సబ్ ఫీచర్

సమకాలీన సాహిత్యోపనిషత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయిత:
ముదిగొండ వీరభద్రయ్య
వెల:
రూ. 100/-

ప్రతులకు:
హిమకర్ పబ్లికేషన్స్, హైదరాబాద్
మరియు అన్ని ప్రసిద్ధ పుస్తక విక్రయ కేంద్రాల్లో
*
‘‘విఫల కళాకారులు విమర్శకులుగా రాణిస్తా’’రనే నాటు లోకోత్తిలో
వెటకారం ఉన్నంతగా వాస్తవం లేదు. కవులలో విమర్శకులూ, విమర్శకుల్లో కవులూ ఉండడం అందరికీ తెలిసిందే. రచయితలోని విమర్శకుడు,
అతనిలోని కవిని మించి ప్రకాశిస్తే అతడు విమర్శకుడిగా రాణిస్తాడు. అలా కాకుండా, కవిదే పైచేయి అయ్యే పరిస్థితిలో అతగాడు
కవిగా మిగులుతాడు. ప్రత్యక్షంగానూ, అనుభవపూర్వకంగానూ కవిత్వంతో పరిచయం లేని విమర్శకుడి వల్ల
కవిత్వానికి మేలు జరిగే
అవకాశం తక్కువ. విమర్శన కరువైన కవి వల్ల సైతం కవిత్వానికి
పెద్ద మేలు జరిగే
అవకాశం లేదు.
అందుచేత, కవులూ విమర్శకులూ తరచు మాట్లాడుకోవడం మంచిది. (కనీసం తమలో తాము మాట్లాడుకోవటం అవసరం!) అరవయ్యేళ్ల కిందట శ్రీశ్రీ-వరద-ఆరుద్ర చేసిన ఇటువంటి సాహిత్య చర్చ పుస్తక రూపం తీసుకుంది. ఇన్నాళ్లకు ముదిగొండ వీరభద్రయ్య, బూదాటి వెంకటేశ్వర్లు, కె.యాదగిరి, కోయి కోటేశ్వరరావుగార్లు ఆ పనే చేశారు. వాళ్లది ప్రధానంగా కావ్యాలంకార చర్చ. అది ‘కవిత్వ కళాతత్వం’ అనే చిరుపొత్తంలో నమోదయింది. ఈ చర్చ కావ్యరూపంలో ఉండడం విశేషం. అంతకుమించిన విశేషం మరొకటుంది- సమకాలీన సాహిత్య జీవుల్లో అరుదయిన కాలిక స్పృహ ఈ నలుగురిలో తగినంతగా ఉన్నందువల్లనే ఇది సాధ్యమయింది. మిగతా విషయాలు ఎలా వున్నా ఇందుకు వారు నలుగురినీ అభినందించాలి. ఈ పుస్తకాన్ని డా.వెల్చాల కొండలరావుకు అంకితమిచ్చారు.
ముందుగా, ఈ చిరుపొత్తానికి వున్న నేపథ్యాన్ని పరిశీలిద్దాం!
**
మన సంప్రదాయ సాహిత్యంలో పండిత కవులు అనేకులు. కవిత్వ కళ, అలంకార శాస్త్రం, వ్యాకరణం, తత్వం లాంటి విభిన్న అధ్యయన రంగాల్లో కృషిచేసిన వాళ్లు ఎందరో చరిత్రకెక్కారు. చారిత్రక స్పృహలేని కారణంగా మరెందరో మరుగున పడిపోయి వుంటారని సంప్రదాయ సాహిత్య విమర్శకులు తరచు బాధపడుతుండడం కద్దు. దానిమాటెలా వున్నా దాదాపు రెండు వేల సంవత్సరాలుగా పండిత - కవులు చేసే సాహిత్య చర్చ మన సాహిత్య చరిత్రలో నమోదయినవన్నమాట వాస్తవం. ఇదే సంప్రదాయానికి కొనసాగింపుగా వెలువడిన చిరుపొత్తమే ‘కవిత్వ కళాతత్వం’.
ఈ తరహా కవి- పండితులకు ఆద్యుడు వరరుచేనేమో! క్రీస్తుశకం ఆరో శతాబ్దికి చెందిన ఈ వైయాకరణి- కవి ఆ రెండు రంగాల్లోనూ చెప్పదగిన కృషిచేసి చరిత్రకెక్కిన మాట నిజం. వరరుచి కావ్యాలు ‘ఉభయాభిసారిక’, ‘కంఠాభరణం’, ‘చారుమతి’ సుప్రసిద్ధాలు. ఇక, ప్రాకృత భాష గురించి వరరుచి రాసిన ‘ప్రాకృత ప్రకాశ’ కూడా సువిఖ్యాతం. ఆయన తర్వాత వంద సంవత్సరాలకు - క్రీ.శ. ఏడో శతాబ్దికి చెందిన పండిత కవి దండి కూడా సుప్రసిద్ధుడే. ఆయన వచన కావ్యాలు, ‘దశకుమార చరిత్రం’, ‘అవంతీ సుందరి’ సువిఖ్యాతాలు. దాదాపు అంతే ప్రఖ్యాతిని పొందింది దండి ‘కావ్యాదర్శనం’. ఇతగాడికి సమకాలికుడిగా ఒప్పుకునే భామహుడు కూడా పండిత కవేనని కొందరంటారు. ‘కర్పూర మంజరి’ నాటకం ద్వారా సుప్రసిద్ధుడయిన రాజశేఖరుడు (పదో శతాబ్ది) రాసిన ‘కావ్య మీమాంస’ కూడా అంతే ప్రసిద్ధం. అతనికి నూరు సంవత్సరాల తర్వాతవాడయిన క్షేమేంద్రుడు కూడా పండిత- కవే. ఇతగాడి ‘ఔచిత్య విచార చర్చ’ ఎంత ప్రసిద్ధమో, ‘సమయ మాతృక’ ‘కళావిలాసం’ కూడా అంతే ప్రసిద్ధికి నోచుకున్నాయి. ఇక పదిహేడో శతాబ్దికి చెందిన మన తెలుగు అలంకారికుడు జగన్నాథ పండితరాయలు కూడా ప్రసిద్ధ పండిత కవే! ఆయన ‘రసగంగాధరం’ ఎంత ప్రాచుర్యమో, ‘్భమినీ విలాసం’ కూడా అంతే ప్రసిద్ధం కదా! కాగా, పండిత కవి సంప్రదాయం పాశ్చాత్య సాహిత్యానికి కొత్తేం కాదు!
క్రీస్తుకు పూర్వం నాలుగు - మూడు శతాబ్దాలకు చెందినవాడని చెప్పే ప్లేటో తను ప్రతిపాదించిన సాహిత్య సిద్ధంతాలకు ఉదాహరణలుగా తానే కొన్ని రచనలు చేశాడు. ఆయన రాసిన ‘గుహ కథ’ ప్రసిద్ధం. ఈ కోవకు చెందిన ప్రసిద్దులెందరో ఉన్నారు. వారి ప్రస్తావన మనకంత ప్రాసంగికం కాదు. అయితే, 18-20 శతాబ్దాల మధ్యలో కీలకమైన విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లీష్ కవులూ, రచయితలూ కొందరిని గుర్తించి చెప్పక తప్పదు. విలియం వర్డ్స్ వర్త్, ఇ.ఎ.పో, మేథ్యూ ఆర్నాల్డ్, డి.హెచ్.లారెన్స్. టి.యస్.ఇలియట్ ఈ కోవలో ముఖ్యులు. కీట్స్ తన లేఖల్లో పేర్కొన్న విమర్శనాత్మక వ్యాఖ్యలను కూడా కొందరు కీలకమైనవిగా పరిగణిస్తారు. అది మనకు సంబంధం లేని విషయం.
ఇదే కోవకు చెందిన తెలుగు పండిత కవులను మన తరంలో కొందరమయినా చూశాం. వారిలో ముందుగా మనం చెప్పుకోవలసిన పేరు ఉమాకాన్త విద్యాశేఖరులది. విశ్వనాథ సత్యనారాయణ, స్వామి శివశంకరులు, కృష్ణశాస్ర్తీ, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ తదితరులు ఈ కోవలో ప్రకాశమానమయిన తారలు. ముఖ్యంగా శ్రీశ్రీ- వరద - ఆరుద్ర ముగ్గురూ చేసిన చర్చ ‘సినీవాలీ’లో అక్షరబద్ధమయింది. ‘‘శ్రీశ్రీ వరదలు నా మిత్రశ్రీలవ్వాలరి తోడ చర్చలు శ్రేయోదాయకం’’ కాగలవని భావించానన్నారు ఆరుద్ర. ఇన్నాళ్లకు మళ్లీ అలాంటి ఓ చర్చ జరగడం, అది పుస్తక రూపం తీసుకోవడం జరిగింది. దాన్ని ‘సాహిత్యోపనిషత్’ అన్నారట. ‘‘అధ్యాపకులూ, విద్యార్థులమూ కలిసి మెలిసి బతుకుదాం- కలిసే (విద్యను) ఆస్వాదిద్దాం- కలిసే విద్యను ఆచరిద్దాం- మన విద్యలో జ్ఞానప్రకాశం నింపుదాం. శాంతి, శాంతి, శాంతి!’’’ అనే ఉపనిషద్వాక్యాన్ని నిజం చేసినందుకే ‘సినీవాలి’కి ఆ పేరు వచ్చింది. ‘కవిత్వ కళాతత్వం’ కూడా అలాంటి పుస్తకమేనన్నారు పెద్దలు.
ఇక ‘కవిత్వ కళాతత్వం’
వస్తువు విషయానికి వస్తే-
కోయి కోటేశ్వరరావు ‘ఈస్థెటిక్ డిస్కోర్స్’కు సమానార్థకంగా ‘కళాతత్వ ప్రబోధం’ అనే మాటలు వాడారు. ఈ చర్చ కూడా సౌందర్యశాస్త్ర చర్చేనని దీన్ని బట్టి మనకాయన సూచిస్తున్నారు. ‘అలంకారాలు కవిత్వానికి భారం కాదా? అలంకృత కవిత్వం కృత్రిమం కాదా?’’ అన్నవి కోటేశ్వరరావు ప్రశ్నలు. ‘‘కానే కాదు కోటేశ్వరా!’’ అన్నది ఆచార్యుల సమాధానం. అలంకారాలు లేకుండా నిత్య నైమిత్తికమయిన విషయాలను గురించి సామాన్యులు కూడా మాటాడరు కదా! అయితే, తెచ్చిపెట్టుకున్న అలంకారాలు కాకి తగిలించుకున్న కేకీకల లాంటివి- అవి కవిని నవ్వులపాలు చెయ్యడమే కాక కవిత్వ ప్రయోజనాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ‘తగిలించుకున్న అలంకారాలతో కవితా శిశువు ఊపిరాడక నిర్జీవంగా పుడ్తుం’దని వీరభద్రయ్య హెచ్చరించారు.
ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యను, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు ఆనందవర్థనుడితోనూ, హెగెల్‌తోనూ పోల్చారు. ‘‘వస్తువులో శోభకన్నా, అభివ్యక్తి శోభ(ను) కవి ఎక్కువగా ఉపాసిస్తే నీ కవిత చరితార్థం’’ అన్నది ముదిగొండవారి ఉపదేశం. ఈ పుస్తకంలో ప్రాథమిక చర్చ ఇదే! ‘కవితలో ఏం చెప్పావు?’ అన్నదానికన్నా ‘ఎలా చెప్పావు?’ అన్నది ఎక్కువ ముఖ్యమనే వాదం కొత్తదేం కాదు. ‘ఏం చెప్పావు?’ అన్నదే ముఖ్యమని చెప్పినవాళ్లే తెలుగు కవితను- ముఖ్యంగా వచనకవితను- నినాదప్రాయం చేశారనే విమర్శ కూడా దశాబ్దాలుగా వింటూ వచ్చినదే. అధ్యయన సౌలభ్యం కోసం ‘ఏమిటి-ఎలా’ అనే అంశాలు రెండింటి మధ్య కల్పించిన కృత్రిమమయిన విభజన, వెర్రితలలు వేసి అవి రెండూ పరస్పరం విభిన్నమయినవనీ, కొండొకచో విరుద్ధమయినవనీ అనిపించే, ఆపాదించే అపార్థాలకు దారితీసింది. ‘తెలుగు హెగెల్’ ఆచార్య వీరభద్రయ్య ఈ రెండింటిమధ్యా ‘గతితార్కిక సంయోగం’ గురించి ప్రస్తావించివుంటే మరింత బావుండేది. అది చర్చను మరింత సంపన్నవంతం చేసేది. ‘‘మనిషిలో సమూలమయిన మార్పు తేగలిగే శక్తి కవిత్వానికే, కేవలం కవిత్వానికే ఉన్నదని’’ ఆచార్యులు ఈ చర్చను ముగించారు. (చర్చ ఎక్కడయినా ముగుస్తుందా అసలు? ఎవరో అన్నట్లు అది ‘ఒడువని ముచ్చట’ కాదా??) కాగా, ఆచార్య ముదిగొండతో - బూదాటి వేంకటేశ్వర్లు ‘రసవిషయిక సంవాదం’ చేయగా, కె.యాదగిరి ‘్ధ్వని విషయిక సంవాదం’ చేశారు. ‘‘సమాధానాలు తెలిసే ప్రశ్నలడిగిన’’ ఆచార్య బూదాటి ప్రగల్భాన్ని ‘‘మనసారా మెచ్చు’’కున్నారు ముదిగొండ. ఇక, ఆచార్య యాదిగిరితో చేసిన ‘సంవాదం’లో శ్రీశ్రీ శేషేంద్ర, జయప్రభ, పెన్నా శివరామకృష్ణ, కనపర్తి రామచంద్రాచార్యులు తదితర ఆధునిక కవుల ధ్వని క్రీడలను రెండు చేతులతో ఉటంకించారు ముదిగొండ. పాఠకులను చర్చలో వెంట తీసుకెళ్లే ఈ ప్రయత్నం జయప్రదమయింది. అదే, ఈ సాహిత్యోపనిషత్తును సమకాలీనంగా మారుస్తోంది. ఇలాంటి చర్చ(లు) ఎంత విపులంగా, విస్తృతంగా జరిగితే కవిత్వానికి అంత మంచిది!

-మందలపర్తి కిషోర్, 8179691822