సబ్ ఫీచర్

రోజంతా హుషారుగా వుండాలంటే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతివేగంగా ఉరుకులు పరుగుల బిజీ జీవితంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మనం రోజంతా హుషారుగా అన్ని పనులు సమర్థవంతంగా పూర్తిచేసుకోవాలనుకోవడం సమంజసమే..! కాని అలా హుషారుగా ముందుకు సాగాలంటే మనం శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండాలి. మత్తుగా నీరసంగా వుంటే ఏ పనీ ఆసక్తిగా సంపూర్తిగా చేయడం కుదరదు. రోజంతా హుషారుగా కొనసాగాలంటే దానికి తగిన మానసిక శారీరక శక్తి అవసరం. ఆ శక్తి పొందాలంటే నిద్ర లేచిన దగ్గరనుండి పడుకునే వరకు మనం కొన్ని నియమాలు పాటించాలి.
పొద్దున సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేవాలి. బారెడు పొద్దెక్కాక లేస్తే నిద్ర మత్తు ఎక్కువసేపు వుంటుంది. నిద్ర లేవగానే పరగడుపునే రెండు గ్లాసుల నీరు త్రాగాలి. దీనివలన రక్తంలోని మలినాలు శుభ్రపడతాయి. సుఖవిరేచనం అవుతుంది. దీనితో శరీరంలోని మలినాలు, అసంపూర్తిగా మిగిలిన ఆహార వ్యర్థ పదార్థాలు విసర్జింపబడి మనసు శరీరం హాయిని పొందుతుంది. చాలామంది ప్రొద్దునే్న బెడ్ కాఫీ, టీ త్రాగి సరిపెట్టుకుంటారు. అవి త్రాగే అలవాటున్నా అవే కాక మంచినీరు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి.
ఆ తరువాత కనీసం అరగంట వ్యాయామం చేయాలి. ఇది వాకింగ్ అయితే ఉదయానే్న సూర్యోదయానికి ముందుగా బయలుదేరి, ఉదయం వచ్చే లేత కిరణాలు తగిలేలా నడక సాగించాలి. మరీ పొద్దెక్కి నడక ఆరోగ్యానికి మంచిది కాదు.
చాలామంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బాగా టైమైనాక కొందరు తింటే, మరికొందరైతే బ్రేక్‌ఫాస్ట్ జోలికి అసలు వెళ్లరు. ఇంకొదరైతే కాఫీ, టీలు తాగి సరిపెట్టుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. రాత్రంతా ఎలాంటి ఆహారం వుండదు కాబట్టి శరీరానికి అవసరమైన శక్తికి బ్రేక్‌ఫాస్ట్ చాలా అవసరం. అయితే ఈ బ్రేక్‌ఫాస్ట్ భారీగా కాకుండా లైట్‌గా తీసుకోవాలి. నూనె దట్టించినవిగానీ, వేయించినవిగానీ బ్రేక్‌ఫాస్ట్‌లో మంచిది కాదు. ఇడ్లీ, దోశె లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. బ్రేక్‌పాస్ట్ తీసుకోవడంవలన శరీరానికి మధ్యాహ్నందాకా అవసరమైన శక్తి లభిస్తుంది.
మధ్యాహ్న భోజనం కాలాతీతం కాకుండా తీసుకోవాలి. వేళదాటిన భోజనం ఆరోగ్యానికి మంచిది కాదు. త్వరగా జీర్ణం కాదు. దీనితో అనీజీగా వుండి ప్రాణం హుషారుగా వుండదు. అంతేకాక ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం ఆరోగ్యకరం. కునుకుపడితే మనసు కాస్త కుదుటపడతది అని ఆత్రేయగారు అన్నట్లు అవకాశం ఉన్నట్లయితే మధ్యాహ్న భోజనానంతరం కొద్దిసేపు కునుకు తీస్తే మానసికంగా, శారీరకంగా రిలాక్స్ అయ్యే వీలుంది.
సాయంత్రం ఏదైనా స్నాక్స్ తీసుకోవాలి. పొద్దున్నుంచి శ్రమపడిన శరీరానికి సాయంత్రపు స్నాక్స్ తగిన శక్తిని ఇస్తాయి.
రాత్రి కూడా త్వరగా భోజనం ముగించాలి. పొద్దుపోయాక చేసే భోజనం ఆరోగ్యానికి మంచిదికాదు. అలాగే తిన్న తర్వాత చేసిన వెంటనే నిద్రకుపక్రమించకూడదు. కాస్త సమయం తీసుకొని నిద్రపోవాలి.
శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ఆహారం శారీరక శక్తినిస్తే నిద్ర మానసిక బలాన్ని పెంచుతుంది. నిద్ర శక్తిని రీచార్జ్ చేస్తుంది. సగటున రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్ర అవసరం. మితిమీరిన నిద్ర కూడా అనారోగ్యమే.
రోజువారీ జీవితంలో ఆహారం, నిద్ర వ్యాయామం సరైన రీతిలో క్రమం తప్పక పాటించడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని జయించడం ద్వారా రోజంతా హుషారుగా హాయిగా ఉండగలరు.

- కైపు ఆదిశేషారెడ్డి