సబ్ ఫీచర్

ప్రజాకవి కాళోజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల గురించి, ప్రజలకోసం, ప్రజల భాషలో కవిత్వం రాసిన అచ్చమైన ప్రజాకవి కాళోజీ. తెలంగాణ ప్రసిద్ధకవుల్లో కాళోజీ ఒకరు. కాళోజీ కవిత్వమంతా నిరంతరం తన చుట్టూ జరుగుతున్న సామాజిక సంఘటనలను ఆశ్రయించి ఉంటుంది. వైయక్తిక జీవితానికి, కవిత్వానికి మధ్య పవిత్రమైన వైరుధ్యం కాళోజీ కవిత్వంలో కనిపించదు. తన భావాలను వీలైనంత తేలికగా వ్యక్తం చేయడమే కాళోజీ లక్ష్యం. తన కవిత్వంలో ప్రజా జీవితాన్ని చిత్రించిన ప్రజాకవి కాళోజీ.
అవనిపై జరిగేటి అవకతవకల చూచి / ఎందుకో నా హృదిని ఇంతా ఆవేదనా? అంటూ పరితపించిన ప్రజాకవి కాళోజీ. స్వాతంత్య్ర సమరయోధుడైన ఆయన తెలంగాణ తొలితరం ఉద్యమనేత. ‘నా గొడవ’ తదితర రచనలతో తెలంగాణ ప్రజలను జాగృతం చేశారు. 1992లో కేంద్రం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ‘కాళోజీ మాటల్లో కల్తీలేదు, వేమన్న మాటల్లో వెలితి ఉండదు’ అంటాడు దాశరథి. అన్యాయాలకు, దోపిడీలకు, ధనస్వాముల పెత్తనాలకు వ్యతిరేకంగా కలం చేతబట్టి తెలంగాణ ప్రజలందరికీ ఆప్తులయ్యారు కాళోజీ. చిన్నప్పటినుంచి చివరి శ్వాస వరకూ స్వేచ్ఛకోసం పరితపించిన వ్యక్తి. కాళోజీకి మాతృదేశమన్నా, మాతృ భాష అన్నా అమితమైన అభిమానం. ఈ రోజుల్లో నిత్య వ్యవహారానికి తెలుగుకు బదులు ఆంగ్లం రాజ్యమేలుతోంది. నిజాం రాజ్యపాలనలో ఉర్దూ రాజ్యమేలింది. భాష విషయంలో ఆయనది విశాల దృక్పథం. ఎవరి వాడుక భాషలో వారు రాయాలన్నదే కాళోజీ సిద్ధాంతం. మనుష్యులమైనందుకు తోటి మనుషుల గురించి ఆలోచించడం, అవసరమైతే వాళ్లకోసం పోరాడటం అన్నది కాళోజీ నమ్మిన, ఆచరించిన సిద్ధాంతం. కాళోజీ 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో (ఉపాధ్యాయ నియోజకవర్గం) ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ కాలంలోనే ఎక్కువ కవితలు రాశారు. ఇటు రాష్ట్రంలో జరిగే ప్రజావ్యతిరేక ధోరణులను, జాతీయస్థాయి రాజకీయాలను ఘాటుగా విమర్శించారు. ఆయన పనె్నండు కవితా సంపుటాలు ‘‘నా గొడవ’’ పేరుతో వచ్చాయి.
అన్య భాషలు నేర్చి / ఆంధ్రమ్ము రాదంచు / సకిలించు ఆంధ్రుడా / చావవెందుకురా! ‘నీ భాష దీనతకు, నీ వేష దుస్థితికి, కారకుడు నీవేయని కాంచవెందుకురా’ అని కాళోజీ విమర్శించారు.
‘అన్నపు రాశులు ఒకచోట / ఆకలి మంటలు ఒకచోట / హంస తూలికలు ఒకచోట / అలిసిన దేహాలు ఒకచోట / సంపద అంతా ఒకచోట / గంపెడు బలగం ఒకచోట / వాసన నూనెలు ఒకచోట / మాసిన తలలు ఒకచోట’ అని సమాజంలోని అసమానతలను తెలంగాణ నుడికారంలో సరళంగా, స్పష్టంగా తన కవిత్వంలో రాసి ధన్యుడైన కవి కాళోజీ. జీవితాంతం పౌర హక్కులకోసం ప్రత్యేక తెలంగాణకోసం పోరాటం చేశారు. హోదాలకు, పదవులకు నీచమైన విషయాలకు ఎలాంటి విలువనివ్వని కవి కాళోజీ. ‘ఉదయం కానే కాదనుకోవడం నిరాశ / ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ’ అని ఆయన సందేశం. ప్రతి కొత్త భావంలోని మంచిని స్వీకరిస్తూ వచ్చిన విశ్వప్రేమికుడు, ఆదర్శవాది కాళోజీ. గణపతి ఉత్సవాలు, గ్రంథాలయ ఉద్యమం, ఆర్య సమాజ కార్యక్రమాలు, రజాకార్ల ప్రతిఘటన, స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహాలు, తెలంగాణ రైతాంగ పోరాటం, పౌర హక్కుల పోరాటాలు మొదలైన అన్ని ఉద్యమాలకూ స్పందించిన నిత్య సమరశీలి కాళోజీ. న్యాయం, ధర్మం, రాజ్యాధికారంకోసం ప్రజలను చైతన్యపరచి నాటి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ప్రజాగొంతుక కాళోజీ.
అన్యాయాన్ని ఎదిరించటం నా జన్మ హక్కు, నా విధి / అన్యాయానె్నదిరిస్తే నా గొడవకు సంతృప్తి, / అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి, ప్రాప్తి / అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు - ఇలా నిరంతరం ప్రజల గురించి పరితపించిన ప్రజాకవి కాళోజీ. 1914 సంవత్సరం సెప్టెంబరు 9న బీజాపూర్ జిల్లా రట్టిహళ్లిలో జన్మించి, తండ్రి వెంట హనుమకొండకు వచ్చి తెలంగాణ వాదిగా జీవించాడు. తల్లి పేరు రమాబాయి. తండ్రి పేరు శ్రీకాళోజీ రంగారావు. భార్య పేరు రుక్మిణీబాయి. కుమారుని పేరు రవికుమార్. కాళోజీ పూర్తిపేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత శ్రీనివాసరావు రాంరాజా కాళోజీ నారాయణరావు. తల్లి కన్నడిగ, తండ్రి పూర్వీకులు మహారాష్టన్రుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ కుటుంబం వారిది.
ఏ సిద్ధాంత చట్రంలోను ఇమడకుండా, ఏ యిజాన్ని భుజానికెత్తుకోకుండా ప్రజల సమస్యల పైనే పోరాడిన అలుపెరిగిన కలంయోధుడు కాళోజీ. ఆంధ్ర సారస్వత పరిషత్తు సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘ్ అధ్యక్షుడిగా, తెలంగాణ రచయితల వేదిక గౌరవ అధ్యక్షుడిగా పనిచేసి, తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేశారు.
‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది’ లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ గురించి కాళోజీ రాసిన ఈ పంక్తులు కాళోజీ జీవితానికి వర్తిస్తాయి.
నేనంటే తిరుగుబాటుదారు / నా గొడవ మన
తిరుగుబాటు/ అని ప్రకటించుకున్న కవి సాహసి కాళోజి. జీవితంలోనైనా రచనలోనైనా నిజం చెప్పడం అత్యవసరమన్నారు. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది. వరంగల్‌లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టబడింది.
తెలంగాణ తొలి పొద్దు కాళోజీ. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ ‘సామాన్యుడే నా దేవుడు’ అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13న తుదిశ్వాస విడిచారు. ఆయన మరాఠీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో పండితుడు. అణాకథలు, కాళోజీ కథలు, నా గొడవ, ఇదీ నా గొడవ, తెలంగాణ ఉద్యమ కవితలు లాంటి రచనలు చేశారు. అందులో ముఖ్యంగా కాళోజీ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ‘నా గొడవ’. భాష రెండు తీర్లని చెపుతూ ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాషగావలె అన్న కాళోజీ మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు.

- కె.రామ్మోహన్‌రావు, 9441435912