సబ్ ఫీచర్

చాన్నాళ్లకు వెలుగు చూసిన తెలంగాణ తొలి నవల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశాదోషం
రచయత : బరారు శ్రీనివాసశర్మ
పేజీలు: 178 వెల: రూ.100
ప్రతులకు:
శ్రీమతి హేరూర్ శోభా విజయకుమార్
3-4-468, రెడ్డి వుమెన్స్ కాలేజీ ఎదురుగా
బర్కత్‌పుర, హైదరాబాద్-2
9849084918
*
దాపు పది దశాబ్దాల క్రితం పాలమూరు జిల్లా కోయిలకొండ వాస్తవ్యులు బరారు శ్రీనివాసశర్మ గారు ‘ఆశాదోషం’ పేరుతో ఓ నవల రాసి... కోయిలకొండ చరిత్రను అందులో పొందుపరిచారు. తెలంగాణ తొలి నవలగా భావింపబడుతున్న ఈ గ్రంథం చాన్నాళ్లకు వెలుగులోకి వచ్చింది.. సరళమైన గ్రాంథికంలో రూపుదిద్దుకున్న ఈ నవలలో.. సుమారు వంద ఏళ్ల క్రితం ఆనాటి పాలకులు పరిపాలించిన తీరుతెన్నులు.. ఆనాడు పండుగలు, ఉత్సవాలు, పెళ్లిళ్లు ఎలా నిర్వహించేవారో.. ఈ నవల ద్వారా తెలుసుకోవచ్చు! 1913 ప్రాంతంలో బరారు శ్రీనివాసశర్మ రచించిన ఈ గ్రంథం అబద్ధమని భావిస్తున్న నేపథ్యంలో... డా.్భంపల్లి శ్రీకాంత్ సంపాదకత్వంలో పాలమూరు సాహితి వారు ప్రచురించి.. అందరికీ అందుబాటులోకి తేవడం అభినందనీయం! ఈ గ్రంథ రూపకల్పనలో.. నాగలింగ శివయోగి సేకరించిన సమాచారం ఎంతగానో ఉపయోగపడిందని తెలుస్తోంది.. శ్రీమతి హేరూర్ శోభా విజయకుమార్ దంపతులు ఈ గ్రంథ ముద్రణలో భాగస్వాములై.. మరుగున పడ్డ తెలంగాణ తొలి నవలగా చెప్పబడే.. ‘ఆశాదోషము’ పుస్తకాన్ని భావితరాలకు అందించ యత్నించడం ప్రశంసనీయం! తెలంగాణ ఆణిముత్యంగా పేరొందిన బరారు శ్రీనివాసశర్మ గారి మనుమడు బరారు విజయ్‌కుమార్ కృషితో, పాలమూరు సాహితి చొరవతో వెలుగు చూసిన ఈ నవల తెలంగాణ అస్తిత్వాన్ని చాటేలా ముస్తాబై రావడం ముదావహం!
కోయిలకొండ చరిత్రను ప్రతిబింబించేలా.. ఇందులోని పాత్రలు - సన్నివేశాలు, సంఘటనలను అందంగా ఆవిష్కరించడంలో రచయిత ప్రతిభ కానవస్తోంది.
ఈ నవల మొదటి ప్రకరణములో.. బాటసారికి పొలము ప్రక్కనే.. రాత్రికి బస ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకునేలా కాపువాడు ఆతిథ్యమివ్వడం.. బాటసారిని చూసి పడుచుపిల్ల భయపడిన ఘటనలు.. ఆసక్తికరంగా మలచబడ్డాయి. రెండో ప్రకరణములో - హిందువులు, ముస్లింలు సమానమేనన్న అంశం చక్కగా ప్రస్తావించబడింది. శ్రీరామచంద్రుల వారు సీతాలక్ష్మణ సమేతంగా సంచరించిన పర్వతమైన రామగిరి సమాచారాన్ని అందులో పొందుపరిచిన తీరు బాగుంది. మూడో ప్రకరణములో - సీత, చంపక సంభాషణలను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నాల్గవ ప్రకరణంలో - కోయిలకొండ దుర్గం యొక్క విశేషాలున్నాయి!
దుర్గం మహాద్వారం ముందర వున్న తటాకం.. చిత్రవిచిత్రమగు దుర్గం యొక్క కట్టడాలను చక్కగా దృశ్యమానం చేశారు. ఆనాటి ఫలవృక్షాలను.. తోటయందున్న గచ్చుమేడను.. వనపాలకుల గృహాలు, అంగడిలో జరిగే వ్యాపార వ్యవహారాలు.. వెలమ నాయకులు ఉండే వీధిలో గల సౌధాలను, గ్రామాధికారుల ఇళ్లను, సర్దారుల మేడలను, ఏనుగు శాలలను, తురగ శాలలను, వ్యాయామ శాలలను ఈ ప్రకరణంలో చక్కగా చిత్రించారు. వెలమ వీధిలో ఒక సౌధంపై ఏకాంత ప్రదేశంలో ఇద్దరు పురుషులు చింతాక్రాంతులై.. మాట్లాడుకున్న ముచ్చట్లను చక్కగా అక్షరబద్ధం చేశారు.
ఐదవ ప్రకరణంలో ‘కామజ్వరం’ శీర్షికన పొందుపరిచిన సమాచారం ఆసక్తికరంగా ఉంది. బలవంతరావు, కళ్యాణరావుల మధ్య జరిగే సంభాషణలు బాగున్నాయి!
ఆరవ ప్రకరణంలో.. ‘వలీదర్శనం’ శీర్షికన హిందూ తురకలు అన్న భేదం లేదనీ.. అందలి పరమాత్ముడు ఒక్కడేనన్న చక్కని సందేశాన్ని అందజేశారు. వలీ పాత్ర ఉన్నతంగా చిత్రించబడింది. ఏడవ ప్రకరణంలో.. రాజు - సన్యాసిల మధ్య న్యాయ విచారణ సంభాషణలు పొందుపరిచారు. ఎనిమిదవ ప్రకరణంలో గల కమల, చంపక, సీతల సరస సంభాషణలు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. తొమ్మిదో ప్రకరణంలో.. కోయిలకొండ ప్రజలు రాజభక్తి పరాయణులని తెలుసుకుంటాము.. మొగిలి రేకువల్ల వలీకి ఒనగూరిన ప్రయోజనాలను రేఖామాత్రంగా ప్రస్తావించారు. పదవ ప్రకరణంలో.. రంజాన్ అలీ శక్తి సామర్థ్యాలను ఆవిష్కరించారు. ఆనాడు సారాయి కోసం.. బట్టలు, నాణేలు, నగదు, ధాన్యాలు, శస్త్రాలు సారాయి దుకాణదారుని వద్ద కుదువపెట్టే అంశాలను ఈ ప్రకరణంలో ప్రస్తావించారు.
పదకొండవ ప్రకరణంలో... భోజనానంతరం విశే్వశ్వరరాయుడు, పురుషోత్తమ రాయుడు మల్లెశాల యందు విశ్రాంతి తీసుకుంటూ ముచ్చటించిన మాటలను అక్షరాల్లో చక్కగా బంధించారు. పనె్నండో ప్రకరణంలో.. తురాబల్ మురావలీకి ఆతిథ్యమిచ్చే సన్నివేశాలు బాగున్నాయి! పదమూడో ప్రకరణంలో.. కోయిలకొండ రాజ్యమును కాపాడుటకు బలవంతరాయుడే సరియైన యోధుడని బసవరాజు ప్రకటించే ఘట్టాలు బాగున్నాయి! తన కూతురు సీతను బలవంత రాయుడికిచ్చి వివాహం చేస్తానని బసవరాజు ప్రకటించే సన్నివేశాలు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి! బలవంత రాయున్ని ఈ ప్రకరణంలో.. మహాబుద్ధిశాలిగా.. రూపవంతునిగా.. గుణ సంపన్నుడిగా రచయిత మన ముందు నిలిపిన తీరు బాగుంది. పధ్నాలుగో ప్రకరణంలో.. దుర్గ ప్రాకారాన్ని కళ్యాణం కోసం.. రమణీయంగా అలంకరించిన సన్నివేశాలను అందంగా ఆవిష్కరించారు. ఈ ప్రకరణం ద్వారా ఆనాడు పెళ్లిళ్లలో ముఖ్యంగా కోట ద్వారాలను.. పరిసర ప్రాంతాలను ఎంత చక్కగా అలంకరించారో తెలుసుకోగలం! పదిహేనో ప్రకరణంలో.. కులీ కుతుబ్‌షాహీ రాయబారి పంపిన సందేశం సభలో వినిపించే దృశ్యాన్ని చక్కగా పొందుపరిచారు. పదహారో ప్రకరణంలో.. దండెత్తి వచ్చిన సైనికులను ఎదిరించి.. క్షణభంగురమగు శరీరమును మాన రక్షణకై తృణప్రాయంగా భావించి.. ప్రాణత్యాగం చేసిన నిండు గర్భిణి వృత్తాంతం అందరినీ కలచి వేస్తుంది. వృద్ధులు, పిల్లలు, అతివలు అన్న తారతమ్యం లేక దండుగా వచ్చిన సైనికుల ఆగడాలను కళ్లకు కట్టినట్లుగా ఈ ప్రకరణంలో దృశ్యమానం చేశాడు. పదిహేడో ప్రకరణంలో... కుతుబ్‌షాహీ సైనికులు కోయిలకొండ కోటను ముట్టడించడానికి చేసిన అరాచకాలను అక్షరీకరించారు. అయితే ఈ యుద్ధంలో తురకలను ఓడించి.. హిందువులకే విజయాన్ని చేకూర్చి.. అంతర్ దుర్గంపై విజయ పతాకాన్ని ఎగురవేసిన తీరుతెన్నులను ఈ ప్రకరణం ద్వారా తెలియజెప్పారు.
పద్దెనిమిదో ప్రకరణంలో.. శారద విరహ తాపాన్ని రమణీయంగా చిత్రించారు. కోయిలకొండ దుర్గంపైకి నవాబు వెంట వెళ్లే భర్త విశే్వశ్వర రాయుడు వెంబడి శారద వెళ్లే సన్నివేశం బాగుంది. పందొమ్మిదో ప్రకరణంలో ‘కుతుబ్ సముద్రము’ శీర్షికన రాసిన ఖండికలో.. నవాబు ఇరువది వేల సైనికులతో దుర్గంపైకి దాడికి వస్తున్నట్లు తెలిసిన నేపథ్యంలో బసవరాజు తాను ధైర్యంగా వుంటూ తన సైన్యం ధైర్యంగా పోరాడేందుకు సంసిద్ధులను చేసే ఘట్టాలు బాగున్నాయి. ప్రకరణం ఇరవైలో.. నవాబు దుర్గంపై దాడికి వచ్చిన సమయాన.. ఆనాడు యుద్ధంలో వినియోగించబడిన ఫిరంగులు, తుపాకులు తదితర ఆయుధ సామాగ్రిని వివరించారు. యుద్ధ సన్నివేశాలను ఈ ప్రకరణంలో చక్కగా పొందుపరిచారు. యుద్ధ సమయాన గ్రామస్థులు పడిన ఇక్కట్లు.. కష్టనష్టాలను ఇందులో చూడగలం! చివరకు కుతుబ్ షాహీ కోయలకొండ దుర్గాన్ని జయించలేక.. గోలకొండకు తిరిగి వెళ్లడం వంటి అంశాలు... కోయలకొండ పాలకుల ధైర్యసాహసాలు.. పరాక్రమాన్ని చాటేలా ఉన్నాయి. ఇలా ఈ నవల ద్వారా ఆనాటి పాలకుల పాలనా విధానాన్ని.. ఆనాటి ఆచార వ్యవహారాలను.. పండుగలు, వివాహాది ఉత్సవాల తీరుతెన్నులను చాటి చెప్పారు.
కోయలకొండ దుర్గం యొక్క ప్రాశస్త్యాన్ని ఈ నవల ద్వారా తెలుసుకోగలం. ఇందలి అనేక సన్నివేశాలు.. సంఘటనలు.. ఘట్టాలు.. సందర్భోచిత వర్ణనలు.. పాత్రలు, పాత్రల మధ్య సంభాషణలు పాఠకులు ఏకబిగిన చదువుకోవడానికి ఉపయోగపడతాయి! కోయలకొండ దుర్గ చరిత్రను ప్రతిబింబిస్తూ.. తెలంగాణ తొలి తెలుగు నవలగా వచ్చిన ఈ గ్రంథంలోని అంశాలు చారిత్రక పరిశోధకులకు కావలసినంత సమాచారాన్ని అందజేయగలదన్న విశ్వాసం ఉంది.

- దాస్యం సేనాధిపతి, 9440525544