సబ్ ఫీచర్

వందేళ్ళ గర్జనకు వందనాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంగ్లేయుల పాలనలో ‘మాకొద్దీ తెల్లదొరతనమూ దేవా, మాకొద్దీ తెల్ల దొరతనమూ’ అంటూ ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ళ సత్యనారాయణ కంచు కంఠం నుంచి వెలువడిన ఈ పాట ఆ రోజుల్లో ఊరూవాడా మార్మోగుతూ పెను సంచలనమే సృష్టించింది.
1920-22 మధ్యకాలంలో ఉవ్వెత్తున సాగిన సహాయ నిరాకరణోద్యమంలో గరిమెళ్ళ క్రియాశీలక పాత్రను పోషించారు. 39 చరణాలున్న ఈ పాట పెద్దల్ని, పిల్లల్ని, స్ర్తిలను పురుషులను, చివరకు బిచ్చగాళ్ళను, ఖైదీలను సైతం ఉత్తేజపరచింది. 1922లో అప్పటి గోదారి జిల్లా కలెక్టర్ బేకన్ ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అనే పాటను గరిమెళ్ళచే స్వయంగా పాడించుకొని విని, అది తెలుగు భాష రాని తనకు సైతం గగుర్పాటు కల్గించింది. ఇక స్వదేశీయుల్లో ఎంత ప్రభావం చూపుతోందని ఆలోచించి గరిమెళ్ళకు ఏడాది పాటు కఠిన కారాగారశిక్ష విధించారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా ‘కూలిపోతున్నది కూలిపోతున్నది / మూల మట్టముతోటి కూలిపోతున్నది ప్రభుత్వం / కూకటివేళ్ళతో కూలిపోతున్నది మూర్ఖ ప్రభుత్వం’ వంటి స్వాతంత్య్ర సమర గీతాలను ఎక్కుపెట్టడంతో ఆయనపై రాజద్రోహ నేరాన్ని మోపి మళ్లీ రెండున్నరేళ్ళు కఠిన కారాగారశిక్ష విధించారు. ఆయన జైలులో ఉండగానే 1923, 1924లలో తండ్రి, తాత మరణించారు. అయినప్పటికీ ఆయన వారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్‌కి దరఖాస్తు చేయలేదు. జైలులోనే తమిళం, కన్నడ నేర్చుకున్నారు. తమిళ ‘తిరుక్కురళ్’, ‘నందియార్’ కన్నడ భాషలో తళ్ళికోట తెలుగులోకి అనువదించారు. భోగరాజు పట్ట్భా సీతారామయ్య రాసిన ‘ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా’ని తెలుగులోకి అనువదించారు.
శిక్షాకాలం పూర్తయిన తరువాతనే బయటకు వచ్చాడు. ఆ పిమ్మట ఆయన భార్య, 1951లో ఆయన తల్లి మృతి చెందారు. ఇలా కష్టాలు, కన్నీళ్ళు వెంటాడినా వెనుదిరగలేదు. ఆంగ్లేయ ప్రభుత్వాన్ని దుయ్యబట్టే క్రమంలో సైతాను ప్రభుత్వం అంటూ 112 చరణాలతో దీర్ఘగేయాన్ని రచించాడు.
‘నూలుపోగుమీద రాజ్యమూగుతున్నదండి బాబు / సీమ నూలు తొంచితేను సితికిపోవునండి బాబు / తెల్లవారి రాజ్యం నూలు పోగుమీద ఊగుతున్నదట.. ఆ సీమ నూలుని కనక తెంచితే, ఆ ప్రభుత తునాతునకలైపోతుంది’ అని ఎలుగెత్తి పాడారు. దాంతో ఆంగ్లేయులు గరిమెళ్ళపై అభియోగాలను మోపి గేయం రెండో భాగాన్ని నిషేధించారు. రెండేళ్ళు కఠిన కారాగారశిక్షను విధించారు.
గరిమెళ్ళ జాతీయోద్యమ గీతాలనేకాక సమాజంలోని రుగ్మతలపైన, వర్గ దోపిడీలపైన కూడా పాటల్ని రాశారు. ‘అన్యాయ కాలంబు దాపురించినపుడు అందరమూ మేలుకోవాలండి’, ‘మాన్యల భోగాలు మనుజులందరికి కల్గు మార్గాలు వెతకాలి రండి’ అనే పాట ఆయనలోని సామ్యవాదతత్వాన్ని స్పష్టం చేస్తోంది. స్వాతంత్య్ర సమరంలో అశేష జన సామాన్యాన్ని తన కవితాధారలతో దేశభక్తిపూరితులను చేసి ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన గరిమెళ్ళ 1893వ సంవత్సరం జూలై 15న శ్రీకాకుళం జిల్లా గోనెపాడులో జన్మించి, ప్రియాగ్రహారంలో నివసించారు. బిఏ వరకు చదువుకొని తన కుటుంబ పోషణ కోసం ఒడిషాలోని గంజాం జిల్లాకలెక్టర్ కార్యాలయంలో ప్రధాన గుమస్తాగా, విజయనగరం ఎంఆర్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా పనిచేశారు. 1919 ఏప్రిల్ 13 నాటి జలియన్‌వాలాబాగ్ ఘటనకు ప్రభావితుడై ‘పాంచా లం’ అనే అద్భుత గీతం ద్వారా నిప్పులు చెరిగాడు.
1933లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ‘గృహలక్ష్మి’ మాసపత్రిక సంపాదకునిగా వ్యవహరించారు. ఆ తరువాత వాహిని, ఆంధ్రప్రభ దినపత్రికలకు సహాయ సంపాదకునిగా వ్యవహరించారు. ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అనే ఒక్క పాటతోనే ఆంగ్లేయుల గుండెల్లో ఇంత దడ పుట్టించిన రచయిత దేశంలో మరెక్కడాలేరు. స్వగ్రామం ప్రియాగ్రహారంలో తన తండ్రి నుంచి సంక్రమించిన ఇంటిని అమ్మేసి ‘శారద గ్రంథమాల’ స్థాపించి సాహిత్య సేవలను అందించారు. ప్రగతిశీల కవితా వ్యాప్తికీ, స్వాతంత్య్ర సాధనకు ఎనలేని సేవలందించిన గరిమెళ్ళ అంతిమ దశలో దయనీయ జీవితాన్ని గడిపాడు.
చివరి రోజుల్లో ఆయన కంటిచూపును కోల్పోయారు. కేవలం కప్పు టీ కోసం మద్రాసు నడిరోడ్లపై ప్రజల ముందు తల వంచుకొని భిక్షాటన చేస్తూ 1952 డిసెంబర్ 18న తుది శ్వాస విడిచారు. అగ్ని సదృశ్యమైన స్వాతంత్య్రోద్యమానికి గరిమెళ్ళ జంఝామారుతం. ఆయన కవిత్వం ఆజ్యం. ఆయన కాలంలో ఆయనంతటి జాతీయ కవి మరి లేడు అనిపించుకున్న వ్యక్తి గరిమెళ్ళ సత్యనారాయణ.
సుస్వరాజ్య సాధనకోసం ఎంతగానో తపించిన గరిమెళ్ళను తమిళనాడుకు చెందిన మహాకవి సుబ్రహ్మణ్య భారతితో పోల్చవచ్చు. అయితే గరిమెళ్ళకు రావలసిన గుర్తింపు రాలేదు. తమిళ ప్రజానీకం సుబ్రహ్మణ్య భారతిని ఇప్పటికీ కీర్తిస్తూ ఉండగా తెలుగు ప్రజలు మాత్రం గరిమెళ్ళను మర్చిపోయారు. ప్రజా పాటల త్యాగయ్యగా గుర్తింపు పొందిన గరిమెళ్ళ పేరుతో ఏదైనా ప్రముఖ విద్యా సంస్థకు నామకరణం చేయాలి. ఇందుకు ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలి.

- వాండ్రంగి కొండలరావు 9490528730