సబ్ ఫీచర్
‘విరాళి’ అందమైన భావాల లోగిలి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘విరాళి’ కవితాసంపుటి
- జన్ను లక్ష్మి
పేజీలు: 200.. వెల: రూ.150/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌజ్, అన్ని బ్రాంచీలు.
నవచేతన బుక్‌హౌజ్
కవయిత్రి సెల్: 9246273615
*
‘హృదయం... పెదవి దాటకుండా
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...
మాటల సందుల్లోనుండీ
హృదయం... జారిపోతూనే వుంది’
అంటూ అందమైన ఆలోచనలకు అక్షరాకృతినిస్తూ... కవయిత్రి జన్ను లక్ష్మిగారు ‘‘విరాళి’’ కవితాసంపుటికి జీవం పోశారు. యండమూరి వీరేంద్రనాథ్‌గారు అభిప్రాయపడినట్లు.. ఆమె కవితా రచన శైలిలో క్లుప్తతను... శిల్పంలో చతురత కానవస్తుంది.. కవయిత్రి లక్ష్మిగారు ఏ అంశాన్ని అభివ్యక్తీకరించినా.. భావంలో వాస్తవికత.. నిజాయితీ అడుగడుగునా దర్శనమిస్తాయి. అందుకే ‘అందమైన భావాల లోగిలి’గా పేర్కొనవచ్చు.
మనకు...
పరిచయమున్న ప్రపంచాన్ని
సృష్టించిన వాడే..
పరిచయం లేని ప్రపంచాన్ని సృష్టించాడంటూ నొక్కి చెబుతూ..
ఓ పలకరింపు.. మనిషిని ఎలా పరవశింప జేస్తుందో... కవయిత్రి ప్రకటించిన భావాలు భావస్ఫోరకంగా కొలువుదీరాయి..
‘సమీక్ష’ పేరుతో కవయిత్రి లక్ష్మిగారు రాసిన కవిత అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ కవితలో.. తుమ్మెద ఝుమ్మని పాడే రాగాన్ని... ఆ రాగంలోని అనురాగాన్ని అందంగా ఆవిష్కరించారు.
కొమ్మ కొమ్మపై ఎగురుతూ..
పువ్వు పువ్వుపై వాలుతూ కలల్ని తెచ్చిన సంగతినీ..
కలలను పంచిన విషయాన్ని... రమణీయంగా దృశ్యమానం చేశారు.
చక్కని భావుకతతో.. చిక్కని భావాలతో సాగే ఈ కవితలో.. అర్థవంతమైన ముగింపునిచ్చారు. పైకి పదబంధాల్లో కనిపించే అంశాలకు.. పదబంధాల మాటున నర్మగర్భంగా కవయిత్రి వెలిబుచ్చిన అభిప్రాయాలకు సమన్వయంతోపాటు ఓ సందేశాన్ని అందించడం అభినందనీయం..
ఈ కవితలో.. ప్రతి పంక్తీ గాఢంగా రూపుదిద్దుకుంది. ముగింపులో ఇలా ముగించారు.
దీపాల వేళ పూబాల
చేరింది వలపు రేకలతో...!
అందానికి ఎందుకులే పొగడ్తలు...
చుంబనాలే ముందు మాటలు!
సౌందర్యానికి ఎందుకులే సమీక్షలు...
గాఢాలింగనాలే కానుకలు! అని విలక్షణ పదప్రయోగంచేసి, కవయిత్రి తమ కవితాపటిమను చాటుకున్నారు. ముందుమాటలు.. సమీక్షలు... కానుకలు... పొగడ్తలు వంటి పదాలను వైవిధ్యంగా కవితలో భిన్నమైన రీతిలో ప్రయోగించి పాఠకులను మెప్పించడం ప్రశంసనీయం.
‘సయ్యాట’ శీర్షికతో రాసిన కవితలో ప్రేమ మనసునుండి చేరాలి అన్న విషయాన్ని బలంగా చెప్పే క్రమంలో.. సయ్యాటను గెలుపు ఓటములు లేని.. నియమ నిబంధనలు లేని పవిత్రమైన ఆటగా ఆవిష్కరించారు. ముసుగులు తీసేసి... స్వచ్ఛంగా మసలుకోవాలన్న షరతు తప్ప... మరేం లేదని తేల్చిచెప్పిన తీరు బాగుంది.
అనుబంధాల ఆటను అక్షరాల్లో బంధిస్తూ... పైకి తేలికగా కనబడినప్పటికీ.. దీర్ఘకాలం ఆ ప్రేమ మనగలగాలంటే కావలసింది... అంతులేనంత సహనం అవసరమని చెప్పారు.
చేతిలో చెయ్యివేసి.../ నమ్మకంగా వుంటానని
మాట యివ్వడం కాదు../ చేతుల్తో పెనవేసుకుని
నమ్మకం.. దేహంనుండీ/ దేహానికి చేరాలని హితవు పలికారు.
నమ్మకం వమ్ముకానంతవరకు.. చిన్నచిన్న... పట్టింపులు.. కాసిని కోపాలు.. కాసిని అలకలు.. అవి తగ్గాక.. అలకలు తీరాక.. తీయని కలయికలు.. ఇచ్చింది తీసుకున్నది.. ఇచ్చేయడం.. ఆట అంతేనంటూ.. చక్కని ముక్తాయింపునిచ్చారు.
‘సాంత్వన’ కవితలో..
జీవితంలో నీ జోక్యం/ నా అభివృద్ధికి..
అవరోధం అనిపిస్తోంది అంటారు.
నీ ప్రేమ.. నా పనులకు/ అంతరాయం కలిగిస్తోందనీ..
పున్నమి జాబిలే.../ అందంగా వుంటుందని
తెలియని నాకు../ నువ్వందంగా వున్నావని
ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించారు.
ఇంత నిక్కచ్చిగా.../ మాట్లాడే నేను...
ఎప్పుడు సాంత్వన/ పొందుతానో తెలుసా?
నీ పక్కన నేనున్నప్పుడే! అంటూనే...
గంభీరమైన నీ గుండె.../ ఎప్పుడు సంతోషిస్తుందో
నీకు తెలుసా?/ నిన్ను నేను పలకరించినప్పుడే! అంటూ
ముగించిన తీరు చాలా బాగుంది.
‘సంతకం’ కవితలో ప్రతి పంక్తీ పాఠకులకు గిలిగింతలుపెట్టే విధంగా కొలువుదీరాయి.
చెక్కిలిపై చెక్కిలి సంతకం/ పెదవిపై పెదవి సంతకం
ఎదపై ఎద సంతం
తనువుపై తనువు సంతకం అంటూ కవితను పాఠకులకు మత్తు కలిగించేలా... ఎత్తుకున్నారు.
తామరాకుపై.. నీటి చుక్కలా.../ తామరాకు చాటు...
నీటి కొలనులా.../ కొంగుపైనా అందమే!
కొంగు చాటునా అందమే అంటూ కొనసాగించారు.
అరచేతుల కనులు మూసి
కౌగిలిలో మేను దాచి../ దాచలేవు సొగసుల గనిని!
ఆపలేవు సిగ్గుల సిరిని అంటూ రమణీయంగా కవితను తీర్చిదిద్దారు.
‘జ్ఞాపకాలు’ కవితలోని పంక్తులు ఆలోచనాత్మకంగా అక్షరాల్లో ఒదిగిపోయాయి.
నేనంటే... ఒక్కరం కాదు/ నేనంటే ముగ్గురం!
‘నా శరీరం’... ‘నా మనస్సు’.. ‘‘నా మెదడులోని ఆలోచనలు’’ అంటారు.
కవయిత్రి తమ ఊహలకు అక్షరరెక్కలు తొడిగి పాఠకులను ఊహాలోకంలో విహరింపజేశారు.
జాబిల్లినీ... ఇంద్రధనుస్సునీ/ అదేపనిగా... అరగదీస్తూ
ఉపమానాలు వాడే/ ఊహాజీవి పరిచయం
నా వాస్తవ జీవితాన్ని.../ లాగేసుకుంటుందనీ..
ఊపేస్తుందనీ.../ ఊహించలేదంటూ... కవితలో కవయిత్రి పొందుపరిచిన పంక్తులు కవితకు నిండుదనాన్నిచ్చాయి.
గులాబీ బుగ్గలను../ చిదిమిన బంగారువేళ్లను..
వేలి కొసలతో మీటిన../ వలపు సితారలను
‘చిదంబర రహస్యం’ కవితలో ఆవిష్కరించారు. అడిగి.. సాయంచేసేది స్నేహం! అడగకుండా... బరువును పంచుకునేది అనురాగం...
రెండు మనసుల్లో చిగురులేసి పెరిగే ప్రయాణం మూడో కంటికి... అర్థంకాని చిదంబర రహస్యాన్ని కవయిత్రి విడమరిచి వివరించిన తీరు బాగుంది.
కవయిత్రి సరస సంభాషణను కవిత్వంలో జొప్పించి పాఠకులను మెప్పించడానికి వెనె్నల్లో బాణాన్ని వదిలారు. ముగింపు చాలా బాగుంది. ‘‘నువ్వునాతో నడిస్తే’’ కవితలో ప్రతిపంక్తీ ఓ భరోసానిస్తుంది.
నువ్వు నాతో నడిస్తే../ నడవాల్సిన దూరం తగ్గకపోవచ్చు.. కానీ
నడిచేటప్పుడు అలసట తగ్గుతుంది కదా! అని అనడం బాగుంది. ‘మనోహరాలు’ కవితలో...
గువ్వలన్నీ/ గూటికి చేరే వేళ
సాయంకాలం/ మనకు హార్యోదయం
అలసిన అందాల ఉషోదయం! అంటూ మనోహరంగా మధురభావాలకు అక్షర రూపం యిచ్చారు.
చిరుగాలి గుసగుసలను/ చిగురాకు గలగలలను
‘హృదయ లేఖ’లో నిక్షిప్తం చేశారు.. ‘‘విసిగించకపోతే...’’ కవిత ద్వారా...
చీరకొంగు రెపరెపలు... గాజుల గలలు...
మువ్వల రవళులు... మొదలగు వాటి ప్రాశస్త్యాన్ని తెలియజెప్పారు. ఒక్కరోజు... వాటిని... నువ్వు విసిగించకపోతే... బెంగపెట్టుకుని... అలక పాన్పు చేరుతాయని ముగించారు.
‘‘నాకెందుకు’’.. కవితలో...
తెలివి... అందం... సంపాదన... చలాకీతనం... చతురత... మాటకారితనం ఉంటే ఏం లాభం?
నా మీద అభిమానం లేని
నా మీద ఇష్టం లేని
నా మీద ప్రేమ లేని
నన్ను గుర్తుకు తెచ్చుకోని... వ్యక్తి నాకెందుకండోయ్!
అంటూ రాసిన పంక్తులు... కావలసినంత సందేశాన్ని మోసుకొచ్చాయి!
పండుగనాడే కాదు.../ సరదాలు...సంతోషాలు...
నిన్న..నేడు... రేపు.. కూడా కావాలని కాంక్షిస్తూ మరో కవితను రాశారు.
‘‘నన్ను క్షమించకు’’ కవిత ముద్దుముద్దు ముచ్చట్లతో కొనసాగించారు. నీతో తనివితీరా... గడపని రోజులకు... నష్టపోయిన రోజులకు... క్షమించుమని అడిగినా క్షమించకు... శతకోటి కౌగిలింతలు... ముచ్చట్లు...ముద్దులు నష్టపరిహారం అందుకున్నాకే... క్షమాభిక్ష ప్రసాదించుమని కోరడం బాగుంది. ఇంకొక కవితలో...
సృష్టిలో/ విరహం ముందు పుట్టి...
ప్రేమ తర్వాత పుట్టిందా?/ ప్రేమ ముందు పుట్టి
విరహం తర్వాత పుట్టిందా? అంటూ కవయిత్రి చిక్కుప్రశ్న వేస్తూ.. పాఠకులు ముక్కున వేలేసుకునేలా చేశారు.
‘‘హారతి’’ కవితలోనూ... కవయిత్రి... రమణీయ భావాలతో అక్షర హారతి పట్టారు.
నీ విరహాగ్నిపై../ పడిన గుగ్గిలం
భగ్గుమని/ కౌగిలి పొగలై..
గుబాళిస్తోందని చెప్పడం కవయిత్రి యొక్క కలల బలాన్ని సూచిస్తోంది. ‘‘విరాళి’’ కవితలో..
నాకర్థం కాకున్నా/ నీ హృదయాన్ని దొంగిలించి
ప్రకృతిలో దాచాను/ ప్రకృతిని... మరల
నా హృదయంలో ధరించి తిరుగుతున్నాను!
లేకపోతే ప్రకృతికి../ అంత అందం... ఎక్కడిది?
ఒఠ్ఠి పచ్చదనం తప్ప... అంటూ రాసిన పంక్తుల్లో కవితకు ప్రాణాన్ని పోశాయి. పారాజిత ప్రేమ.. వృథా కాలేదంటూ ‘‘బహుమతి’’ కవితను తీర్చిదిద్దారు.
జీవితపు అంచులలో/ గతంలోకి... స్వా-గతం! చెబుతూ..
నీ తనువు స్పర్శ... హృదయ స్పర్శ రెండూ కావాలంటూ.. చేతులెత్తి అడుగుతూ... ‘‘స్వా...గతం!’’ కవితను రూపుదిద్దారు.
ఇలా... ఈ గ్రంథంలోని కవితలన్నీ రమణీయ భావాలతో... కొలువు దీరాయి. ప్రతి కవిత ఓ మంచి సందేశాన్ని పంచింది... పాఠకుల్లో ఓ గొప్ప అనుభూతి కలిగించే విధంగా తమ రచనను కొనసాగించారు.
పుస్తకం... సంగీతం/ వ్యాయామాలు...
కుంగిపోతున్న మనస్సుని
పైకి... లాగలేవన్న నిజాన్ని ఇందలి కవితలు నిగ్గుతేల్చాయి.
ఒక మనసును పైకి లాగి
మళ్లీ జన జీవనంలో కలిపేది మరో మనస్సే!! అంటూ తేల్చిచెప్పే సందేశాలు ఇందలి కవితల్లో తారసపడతాయి. కవయిత్రియొక్క భావుకతను... సృజనాత్మక ప్రతిభను... పదబంధ ప్రయోగ చాతుర్యాన్ని... నేర్పరితనాన్ని అందరం అభినందించి తీరుతాం. ఈ కవితల్ని చదివి అందరం సేద తీరుతాం. ఒకింత ప్రశాంతతను పొందుతాం. అద్భుతమైన అనుభూతిని ఆస్వాదిస్తాం.