సబ్ ఫీచర్
తెలుగుతల్లి పాదార్చనలో త్రిమూర్తి కీర్తిమంతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ పత్రికా ప్రకటనమునందు నా యుద్దేశములు రెండు. భాషాభివృద్ధితో దేశాభివృద్ధి నేనేర్పఱుచుకొన్న భాషాభివృద్ధి మార్గము, తెలుగు భాషలో మృదువైన సులభశైలిని సలక్షణమైన వచన రచన చేయుట’’ ఆధునిక తెలుగు వచన శైలికి ఆద్యులైన సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగంగారు, స్వీయ చరిత్రలో పేర్కొన్న వివేకవర్ధని పత్రిక ప్రస్తావనలోని వాక్యాలివి. కందుకూరి వీరేశలింగ కవికి స్మృతి చిహ్నంగా అంకితం యివ్వబడిన గిడుగు వెంకటరామమూర్తిగారి ‘ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం’, వ్యాసం ప్రథమ ముద్రణగా వెలుగు చూసింది. వ్యావహారిక భాషను బహిష్కరించి గ్రాంథికాంధ్రాన్ని ప్రతిష్ఠించాలనే మహామహోపాధ్యాయులైన పండిత ప్రకాండులైన వేదం వెంకటరాయశాస్ర్తీ, జయంతి రామయ్య, కొక్కొండ వేంకటరత్నం వంటి పండిత భిషక్కులు, లౌకిక భాషాదేవి సంరక్షణలోనే పండిత భాషాదేవిని రక్షించుకోవాలని, లౌకిక భాష పట్ల గ్రామ్యద్వేషాన్ని విడనాడాలని, గిడుగు వెంకటరామమూర్తి కొరడా ఝుళిపించిన రోజులవి. ‘ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం’ వ్యాసం తెలికిచెర్ల వెంకటరత్నం సంపాదకునిగా, గుంటూరునుంచి 1933లో పునర్ముద్రితమైంది. తెలుగు భాషకు సంబంధించి ప్రాచీన, ఆధునిక నిక్షిప్త చారిత్రక అంశాలను ఎన్నింటినో వెలుగులోకి తెచ్చిన నిరంతర మేధా పరిశోధనా సాహితీ జిజ్ఞాసి డా.అక్కిరాజు రమాపతిరావు యిటీవల గిడుగువారు నడిపించిన ‘తెలుగు’ పత్రిక శత జయంతి సందర్భం గుర్తుచేస్తూ, ఆ మహనీయుని మాతృభాషా సేవామూర్తిమత్వం ప్రతిబింబింపచేసారు. వ్యవహారిక తెలుగు భాషోద్యమ యుగకర్త, ద్రష్ట అయిన గిడుగు వెంకట రామమూర్తి 1919 సెప్టెంబరు- 1920 ఫిబ్రవరి వరకు అత్యంత ప్రయాసతో ఉద్యమ సేవానిరతి స్ఫూర్తిగా నడిపిన ‘తెలుగు’ మాస పత్రికలో ఆవిష్కరింపబడిన ‘్భష భేషజం’ వ్యాసం వ్యవహారిక భాషా ఆవిర్భావానికి శుభోదయ విప్లవ తరుణంలో సృజించబడిన ‘మేగ్నాఛార్టా’గా ఆరాధించుకోవలసి వుంది. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావుగారు, వదాన్యతను చూరగొన్న పునర్ముద్రిత గ్రంథం సప్తతి తమ జన్మదినోత్సవ ప్రచురణగా, గిడుగువారి మిథ్యాపవాదం, భాషా భేషజ వ్యాసాలతో వ్యాసావళి, బాలకవి శరణ్యము, గద్య చింతామణి నాటి విశాలాంధ్ర ప్రచురణాలయం వెలువరించారు.
గిడుగు-కందుకూరి సాన్నిహిత్యం
‘మిథ్యాపవాదం’ వ్యాసంలో కందుకూరి వీరేశలింగంగారితో గిడుగు వెంకటరామమూర్తిగారి వాడుక భాషా ప్రచార ఉద్యమ సాన్నిహిత్యం స్పష్టమవుతోంది. 1919 జూన్‌లో ఆంధ్ర సాహిత్య పరిషత్ అష్టమ వార్షిక సభాధ్యక్షునిగా వేదం వేంకట రాయశాస్ర్తీ, అప్పటికే స్వర్గస్థులయిన కందుకూరిని పరోక్షంగా విమర్శించటం కారణంగా గిడుగువారి ప్రతి తీవ్ర విమర్శ గ్రాంథేయవాదులకు చెంపపెట్టు అయింది. అంతకుముందు పాఠశాలలలో ఉపయుక్త పాఠ్యాంశాల ప్రణాళిక దృష్టిలో పెట్టుకొని కందుకూరి వీరేశలింగం, గ్రామ్యభాషలో రాసిన గ్రంథాలను పాఠశాలలో ఉపయోగించటం పట్ల తన వ్యితిరేకత స్పష్టం చేసారు. వ్యవహారిక భాషా ఉద్యమం ఫ్రెంచ్ విప్లవంకంటే ప్రమాదకరమైనదని తన కావ్యభాషా సమర్ధనం (ఇన్ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు) పుస్తకంలో హెచ్చరించి, గిడుగును వ్యతిరేకించిన, గ్రాంధేయవాద ప్రముఖుడు జయంతి రామయ్య. తన ఆధునికాంధ్ర వాఙ్మయ వికాస వైఖరి గ్రంథంలో 1912 నవంబరులో మద్రాస్ పచ్చయ్యప్ప కాలేజీలో జరిగిన ‘గ్రామ్యాదేశ నిరసన సభాధ్యక్షుడైన కందుకూరి, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక 1వ సంపుటంలో ప్రచురితమైన ఉపన్యాసాన్ని రామయ్యగారు, తన వాదనకు అనుగుణంగా స్పష్టీకరించారు. ‘‘ఇటీవల వీరేశలింగంగారు పలువురకు సులభముగా తెలియునటుల శైలిని మార్చుకొన్నారు. స్వభావంచేత ఆయన గ్రాంథికశైలి ప్రసన్నమైనది. సాంఘికాచార సంస్కరణ ఆవశ్యకమని జనులకు బోధించు పని పెట్టుకొనుటచే వ్యాసాదులను సులభములగు పదాలను ఉపయోగించి, సంధులు అచ్చటచ్చట సడలించి భాషా లక్షణము చెరపకుండా సులభశైలి కల్పించారు’’అని కూడా జయంతి రామయ్య పేర్కొన్నారు. వీరేశలింగంగారి పూర్వశైలికి, మారిన శైలికి గల భేదాన్ని చూపటానికి జయంతి రామయ్యగారు వీరేశలింగం గారి పూర్వ రచన నీతిచంద్రిక నుండి కొన్ని వాక్యాలు, తరువాతి రచనలు నవలల నుండి, కొన్ని వాక్యాలు పోలికగా తన గ్రంథంలో పేర్కొని న్యాయం చేసారు.
గ్రాంథికం నుంచి లౌకిక భాష వైపు...
ప్రాచీనాంధ్ర కావ్యాలలోని భాషను ఉపయోగించి తొలి దశలో చిన్నయసూరి భాషాశైలిలో, కందుకూరి వారు నాడు విగ్రహం, సంధి రచించారు. ఆ భాషాశైలి అయుక్తమని గ్రహించిన తరువాత గ్రాంథికాన్ని నిరసించారు. పైగా అట్టి ఆయుక్తమైన శైలితో నాడు రచించినందుకు తననుతాను నిందించుకొన్నట్టు స్వీయచరిత్ర రెండో భాగం 156 పుటలో స్వయంగా ప్రకటించారు. తరువాత పండితులు ఆక్షేపించినా, నిందించినా ఆయన లక్ష్యపెట్టలేదు. ఎన్నోసార్లు వ్యావహారిక భాషాప్రచార ఉద్యమాలకు మద్దతుగా గిడుగుతో చురుకుగా పాల్గొన్నారు. చిట్టచివరిగా 1919 ఫిబ్రవరి 28న, స్వయంగా వర్తమాన వ్యావహారికాంధ్ర భాషాప్రవర్తన సమాజం రాజమహేంద్రవరంలో స్థాపించారు. వ్యవహారిక భాషా ఉద్యమసారధి గిడుగువారు కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో వీరేశలింగం కవుల చరిత్ర రెండవ కూర్పు అచ్చువేయించటానికి ఆ గ్రంథాన్ని సవరిస్తున్నారు. ‘‘ఈ పని పూర్తికాగానే వాడుక భాషలో గ్రంథ రచనకు పూనుకొంటానని ఆ సభలో చెప్పారు. అయితే మన దురదృష్టంచేత మరి మూడు నెలలకే కాలం చేసారు’’ అన్నారు. గిడుగు వెంకట రామమూర్తిగారు తన వ్యాసావళిలో.
సనాతన వీరగ్రాంథిక భాషావాద పండిత ప్రకాండుల ఉడుము పట్టు సడలింపచేసి, వారి పరిష్యంగంలో చిక్కిశల్యమవుతున్న మాతృభాషకు జీవం ప్రసాదించిన గిడుగువారు కారణజన్ములు. 1863 ఆగస్టు 29న జన్మించి, 1940 జనవరి 22న లోకాన్ని వీడిన గిడుగు జయంతిని, మాతృభాషా దినోత్సవాన్ని స్మృత్యంజలి ఘటించటం ఎంతైనా సముచితం. కవి సమ్రాట్ విశ్వనాథ, ‘తెలుగు సరస్వతి నోముల పంట’గా గిడుగును ప్రశంసించారు. బ్రిటిష్ ప్రభుత్వం రావుబహదూర్, మద్రాస్ ప్రభుత్వం కైజర్-ఎ-హింద్ బిరుదులతో గౌరవించింది. వ్యావహారిక భాషోద్యమానికి నేతృత్వం వహించిన గిడుగు వెంకటరామమూర్తి, కందుకూరి వీరేశలింగం, గురజాడ వెంకట అప్పారావుల త్రిమూర్తి మంతం, తెలుగు భాషామతల్లి గ్రాంథిక సంకెళ్ళు సడలించి తేట తెలుగు మాధుర్యం నాల్కలపై తేలియాడే వాడుక భాషగా విలసిల్ల చేసింది. తెలుగుజాతికి అదే ప్రాణప్రతిష్ఠ.