సబ్ ఫీచర్

ఒక ఊరు రెండు కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం ఊరు పేరు తెలియని తెలుగువారు దాదాపు ఉండకపోవచ్చు. ఆ ఊరుకి అంతటి పేరు రావడానికి కారణం ఒకప్పటి కళావంతుల రసికత. అందుకే పెద్దాపురం పేరు చెప్పుకోవడానికి కొందరు జంకుతారు కూడా! డెబ్బై ఏళ్ళ క్రితం అలాంటి ఊరు నేపథ్యంలో రెండు గొప్ప తెలుగు కథలు వెలువడ్డాయి. పెద్దాపురంలోని మనుషుల జీవన విధానాన్ని ఎంత ఉన్నతంగా చూపించాడంటే రచయిత, ఓసారి ఆ ఊరు చూసి రావాలనేంతగా.
తంగిరాల శంకరప్ప అనే నిరుపేద బ్రాహ్మణ యువకుడు పెద్దాపురం వచ్చాడు. రాజుగారి దర్శనం చేసుకోవాలని అతని కోరిక. రాజుగారికి చదరంగం అంటే వల్లమాలిన అభిమానం. అయితే చాలామందితో చదరంగం ఆడి సమఉజ్జీ దొరక్క తనతో ఆడి ఓడిన వాడి తల కోట గుమ్మానికి వేలాడదీస్తామని ప్రకటిస్తారు రాజు. అది విసుగుతో చేసిన ప్రకటన. అదంతా తెలుసుకుని రాజుతో చదరంగం ఆడాలని పెద్దాపురం వచ్చాడు శంకరప్ప. అతన్ని వీధిలోకి నెట్టివేస్తారు దివాన్జీ, ఠానేదారు.
రాజు కోసం నువ్వెళ్ళడం కాదు. రాజే నీ కోసం రావాలి అంటుంది ఆశ్రయం ఇచ్చిన పూటకూళ్ళ పెద్దమ్మ. అదిగో అపుడు మొదలవుతుంది నిజమైన చదరంగం ఆట. ఊళ్ళోని ప్రతి ఇంట్లో చదరంగం ఆడుతుంటారు. ఓ మాదిరి ఆటగాళ్ళని సులువుగా మట్టి కరిపిస్తాడు. ఒక్కసారిగా పెద్దాపురంలో కలకలం చెలరేగుతుంది. వరాహమూర్తి అని ఒకసారి రాజుగారితో చదరంగం ఆడిన వ్యక్తిని ఓడిస్తాడు. గమ్మత్తుగా ఆట ప్రారంభిస్తాడు శంకరప్ప. రంగనాయికి అనే రాజు ఆంతరంగిక పనిమనిషి. ఒక రోజు తన ప్రియునితో చదరంగం ఆడుతుంటే గది బయట నుంచి సలహా ఇచ్చి గెలిపిస్తాడు. శంకరప్ప ఆట చూడాలని సామర్లకోట రాజు పల్లకీ పంపిస్తే సున్నితంగా తిరస్కరిస్తాడు. ఎందుకంటే, అతని లక్ష్యం పెద్దాపురం మహారాజు శ్రీ వత్సవాయి చతుర్భుజటిమ్మ గజపతితో చదరంగం ఆడటం. తన కోరిక నెరవేర్చుకునే క్రమంలో శంకరప్పని ఉన్నత వ్యక్తిత్వంతోపాటు నేర్పు, లౌక్యం ఉన్న పాత్రగా తీర్చిదిద్దాడు రచయిత. అదే సమయంలో అంతకంటే ఉన్నతంగా రూపొందించాడు రాజు పాత్రని. దివాన్జీ, వరాహమూర్తి వంటివారు కుటిల మనస్కులు.
ఇది తొంభై మూడు పేజీల కథ. మొదలుపెడితే ముగించేవరకూ వదిలిపెట్టలేని అపురూపమైన కథ. భాష, భావ వ్యక్తీకరణ అసాధారణ రీతిలో వుంటుంది. శంకరప్ప కోటలోకి ప్రవేశించి రాజు ఎదుట నిలిచినపుడు రెండు పాత్రల మధ్య వున్న నిగూఢమైన మైత్రిని రచయిత వెల్లడించిన సందర్భంలో భాష కదం తొక్కుతుంది. రాజు, శంకరప్ప చదరంగంలో తలపడినపుడు అక్కడ నలుగురు ఉన్నారు. ఆ నలుగురూ రాజుతోను, శంకరప్పతోను ఆడినవారే. కాని ఇపుడు రాజు, శంకరప్పల ఆట వింతగా కనపడిందట. ఆ నడక కొత్తగా తోచిందట. కాకేమీ? సూచిభేద్యమైన గాడాంధకారంలోనే కదా మెరుపు తీగల చకచకలు. మందగజం తారసిల్లినపుడే కదా సింహంపిల్ల శౌర్యోద్రేకం. దిగ్దందుల ద్వంద్వ యుద్ధం భయంకరమే, అయినా ద్రష్టలకు దర్శనీయమే. పెద్దాపురం రాజుని దర్శించుకోవడానికి వచ్చాడు ఫకురల్లీఖాన్. శంకరప్పకి జరిగిన మర్యాదే జరిగింది. గులాబీ అత్తరు రాజుకి ఇష్టమని తెచ్చాడు. కాని రాజు దర్శనానికి దివాన్జీ అనుమతి ఇవ్వలేదు. అంతేకాదు తెచ్చిన అత్తర్లని, ‘ఏమిటీ కంపు’ అని చీదరించాడు. ఖాన్ తిరిగొచ్చాడు. అతనికి ఆ రాత్రి నిద్రలేదు. తెల్లవారిన మరుక్షణం ఠానేదార్ ఇంటికి చేరి అతని పాదాలమీద పడ్డాడు. ఇంతవరకూ అలాంటి గొప్ప అత్తర్లు పెద్దాపురం కోటకి రాలేదని, ఖానుకి మంచి సన్మానం జరగడం దివాన్‌కి ఇష్టం లేదని, చూశాడంటే మహారాజు అత్తర్లు విడిచిపెట్టడని- ఠానేదారుకి తెలుసు.
అందుకే మంచి సలహా ఒకటి ఇచ్చాడు. తెల్లవారు జామున కొండల్లోకి షికారుకి వెళతాడు రాజు. కోట ప్రాకారం దాటకుండా ఆయన కంట్లో పడాలి. నీవట్టి వేళ వారిని ఆకర్షించాలి. దివాన్జీకి మరుపు వస్తుంది. లేదంటే నువ్వు కోటలోకి ప్రవేశించలేవు అంటాడు ఠానేదార్. అలాగే నని బయలుదేరిన ఖానుని సిపాయిలు ఆపేసారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. చూస్తుండగానే మహారాజు చదరంగ సహచరులూ, దశావతారీ స్నేహితులు వచ్చారు. ఇంతలో రాజు బయలుదేరుతున్నాడనే కబురు రావడంతో ఖానుని గెంటడానికి సిద్ధపడ్డారు సిపాయిలు. ‘పెద్దాపురం రాజ్యంలో కళాకారులకి ఇదా సన్మానం?’ అంటూ ఆవేశంతో గులాబీ అత్తరు పైకి తీశాడు ఖాన్.
‘ఇది పెద్దాపురం ప్రభువు కోసం తయారుచేశాను. నిద్రాహారాలు మాని తయారుచేశాను. ఢిల్లీ పాదుషావారు అటూ, పెద్దాపురం ప్రభువువారు ఇటూ అన్న గౌరవభావంతో నా శక్తి అంతా వినియోగించి బొట్టుబొట్టుగా కూడబెట్ట్టినిది. దక్షిణ దేశంలో నా పేరు నిలిచిపోతుందన్న పేరాసతో నా రక్తం అనుకుంటూ కూడబెట్టినిది. అయితే పెద్దాపురం ప్రభువు ఎంత సరసులో వారి పరివారం అంత విరసమైందని ఇక్కడకు వస్తే కాని తెలుసుకోలేకపోయాను అని విసురుగా కోట గోడకి విసిరికొట్టాడు.
ఆ ప్రదేశం అంతా అత్తరు సౌరభంతో గుప్పుమంది. అందరూ ఆ పరిమళానికి మత్తెక్కినట్టయ్యారు. వెనక్కి తిరిగిన ఖాన్ కొయ్యబారిపోయాడు. పంచకళ్యాణిమీద రాజు సొక్కి ఉన్నాడు. మోర పైకెత్తి ఉండుండి సప్రయత్నంగా ఊపిరి తీసుకుంటోంది పంచకల్యాణి. ఇప్పటికీ ఆ ప్రదేశంలో గులాబీ అత్తరు గుబాళిస్తూనే ఉంటుందంటారు చూసివచ్చినవారు. వడ్లగింజలు, గులాబీ అత్తరు ఈ రెండు కథలు పెద్దాపురంలో జరుగుతాయి. వాటిలో రాజుని తప్పు పట్టడానికి ఏమీ ఉండదు. మా చుట్టూ బలమైన ఒక ప్రాకారం వుంది. అహితులనెప్పుడూ దూరంగా వుంచే అలవాటు చొప్పున అది ఒక్కొక్కప్పుడు హితులను కూడా దగ్గరకు చేరనివ్వదు అంటూ రాజు చేత చెప్పిస్తాడు రచయిత. సిబ్బంది అతిగా ప్రవర్తించడంవల్ల జరిగిన ఈ కథల్ని అద్భుతమైన శిల్ప నైపుణ్యంతో చెక్కారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ. ఈ కథలు రాసి డెబ్భై ఏళ్ళు దాటినా ఇప్పటికీ నూతనంగా ఉంటాయి. ఒకసారి చదివితే మరపురాని కథలే కాదు పెద్దాపురానికి సాహితీ గౌరవం కలిగించిన కథలు కూడా.

- మంజరి 9441571994