సబ్ ఫీచర్
పర్యాటక రచనలకు ఆద్యుడు వీరాస్వామయ్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఏనుగుల వీరస్వామయ్య పేరు స్ఫురణకు రాగానే చదువరులకు ప్రధానంగా గుర్తువచ్చేది ఆయన పేరిట ప్రచురణ అయిన ‘కాశీయాత్ర చరిత్ర’ అనే పుస్తకం. నిజానికి ఆయన దీనిని పుస్తక రూపంగా వ్రాయాలని సంకల్పించినట్లు ఆధారాలు లేవు. వీరాస్వామయ్యగారు (1780-1836) కాశీయాత్ర చేయడమేకాకుండా తన ప్రయాణ వివరాలు- సన్నాహాలతో సహా స్నేహితుడయిన శ్రీనివాస పిళ్ళెగారికి రోజువారీగా ఉత్తరాలు రాశారు. తీర్థయాత్రలు చేయడం తెలుగు ప్రజలకు అప్పటికీ- యిప్పటికీ బహుసరదా అయిన విషయం. కాకపోతే తన ప్రయాణ వివరాలతోపాటు దేశ చరిత్రకు ఆలంబన అయిన అనేక రాజకీయ, సాంస్కృతిక విషయాలను జోడించడం, ఆయా ప్రాంతాల జనుల ఆచార వ్యవహారాలు, దైనందిన దినచర్యల గురించిన విశేషాలు, కట్టుబాట్లు, నియమ నిషేధలు మొదలయిన వాటినన్నిటినీ బహుపరిశీలనగా చూచి, తరువాత తరాల వారికి సౌకర్యం కలిగించటానికి గ్రంథస్థం చేయడం గొప్ప విశేషం.
ఏనుగుల వీరాస్వామయ్య మే నెల 18వ తేదీన, 1830లో ఈ ప్రయాణం ప్రారంభించారు. తెలుగు దేశం నుంచి బయలుదేరి దారిలో తగిలిన చప్పన్న దేశాలను చూచి, అన్నిటినీ సమీకరించుకుంటూ, రానుపోను ప్రయాణంలో వలయునన్ని రాష్ట్రాలను సందర్శించి అక్కడి విశేషాలను అక్షరాలతో మలిచారు. 1836లో వారు పరమపదించిన తరువాత, శ్రీనివాస పిళ్ళెగారు స్నేహితుని జ్ఞాపకార్థం ఈ పుస్తకాన్ని 1838లో ప్రచురించారు. అందుచేత-ఈ పుస్తకం యిప్పటికే పాఠకులకు చేరువ అవటానికి ముఖ్యకారణం శ్రీనివాసపిళ్ళెగారు అని గుర్తుపెట్టుకోవడం చాల అవసరం. కర్త, కారయిత, ఆమోదకుడు కూడా ఒక పనికి ఆలంబనం అని ఒక వాడుక వున్నది. ఎందరో మహానుభావులు పూనుకుంటే గాని, యిటువంటి పని ప్రారంభంకాదు. ప్రభవించదు, ప్రచారంలోనికి రాదు. ఏనుగుల వీరాస్వామయ్యగారు మదరాసు మహానగరంలో పుట్టిపెరిగిన వ్యక్తి. ఆయన జీవిత బాల్య వివరాలు యెక్కువగా తెలియరావు. అయితే ఆయన వయసు వచ్చిన తరువాత జరిపిన కార్యకలాపాలు, నెరవేర్చిన మహత్తర కార్యాలు మాత్రం అనేకచోట్ల ప్రస్తావన అయినాయి. అతి చిన్న వయసులోనే ఆయన తండ్రి గారిని పోగొట్టుకోవడం జరిగింది. తన స్వయంకృషితోనే చదువుసంధ్యలు సాధించి, బహుభాషా సంజ్ఞానం సంపాదించారు. ఆయనకు సంస్కృతం, తమిళం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి ప్రావీణ్యం లభించింది.
1819లో మదరాసు హైకోర్టులో అనువాదకుడు, ద్విభాషిగా ఉద్యోగం ప్రారంభించి, ఆ శాఖకు ప్రథమస్థాయి ఉద్యోగిగా విరమణ చేశాడు. ఆయనకు రాజకీయ, సాంఘిక మత సంబంధమయిన విషయాలలో మంచి పరిచయం అవగాహన వున్నాయి. ఈ సంబంధమయిన ఉత్తరాలను తరుచుగ పత్రికలలో వ్రాసి తన అభిప్రాయాలను స్ఫుటంగ సూటిగ తెలుపుతూ ఉండేవారు. మదరాసు నగరం జీవితానికి సంబంధించి ఆయన నెరవేర్చిన అంశాలు రెండు ప్రధానంగా పరిచయం చేసుకోవాలి. మొదటిది జార్జినార్టన్‌తో కలిసి పచ్చయప్ప కాలేజిని ప్రారంభించడానికి తన సహాయ సహకారాలు అందించడం, ఈ కృషిలో ఆయనకు మరింత ఆలోచన యిచ్చినవారు వెరుబక రాఘవాచార్యులు, కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళెగారలు (ఈ పిళ్లెగారే కాశీయాత్ర చరిత్ర పుస్తక సమాకర్త, ప్రచురణకు మూలకర్త).
రెండవది మదరాసు హిందు లిటరరీ సొసైటీ అనేది ప్రారంభించి, సమకాలిక యువకులలో సంస్కృతి, సాహిత్య విషయాలను గురించి తగిన ప్రోత్సాహం కలిగించడం. ఈ సొసైటీలో చరిత్ర, రాజకీయ శాస్త్రం, ఇంగ్లీషు సారస్వతం మొదలయిన సాంస్కృతిక విషయాలపై ఉపన్యాసాలు పలువురు ప్రముఖులచేత యిప్పించేవారు. ప్రజలలో చైతన్యం, స్ఫూర్తి తీసుకురావటానికి అవసరం అయిన సరంజామా అంతా సమకూర్చేవారు. మదరాసు నగరంలో ఆరోజులలో రాజకీయ చైతన్యం తీసుకురావటానికి ఈ సంస్థ యెంతగానో దోహదం చేసింది.
ఈయనకు సి.పి.బ్రౌన్ దొరతో ప్రత్యక్ష పరిచయం, స్నేహం వున్నాయి. వీరస్వామయ్య- బ్రౌన్‌ల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు విరివిగా జరుగుతూ వుండేవి. ‘ఏనుగుల వీరాస్వామి జర్నల్’అనే పేరుతో ఎ.పి. గవర్నమెంట్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారు ప్రచురించిన గ్రంథంలో రుూ ఉత్తరాలు కొన్ని వున్నాయి.
మొదటిదిప్పుడున్నట్టుగ వీరస్వామయ్యగారు యాత్రాగ్రంథ రచనలకు ఆర్యుడు. ఆయన గ్రంథం మాదిరి అయింది. తరువాత వచ్చిన రుూ ‘సాహిత్య రూప’ రచనలకు సాహిత్యం అనేక రూపాలలో పల్లవిస్తుంది. పద్యంనుండి గద్యానికి ప్రయాణంచేసిన సాహిత్యం రచనలలోనే అనేక శాఖోపశాఖలుగా విస్తరించింది. యాత్రాగ్రంథాలు, ఉత్తరాలతో కూర్చిన పుస్తకాలు, సమకాలిక సామాజిక చరిత్రకు ఆధారాలుగా ముందుకు వచ్చాయి. ఆత్మచరిత్రలలో అందని విషయాలు అనేకం రుూ సాహిత్య రూపంలో ప్రదర్శింపడం అవటానికి ఆస్కారం వుంది. ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒరిస్సాలోని జగన్నాథ సడక్(రోడ్డు) గురించిన వివరాలు- చారిత్రక విషయాలు. ఈ పుస్తకంలో ఎక్కువగా దొరుకుతాయని ప్రచారం. జగన్నాథ సడక్ అనేది కలకత్తానుంచి, పూరీ వరకు వెళ్లే కాలిదారి. అప్పటి ప్రయాణికులకు ఉపయోగపడిన రహదారి. దీని నిర్మాణం 1700లో జరిగిందట 1825నుండి దీనిని పేరుమార్చి ఒరిస్సా ట్రంక్ రోడ్ అనడం ప్రారంభించారట. 1898లో రైలుమార్గం ఏర్పడిన తరువాత ఈ పాతరోడ్డు ప్రాముఖ్యం తగ్గిపోయి, పాతబడిపోయింది.
ఇటువంటి అనేక చారిత్రక ఆధారాలు రుూ పుస్తకంలో లభిస్తాయి. 18 మే 1830లో ప్రారంభంఅయిన కాశీయాత్ర, ఒక సంవత్సరం మూడు మాసాల అయిదు రోజులు నిరాఘాటంగా జరిగి కాశీ చేరుకుంది. ఈ ప్రయాణం చేసిన వందమంది యాత్రికులలో వీరస్వామయ్యగారు ప్రధాన వ్యక్తి. మదరాసునుంచి బయలుదేరి యిప్పటి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరియా రాష్ట్రాల మీదుగా పర్యటన జరిగింది. ఒరియాలోని బహుప్రాంతాలు మండలాలు దర్శించారు.
ఒరిస్సాలో తిలక సరస్సు, గంచాల, భద్రపూర్, బదలిపురం ప్రాంతాలు యిప్పటికీ తెలుగు జనాభాతో వున్నాయి. తిరుగు ప్రయాణంలో బీహార్, ఎంగర్‌కోన్ చూశారు. వీరాస్వామయ్యగారు ఈస్ట్ ఇండియా కంపెనీవారు ఆమోదించిన వర్తక ప్రముఖుడు కూడా. కాశీయాత్ర చరిత్ర పుస్తకం వ్రాతప్రతి యిప్పటికీ మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో ఉన్నది. ఇది సమగ్రమయినది. ప్రచురించిన ప్రతి అంతటినీ తనలో చేర్చుకోలేదనే చెబుతారు. 15-12-1821 తేదీతో వీరస్వామయ్య సి.పి.బ్రౌన్‌కు వ్రాసిన లేఖ యింగ్లీషు లిపిలో వున్నది. ఈ ఉత్తరంలో ఆయన తన యాత్ర మార్గాన్ని విపులీకరించడమేకాక సమస్త హిందూ పుణ్యస్థలములు, నదులు, మతములకు సంబంధించిన విశేషాలు, హిందూ పురాణ, జ్యోతిశ్శాస్త్ర వివరాలు చేర్చామని తెలిపారు. బ్రౌన్ దొరకు కొన్ని పురాతన గ్రంథాలు సేకరించడంలో కూడా ఈయన సహకరించారు.
బహుముఖమయిన ప్రయోజనాలను సిద్ధింపచేసిన వీరస్వామయ్యగారి జీవనయానం ఎంతో సార్థకమయినదీ, కృతార్థం అయినదీ అన్న విషయం తెలుగుజాతి గమనించవలసిన ముఖ్య సూత్రం. ఆయన ‘కారణజన్ముడు’ అనడంలో యెలాంటి సంశయం, సందేహం అవసరం లేదు.
*
(డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన
‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి...)
*