సబ్ ఫీచర్
ఆత్మీయ హస్తాన్ని అందిద్దాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ.. రాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ.. అంటూ స్ర్తిని పొగుడుతాము. ఇంకా ఆకాశమంత ఎత్తు ఎదిగిన మహిళల్ని ఆదర్శంగా తీసుకోవాలి అంటాము. ఇంకా గొప్పగా చెప్పాలంటే, కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ, అపురూపమైనదమ్మ ఆడజమ్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ- అంటూ మనం ఈ మహిళా దినోత్సవం రోజున మహిళలకు రకరకాల కాంప్లిమెంట్లు ఇస్తుంటాం. కానీ కనీసం బతికే హక్కును కోల్పోతూ సామాజిక చీకటి కోణంలో మగ్గుతూ మృగాళ్ల చేతుల్లో నలిగిపోతూ బ్రతికుండగానే ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్న బాలికల, మహిళల్ని మనం మర్చిపోతున్నాం. మన దేశంలో, రాష్ట్రంలో అక్రమ రవాణాకు గురై మురికికూపంలోకి నెట్టివేయబడుతున్నారు. మన ఇంట్లో అమ్మాయిలు, చుట్టుప్రక్కలవాళ్ల పిల్లలు, ఇంకా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న మహిళలు, వారి పిల్లలు ఇలా సమాజంలో ఎంతోమంది ఆడబిడ్డలు మాయమవుతున్నారు. మనకు తెలిసినా కూడా తెలియనట్టు నటించే సంక్షోభంలో వున్నాం మనమంతా.
ఒక పది నిమిషాలు మనం ఓ చిన్న పని చేయడానికి పట్టే టైము. కానీ ఆ ఒక్క పదినిమిషాల్లోనే దేశంలో ఎక్కడో ఒకచోట ఆడపిల్ల మాయమైపోతోంది. ఇలా మన దేశంలో కనిపించకుండా పోతున్న చిన్నారులు, మహిళల సంఖ్య వేలల్లో వుంది. వీళ్లంతా ఎటు పోతున్నారు? ఏమైపోతున్నారు? అదేం పెద్ద బ్రహ్మరహస్యం కాదు. ఎందుకంటే, ఇలా కనిపించకుండా పోతున్న ఆడపిల్లలు మన చుట్టూనే ఎక్కడో వ్యభిచార కూపంలో చేరిపోతున్నారు. మన దేశంలో అతి పెద్ద సామాజిక విషాదమిది. మన కళ్లముందు సాక్షాత్ లక్ష్మీదేవిలా, మన ఇంటి మహాలక్ష్మిలా కనిపించే బంగారుకొండలు కిడ్నాప్‌కు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్ని చూస్తే మన సమాజం నిజంగా ఎదుగుతోందని చెప్పుకోలేని క్లిష్ట పరిస్తితుల్లో మనం వున్నాం.
ఇలా అక్రమ రవాణాలో మాయమవుతున్న చిన్నారులు లైంగిక దాడికి గురవుతున్నారనేది మన రాష్ట్రం, దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన చేదు వాస్తవం. చిన్నవయసులోనే నరక కూపంలోకి చేరుకోవడం, ఎయిడ్స్ బాధితులుగా మారడం లాంటి కారణాలతో వేలమంది మహిళలు, చిన్నారులు బలవుతున్నారు. భర్త సరిగా చూడక భర్త కొట్టి, తిట్టి, భర్త చనిపోతే, లేదా మంచి సంబంధం పెళ్లిచేయక, సినిమా మోజుతో హైదరాబాద్, మద్రాసు వచ్చేవాళ్లు, అదేవిధంగా జాబ్ చేసుకొని బతకొచ్చనే ఆడపిల్లల్ని టార్గెట్ చేసి బ్రోకర్లు మాయమాటలు చెప్పి మెల్లిగా వ్యభిచార వృత్తిలోకి దించుతారు. ఒప్పుకోకపోతే చంపడానికి కూడా వెనుకాడరు. ఇలా కిడ్నాప్‌తో మాయమవుతున్న పిల్లలు కొందరు. పేదరికంవల్ల ఉపాధికోసం మోసగాళ్లను నమ్మి బలయ్యేవాళ్ళు మరికొందరు. అదే పేదరికంతో పిల్లల్ని అమ్ముకునేవాళ్లు కొందరు. ఏది దిక్కు గత్యంతరం లేక నరక కూపంలోకి అడుగుపెట్టేవాళ్లు మరికొందరు. ఇలా రకరకాల కారణాలతో రాష్ట్రంలో బాలికల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కారణాలు ఎన్ని ఉన్నా పెద్ద మాఫియాలు, ముఠాల పాత్రలు కాకుండా ఇంత భారీ స్థాయిలో ఆడపిల్లల్ని మాయం చేసే అవకాశం వుండదు. ఈ ఆడపిల్లల అక్రమ రవాణా అంతర్జాతీయ సమస్య. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మన తెలుగు రాష్ట్రాలలో మరీ ఎక్కువ. ముంబై, పూనె, ఢిల్లీ లాంటి చోట్ల రెడ్‌లైట్ ఏరియాల్లో రెయిడ్ చేసిన ప్రతిసారీ తెలుగు రాష్ట్రాలవారే ఎక్కువగా వుండడం చాలా బాధాకరమైన విషయం. ఇలా మహిళల్ని, పిల్లల్ని అక్రమ రవాణా చేయడాన్ని సామాజిక నేరంగా చూడాలి. మానసికంగా, శారీరకంగా ఎదగని వయసులోనే దారుణమైన పరిస్థితుల్లో పిల్లల భవిత దెబ్బతింటుంది. ఈ అక్రమ రవాణా అంశం అనేక అంశాలకు లింకుగా మారింది. కిడ్నాపింగ్, వ్యభిచారం, వెట్టిచాకిరి, అవయవాల మాఫియా, ఎయిడ్స్ అన్నిటికీ ఇదే మూలంగా మారుతోంది.
వ్యభిచారం, అక్రమ రవాణాను నిరోధించడానికి చట్టంలో గట్టి నిబంధనలే వున్నాయి. మైనర్ ఆడపిల్లలకు వ్యభిచారానికి పాల్పడినవాళ్లకి ఏడేళ్లనుంచి 10 ఏళ్ళ జైలుశిక్ష అవకాశం వుంది. వ్యభిచారాన్ని వ్యాపారంగా నిర్వహించేవాళ్లకు రెండేళ్లు జైలుశిక్షపడుతుంది. ముఖ్యంగా మనుషుల్ని అక్రమంగా తరలించేవాళ్లకు మూడేళ్లనుంచి ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది. చట్టప్రకారం వ్యభిచార కూపం నుండి బయటకు వచ్చినవారికి ప్రభుత్వమే పునరావాసం కల్పించాల్సి వుంటుంది. ఇంకా ఐపిసి సెక్షన్ 366ఎ, 372, 373, 376లు అమ్మాయిలను అక్రమంగా తరలించడం, లైంగిక దాడులకు పాల్పడటం లాంటి నేరాలకు సంబంధించినవే. అలాగే శిక్షలను మరింత కఠినతరంచేసి ఇలాంటి కేసులలో విచారణ త్వరితగతిన జరిగేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలి. అపుడు ఈ సమస్య త్వరితగతిన పరిష్కారం అవుతుంది.
ఇలాంటి చేదు అనుభవాలనుంచి బయటకు వచ్చినవాళ్లకు సమాజం నుంచి, సాటిమనుషులుగా కూడా గౌరవం దక్కడంలేదు. వాళ్లు ఎదురుగా వస్తే గౌరవించే సంస్కారం మనలో చాలామందికి లేదు. ఇలాంటి పరిస్థితులే అక్రమ రవాణాలో చిక్కుకున్న ఆడపిల్లల భవిష్యత్తుకు పెద్ద సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితినుంచి మన సమాజం ఇంకా ఎదగాల్సి వుంది. అమ్మాయిలు మాయమవుతున్న సంఘటనలపైన సామాజిక బాధ్యత పెరగాల్సి వుంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఇలాంటి సంఘటనలపై వెంటనే సమాచారం అందేలా ప్రత్యేకమైన వ్యవస్థలు ఏర్పాటుకావాలి. కిడ్నాపింగ్లాంటి సంఘటనలు జరిగినపుడు ఎంత వేగంగా సమాచారం అందితే అంత వేగంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం వుంటుంది.
అలాగే మన ఇంట్లో పిల్లలు తప్పిపోతే ఎంతో బాధపడతాం. అలాంటి పిల్లలు లక్షమంది కనిపించకుండా పోయారు. వాళ్లేం నేరస్థులు కారు. అందరిలా బ్రతాకాలనుకున్న ఆశ వున్నవాళ్లు. చదువుకొనే పరిస్థితి వుండి, ఎదిగే అవకాశం కల్పిస్తే విజేతల లిస్టులో వాళ్లే ముందుంటారు. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొందరు వ్యక్తులు మార్పుకోసం ప్రయత్నిస్తున్నారు. బాధితులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. అలాగే మనం కూడా మారాలి. మన ఆలోచన మారాలి. సమాజంతో కలిసికట్టుగా వుండి సంఘటనలను గుర్తించినచోట్ల మహిళా స్వయం సహకార సంఘాల సహకారంతో సమాచారం తెలుసుకోవడం, నేరస్థులను గుర్తించడం లాంటివి చేయాలి. కనీసం 1098 చైల్డ్ లైన్ నెంబర్‌కి ఫోన్ చేయండి. ఎందుకంటే, చైల్డ్‌లైన్ ఒక ఉచితమైన ఫోన్ నెంబర్. ప్రతి జిల్లాలో భారతదేశంలో ఎక్కడైనా ఇది లభిస్తుంది. ఈ చిన్నారులకి ఏం చేయాలో తెలియకపోయినా ఫర్వాలేదు. 1098 నెంబర్‌కి ఫోన్ చేయండి చాలు. మన ఆత్మీయ హస్తాన్ని అందించి ఆత్మవిశ్వాసం కలిగించి వారి బంగారు భవితకు మార్గం సుగమం చేద్దాం. వాళ్లకి సమాజంలో మంచి పౌరులుగా గుర్తించి గౌరవిద్దాం.