారేజీ నుండి మిగులు జలాలు నిలిచిపోయిన తరువాత కూడా పట్టిసీమ పంపింగ్ కొనసాగుతోంది. దీనివల్ల గోదావరి డెల్టాలో రబీకి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే గోదావరి డెల్టాకు ఇలాంటి ప్రమాదం ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే మొదటి నుండి గోదావరి డెల్టా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకున్నట్టే గోదావరి డెల్టాకు నీటి ఎద్దడి పొంచి ఉన్నప్పటికీ, ఏమాత్రం పట్టించుకోకుండా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇన్‌ఫ్లోస్ కన్నా అవుట్‌ఫ్లోస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే బ్యారేజీ బేసిన్ నీటిమట్టం బాగా తగ్గి, గోదావరి డెల్టాకు నీటిసరఫరా కష్టమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.