సబ్ ఫీచర్
పొరుగిండ్లకు పనులు లేక పోవకుమెపుడున్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘కాలము నిల్వబోదు క్షణకాలము’ అనిన కవి వాక్కు అక్షరసత్యము. నిజమే. కాలం ఎవ్వరికోసం ఆగదు. మరలిరాదు. మనకు అందుబాటులో ఉండే అన్ని వనరులలోనూ కాలం చాలా విలువైనది. ‘టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్’ అని కదా లోకోక్తి. కాలము, అల ఎవరికోసం ఆగవు.
‘‘సమయమమూల్యమొక్క నిముసమ్మువృథాచనఁ గ్రమ్మరింపనే
రము మనమాయువా? త్రుటి పరంపర ట యెరింగి నిద్ర మాం
ద్యమును దొరంగి మీ పనుల నారయుడో జనులార! యంచుడం
బముగ మెడన్నిగడ్చి కృకవాకము కూసెడి నింటికొప్పునన్’’
అంటూ శ్రీ దువ్వూరి రామిరెడ్డిగారు సమయం యొక్క విలువ గుర్తించమంటూ మానవాళిని ప్రబోధించారు. కాలం విలువ తెలిసినవారు ఎవ్వరూ కాలాన్ని వృధా చేయరు. లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగినవారు ఘనకార్యాలను సాధిస్తారు. సమయం వృథా చేసుకొనేవారు వ్యర్థులుగా, అసమర్థులుగా కాలగర్భంలో కలిసిపోతారు.
‘‘ఉడుముండదె నూరేండ్లును / పడియుండదె పేర్మి పాము పది నూరేండ్లున్/ మడువున కొక్కెర యుండదె? / కడు నిల పురుషార్థ పరుడు కావలె సుమతీ!’’
తన జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకొని, పురుషార్థములనన్నిటినీ సాధించగలిగిన వారి జన్మము సార్థకము. అంతేతప్ప ఏదో విధంగా కాలం గడుపుకొని, సమాజానికి ఉపయోగపడనివాని జీవితం పశుతుల్యమే!
దేశంకోసం, సమాజం కోసం, పరోపకారం కోసం తమ జీవిత కాలాన్నంతటినీ వినియోగించేవాళ్ళు ఉత్తములు. వీరికి 24 గంటల సమయం తక్కువ. ఎందుకంటే ప్రతి క్షణము వీరికి విలువైనదే. ఇలాంటి మహనీయులు లోకంలో చాలా తక్కువమంది ఉంటారు. జాన్ మిల్టన్, డాక్టర్ శామ్యూల్ జాన్‌సన్, థామస్ గ్రే వంటి ఆంగ్ల రచయితలు సమాజహిత సాహిత్యాన్ని అందించడానికి రోజూ అనేక గంటల సమయం గ్రంథ పఠనంలో గడిపితే, అనేకమంది శాస్తవ్రేత్తలు, సామాజికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రజాహితం కోసం తమ సమయాన్నంతా కేటాయించి, జీవితాలనే త్యాగం చేశారు. మహాత్మాగాంధీకి సమయపాలన ఆరవప్రాణం. ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి ప్రయాణం చేసే సమయంలో వాహనంలోనే కునుకుతీసి విశ్రాంతి పొందేవారు ఆయన. మిగతా సమయం అంతా ప్రజల కోసమే వెచ్చించారాయన. కారాగారంలో కూడా గ్రంథపఠనం, వ్యాసాలు వ్రాయడం, నూలు వడకడం చేశారాయన.
ఇటువంటి మహనీయులను కాక, మిగతావారిని రెండు విభాగాలు చేయవచ్చును. తీరిక వేళలలో సత్కాలక్షేపం చేసేవారు ఒక వర్గం అయితే, ఉబుసుకోక ఇతరుల కాలాన్ని కూడా వృధా చేస్తూ, విసిగిస్తూ, కబుర్లు చేసేవారు మరియొక వర్గం. ఈనాడు చాలామంది విలువైన కాలాన్ని వాట్సప్ మెసేజీలతో, ఫేస్‌బుక్‌లతో, ఛాటింగ్‌లతో, గాసిప్‌లతో, టీవీ సీరియల్స్‌ను చూడటంలో వృధా చేస్తున్నారు. ఉత్పాదకత లేని వ్యాసంగాలవి. సంగీత సాహిత్యాదులతో, సద్గోష్ఠులతో, ఇంటిని, పెరటితోటను, పరిసరములను తీర్చిదిద్దడంలో, ఇతర ఉపయోగ్యములైన వ్యావృత్తులతో సమయాన్ని వినియోగించడం మేలైన పని. తమ తీరిక వేళలో ఇలా ఉత్తమమైన పనులతో శారీరక, మానసిక ఉల్లాసాన్ని తాము పొందుతూ, తోటివారు పొందేలాగా కాలాన్ని వినియోగించవచ్చును. ఇటువంటివారు ద్వితీయ శ్రేణికి చెందినవారుగా పరిగణించవచ్చు.
ఇక చివరివర్గంవారు తమ సమయాన్ని, ఇతరుల కాలాన్నీ వృధా చేసేవారు. పొద్దు ఎలా గడపాలో తెలియక ఇరుగిళ్ళకో, పొరుగిళ్ళకో అనవసరంగా వెడుతుంటారు. అక్కడ ఏవేవో పోచికోలు కబుర్లు చెప్పడం, ఇతరుల గురించి లేనిపోని విషయాలు చర్చించడం, విమర్శలు చేయడం, అభాండాలు వేయడం, చాడీలు చెప్పడం, ఇలాంటి పనికిమాలిన పనులతో తమ కాలాన్నీ, ఎదుటివారి కాలాన్నీ పాడుచేస్తుంటారు. ఇది కూడని పని. ఇలాంటివారి గురించి ఒక సామెత వుంది. ‘లబ్ధ్వాపి కామధేనుంతే లాంగలే వినియుజ్యతే’ అని.
కోరిన కోరికలు తీర్చే కామధేనువు లభిస్తే, దాని విలువ తెలుసుకోలేక దానిని పొలం దున్నడానికి ఉపయోగించడం అని ఈ మాటకు అర్థం. అమూల్యమైన కాలాన్ని ఇరుగుపొరులతో బాతాఖాని కోసం వినియోగించేవారు కూడా ఇలాంటి మూర్ఖులే. ఏదైనా తప్పనిసరి పని ఉంటేనే తప్ప, ఆహ్వానించబడితే తప్ప, ఎవరింటికీ వెళ్ళకూడదు. అనవసరంగా అన్యుల ఇళ్ళకు వెళ్ళడంవలన ఏమి జరుగుతుందో నీతి శాస్త్ర ముక్తావళి ఇలా వివరించింది.
వాన సమస్త జీవుల కవశ్యము ప్రాణము, ప్రాణమైనయ
వ్వానయు పల్మరున్ కురియ వచ్చిన తిట్టుదురెల్ల వారలున్
హీన మనస్కుడై యొరుల ఇండ్లకు పల్మరు పోవునేనియున్
మానసికట్ల వచ్చు నవమానము, న్యూనము, మానభంగమున్
వానలు రావాలని, కావాలాని ప్రాణులన్నీ కోరుకుంటాయి. సకాలంలో సరియైన మోతాదులో వానలు కురిస్తే లోకం సుభిక్షంగా, హాయిగా ఉంటుంది. ఆ విధంగా అందరికీ అవసరమైన వానలే అధికమై, అతివృష్టిగా మారితే లోకం వానలను చీదరించుకొంటుంది. అలాగే, ఆహ్వానింపబడినపుడు, పని ఉన్నప్పుడు ఎవరింటికైనా వెడితే స్వాగతింపబడతారు. కానీ చీటికి మాటికి పరుల ఇళ్ళకు వెళ్తే అవమానింపబడతారు. చులకనగా చూడబడతారు.
పండిత రాజ శతకం ఇలా అంటుంది:
‘‘అతి పరిచయాదవజ్ఞా / సంతత గమనాదనాదరోభవతి
మలయే భిల్ల పురంధ్రీ / చందనతరు కాష్ఠమింధనం కురుతే’’
ఎంత గొప్పవారైనా తరచూ ఇతరుల ఇళ్ళకు వెడుతుంటే, వారిపట్ల అనాదరణభావం ఆ ఇంటివారికి కలుగుతుంది. పరిచయం అధికమయ్యేకొద్దీ వారిపట్ల తేలికభావం కూడా కలుగుతుంది. అది ఎలాగంటే, ఎంతో విలువైన చందనపు చెట్టు కూడా (మంచిగంధం చెట్లు) అవి విపరీతంగా పెరిగే మలయ పర్వత ప్రాంతంలో గిరిజనులచే వంటచెరకకుగా వాడబడుతుందట. దాని విలువ అంతగా దిగజారిపోవడానికి కారణం ఆ గంధం చెట్లు ఎక్కడ చూసినా విరివిగా కనబడటమే అంటాడు కవి.
పదే పదే పొరిగిళ్లకు వెళ్ళేవారిని లోకం అనుమానిస్తుంది. అపనిందలు వేస్తుంది. వాళ్లను తమ ఇళ్లలోనికి రానిచ్చినవారిని సైతం నిందిస్తుంది.
ఒక సంస్కృత కవి ఇలాంటి కాలక్షేప రాయుళ్ళను కుక్కలతో పోల్చి ఏవగించుకుంటాడు. ‘‘శునాంచ పిశునానాంచ పరగేహ ప్రవేశినామ్ / ప్రయోజనం నపశ్యామః పాత్రాణాం దూషణాదృతే’’- ఇతరుల ఇళ్ళకు వెళ్ళేవారికి, కుక్కలకు పెద్ద తేడా లేదు. వీళ్ళ రాకవలన ప్రయోజనం ఉండదు సరికదా పాత్రలు పాడుచేయబడతాయి. కుక్కలు గినె్నలను, వీళ్ళు యోగ్యులను చెడగొడతారని అర్థం.
మరొక కవి ఇలాంటి వ్యర్థులను పాములకంటే ప్రమాదకారులుగా వర్ణించాడు. ‘‘అహోఖల భుజంగస్య విచిత్రొయం వధక్రమః/ అన్స్య దశతి శ్రోత్రం ప్రాణైరన్యొ వియుజ్యతే’’- పాము కాటువేయదగిన వారి ప్రాణాలను తీస్తుంది. కానీ ఇతరుల ఇళ్ళకు వెళ్లి పరులపై చాడీలు చెప్పే దుర్మార్గపు పాము ఒకరి చెవి కొరికితే మరెందరో ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి విచిత్రమైన వధ వీరి నైజం.
ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలో మరొక కవి చెప్పాడు. ‘‘ఖలానాం కంట కానాంచ, ద్వావే వహిప్రతిక్రియే / ఉపానన్ముఖ భంగవా దూరతః పరివర్జనమ్’’- మన ఇళ్ళకు వచ్చి మనకు ఇబ్బంది, కంటగింపుగా మారే ఈ దుర్మార్గులు మనం నడిచే దారిలో గుచ్చుకొనే ముళ్ళలాంటివారు. ఎప్పటికప్పుడు వీరిని తొక్కివేయడమో, దూరంగా విసిరివేయడమో చేయకపోతే చాలా ప్రమాదం సుమా! అని హెచ్చరించాడాయన.
పిలువని పేరంటానికి వెళ్లినట్లుగా అందరి ఇళ్ళకు వెళ్లి అనవసరంగా రకరకాలుగా నిందింపబడటంకంటే, సత్కాలక్షేపంతో తాను తరించి, తన వారిని తరింపజేయడం అన్ని విధాలా ఉత్తమం.