సబ్ ఫీచర్
పొత్తూరివారి విశిష్ట వ్యక్తిత్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శ్రీపొత్తూరి వెంకటేశ్వరరావుగారితో ఒక అర్థ శతాబ్దికి పైగా నాకు ఆత్మీయ పరిచయమే కాక సాన్నిహిత్యం కూడా ఉన్నది. బహుశా వారు నాకంటే రెండు లేదా మూడు సంవత్సరాలు మాత్రమే వయసులో పెద్ద అయి ఉండవచ్చు. కాని తత్త్వచింతనలోనూ, ఆధ్యాత్మిక గవేషణలోనూ పదింతలు పెద్ద అనుకోవటం సమంజసం. ఆయన నిండుకుండ. తొణకినట్లు నాకనిపించలేదు ఎప్పుడూ. ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి భంగం కలిగించే లౌక్యం ఎప్పుడూ ఆయన జీవిత నిఘంటువులో చేరలేదు. చేరలేదు కూడాను. అలౌకిక లౌకిక ప్రవృత్తి అన్నమాట.
వంశ వారసత్వం, కుటుంబ చారిత్రక నేపథ్యం, ఆయనను హుందాగా, ఎబ్బెట్టు ఏమాత్రం అనిపించని రాజసంతో, అవసరం లేనంత వినయంగా అభేద్యంతో విలక్షణ వ్యక్తిగా పత్రికా రంగంలోనూ, స్నేహపరిధిలోనూ, నలుగురినీ కలుపుకొనిపోగల పెద్దమనిషితనం, పెద్ద మనసుధనం ఆయన కడదాకా ఆయన నిలుపుకున్నారు. మత హిత భాషణమే వారివద్ద ఎప్పుడూ సువాసించేది. ఒకవేళ ఎవరిగూర్చి అయినా పరియాచకంగా ప్రస్తావించవలసి వచ్చినా, మృదువుగానే ఆ ప్రసక్తి ఉండేది కాని, కరుకుగా, కటువుగా ఏమాత్రం ధ్వనించేది కాదు.
సత్యం బ్రూయాత్, ప్రియంబ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియంగానే వారి వృత్తి జీవితం సువాసించింది అంటే ఎప్పుడూ వారు అప్రియం చెప్పలేదని కాదు. తన మనోగతం దృఢంగా చెప్పలేదనీ కాదు. కాని ఒక హుందాతనం, మర్యాద సమర్థుడైన వైద్యుడు రోగ నిదానం చేయటంలోని కౌశలానే్న ఆయన ఎక్కువ ఇష్టపడేవారు. ఆయన పెద్దమనిషి తనానికి ఏనాడూ లోటు రానివ్వలేదు. ఆయన చూసినంత వినయం ఆయన స్థాయికి అస్థానపతి తామే అయినా సౌజన్యాన్ని మేర మీరలేదు వెంకటేశ్వరరావుగారు.
బాగా దగ్గరివారి దగ్గర, స్వశాఖ వారైన మిక్కిలి సన్నిహితుల దగ్గరా సిక్సుథౌజండ్ (ఆరువేల) ప్రసక్తితెచ్చి అప్పుడప్పుడు ఆహ్లాదపరుస్తుండేవారు. స్వీన్నత్యం చెప్పుకోవటం ఏవాత్రం తప్పుకాదు. తన వారిని మెచ్చుకోవటానికి సంకోచపడని బోళాతనమే దీని జీవధాతువు. సర్వం సమాజ వర్ణాల వారిని కావలసినంతమేర మెచ్చుకోవటంలో తన ఆత్మశాఖ ప్రత్యయం ఏనాడూ అవరోధం కాలేదు.
శ్రీ పొత్తూరి వారు స్వీయచరిత్ర (ఆత్మకథ) ప్రచురించి తన తరువాతి పత్రికా వృత్తి జీవికను సాగించే వారికీ, పత్రికలకు, సమాజ హితానికీ, సాహిత్యానికీ పరస్పర ఆధారాధేయత, సత్ప్రమాణాలు పాటించటంలో ఉపదేశకులైనారు. తెలుగులో ఇప్పటికి ఇంచుమించు నాలుగువందలు (స్వీయ చరిత్రలు), ఆత్మకథలు, అనుభవాలూ, జ్ఞాపకాలూ వెలువడ్డాయి. కాని శ్రీ పొత్తూరి వారి స్వీయ చరిత్రలోని ఆస్తికతా ఆశ్రయత్వం తక్కిన ఈ వర్గానికి చెందిన రచనలలో మృగ్యం. పొత్తూరి వారి స్వీయ చరిత్ర ఆవిష్కరణం పొ.శ్రీ.విశ్వవిద్యాలయం సభా సమావేశ మందిరంలో నాలుగేళ్ళ కిందట జరిగింది. అప్పటి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ పొత్తూరి వారి పత్రికా సంపాదకత్వం ఆభిజాత్యాన్ని సోదాహరణంగా శ్లాఘించారు. నేనాసభలో ఉన్నాను కాబట్టి, తరువాత పొత్తూరివారు స్వీయచరిత్ర నాకు ప్రేమతో బహూకరించారు. కాబట్టే నాకు ఆ రచన విశిష్టత గ్రహించగల అవకాశం లభించింది. సీనియర్ పాత్రికేయులు శ్రీ కె.శ్రీరామచంద్రమూర్తి, శ్రీ జి.ఎస్.వరదాచార్యులు, శ్రీ కల్లూరి భాస్కరం ప్రభృతులు ఈ ఆవిష్కరణ సభలో ప్రసంగించినట్లు నా జ్ఞాపకం. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ కూడా చాలాబాగా మెచ్చుకున్నారు. ‘విధి నా సారథి’ని పరమపూజ్యులు, పరివ్రాజకాచార్యవర్యులు కుర్తాలం పీఠ శ్రీ సిద్ధేంద్ర సరస్వతీ స్వామివారు (పూర్వాశ్రమంలో శ్రీ ప్రసాదరాయ కులపతి) శ్రీ వెంకటేశ్వరరావుగారు చిన్ననాటి పాఠశాల, కళాశాల సహాధ్యాయులు. శ్రీ స్వామివారు పరివ్రజించిన పిమ్మట శ్రీ పొత్తూరివారు సుమారు రెండు దశాబ్దాలపాటు సిద్ధేశ్వర పీఠ ధర్మాధికారిగా కుర్తాలం తరచు రాకపోకలు సాగించారు. ఎన్నోసార్లు తనతో నన్ను (రమాపతిరావును) తన వెంట తీసుకుని వెళ్ళే చనువూ ఉత్సాహం చూపారు కాని, ప్రాప్తి లేక వారి సాదర వాత్సల్యాన్ని నేను వినియోగించుకోలేకపోయినాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయ సామాజిక సాంస్కృతిక అతిరథ మహారథులలో వారైన శ్రీ వల్లూరి బసవరాజుగారు శ్రీ పొత్తూరివారికి స్వయంగా బావగారు. బహుశా బసవరాజుగారి ప్రాపకంలో తమ భవిష్యత్తు దిద్దితీర్చుకుందామనే పొత్తూరి వారు హైదరాబాదు చేరి ఉంటారు. తరువాత ఆయన పాత్రికేయ వృత్తిలో అనుభవ పరిణితులైనారు. చాలాకాలం వెంకటేశ్వరరావుగారు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంనుంచి ప్రాంతీయ వార్తలు చదివారు. ఆయన కంఠం స్వరం ఇంపుగా సొంపుగా విశద మనోజ్ఞంగా ఉండేది.
అప్పట్లో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలు మాత్రమే బాగా ప్రాచుర్యంగల దినపత్రికలు. అనంతర కాలంలో పెద్ద పెట్టుబడులతో కొత్త పత్రికలు వచ్చాయి. అయినా ఆంధ్రప్రభ (దైనిక, వారపత్రికల) ప్రాచుర్యం, ప్రామాణికతలకు భంగం వాటిల్లలేదు. కేవలం తాను నెర నమ్మిన పత్రికా విలువలనే పాటించారు కాని ‘ఏ పత్రికలో పనిచేసినా రాజీ పద్ధతి ఎంచుకోలేదు. ఎప్పుడూ రాజీనామా పత్రం ఆయన జేబులో ఉంచుకునే వారేమో!
ఆంధ్రప్రభ యాజమాన్యం సతతం వారి పట్ల ఆదర గౌరవ అభిమానాలనే పాటించింది. ఆంధ్రప్రభ వార పత్రిక సంపాదకత్వం తాను అంగీకరించటానికి ప్రధానంగా శ్రీ పోరంకి దక్షిణామూర్తి, నేను అనే రమాపతిరావుల ప్రోద్బలం, ప్రోత్సహం, విశ్వసనీయతలు తనకు చేయూతనిచ్చాయని శ్రీ వెంకటేశ్వరరావు ఆ ప్రసక్తి ఏదో విధంగా తెచ్చి ప్రస్తావిస్తూ ఉండేవారు. ముఖ్యంగా గోరాశాస్ర్తీ ఒప్పుకొని తీరవలసిందేనని తనను నిర్బంధించినంతగా ఒత్తిడి తెచ్చారని చెపుతుండేవారు. వారపత్రిక సంపాదకత్వ నిర్వహణలో జ్ఞాన పరిధి ఎంతగా విస్తరిస్తుందనీ, సాహిత్య పరిజ్ఞానం లోక కావ్యాద్యవేక్షణకు ఎంతో ఆలంబనమవుతుందని గోరాశాస్ర్తీ తనకు ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు అని ఆ ప్రసక్తి తానే తెచ్చినప్పుడల్లా ఆయన చెపుతుండేవారు.
1980లలో మా (అంటే అక్కిరాజుతో) సాన్నిహిత్యం మరింత బలపడింది. ఇంచుమించుగా రెండుమూడు రోజులకొకసారి అయినా ఉదయం (సుప్రభాత వేళ) వారినుంచి నాకు ఫోన్ తప్పక అందేది. ఆరోజు తాను రాస్తున్న సంపాదకీయం గూర్చి అనివార్యంగా ప్రస్తావించేవారు.
ఆంధ్రప్రభ వారపత్రికలో ఎన్నో శీర్షికలు నేను నిర్వహించాను. సుగృహీత నామధేయులు శ్రీ మాస్తి వేంకటేశయ్యంగారికి జ్ఞానపీఠ పురస్కారం ప్రదత్తమైనాడు వెంకటేశ్వరరావు సంపాదకీయం రాశారు. ‘ముఖాముఖి’ పేరిట ఆంధ్రప్రభ దినపత్రిక ఒకనియత శీర్షిక కొంతకాలం నిర్వహించింది. కళాసాహిత్య సామాజిక మహాప్రతిభుల సన్నిధిగోష్ఠి పాఠకుల తెలపటం ఈ శీర్షిక మహితాశయం. ఈ శీర్షిక తరఫున నేను 20 మంది దాకా గొప్ప వ్యక్తుల గూర్చి రాశాను. అవకాశముంటే స్థానికంగా ఉన్న మహాదేశికుల దగ్గరకు నాతోపాటు వారూ ఉండేవారు. నాంపల్లి రైల్వేస్టేషన్లో రైలుప్రయాణం చేస్తున్న తుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారిని, నీలంరాజు వెంకట శేషయ్యగారిని మేమిట్లా కలుసుకున్న జ్ఞాపకం. 1980 ద్వితీయ దశకంలో కర్నూలు కంచి కామకోటి మహాస్వాములు ముగ్గురూ చాతుర్మాస్యం ఏకకాలంలో పాటించినప్పుడు (మూడో ఆయన అప్పుడప్పుడే దీక్షా విధి స్వీకరించారు) మేము హైదరాబాదునుంచి కారులో కర్నూలు ప్రయాణం చేశాము. అప్పుడు చాలా అనుగ్రహ సంఘటనలకు పాత్రులమైనాము. అప్పటి జాగృతివారపత్రిక సంపాదకులు శ్రీ పి.వేణుగోపాలరెడ్డి, ఇంకొక పాత్రికేయులు కూడా మాతో ఉన్నారు. మహాస్వామికి తెలుగు దినపత్రికల చరిత్ర పూర్వాపరాలు హస్తామలకమై ఉండటం మమ్ముల్నెంతో ఆశ్చర్యపరిచింది. విశ్రాంతికోసం లోపలకు వెళ్ళి, ఇక ఆరోజు ఎవరికీ దర్శనం లభించదని మఠ నిర్వాహకులు మమ్మల్ని నిరాశపరిచిన మరుక్షణం మహాస్వామి ఇతరులకు వచ్చి మమ్మల్ని అనుగ్రహించి ఒక గంటసేపు మాట్లాడారు. ఇది కర్నూలు శివారు ప్రాంతమైన కాశీబుగ్గలో జరిగిన సన్నివేశం.
ప్రభావశీలమైన వయసునుంచీ ఆర్ఎస్ఎస్, బిజెపి సామాజిక దర్శనాలతో మమేకమై, కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరానందస్వామి ఆంతరంగిక మిత్రులైన వెంకటేశ్వరరావు నక్సలైట్ల ప్రభుత్వ రాయబారంలో మధ్యవర్తులు (అందులో ప్రముఖులు)కావటం వైపరీత్యమే. బహుశా పగయడగించుటెంతయుశుభంబని’ వారి అభ్యూహ అయి ఉండవచ్చు. ప్రభుత్వమూ, అరణ్యానీక విప్లవ నివాస ప్రతినిధులను ఒక వేదికపై సంధానించారు వెంకటేశ్వరరావు.
శ్రీ పొత్తూరి సాహిత్య ఆధ్యాత్మిక వాఙ్మయంలో కూడా విలక్షణ రచనలు తెలుగు వారికిచ్చారు. వేదాంత పరిభాషా నిఘంటువు అపురూపమైనది. వేరే పత్రికలో చేకూరి రామారావు రాస్తున్న ‘చేరాతల’కు దీటుగా బాలాంద్రపు రజనీకాంతరావ, జి.కృష్ణ వంటి దిగ్గంతులతో సమాంతర శీర్షికలు నిర్వహింపచేశారు. కేంద్ర సాహిత్య అకాడమివారు వెంటనే పొత్తూరివారి సంక్షిప్త జీవిత చరిత్ర సంధానించే పూనిక వహించాలి. ప్రముఖ పాత్రికేయుల గూర్చి ఇటువంటి పుస్తకాల ప్రణాళిక వుంది. ఇందుకు పొత్తూరి మేనకోడలు శ్రీ దేవిమురళీధర్ సమర్థురాలే కాక అన్ని విధాలా సమర్హురాలు.
శ్రీ వెంకటేశ్వరరావు జిల్లేళ్ళమూడి అమ్మకు సర్వేసర్వాత్మనా శరణాగత అంకిత ప్రవృత్తికల వారు. ఆమె హైదరాబాదు వచ్చినప్పుడు వీరింటనే బసచేసేదనుకుంటాను.
ఇక పొత్తూరివారి ఆతిధ్య అనురాగ సంపద కడుదొడ్డది. ఆయన ఇల్లాలు (శ్రీమతి సత్యవాణిగారు) అల్లసాని పెద్దనగారి ‘పండనలయడువేవురు వచ్చిరేని. అనురాగ ప్రపూర్ణ స్మితపూర్వాభిభాషణ ఉదాత్త వ్యక్తిత్వ శోభితురాలు. పొత్తూరివారు కూడా ప్రవరాఖ్యులేకదా! (గొప్పపేరు, వరిష్ఠమైన గుర్తింపుఉన్నవారు కాబట్టి ఆయన కుటుంబ జీవితం పరమశోభస్కరంగా భాసించింది.
వారి సంతానంలో ఒక తల్లి ఆయన వారసత్వం కూడా నిలబెట్టింది.
ఇటీవల ఆయన శ్రీ చంద్రబాబునాయుడికి వెంకటాద్రినాయుడు జీవిత చరిత్ర అంకితం చేశారు. ఇంక ఆయన జీవిత ప్రముఖ ఘట్టాలు స్వీయ చరిత్ర ద్వారా ఆసక్తులు తెలుసుకోవాలి.