సబ్ ఫీచర్

తెలంగాణలో కంచగట్టే కాంతలు, కాంతయ్యలు కోకొల్లలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ నలుచెరగులా ప్రజల నాలుకలపై సొగసైన పదబంధాలు, సాహిత్య స్పర్శగల వాక్యాలు నర్తనమాడుతాయి. విద్య లేకపోయినా, ప్రపంచాన్ని అధ్యయనం చేయకపోయినా తనకున్న ఇంగిత జ్ఞానం, వినికిడి జ్ఞానంతో తమ బుద్ధికి పదునుపెట్టి పదాలను అల్లడంలో ఆరితేరిన వారు. ఒగ్గుకథను బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చిన చుక్క సత్తయ్య ఇటీవల మరణించారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. భాషా పరిజ్ఞానం లేదు, ప్రబంధాలు తెలియవు, సాహిత్య లక్షణాలు తెలియవు. కాని ఆయన పలికిన ప్రతి పదం ఓ సాహిత్య గుబాళింపు. ప్రతి వాక్యం అనన్య సామాన్యమైన కవితా పరిమళం, ఆయన మాటల ప్రవాహం గోదావరి, కృష్ణానదుల ఝరి.
వాడుక భాషలో ఎంత సౌందర్యముందో, ఎన్ని అద్భుత పద బంధాలున్నాయో, ఎంత సొగసైన పోలికలున్నాయో ఆయన, ఆయన మిద్దె రాములు లాంటి అనేకమంది జానపదుల మాటలు పాటలు వింటే తెలుస్తుంది.
ఈ విలక్షణ అద్భుత అమలిన వౌఖిక సాహిత్యానికి పట్టం కట్టాలా?... వద్దా?... అని విశ్వవిద్యాలయాల లాక్షణికులు ఇప్పటికీ తేల్చుకోలేక పోతున్నారు. తర్జన భర్జన పడుతున్నారు. తలపై పెట్టుకున్నట్టు నటిస్తూనే ఆ సౌందర్యాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించలేక పోతున్నారు. వెలివేసినట్టుగానే చూస్తున్నారు. అయినా నిత్యం ఊరే ఆ ‘జల’కు నష్టం లేదు. కష్టం అంతకన్నా లేదు. కాపాడుకుంటేనే తేనెలూరే ఆ తియ్యందనాలు తరతరాలుంటాయి లేదా లుప్తమవుతాయి. లుప్తమవడంవల్ల ఆ జనపదులకు గాని, చుక్కా సత్తయ్య లాంటి వారికి గాని ఇసుమంత నష్టం లేదు. నష్టపోతే... గీతే... తెలుగు భాషనే, తెలుగు సమాజమే!
ఈ సోయి బిరుదురాజు రామరాజు కాలంనుంచి కొనసాగుతోంది. అందుకే ఆయన కాలుకు బలపం కట్టుకుని అనేక జానపద పాటలు, పదాలు, జానపద వీరగాథలు, పౌరాణిక గాథలు సేకరించి అక్షరీకరించి ఒక గొప్ప పద భాండాగారాన్ని ముందుతరాలకు అందించారు.
ఆయనను ఆదర్శంగా తీసుకున్నా ఇప్పటివరకు తెలంగాణలో బండ్లకొద్ది ప్రజాసాహిత్యం, పలుకుబళ్ళ రాశులు పోగయ్యేవి. ప్రతి జనపదుని గొంతు ఒక ప్రత్యేక భాషా తియ్యందనాల ఊట. వాళ్ళు తిట్టినా, కోపించినా, విసుగొందినా, ప్రేమ కనబరిచినా, లాలించినా కల్తీలేని వౌఖిక సాహిత్యం పద పోహళింపు, మాటల ఝరి జరీ అంచులా తొంగి చూస్తుంది. వ్యవసాయం, కుల వృత్తులతో జీవనం సాగించే జనపదుల్లోనేగాక సంచార జీవితం గడిపే వృత్తికళాకారుల, ఉపకులాల అసామాన్య సాహిత్య తరంగాలు అనేకం కనిపిస్తాయి. ఇప్పటికీ ఈ ఉప కులాల, సంచార తెగల వద్ద అమలిన సాహిత్యధార తేటగానే ఉంది. కొందరు దాన్ని వంశపారంపర్యంగా కొనసాగిస్తున్నారు. ఆ భాషా రసరమ్యతను, బిగువును, పోహళింపును, చమత్కారాన్ని, సొగసును అంతే తాజాగా నిలుపుతున్నారు. అలాంటి వారికి నిజానికి తెలుగు సమాజం రుణపడి ఉంది. ఎలాంటి ప్రయోజనాన్ని, ఏ రకమైన లబ్ధికోరకుండా వారు తమ పెద్దల వారసత్వాన్ని కాపాడుకోవాలన్న తపనతో వారు ఆ నిరంతర ఝరిని సజీవంగా ఉంచుతున్నారు. కొందరు దానికి మెరుగులు అద్దుతున్నారు. ఇది కదా మనకు కావలసింది!
ఈ సహజ వ్యక్తీకరణ సాహిత్యానికి, పద సంపదకు, వాక్యరత్నాలకు, రసాత్మకతకు, రమ్యతకు, నిర్మాణానికి నిర్ఘాంతపోతూనే దాన్ని తాత్కాలిక వినోద ప్రక్రియగానే పరిగణించడం కారణంగా జరగవలసిన నష్టం జరిగిపోయింది. హేమాహేమీలనదగ్గ జానపద కళాకారుల, ఊహాకారుల నిష్టాగరిష్టులను క్రమంగా కోల్పోతున్నాం. సంచార తెగల్లో అసంఖ్యాక కళాకారులు తమ పద సంపదను, తమ తెగకు సంబంధించిన ప్రత్యేక పదాలు వారితోపాటే సమాధి అవుతున్నాయి. కాలం నిరంకుశత్వం కారణంగా ఆ వారసత్వాన్ని అంత ప్రతిభావంతంగా కొనసాగించలేని తరాలు తెరమీదకొస్తున్నాయి. దాంతో ఆ అమూల్య వౌఖిక సాహిత్య సంపద కానరాకుండా పోతోంది.
శిష్ట వ్యవహారికుల సృజన, అలంకారాలు, రసజ్ఞతతో పోటీపడదగ్గ రీతిలో సమాంతర సాహిత్యం జలలా కొనసాగింది. కాని దాన్ని సరైన వెలుగులో భద్రపరిచి విస్తృతపరచలేకపోయాం. దానికి అందరూ బాధ్యులే! అందరం దోషులమే! భాషా బాధ్యతను విస్మరించి విర్రవీగిన వారమే! అందులో ఎవరికీ మినహాయింపు లేదు.
ఈ ఎరుక కలిగిన తరువాతనైనా తప్పు సరిదిద్దుకోగలిగితే కొంత వౌఖిక సాహిత్యాన్ని కాపాడుకునే వీలుంది. పూర్తిగా ద్వారాలు మూసుకుపోలేదు. ఇంకా కొన్ని మార్గాలు కనిపిస్తున్నాయి. దారులున్నాయి. వాటిని పసిగట్టి పనిచేయడమే జరగాలి!
బిరుదురాజు రామరాజు, ఈతరంలో జయధీర్ తిరుమలరావు, వుప్పలలా అంకితభావంతో కృషిచేసేవాళ్లు ఇప్పటికైనా ముందుకొస్తారని ఆశిద్దాం. వారి వారి అభిరుచికి తగ్గ కోణంలోనైనా వౌఖిక సాహిత్య మార్దవాన్ని ముందుతరాలకు పట్టి చూపుదాం.

- వుప్పల నరసింహం, 9985781799