సబ్ ఫీచర్

వృథాను అరికడదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ సేవ చేయటం, దేశం ఇతోభివృద్ధి చెందటానికి సహకరించడానికి వీలుకావడం లేదు, సమయం దొరకడం లేదు, ఆర్థిక లేదా ఇతర ఒనరులు లేవు అని బాధపడేవారు ఉన్నారు కొందరు. వారి ఆశ, ఆశయం మెచ్చుకో తగ్గవే.. కానీ మనం అందరం నిత్య జీవితంలో చేయగలిగినవి చాలా ఉన్నాయి. అదీ పెద్దగా శ్రమపడకుండానే.. ఉదాహరణకి నేను రోజూ ప్రొద్దునే పాలు తేవడానికి వెళ్లి వస్తుంటాను. అలా వెళ్ళి వచ్చేటప్పుడు గమనించింది. ఒక ఆయన, మధ్యవయస్కుడు రోజూ ఒక రెండు చక్రాల బండి మీద వచ్చి వారూ పాలు తీసుకు వెళుతుంటారు. రావడం, పాలు తీసుకోవడం, మళ్లీ వాహనంపై వెళ్లిపోవడం.. ఇంతసేపూ వాహనం ఇంజన్ పనిచేస్తూనే ఉంటుంది. వాహనం ఆపే ప్రశ్న లేదు. అలాగని ఆ బండికి కిక్కు కొట్టి శ్రమ పడాల్సిన అవసరమూ లేదు. సెల్ఫ్ స్టార్ట్ బండి అది. ఆలోచిస్తే.. ఎంత ఇంధనం వృథా అవుతోంది? అదీకాక ఇల్లు కూడా మహా అయితే ఒక ఫర్లాంగు దూరంలో ఉంటుంది. చక్కగా నడిచి వచ్చి నడిచి వెళ్తే.. ఎంతో ఇంధనం పొదుపు అవుతుంది. పైగా ఆరోగ్యానికి మంచిది కూడాను.. ఇంకోసారి చూశాను.. ఒక పధ్నాలుగు, పదిహేను సంవత్సరాల అమ్మాయి వాహనంపై కూర్చుని ఒక స్నేహితురాలుతో మాట్లాడటం.. దాదాపు పదిహేను నిముషం వాహనం ఇంజన్ పనిచేస్తూనే ఉంది.. అంతసేపూ.. నేను ఒక్కడినే గమనించడమే కాదు.. మీరు కూడా ఒకరోజు గమనించి చూడండి. చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది ఇది. కానీ దేశం మొత్తం మీద అన్న విషయం తరచి చూస్తే ప్రతిరోజూ కనీసం ఒక లక్ష లీటర్ల పెట్రోల్, డీజిల్ వృథా చేస్తున్నాం మనం. అదీ ఎంతో విలువైన, అవసరమైన విదేశీ కరెన్సీని వెచ్చించి, దిగుమతి చేసుకుంటున్న సరకు ఈ ఇంధనం. కేవలం విలువ ప్రకారమే చూసినా, ఎంత డబ్బు వృథా అవుతుంది.. ఇంధనం ఒక్క విలువే కాదు.. ఆ ఇంధనాన్ని సరఫరా చేసే వాహనాలు ఉపయోగించే ఇంధనం ఖరీదు కూడా వృథాయేగా.. పైగా ఈ ఇంధనం వాడిన వాహనాలు విడిచే కార్బన్ అణువుల వల్ల కలిగే వాయుకాలుష్యం? దానివల్ల కలిగే పరిణామాలు? ఇంకా ఆ కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య హానికి వాడాల్సిన మందుల ఖరీదు.. ఆ మందుల తయారీకి వాడాల్సిన రసాయన పదార్థాలు.. ఇలా ఆలోచించుకుని, గణించుకుంటూ పోతే.. ఇంధనం ఖరీదు రెట్టింపు ద్రవ్యం, మానవ ఇతర వనరులు, మనం వృథా చేస్తున్నాం అన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది. అదీనూ ఒక్క ఇంధన దురుపయోగం మూలంగానే.. మనం కుళ్ళాయి నుంచి వచ్చే నీటిని ఎంత వృథా చేస్తున్నామో గమనించండి.. అలాగే అనవసరంగా విద్యుత్తు వాడకం.. ఇలా ఒకటేమిటి? మనకి అలవాటు అయిన నిర్లక్ష్యం, అశ్రద్ధ వల్ల ఎంత దేశ సంపదను, వనరులను వృథా చేస్తూ.. మన ఆర్థిక పరిస్థితిని గడ్డు సమస్యల్లోకి నెడుతున్నామేమో.. ఒక్కసారి ఆలోచించండి. కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఇంకా చాలా విధాలుగా, దేశ ద్రోహం చేస్తున్నాం మనం.. సేవ మాట అటుంచి.. అభివృద్ధికి తోడ్పడటం పక్కకు పెట్టి వృథాను ఎక్కువగా చేస్తున్నాం. ఉదాహరణకు ప్రతివారూ వీధుల్లో పడేసే చెత్త శుభ్రం చేయటానికి మానవ వనరుల ఖర్చు చూడండి.. దానివల్ల వ్యాపించే వ్యాధులు, వాటి పరిణామాలు.. అలాగే ఒక వ్యక్తి తన వాహనం అజాగ్రత్తగా రోడ్డు మధ్యలో ఆపితేకలిగే రాకపోకల ఇబ్బందుల వల్ల వృథా అయ్యే సమయం వగైరా.. కాగితాలు, ఒక పక్క రాసినవి, లేక ముద్రణ జరిగినవి, చింపి అవతల పడేసే బదులు, చాకలి పద్దుకు, నెల మొదటి వారంలో తయారుచేసే సరుకుల పట్టికకు వాడవచ్చు. ఎంత వృక్ష సంపదను రక్షించవచ్చు అన్నది మన అంచనాకు తట్టదు. ఇటువంటి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం కూడా దేశసేవే.. ఎందుకు అంటే వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి.. పైగా దేశసేవ కన్నా మన బాగును మనం కాపాడుకునే స్వార్థం కూడా ఇందులో జత కూడి ఉంది. ప్రతి ఇంట్లో కొన్ని వాడి మిగిలిపోయిన మందులు ఖచ్చితంగా ఉండి తీరుతాయి నేటి రోజుల్లో.. ఉపయోగ కాలపరిమితి దాటి వాటిని బయటపడేసే బదులు, దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఇచ్చేస్తే ఎవరో ఒకరికి ఉపయోగపడతాయి కదా.. పర్యవసానంగా ఒకరి అవసరానికి మనం ఆదుకున్నాము అన్న తృప్తి మాత్రమే కాద, ప్రభుత్వ ఖర్చులను కొద్దిపాటిగా అయినా తగ్గించవచ్చు కదా.. ఇదంతా ఒక చాదస్తపు కంఠశోషగా చూడక, ఏమాత్రం ఆచరణలో పెట్టినా, కలిగే లాభం మన అందరిదీనూ.. మనమూ మనవంతు దేశసేవ చేయడంలో ఒక అడుగు ముందుకు వేసినట్లే మరి.

- నండూరి రామచంద్రరావు 99491 88444