సబ్ ఫీచర్

వార్తలు చదువుతున్నది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రచార సాధనాలలో స్పోకెన్ వర్డ్ అతి శక్తివంతమైనది. అందుకే రేడియో ఈనాటికీ నిలదొక్కుకోగలిగింది. టెలివిజన్ వచ్చిన తర్వాత రేడియో స్థానం ఏమవుతుందో అనుకున్నారు; కానీ రేడియోకి ఈనాడు కూడా శ్రోతల కొరత లేదు అని తెలుసుకోవడం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అమెరికా వంటి అభివృద్ధి చెందినదేశంలో రేడియో స్టేషన్ల సంఖ్య ఇప్పటికీ పెరుగున్నదంటే, ఈ మాధ్యమానికిగల ప్రత్యేకత స్పష్టమవుతున్నది.
మన దేశానికి సంబంధించినంతవరకూ- రేడియో వార్తల చరిత్ర టూకీగా పరిశీలిస్తే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల యుద్ధప్రచారాన్ని ఎదుర్కోవటానికి 1942లో రేడియోవార్తలు ప్రారంభమైనాయి. అప్పటినుంచీ కొన్ని మార్పులు, చేర్పులతో ఇప్పటి ఆకాశవాణి వార్తా సర్వీసుల రూపాన్ని సంతరించుకున్నది. ఈనాడు ఆకాశవాణి 70 జాతీయ బులెటిన్లు, ఇరవై రెండు ప్రాంతీయ భాషలలో నూట పద్ధెనిమిది ప్రాంతీయ వార్తా బులెటిన్లు ప్రసారం చేస్తూ అతి పెద్ద యంత్రాంగాన్ని కలిగివుంది.
రేడియో వార్తాప్రసారంలో రెండు భాగాలున్నాయి. లైటర్ వీన్‌లో చెప్పాలంటే- వంట చేయడం, వడ్డించడం; వార్తలు ఎడిట్ చేయడం, చదవటం- వడ్డించేది న్యూస్‌రీడర్లు. వండిన పదార్థం ఏ రీతిలో వున్నా, చేతనైనంతలో వడ్డన ఆకర్షణీయంగా చేసినట్లు- వార్తలుకూడా, వాటి స్వభావం ఏదైనప్పటికీ రొటీన్‌గా వుంటే రాజకీయ, సామాజిక వార్తలు, భయానక వార్తలు, ఉత్తేజాన్ని కల్గించేవి, కరుణ కలిగించేవి. రకరకాలైన వార్తలు- వీటిని నాటకీయంగా చదవకూడదు. అయితే ఒకేమూసలో పోసినట్లుచదవకూడదు. ఈ సూక్ష్మాన్ని గ్రహించి- వార్తలు చదవటాన్ని ఒక కళగా రూపొందించి ఒరవడి పెట్టారు మొదటి తరానికి చెందిన న్యూస్‌రీడర్లు. వారిలో చెప్పుకోదగినవారు పన్యాల రంగనాథరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం మొదలైనవారు. వార్తలు వినటానికి ఆసక్తికరంగా వుండాలంటేకొన్ని కిటుకులు పాటించాలని వారు చెబుతుండేవారు. వార్తలు చదివేటప్పుడు పాజెస్ అంటే మాటకూ మాటకూ మధ్య ఎక్కడ క్షణం ఆపాలి, ఎక్కడ అసలు ఆపకూడదు- ఇది చాలా ముఖ్యమైన కిటుకు. ఆయా సందర్భాన్ని బట్టి కొద్ది వేగంతో వూపునిచ్చి చదవటం, విరిచి చదవటం- బాగుంటుంది. ఉదాహరణకు ఈ వాక్యాన్ని ఇట్లా చదివితే బాగుంటుంది. ‘దేశ సమగ్రతా పరిక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు జాతి శ్రద్ధాంజలి ఘటించింది’-
ఏది చదివినా- ఈ విషయానికి సంబంధించిన నేపథ్యం తెలుసు అన్న స్పృహ, ధీమా గొంతులో ధ్వనించాలి. భాషమీద కొంత అధికారం వుండాలి, స్పష్టత ఉండాలి.
శబ్దోచ్ఛారణ, వాడే మాటలు ప్రామాణికగా ఉండాలి. వాక్యంలో క్లిష్టత లేకుండా, వినగానే అర్థం అయేట్లువుండాలి. ప్రొఫెషలిజమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనీ, సాధ్యమైనంతవరకు తప్పులు దొర్లకుండా వుండాలనీ మాకు అప్పట్లో పదే పదే చెప్పేవారు. కొన్ని కొన్ని మాటలు వాడకపోవటం సమంజసంగా వుంటుంది. గత రాత్రి, నేడు మొదలైనవి. గత రాత్రికి బదులు నిన్నరాత్రి అనీ, నేడు బదులు ఈవేళ, లేక ఈరోజు, ఈనాడు అని అనవచ్చు. చెప్పారు, అన్నారు, ఉద్ఘాటించారు, స్పష్టం చేశారు మొదలైన క్రియా విశేషాలను జాగ్రత్తగా ఉపయోగించాలి.
మేము వార్తలు చదివే రోజుల్లో కొన్ని తమాషా అనుభవాలు ఎదురవుతూ వుండేవి. అపుడు ఇంత సిబ్బంది వుండేదికాదు. హైదరాబాద్, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో పనిగంటలను గురించి పట్టింపు వుండేది కాదు. ఒక మధ్యాహ్నం, ఒక పెద్దమనిషి ఫోన్‌చేశారు. ఆయన జైలు నుంచి బెయిల్‌మీద ఆ రోజేవిడుదలై వచ్చారట; తనను జైలులో నిర్బంధించిన విషయాన్ని వార్తలలో ఎందుకు చెప్పరు అని నా మీద విరుచుకుపడ్డారు. ఆ వార్త నేనే చదివాను. అంత హడావుడిగా ఎందుకు చదవవలసి వచ్చింది. మీ ఉద్యోగాలు ఖబడ్డార్ అని బెదిరించారు. తెలంగాణ- ఆంధ్ర ఉద్యమాలు ఉధృతంగా కొనసాగుతున్న రోజులలో మాకు దినదినగండంగ ఉండేది. ‘‘ఈ సాయంకాలం ఫలానా సమయంలో, మేము రైలు పట్టలమీద కూర్చుని రైళ్ళు ఆపబోతున్నాము. ఈ సంగతి ఈ రోజు వార్తల్లో చెప్పకపోతే మీ పని సరి’’ అని ఫోనులో చెప్పటమే కాదు, స్వయంగా వచ్చి బెదిరించేవారు. ఇలాంటి బెదిరింపులు, ఒత్తిడులు అనేక వర్గాలనుంచి వస్తుండేవి. శ్రీమతి ఇందిరాగాంధీ హత్య తరువాత, ఆమె చితాభస్మాన్ని మన రాష్ట్రంలో రైళ్లలో వివిధ ప్రాంతాలకూ తీసుకువెళ్లటం జరిగింది. ఆ సమయంలో స్థానిక నాయకులు చేసిన హడావుడి అంతా, ఇంతా కాదు. వారి ప్రకటనలు తప్పనిసరిగా వార్తలలో ప్రసారం కావాలి. అవి ఇట్లా వుండేవి. ‘చితాభస్మం వున్న రైలుబండి మా ఊరి స్టేషను వద్ద ఫలానా సమయానికి ఆగుతుంది. కనుక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శ్రద్ధాంజలి సమర్పించవలసిందిగా ఫలానా నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు అని, ఈ స్థాయిలో వుంటే ప్రకటనలు చాలా చోటు చేసుకునేవి వార్తలలో - తాము చేసే ప్రచారాన్ని గురించి ప్రచారం చేయవలసిందని వత్తిడి చేస్తూ ఉండేవి. వడ్డన గురించి ప్రస్తావించాను. ఇక వంటల గురించి క్లుప్తంగా చెప్పి విరమిస్తాను. వంటల తయారీ అంటే- రేడియో వార్తా సర్వీసుల వ్యవస్థను గురించి చెప్పక తప్పదు. స్వాతంత్రానికి పూర్వం మోస్తరుగా ఇపుడు రేడియో వార్తా సర్వీసులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నవి. ఈ మంత్రిత్వ శాఖలో వార్తా సర్వీసులతో సహా అనేక విభాగాలను ఒకే కేడర్‌కు చెందిన అధికారులు నిర్వహిస్తున్నారు.
- మాడపాటి సత్యవతి

ఆకాశవాణి విజయవాడ, ప్రెస్ అకాడమీ 2001, జనవరి 4న గుంటూరులో నిర్వహించిన సదస్సులో సత్యవతి చేసిన ప్రసంగ పాఠం ఇది.
ఆకాశవాణి ఉజ్వలంగా వెలిగిన కాలంలో హైదరాబాద్ రేడియో న్యూస్ రీడర్‌గా మాడపాటి సత్యవతి బహుళ ప్రసిద్ధులు. నిజాం సంస్థానం ఎర్రుపాలెంలో 1931, మే 19న జన్మించిన వీరు.. మాడపాటి రామచంద్రరావు, విశాలాక్షి దంపతుల ఎనిమిది మంది సంతానంలో పెద్దవారు. మాడపాటి హనుమంతరావుగారి అన్న తిరుమలరావు ఏకైక కుమారుడు రామచంద్రరావు. హనుమంతరావుతో చాలా సన్నిహితంగా ఉన్న వీరు నిజాం విమోచన ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాదులో హాస్టలులో ఉండి సత్యవతి చదువుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు ఎం ఏ చేశారు. తొలుత హైదరాబాద్ ఆకాశవాణిలో అనౌన్సర్‌గా చేరి, పిమ్మట వార్తా విభాగంలోకి తరలి వెళ్ళారు. 1991 న్యూస్ రీడర్‌గా పదవీ విరమణ చేశారు. విజయవాడ వార్తా విభాగంలో కూడా పనిచేసిన సత్యవతి న్యూస్‌రీడర్‌గా ఎంతోమందికి తెలుసు. అవివాహితులుగా జీవితం గడిపిన సత్యవతి తన అన్నగారి కుటుంబంతో ఉండేవారు. పదవీ విరమణ తర్వాత శ్రీరంగం గోపాలరత్నం గారి వద్ద కర్ణాటక గాత్రం నేర్చుకోవడం విశేషం. చలాకీగా ఉన్న సత్యవతి హోమియోవైద్యం వాడేవారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరిన సత్యవతి మార్చి 4వతేదీ తెల్లవారుజాము 1.45కు కన్నుమూశారు.
(మార్చి 14 శనివారం, ఉదయం 11.30 నిముషాలకు పాట్నీసెంటర్‌లోని తాజ్‌మహల్ హోటల్లో సంస్మరణ కార్యక్రమం)

- డా. నాగసూరి వేణుగోపాల్ 94407 32392