సబ్ ఫీచర్

తెలుగు వాడకానికి సవ్యమైన దారిదీపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘...వాడెవడు, నన్ను జూడు. అదిగాదు - అనే ప్రయోగాలు సర్వత్రా వినిపిస్తుంటాయి. ఆ మాటల్లో సంధి దాగుందని మాట్లాడేవాళ్ళకు తెలీదు, వినేవాళ్ళకూ తెలీదు. సంధికి మాటలను తేలిక పరిచే స్వభావం ఉన్నందువల్ల అవి అప్రయత్నంగా వ్యవహారంలో ఇమిడిపోయాయి. వ్యాకరణం గూడా వాటిని ఇనుప గుగ్గిళ్ళుగాకాక, వ్యవహారమంత యధాలాపంగా సమర్పిస్తే, విద్యార్థికి తేలిగ్గా జీర్ణవౌతుంది’ అని ఎం.వి.రమణారెడ్డిగారు ‘‘తెలుగింటి వ్యాకరణం’’ పుస్తకంలో రెండవ భాగం ప్రారంభంలో (పేజి-63) పదాల సంయోగం గురించి ఉపోద్ఘాతం రాస్తూ అంటారు. ఈ మాటలు మొత్తం ఈ రచనకున్న అంతఃస్ఫూర్తిని అందిస్తున్నాయి.
***
తెలుగులో గ్రామరుందా? అనే గుంపు ఒకటుంటే; ఇంగ్లీషు గ్రామరు తెలుసుకుంటే చాలు అనే వర్గం ఇంకోటి. షూరుగా మార్కులొచ్చేది తెలుగు గ్రామరులోనే అనే విద్యార్థులు కొందరుంటే; సంస్కృతం తీసుకుంటే ఫుల్లు మార్కులనే విద్యార్థులు మరెంతోమంది. తెలుగు గ్రామరంటే గైడ్లలో దొరుకునది అని ఎంతోమంది పిల్లలు భావించినా ఆశ్చర్యం లేదు. ఇంగ్లీషు మీడియం వేలంవెర్రి పెరిగాక; టీవీ ఛానళ్ళు భాష, మొబైల్ మెసేజిల భాష వచ్చాక తెలుగు సమస్యలు మరిన్నీ, పరిస్థితి మరింత దయనీయం!
డాక్టరీ చదువుకున్న లాయరుగారు రాజకీయాల్లో దిగి- విశే్లషణలు, అనువాదాలు, చరిత్ర రచన వంటివి చేసి లేదా చేస్తూనో- వ్యాకరణం గురించి పుస్తకం వెలువరించడం ఏమిటి? మరీ పుష్కలంగా కలాలు విదిలిస్తున్న మహాశయులు, పండితులు, సాహితీవేత్తలు, భాషోద్యమకారులు, పరిశోధకులు ఈ ప్రాథమిక అవసరాన్ని ఎందుకు పట్టించుకోలేకపోయారు? అది తెలుగు భాష దురదృష్టం, తెలుగువారి ముందుచూపులేమి! హేతుబద్ధత, చారిత్రక దృష్టి, వర్తమాన కోణం, సామాజిక ప్రయోజనం అనేవి మాత్రమేకాక తెలుగు భాషమీద అచంచలమైన ఇష్టం రమణారెడ్డిగారి రచనలలో తారసపడతాయి. ఒక ఐదేళ్ళుగా వారి రచనలు కొన్నింటిని దగ్గరగా పరిశీలించాను. తెలుగువారు గర్వపడేలా ప్రపంచ చరిత్రను సమగ్రంగా, సవ్యంగా కుదించి ఇస్తూ ఇప్పటికే మూడు సంపుటాలు ప్రచురించారు రమణారెడ్డిగారు. తీరేందుకు వేచివున్న కోరికలు-అంటూ మూడో సంపుటానికి ముందుమాట రాస్తూ తెలుగులో కొరతలుగా మిగిలిన రెండింటిలో ఒకటి అప్లయిడ్ గ్రామర్ వంటి రచన అని వివరించి అపరిమితమైన ఆశ్చర్యం కల్గించారు. చాలాకాలం క్రిందటే కొంత తయారై, మూలపడింది అని కూడా అంటారు. అయితే ఇంత త్వరగా వెలుగు చూస్తుందని అనుకోలేదు. అందుకే ఆనందాన్ని వ్యక్తీకరించాలని ఈ నాలుగు మాటలు. భాష బ్రతికుంటేనే జాతి బ్రతికుంటుంది. భాషకున్న గౌరవమే జాతి గౌరవం- అంటూ ముగిసే ఆ ముందుమాట రెండో పేరాలో ఈ వ్యాక్యాలున్నాయి! ‘‘అన్య భాషనుండి వచ్చిన సంస్కృత పదానికి ‘తత్సమం’గా మొదటి స్థానం కల్పించి, తెలుగు పదాన్ని మూడవ స్థాయికి దించే నామోషీ వ్యాకరణానే్న ఇప్పటికీ మనం అనుసరిస్తున్నాం. అంతేగాకుండా, పదాల కూర్పు, చేర్పులకు క్రమబద్ధీకరణ స్పష్టంగా లేకపోవడంతో కంప్యూటర్ ఆటోతో తప్పులు సరిదిద్దుకొనే వసతి కరువై, తమిళులకంటే మనం వెనుకబడి వున్నాం. అందువల్ల, ఇంగ్లీషు రెన్ అండ్ మార్టిన్ వ్యాకరణం ఆధారంగా, మన భాషకు అనువైన రీతిలో ఉత్తరోత్రా మరింత ఎదుగుదలకు ప్రాతిపదికగా వుండే ప్రాథమిక వ్యాకరణం కూర్చాలనేది నా సంకల్పం.’’ - ఇదీ ఎం.వి.రమణారెడ్డిగారి ఈ తెలుగు వ్యాకరణం ప్రణాళిక! ఇందులో తెలుగు తలఎత్తుకుని ఎదుగుతూ సాగాలనే కోరికా, భాష మరింత ప్రయోజనకరంగా మారుతూ వెళ్ళాలనే ఆకాంక్ష విశేషంగా కనబడుతున్నాయి.
***
విజ్ఞానపు ప్రపంచం విస్తరించక ముందు, జటిలమైన సంస్కృతంలో రాసిన వ్యాకరణ గ్రంథాలు సరిగా అర్థంకాక, సవ్యంగా వివరించే దిక్కులేక- ఆసక్తిఉన్నవాళ్ళు దిక్కుమాలిన గైడ్లలో వ్యాకరణం చదువుకునే పరిస్థితి దాపురించింది. సరే, సవ్యమైన, సమగ్రమైన రీతి అంటే ఏమిటి అంటారా? ఈ విషయం చూడండి :‘‘ఒకానొకప్పుడు తెలుగు భాషకు 36 అక్షరాలే ఉండేవి. కాలక్రమంలో వేలాది సంస్కృత పదాలు ఇందులో చేరిపోవడంవల్ల వాటిని పలకడానికి అవసరమైన అక్షరాలనుగూడా దిగుమతి చేసుకోవలసి వచ్చింది.’’
‘‘ఇంగ్లీషు వంటి యూరోపియన్ భాషల్లో అక్షరాన్ని విడిగా పలికేందుకు వాడే శబ్దంవేరు. అదే అక్షరం పదంలో ఇమిడినపుడు పలికే శబ్దం వేరు. భారతీయ భాషల్లో అక్షరమే శబ్దం. విడిగానూ అదే శబ్దం, పదాల మధ్యనూ అదే శబ్దం. అందువల్ల, తెలుగు అక్షరాలు నేర్పించే ఉపాధ్యాయులు తమ వృత్త్ధిర్మంలో భాగంగా విద్యార్థులకు తెలుగు అక్షరాలను నిర్దిష్టంగా, నిర్దుష్టంగా పలికే విధానాన్ని అలవాటుచేయడం తమ ప్రాథమిక కర్తవ్యంగా స్వీకరించాలి.’’ ‘‘అచ్చుతో కలిసినపుడే హల్లులకు ఒక స్వభావమూ, తెలుగు నాలికల మీద తిరిగే ఒడుపూ కలుగుతుంది.’’ ‘‘హిందీ గాయకులతో పాడించిన తెలుగు పాటలు వింటే చ, జ, లు పలకడంలో చూపించే తేడాలో ఎంత తెలుగుదనం ఇమిడి ఉందో తేలిగ్గా తెలిసిపోతుంది.’’ ప్రణాళికగా చెప్పుకున్న చట్రం ఎలా రూపు ధరించిందో ఈ వాక్యాలు మనకు తేటతెల్లం చేస్తాయి.
***
ఇంతవరకు ఎవరికి అవసరంపడని, ఎవరూ తలపెట్టని వ్యాకరణం తన ఆరోగ్యాన్ని పణంగాపెట్టి తయారుచేశారు ఎం.వి.రమణారెడ్డిగారు. ఇక సరైన రీతిలో వినియోగించుకోవడమనేది మన విజ్ఞత మీద, అప్రమత్తత మీద ఆధారపడి ఉంటుంది. ఇక తెలుగుకు సంబంధించి రమణారెడ్డిగారు పేర్కొన్న రెండవ కొరత నిఘంటువులకు సంబంధించి. తప్పిపోయిన పదాల పట్టిక ఉంది గానీ నిఘంటువు శక్తిలేదని వారే రాశారు. మరి పరిష్కారం? దీనికి సంబంధించి నాకు స్ఫురించిన తరుణోపాయం ఏమిటంటే తెలుగు నిఘంటువులెక్కని పదాలను అకారాది క్రమంలో, వారు భావించిన రీతిలో ఒక అనుబంధ నిఘంటువు తయారుచేయగలరేమో ఆలోచించాలి! వ్యాకరణం, నిఘంటువు సంబంధించికాక మరో విషయం గురించి కూడా రమణారెడ్డిగారు ఆలోచించాలని నా కోరిక. తెలుగుకు కంప్యూటర్ తోడ్పాటు, కంప్యూటర్లో తెలుగు, ఇతర భాషలతో పోలిస్తే కంప్యూటర్ వాడకంకోసం తెలుగుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, వగైరాలకు సంబంధించి కూడా తన సూచనలను, ప్రతిపాదించే ప్రణాళికను అక్షరబద్ధం చేయాలని తెలుగును నిరంతరం ప్రేమించేవాడిగా నా విన్నపం. రమణారెడ్డిగారి రచనల కరచాలనం అవిచ్ఛిన్నమైన స్ఫూర్తి!

- డా. నాగసూరి వేణుగోపాల్, 9440732392