సబ్ ఫీచర్

బాలసాహిత్యంలో కాల్పనిక కథల పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో కథ లేదా కత ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమీ నిఘంటువు ప్రకారం కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్యగ్రంథం. కథ అంటే నీతి. కథ ఒక రీతి. కథ అంటే నిజాయితీ. పిల్లలను చేరదీసి కథలు చెప్తే ఆ కథలే పిల్లలను వేలుపట్టి నడిపిస్తాయి. నీతి చంద్రికలై దారి చూపుతాయి. రోబోటిక్ యుగంలో ఉన్నా అంతరిక్షం లో విహరించిన బేతాళ కథలు చెప్పాల్సిందే. చందమామ వంటి పుస్తకాలు చదవాల్సిందే ఎందుకంటే ఆ కాల్పనిక శక్తే మానవజాతిని ఇంతవరకు నడిపించింది. పసిమనసుల్లో ఎన్నో ఆలోచనలు రేకెత్తింపచేసింది. ఎందుకు? ఏమిటి? ఎలా అన్న ప్రశ్నలు ఉదయింపచేసి పరిష్కారాలను ప్రసరింప చేసింది. అందుకే కథలు చెప్పకు అని పిల్లలను చిన్నబుచ్చకూడదు. వాళ్ళు చెప్పింది సావధానంగా వినాలి. మెచ్చుకోవాలి అప్పుడే వారి కళ్ళల్లోని వెలుగును మనం చూడగలుగుతాం. కథలు మేలుకొలుపులు. వినేకొద్దీ ఇంకా వినాలనిపిస్తాయి. చదివేకొద్దీ ఇంకా చదవాలనిపిస్తాయి. చెప్పేకొద్దీ ఇంకా చెప్పాలనిపిస్తాయి. తాతయ్య కథ చెప్తూ ఉంటే చందమామకి కునుకు రావాలి కాని మనవలకి రాదు. జీవితాంతం చెప్పినా తరగని కథలు పిల్లలకి దారిచూపే వెలుగురేఖలు.
‘‘జ్ఞానం కంటే ఊహాశక్తి చాలా గొప్పది’’ అన్నాడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ఈ మాట అక్షరాల నిజం. పిల్లల్లో ఊహాశక్తిని పెంపొందించడానికి కథ చెప్పడం ఓ చక్కని మార్గం. ఆయన మరొక మాట కూడా చెప్పారు’’ మీ పిల్లలు తెలివైనవాళ్లుగా ఎదగాలను కుంటే వాళ్లకు మంచి కాల్పనిక కథలను చదివి వినిపించండి అని. కాల్పనిక కథలకు ఉండే గొప్పతనం అటువంటిది. అనగా అనగా అనగానే పిల్లలు ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోతారు కథలోని పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. దృశ్యాన్ని చూస్తే అనుభూతి లభిస్తుంది కానీ ఆలోచించే అవసరం ఎక్కువ ఉండదు. అయితే కథ చెప్పడం, చదవడం, వినడం వల్ల పిల్లల్లో కాల్పనిక జగత్తు విస్తృతవౌతుంది. సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. కథ వింటూ ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దానివల్ల ఆలోచనా పరిధి పెరుగుతుంది. ప్రశ్నించే తత్వంతో పాటు సమస్యలను పరిష్కరించే సామర్ధ్యం పెరుగుతుంది. అన్నిటికీ మించి వివిధ పదాలను పరిచయంచేస్తూ భాషా సంపత్తిని పెంచడానికి కథలు దోహదపడతాయి.
పిల్లల్లో కల్పనాశక్తి అధికంగా ఉంటుంది. వాళ్లు చిత్రవిచిత్రంగా ఊహించగలరు. ఆ ఊహలకు ప్రాణం పోయగలిగితే ఆ కల్పనాశక్తి బయటకు లాగగలిగితే వాళ్ళు కవులుగా, కళాకారులుగా, భావకులుగా తయారుకాగలరు. మానవత కలిగిన మంచి మనుషులుగా రూపు దిద్దుకుంటారు. సరియైన సూచన కాని ఆధారంకాని లేకుండా వారి కల్పనకు ఊపిరిపోయలేము. కొన్ని ఆధారాలు ఇచ్చి కథలు అల్లమనాలి. ఈ కథలు మనం అనుకున్న విధంగా ఉండాలని భావించకూడదు
వారికి ఇష్టమైన రీతిలో ఊహించనివ్వాలి. వాటిని భాషా నైపుణ్యపు అభ్యసనాలుగా మార్చగూడదు.
మాస్టారూ మేం పిల్లలం పువ్వుల్లాంటిపిల్లలం, పిట్టల్లాంటి పిల్లలం, మమ్మల్ని పువ్వులానే చూడండి గుభాళిస్తూ వికసిస్తాం. పిట్టల్లానే ప్రేమించండి రెక్కలువిప్పి దూసుకెళతాం మమ్మల్ని భయపెట్టకండి ఆలోచించనివ్వండి ఆకాశపుటంచులు చూస్తాం. మాకు స్వేచ్ఛనివ్వండి పురివిప్పి రంగులజల్లు కురిపిస్తాం. మమ్మల్ని ఆడుకోనివ్వండి ఆటల్లోనే పాఠాలు నేర్చుకుంటాం. పాడుకోనివ్వండి పాటల్లోనే ప్రపంచాన్ని తెలుసుకుంటాం అంటోంది పిల్లల అంతరంగం.
అందుకే ఉపాధ్యాయులైనా తల్లిదండ్రులైనా వారికి తగిన స్వేచ్ఛనిచ్చి భయంలేకుండా మాట్లాడనివ్వాలి. కథలవల్ల పఠనాసక్తి పెరుగుతుంది. వ్యక్తిత్వ నిర్మాణం జరగాలంటే కాల్పనిక కథలు తప్పనిసరిగా చదివించాలి. అందుకే బాలసాహిత్యంలో కాల్పనిక కథలకే పట్టం కట్టడం జరిగింది. అందులోనూ పేదరాసిపెద్దమ్మ కథలన్నా, పంచతంత్ర కథలన్నా, భేతాళ కథలన్నా పిల్లలు చెవికోసుకుంటారు. రాకుమారులు మాంత్రికుల కథల్లో చాలాసార్లు పేదరాసి పెద్దమ్మ కనిపిస్తుంది. మంచి వాళ్లందరికీ తలలో నాలుకలా ఉండే ఆమెకి తెలియని విషయమే ఉండదు. తన దగ్గరికి వచ్చేవారికి తగిన సలహాలనిస్తూ సమస్యలనుంచి గట్టెక్కిస్తుంది. ఇలాంటి కథలు చదవడం, వినడం వల్ల పరోపకారబుద్ధి సమస్యా పరిష్కారం పిల్లల్లో అలవడతాయి. పిల్లల్ని ఊహాలోకాల్లో విహరింపచేసే కథల్లో ముఖ్యమైనవి జానపద కథలు. ఇవి చదవడం వల్ల రాజుల సాహసాలు, విశాల హృదయం, ముందుచూపు, మంత్రుల బుద్ధికుశలత, విదూషకుల హాస్యచతురత వంటివి జానపద కథల్లో చదివి పిల్లలు ఉత్తేజితులౌతారు.
రోజువారీ దినచర్యలో విసుగెత్తిపోయినపుడు ఊహాశక్తి మందగిస్తుంది సరిగ్గా అలాంటప్పుడే రెక్కలు కట్టుకుని ఎక్కడికైనా ఎగిరిపోవాలనిపిస్తుంది. ఆ సమయంలో కాల్పనిక కథ చదివినట్లయితే అకస్మాత్తుగా ఏ పిల్ల పిశాచమో ప్రత్యక్షమై అడవిలోకి తీసుకెళ్లి మర్రిచెట్టు తొర్రలోని రత్న రాశులని చూపించవచ్చు. కోరిన చోటికి చిటికెలో చేర్చే పావుకోళ్లు సొంతం కావచ్చు. రెక్కల గుర్రాలు, పుష్పకవిమానాలు, పరకాయప్రవేశాలు ఇంకా అనేకానేక అలౌకిక అనుభూతుల్ని కలుగజేసే సమ్మోహనాశక్తి కాల్పనిక కథలకుంది.
‘‘చీమలచేత, పక్షులచేత మాట్లాడించడంలోనే గొప్పతనముంది’’ అంటారు గోల్డ్‌స్మిత్ అనే రచయిత. పిల్లలు సాధారణంగా జానపద కథలు ఇష్టపడతారు. జానపదకథలన్నీ అద్భుతరసాన్ని కలిగి ఉంటాయి. ఈ కథలు పిల్లల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకుని పోతాయి. వాళ్ళల్లో ఊహాశక్తిని పెంపొందింపచేస్తాయి అందువల్ల పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. మామూలుగా కనిపించనటువంటి ఆకాశంలో ఎగిరే చాప, మంత్రదండం, నీళ్లను మంత్రించి జల్లితే మనిషి జంతువుగా మారడం లాంటివి పిల్లలకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. భేతాళ కథలని కూడా పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఈ కథల్లోని భేతాళుని ప్రశ్నలకు రకరకాల సమాధానాలు ఊహిస్తారు పిల్లలు. పిల్లల ఊహలకందని విధంగా జవాబు చెప్తాడు విక్రమార్కుడు. అదే పిల్లలకి ఆసక్తిని కలిగిస్తుంది. ఈ కథల్లో తార్కికభావన ధర్మసందేశం మొదలగునవి ఉంటాయి. ఈ రకమైన కాల్పనిక కథలు పిల్లల మనసులమీద చెరగని ముద్రవేస్తాయి. అదే విధంగా వారి వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతగానో దోహదపడతాయి. చదువులో రాణించినా రాణించకపోయినా ఈ బాలసాహిత్యం చదివినవారు మాత్రం గొప్ప వ్యక్తులుగా తయారు అవుతారు. పిల్లల మనోవికాసానికి, ఆనందానుభూతికి, కలలను సాకారం చేసుకోవడానికి కాల్పనిక కథలు ఎంతగానో దోహదపడ తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకే కాల్పనిక కథలకు బాలసాహిత్యంలో ప్రత్యేకమైన స్థానముంది.

- కాశీవిశ్వనాథం పట్రాయుడు, 9494524445