సబ్ ఫీచర్

అవసరమే సాహితీ వనానికి అనువాద పొద !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో అనేక భాషల ప్రజలు జీవిస్తున్నారు. వివిధ భాషలున్న మన దేశంలో ఆయా భాషల్లో విస్తారమైన సాహిత్య సంపద ఉంది. శతాబ్దాలుగా సాంస్కృతిక సమైక్యతా ప్రక్రియలో భాగంగా వివిధ భాషల మధ్య ఇచ్చిపుచ్చుకునే సంస్కారం విస్తరిల్లుతూ ఉంది. ఒక భాషా సంతతివారు ఇతర భాషా సంతతివారి సామాజిక వికాసానికి తోడ్పడుతూ అవసరాన్ని బట్టి ఆయా భాషల్ని నేర్చుకుంటూ, పరిస్థితుల కనుగుణంగా ప్రవీణులు కూడా అవుతుండడం విశేషం.
ఒక భాషా సాహిత్యంలో వున్న కావ్య సంపదని బట్టి, భాషా మనుగడను బట్టి ఆ భాషకూ, భాష మాట్లాడే జాతికి ప్రాముఖ్యత, గౌరవం లభిస్తాయి. ఒక జాతి నాగరికత ఆ భాషా సాహిత్యంలో వారి జీవన ప్రమాణాలను బట్టి నిర్ణయించబడుతుంది. ప్రముఖ హిందీ రచయిత మహావీర్ ప్రసాద్ ద్వివేది చెప్పినట్లుగా ‘సాహిత్యం లేని భాష రూపవతి అయిన బిచ్చగత్తె వంటిది’. ఏదైనా భాషలో వున్న సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా ఆ భాష అర్థం కావాలి. వారికి మాత్రమే ఆ భాషా సాహిత్య సౌందర్య పరిమళం అలుము కుంటుంది. భాష ఎంత బాగున్నా అనువాదాల అవసరంకూడా అంతే ఉంటుంది. అనువాదం ద్వారానే పలు భాషా సాహిత్యం చదవగలుగుతాం. ఆయా భాషల్లోని రచయితల భావాలు, జీవితానుభవాలు, అనుభూతులు, అనువాదాల ద్వారా మాత్రమే ప్రపంచమంతా తెలుసుకోగలుగుతుంది. రవీంద్రుని ‘గీతాంజలి’ ఒక్క మాతృభాషలోనే ఉండి వుంటే అది విశ్వమానవాళికి అందేది కాదు. నోబెల్ పురస్కార పాత్రత లభించేది కాదు. అనువాదాల ద్వారా ఒక భాషలోని రచయితల మేధస్సు, సంస్కృతి, ఇతర భాషీయులకు అంది విశ్వమానవ స్నేహానికి బాటలు వేస్తుంది. భారతీయుల సంస్కృత కావ్యాలు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, జయదేవుడు మొదలైన మహనీయుల రచనలవల్ల దేశఖ్యాతి ఇనుమడించింది. మన దేశంలో పలు మతాలు, భాషల ప్రజలుండటంవల్ల వివిధ భాషా ప్రాంతాల ప్రజల మధ్య భావ సమైక్యతకు ఆదానప్రదానాలు, అనువాదాలే ముఖ్యపాత్ర వహిస్తాయి. భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాష తెలుగు. ప్రాచీన హోదా అధికారికంగా సాధించుకున్న తెలుగు సాహిత్యం విశిష్టమైంది.
మొదట ఇతిహాస పురాణాల అనువాదాలతో సాగిన తెలుగు సాహిత్యం ఆ తర్వాతి కాలంలో సంస్కృత కావ్యాలను తెలుగు సాహిత్యంలోకి తీసుకురావడం జరిగింది. 15వ శతాబ్ది నుండి తెలుగులో స్వంత రచనా ప్రక్రియ ప్రారంభమైంది. అత్యధికంగా ప్రబంధాలు వెలువడిన భారతీయ భాషల్లో ఒకటి అయిన తెలుగులో ద్వర్థికావ్యాలు, శే్లషకావ్యాలు, ప్రత్యర్థి, చతురర్థి కావ్యాలు కూడా వెలువడ్డాయి. అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వాగ్గేయకారులు తెలుగు సాహిత్యంలో రాగఝరులు కురిపించారు.
భారతదేశంలో అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషల్లో మొదటి స్థానం హిందీకే దక్కుతుంది. దేశవ్యాప్తంగా ఇతర భాషీయులు అర్థం చేసుకోగలిగే భాష కూడా హిందీయే! హిందీ సాహిత్య పాఠకులు కూడా ఎక్కువ. ప్రాంతీయ భాషల రచయితల్లో హిందీ తెలిసిన రచయితలు తమ భాషల గొప్ప రచనల్ని హిందీలోకి అనువాదం చేసి ఇతర భాషీయులందరికీ అందుబాటులోకి తెచ్చారు.
తెలుగు ప్రజలు హిందీని నేర్చుకొని తమ తెలుగు గ్రంథాల్లో చాలావాటిని హిందీలోకి అనువాదం చేసి తెలుగు సాహిత్య పరిమళాన్ని అంతటా వెదజల్లారు. తెలుగు ప్రాంతంలో వివిధ హిందీ విద్యాలయాలు, హిందీ ప్రచార సభ, హిందీ ప్రేమమండలి, హిందీ మహావిద్యాలయ మొ. సంస్థల ద్వారా అనేకమంది పెద్దలు హిందీ ప్రచారానికి కృషిచేశారు. తెలుగు భాషీయులైన హిందీ కవుల్లో లాజపతి పింగళ, కర్ణవీర నాగేశ్వరరావు, సి. బాలకృష్ణరావు, ఆలూరి బైరాగి, వారణాసి రామమూర్తి రేణు, బూదరాజు వెంకట సుబ్బారావు, హరికిశోర్, డా. చావలి సూర్యనారాయణమూర్తి, రాపర్తి సూర్యనారాయణ నాను, డా. ఇలపావులూరి పాండురంగారావు, డా. పి. ఆదేశ్వరరావు, డా. పుల్లయ్యరావు, డా. మాధవరావు రేగులపాటి, వేమూరి రాధాకృష్ణమూర్తి, ఈమని దయానంద్, చేబ్రోలు శేషగిరిరావు, డా. టి.మోహన్‌సింగ్, వై. కృష్ణమూర్తి, డా. ఎన్.ఎస్. దక్షిణామూర్తి, జి. సీతారామయ్య అత్యంత ప్రముఖులు.
ప్రాచీన తెలుగు కావ్యాల హిందీ అనువాదాలు
నిజానికి అనువాదం ఒక భాషనుండి మరొక భాషలోకి భావాభివ్యక్తిని రూపాంతరీకరణ చేస్తుంది. ఇది పునర్జన్మ లేదా పునర్నిర్మాణం. మూల రచనలోని ఉదాత్తత, శైలీ శక్తిని సమన్వయం చేస్తూ ఆ ఆత్మను ప్రత్యక్షం చేస్తుంది. ఒక్కోసారి మూలకృతి కన్నా ఉత్కర్షతో కూడా రూపొందుతుంది. ఈ విధంగా ఆలోచిస్తే తెలుగు భాషీయులు ప్రాచీన సంస్కృత కావ్యాలను తెలుగులోకి అర్థవంతంగా అనువదించటమే గాక, ఈ తెలుగు కావ్యాలను హిందీలోకి కూడా మరలా అనువదించారు.ప్రాచీన కావ్యాలను హిందీలోకి అనువదించిన వారిలో పోతన భాగవతంలోని నాలుగు అంశాలనూ ‘్భగవత పరిమళ’ అంశాలుగా డా. పి. ఆదేశ్వరరావు, పోతనాకృత్‌నుండి డా.ఎం.రంగయ్య ప్రముఖులు.తెలుగులో గోన బుద్ధారెడ్డి అందించిన ‘రంగనాథ రామాయణాన్ని’ కె.సి. కామాక్షిరావు అనువదించారు. ఇదే రామాయణాన్ని డా. భీమ్‌సేన్ నిర్మల్ హిందీలో లిప్యంతరం చేసి ‘రంగనాధ్ రామాయణ్’ అనే గద్యానువాదం చేసి హిందీవారికి అందించారు.
పదకవుల సాహిత్యం
తెలుగు సాహిత్యానికి సంగీత వైభవాన్ని సంతరించిన వాగ్గేయకారులు అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు మొదలైనవారు. వీరి పదాలను తెలుగు రచయితలు హిందీలోకి అనువదించారు. త్యాగరాజు కీర్తనలు- త్యాగరాజ్ కే పద్‌ను డా. ఇలపావులూరి పాండురంగారావు, అన్నమాచార్య పదాలు- అన్నమాచార్య సంకీర్తన్‌ను సిహెచ్. రాములు అనువదించారు.
శతక సాహిత్యం
ప్రాచీన తెలుగులో మధ్యయుగ కావ్యాలలో శతక సాహిత్యం అధికంగా వెలువడింది. ఈ శతకాల్లో నీతిబోధ ముఖ్యమైన అంశం. తెలుగులో అత్యధిక జనాదరణ పొందిన శతకాలు వేమన శతకం, సుమతీ శతకం.. వేమన పద్యాలను ఆటవెలది ఛందస్సులో రచన చేశాడు. వీటికి మూడు అనువాదాలు హిందీలో కనిపిస్తాయి. దువ్వూరి రామకృష్ణమూర్తి (దోహాలలో) మాధవరావు రేగులపాటి ‘వేమన సూక్తి సుధ’ (నాలుగు పంక్తులలో), సూర్యనారాయణ భాను ‘వేమన కీ వాణి’(చౌపాయిలలలో) మొదలైనవారు వేమన వాక్కును స్పష్టంగా హిందీవారికి అందజేశారు. ఇలా శతకానువాదకులు కావ్యానువాదంలో హిందీకి అనుగుణంగా, మాతృభాషా వైశిష్ట్యం తగ్గకుండా అత్యంత ప్రావీణ్యతతో చేయటం శ్లాఘనీయం.
కవిత్వం
ఆధునిక తెలుగు కవిత్వం ఆయా కవిత్వాల భావ సిద్ధాంతం, ముఖ్యాంశాలను బట్టి అనేక విధాలుగా విభజింపబడింది. తెలుగులో భావ కవిత్వం, అభ్యుదయ, దిగంబర, ప్రగతిశీల, విప్లవల, స్ర్తివాద, దళిత, ముస్లిం మైనారిటీ, బహుజనవాద ధోరణులతో వెలువడిన కవిత్వంలో కొందరు ప్రముఖుల రచనలు హిందీలోకి అనూదితమైనాయి. సూర్యనారాయణ భాను ఆధునిక తెలుగు సాహిత్యంలో 45 కవుల విశిష్ట కవితల్ని హిందీలో ‘తెలుగుకే ఆధునిక కావ్యధార’ శీర్షికతో అనువదించారు. వీటిని జాగృతి, కల్పన, ప్రగతి మొ. ఖండాలుగా విభజించి అందించారు. వీరిలో కవిసామ్రాట్ విశ్వనాథ, భావకవి దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, గుర్రం జాషువ, శ్రీరంగం నారాయణబాబు ఉన్నారు. శ్రీశ్రీ కవిత్వాన్ని కూడా ‘తెలుగుకే ఆధునిక కవి శ్రీశ్రీ’ శీర్షికతో అనువదించారు. రాయప్రోలు అమలిన ప్రేమ కావ్యం ‘తృణకంకణాన్ని’ రేపాటి శంకరశాస్ర్తీ ‘తృణకంకిణీ’గానూ, గురజాడ అప్పారావు కవిత్వాన్ని భాను ‘గురజాడాకే కవితాయే’ పేరుతో అనువదించారు. గుర్రం జాషువ ‘్ఫరదౌసి’ అదే మానవ జీవన సంవేదనను ప్రతిబింబించే విధంగా దుర్గానంద్ ‘్ఫరదౌసి’ పేరిట అనువదించారు. తెలుగులో వచన కవితా పితామహుడైన పురిపండా అప్పలస్వామి 38 కవితల్ని గుర్రం సుబ్బారావు ‘తెలుగుకే ఆధునిక కవి పురిపండా’గా అనువదించారు. తెలుగులో రెండవ జ్ఞానపీఠ పురస్కృతులు డా. సి.నారాయణరెడ్డి గారి ‘విశ్వంభర’ను భీమసేన్ నిర్మల్ హిందీలోకి అనువదించారు. రుగ్వేందలో ఒక సూక్తి ఉంది- ‘అందరం కలిసి నడుద్దాం, ఒకే భాష మాట్లాడదాం, ఒకే విధంగా ఆలోచిద్దాం’ అని. ఇది ఋగ్వేద సంకల్పంగా ఉంది. కానీ కాలక్రమంలో మానవలోకంలో భాషల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అందుకే ఒకరిమాట మరొకరు తెలుసుకోటానికి అనువాదం అవసరం అయింది. తెలుగులో ప్రముఖ రచయితల చారిత్రక, సాంఘిక నవలలనేకం. ప్రముఖుల అనువాదాలుగా వెలువడినాయి. ముఖ్యంగా ఎక్కువగా సామాజిక నవలలు హిందీ పాఠకులను చేరటం ప్రశంసనీయం. అనువాదకులు రెండు భాషల్లోనూ ప్రవీణులు కావటం ప్రత్యకతగా శోభించింది. భారతీయ భాషలన్నిటిలో కథా సాహిత్యానికి ప్రత్యేక స్థానముంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో వచ్చిన ఉద్యమాలు, ధోరణులు అన్నీ కథా ప్రక్రియలో కూడా కన్పిస్తాయి. ఇతర ప్రక్రియలకంటే కథలు హిందీలోకి ఎక్కువగా అనువదింపబడినాయి. ఒకే రచయిత సంపుటాలు, వేరు వేరు రచయితల కథా సంకలనాలుగా వెలువడటంవలన పూర్తి వివరాలు ఉటంకించటం సాధ్యం కాదనే చెప్పాలి.

-డా సి.భవానిదేవి, 9866847000