సబ్ ఫీచర్

ప్రతిభా వైజయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ కారణమూ లేకుండా ఎవరికీ ఉత్తపుణ్యాన పేరు రాదు. మనలాగే పుడ్తారు- కాని కొందరు కారణజన్ములౌతారు. ‘ఏ పనికో జన్మించితినని నీవెంచవలదు శ్రీరామా!
‘‘వాల్మీకి మొదలైన మహర్షులు నిన్ను మనసారా తనివి తీరా నిన్ను కీర్తించి తృప్తిపడ్డారు. అది వారి స్వార్థం. మరి నా ఆశ ఎలా తీరుతుందయ్యా!! నీకు తెలియదా? నేను పుట్టిన కారణం? ఏంటో నీకు తెలుసు. నా జన్మ ప్రయోజనం, నిన్ను కీర్తించడమే అంటాడు త్యాగరాజు.
సహస్ర చంద్రదర్శన సౌభాగ్య సంపన్నుడై ఆకాశవాణి అనే మాధ్యమాన్ని సుసంపన్నం చేసి, దశ, దిశా నిర్దేశనం చేసిన కారణజన్ముడు రజనిగా మేమందరం ప్రేమగా పిలుచుకునే ‘ప్రతిభామూర్తి’ డా.బాలాంత్రపు రజనీకాంతరావు.
‘పూర్ణాయుర్దాయంతో జీవించిన ధన్యజీవి. ఆయనకు జన్మతః సిద్ధించిన విభూతులు కొన్నైతే, నలుగురినీ చూసి సంపాదించుకున్న అపార విజ్ఞానం తోడై కళాప్రపూర్ణుడై విద్వజ్జన లోకానికి సుపరిచితుడైయ్యాడు. డా.రజనీకాంతరావు చేపట్టిన ప్రక్రియలు అనంతం. కేంద్ర సాహిత్య ఎకాడమీ పురస్కారం పొందిన ‘‘ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర’’ గ్రంథం ఒకటి చాలు. ఆయన సర్వతోముఖ ప్రతిభ చాటేందుకు.
నిజంగా చెప్పాలంటే వెంకటమణి తర్వాత అంతటి సమున్నతుడు. కర్ణాటక సంగీతంతో సమానంగా లలిత సంగీత నిరూపణకూ, సంగీతరూపక నిర్మాణానికి, అంత సేవ చేసిన రజనిని కొలిచేందుకు కొలమానాలు లేవు.
ఆయనకు 1942లో రేడియోలో చేరిన నాటినుండే సంగీత సాహిత్యాల నర్తనశాలలు రేడియో కేంద్రాలే.
అజ్ఞాతంగా ఆయన పనిచేసిన తెలుగు సినిమాల్లోని పాటలు సినీ సంగీత ప్రేమికులను అలరిస్తూనే వుంటాయి. 1945లో స్వర్గసీమలో ‘ఓహోహో పావురమా’ పాటకు కట్టిన అరేబియన్ ట్యూన్ ఆయనదే. రాజమకుటం, ‘ఊరేది పేరేది’లో చారుకేశి రాగ బాణీ 1950లో లక్ష్మమ్మ, 1951లో పేరంటాలు చిత్రాలకు రజనియే సంగీతం యిచ్చారు.
మాటల మేటి దేవులపల్లి... అయితే పాటల పేటి రజనీగా యిద్దరూ కృష్ణరజనిగా ప్రసిద్ధులై చేసిన ప్రయోగాలన్నీ ఆకాశవాణివారు దాచుకోవలసిన నిధులే. ప్రతి ముద్దలోనూ రసానుభూతినందించేది లలిత సంగీతమేయని, ఆస్వాదించగలిగే మనసుంటే లలిత గీతం అంతటా రసావిష్కరణే అని చాటిన లలిత సంగీత చక్రవర్తి రజని. బాలాంత్రపు రజనీకాంతరావు కవి పండిత కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి.
గత శతాబ్దంలో ఏకాంతసేవ రచించిన ‘వేంకట పార్వతీశ్వరులలో వేంకట్రావుగారి కుమారుడు రజని.
రేడియో మాధ్యమాన్ని జనబాహుళ్యంలోకి తెచ్చిన వారిలో ఆద్యుడు ఈయనే. ఆయన తరువాత ఏ కేంద్రానికీ అంతటి సమర్ధుడు లేడు. ఆయన ‘రజని’ ఉమ్మడి మద్రాసు కేంద్రంలో పనిచేసిన కాలంలో లలిత సంగీత గీతాల ప్రసారానికి కారకుడయ్యాడు. ఘంటసాల వేంకటేశ్వర్రావు, ఆర్.బాలసరస్వతీదేవి, సాలూరి రాజేశ్వర్రావు, టంగుటూరి సూర్యకుమారి, సీత, అనసూయలు, భానుమతి, ఎస్.వరలక్ష్మి మొదలైనవారు రజని ఆధ్వర్యంలో పాడిన పాటలకు ఆరోజుల్లో సినిమా పాటలకు మించిన ఆదరణ వుండేది.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నెహ్రూ ప్రసంగం పూర్తవగానే మద్రాసు కేంద్రం నుంచి ‘‘డిఐఎల్ పట్టమ్మాళ్ పాడిన సుబ్రహ్మణ్య భారతి గీతం (ఆడువోమే పళ్ళుప్పాడు వమే) తర్వాత రజని గీతం ప్రసారమైంది. టంగుటూరి సూర్యకుమారి ‘మ్రోయింపుము జయభేరి, మాదీ స్వతంత్ర దేశం లాంటి ఆణిముత్యాల్లాంటి గీతాలు దేశభక్తి ప్రబోధితమైన ప్రతివారినోటా నినదించాయి.
సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్టప్రతిగా ఉన్నప్పుడు, ‘రజనీకి’ సాహిత్య ఎకాడమీ అవార్డు లభించింది. రాధాకృష్ణన్‌ని చూసేందుకు వెళ్ళిన రజనీకి, ఆంధ్ర వాగ్గేయకార చరిత్రలో వున్న ఒక పాట, రాధాకృష్ణన్ ఆలపించటం ‘‘నేనెన్నడూ మరచిపోలేను అన్నారోసారి. నేను పాడిన రజనీ గీతం ‘‘హాయిలో నేల, యెదకింత హింస’’ ఎంతో ప్రసిద్ధమై, రజనీ ‘‘నాకు అభిమాని అయ్యేందుకు తోడ్పడిందంటే నాకెప్పుడూ ‘ఆశ్చర్యంగానే వుంటుంది.
దేశంలో సాహిత్య అకాడమీ అవార్డు, సంగీత నాటక ఎకాడమీ అవార్డూ రెండింటినీ అందుకున్నవారు రజనీయే.
రేడియో ప్రసార మాధ్యమాన్ని సంగీత సాహిత్యాలతో సుసంపన్నం చేసిన అతి కొద్దిమందిలో రజనీ ముందు వరుసలో వుండే వ్యక్తి.
ఆయనలాంటి సాహితీవేత్త, పరిశోధకుడు, ప్రయోక్త, అరుదుగా జన్మిస్తారు. అత్యున్నత సంగీత సాహిత్య ప్రమాణాలతో నిండిన రజనీ సంగీత రూపకాలు, యక్షగానాలు, ఈతరం జాగ్రత్తపరుచుకోదగిన అపురూప సంపద.
నృత్య ప్రదర్శనకు అనువుగా వుండే రజనీ సంగీత రూపకాలు, నేటిమేటి నృత్య కళాకారులు ప్రామాణికంగా స్వీకరించి ప్రదర్శించయోగ్యమైనవి.
‘చెంచు దాననే అనే అన్నమయ్య కీర్తన దేసాగళంలో కూర్చి, అన్నమయ్య కాలంనాటి రాగ స్వరూప నిర్ణయాన్ని ఆవిష్కరించే ప్రయత్నంచేసిన ‘ఆధునిక వాగ్గేయకారుడు’- మీరు ఎవరినైనా అడగండి దక్షిణాంధ్రావనిలో, ఆయనకున్న పేరుప్రఖ్యాతులు మరెవరికీ లేవు.
రజనీగారి పుట్టిల్లు పిఠాపురం. పిఠాపురం పేరు చెప్పగానే గుర్తొచ్చే కొద్దిమందిలో సంగమేశ్వరశాస్ర్తీ ప్రముఖులు. సంగమేశ్వరశాస్ర్తీ శిష్యులు కూడా కృష్ణమూర్తి దగ్గర సంగీతంలో ఓనమాలు రజనీ దిగ్విజయ సంగీత యాత్రకు నాందీ పలికాయి. ఇరవై ఏళ్ళు వచ్చేసరికే ఆయనకు పాటామాటా రెండూ అలవడ్డాయి. ఆయన అభిరుచికి తగ్గ రేడియో ఉద్యోగం ఆయనకు వరమైంది. తెలుగులో శాస్ర్తియ సంగీత మాధ్యమానికి తోడుగా మొదలైన సుగమ సంగీతం మొదలైన కాలం అది. రజని, రాజేశ్వర్రావు, రావు బాలసరస్వతి, సీత, అనసూయ, ఘంటసాల, వీరంతా వైతాళికులు. వీరందరిలోనూ వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావే.
రజనీ సమర్ధవంతంగా నిర్వహించినవి వున్నాయి. అందులో రెండు ముఖ్యమైనవి:
1. అన్నమాచార్య కీర్తనల ప్రచార ఉద్యమంలో మొదటి వరుసలో నిలిచి విజయవాడ కేంద్రంనుంచి ఎన్నో ప్రసారం చేశారు. కొన్ని కీర్తినలు ఆయన కంపోజ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంవారు అన్నమాచార్య కళాపీఠానికి రజనీని డైరెక్టర్‌గా చేశారు. సంగీత సాహిత్యాలలో అసమాన ప్రజ్ఞా దురంధరులెవరైనా యిటువంటిచోట్ల ఎక్కువకాలం పనిచేయనివ్వరు.
కొంతకాలం ఆయన తిరుపతిలోనే కొనసాగి వుండి వుంటే అన్నమాచార్య కీర్తనల రూపురేఖలు, యిప్పుడున్నట్లుగా వుండేవి కావు’’ అని రసజ్ఞులు అనుకునే బహిరంగ రహస్యం.
రజని ఎక్కడుంటే అక్కడే వసంతం. అన్నమాచార్యుల కాలంలో రాగాలు ఎలా వుండేవో ఊహించి చేసిన ఆయన బాణీలు అస్మదాదులకు దిశానిర్దేశం చేయగల దివిటీలు. దేవసాళగం, దేశాక్షి వంటి రాగాల్లో కీర్తనలుచేసి రక్తిగా పాడించటం సుళువైన విషయం కాదు. ఆయనకే చెల్లు.
రజని మొదటి సంగీత రూపకం ‘‘చండీదాసు 1941 ఫిబ్రవరి 21వ తేదీ మద్రాసు రేడియో కేంద్రంనుంచి ప్రసారమయింది. చండీదాసు పాత్ర రజనిదే. ‘రామమణి అనే నాయిక పాత్ర అప్పటి ‘‘మాలపల్లి’’ సినిమాలో పాటలు పాడిన గాయని పి.సుందరమ్మ. ‘నల్లవాడే గొల్లపిల్లవాడే’ అనే బసవరాజు అప్పారావు గేయంతో ఆమె ప్రసిద్ధమయింది.
చండీదాసు సంగీత రూపకానికి వాద్యబృందానికి మార్గదర్శకుడు సాలూరి రాజేశ్వర్రావు. పాటకూ పాటకూ మధ్య విరామ సంగీతాన్ని ఆయనే కంపోజ్ చేసినా, రాజేశ్వర్రావు రేడియోలో తన పేరు చెప్పవద్దని కోరిన సజ్జనుడు.
సంగీత దర్శకత్వం మాత్రమే తన పేరు చెప్పమని కోరాడు. రేడియోలో బాలసరస్వతితో రాజేశ్వర్రావు పాడిన లలిత గీతాలు చల్లగాలిలో యమునాతటిపై, ఓ విభావరీ, కోపమేల రాధా పాటలు ముందు ఈవేళ ఏ సినిమా పాటా నిలబడలేదు. చండీదాసుకు బెంగాలి భాష మూల రచన. ఆరోజుల్లో ప్రసిద్ధులైన సంగీత దర్శకులు పంకజ్ మల్లిక్ సైగల్ వంటి గాయకుల గాన పద్ధతులను తెలుగు పాటలకు జోడించటంలో రజని, రాజేశ్వర్రావులిద్దరూ కృతకృత్యులైయ్యారు. రజని పేరు భక్తిరంజనితో ప్రసిద్ధమైంది. మద్రాసు కేంద్రం నుంచి శుక్రవారాల్లో రాత్రి 10నుంచి 10.30 దాకా ప్రసారమవుతూండేది. విజయవాడ నుండి అదే కార్యక్రమం ఉదయం 6.20 నుంచ 7 గంటల వరకూ వినబడేది. అపురూపమై పుస్తకాల్లోనే వున్న తూము నరసింహదాసు, ప్రయాగ రంగదాసు, భద్రాచల రామదాసు, పరంకుశ దాసు కీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు ఈ భక్తిరంజనిలో వినబడుతూ రేడియో శ్రోతల సంఖ్య పెరిగేందుకు దోహద పడిన ప్రధాన వ్యక్తి.
భక్తి రంజని రజని.
పిఠాపురంలోని మద్దిరాల వేంకట రాయకవి రచించిన ‘‘ఏకాంత సేవా విలాసం’’ (కుక్కుటేశ్వర రాజరాజేశ్వరీ విలాసం) వోలేటి వెంకటేశ్వర్లుతో కలిసి రజని రూపొందించారు.
కూచిపూడి యక్షగానానికి జాతీయ స్థాయి నృత్యంగా గుర్తింపు పొందటానికి అప్పట్లో వోలేటి వెంకటేశ్వర్లు, బందా కనకలింగేశ్వర్రావులతో ఎంతో శ్రమించి, కూచిపూడి విద్వాంసుల సహాయంతో యక్షగానాలను విజయవాడ ఆకాశవాణి కేంద్రంనుంచి ప్రసారం చేసిన ఘనత రజనికే చెల్లుతుంది.
బాలాంత్రపు రజనీకాంతరావులాంటి హిమాలయ శిఖర సదృశుడైన వ్యక్తిని గురించి చెప్పటం చాలా సాహసం. అయినా నాకున్న అర్హత ఒక్కటే. ఆయన మెచ్చిన విధంగా ఆయన పాటలు పాడి, ఆయన అభిమానం పొందగలగటమే. రజనీని ఎప్పుడు కలిసినా కేవలం పది పదిహేను నిమిషాలు మాట్లాడినా అందులో వున్నదంతా సంగీత ప్రస్తావనే.
మనకున్న కళారూపాల్లో సంగీత ప్రధానమైన గీతం, వాద్యం, నృత్యం- కలబోసుకున్న సంగీతానికి నిలువెత్తురూపం రజని. ఈ మూడింటిలోనూ సమానమైన ప్రతిభ వున్నవారు ఈ తరంలో, నాకు తెలిసినంతవరకూ రజనీ ఒక్కరే.
వెనకటి తరంలో ఆదిభట్ల నారాయణదాసు గారిని చెప్తారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్‌గా రావటానికి ముందు మామూలు ఉద్యోగిగా మేధావులతో పనిచేయటం ఆయనకు లభించిన వరం.
సృజనాత్మకత మూర్త్భీవించిన మూల విరాట్టుగా భాసిల్లిన ‘రజనీ’ కాలంలో నేను పనిచేయటం నా అదృష్టం- ఆ తరువాత కాలంలో వచ్చి చేరిన ఉత్సవమూర్తుల కాలంలో రిటైరవ్వటం యాదృచ్ఛికం. సాధారణంగా ఎవరికైనా ఎదుటివారిలోని సద్గుణాలను మెచ్చుకోవటం అరుదైన లక్షణం
‘‘తన్నుత్తమ, ఎదుటి మధ్యమ ఎక్కడో ప్రథమ’’అనే వ్యాకరణ సూత్రంలా కనిపించే వారే లోకంలో వుంటారు.
కొత్త వారిలోని ప్రతిభను పసిగట్టి, వాళ్ళను ప్రోత్సహించే ప్రత్యేక లక్షణం ఆయన సొంతం. ప్రతిభకు పట్టం కట్టే సంప్రదాయానికి ఒరవడి పెట్టిన వ్యక్తి. అధికారిగానే జీవించలేదు. జీవిత చరమాంకంవరకూ ఆర్టిస్టుగానే బ్రతికారు.
ధ్వని మాధ్యమానికి ఊపిరులూదిన రజని లేని లోటు ఎవరూ పూరించలేరు. కీర్తి శరీరంతో అందరికీ గుర్తుండిపోతారు. తెలుగువారి సంగీత సాహిత్య ప్రతిభ తెలుసుకోవాలంటే స్ఫురించే పేరు డా.రజని.

చిత్రం..బాలాంత్రపు రజనీకాంతరావుతో వ్యాస రచయత మల్లాది సూరిబాబు

- మల్లాది సూరిబాబు, 9052765490