సబ్ ఫీచర్

రసజ్ఞుడైన రాజు రఘునాథనాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రదేశ రాజకీయం, సాహిత్య చరిత్రలకు సంబంధించి 17వ శతాబ్దకాలం ఎంతో విశిష్టమైంది. ఈ కాలంలో ఆంధ్ర పాలకులను గాని, ఆంధ్ర సాహిత్యాన్నిగాని పరిశీలించాలంటే దక్షిణాంధ్ర యుగమే ముఖ్య ఆధారం. ఆంధ్రదేశంలో విజయనగర సామ్రాజ్యం రాక్షస తంగడి యుద్ధంతో దాని ప్రతిభ మసకబారింది. విజయనగర వారసులు నామమాత్రంగా పెనుగొండను రాజధానిగా చేసుకుని జీవిస్తున్నారు. అప్పటికే దక్షిణాంధ్ర ప్రాంతంలో తంజావూరు, మధుర, చెంజి మొదలైన ప్రాంతాలు విజయనగర సామంతులుగా స్థిరపడ్డారు. ఈ రాజ్యాలలో కూడా విజయనగర వైభవాన్ని పుణికి పుచ్చుకుని, వారికి అత్యంత ఆత్మీయులుగా వెలుగొందినవారు తంజావూరు నాయకరాజులు. ఈ తంజావూరు నాయకరాజులలో బహుముఖ ప్రజ్ఞాశాలి రఘునాథ నాయకుడు.
తంజావూరును పాలించిన నాయక రాజులలో మూడవవారు రఘునాథ నాయకుడు. వీరి తండ్రి అచ్యుతప్ప నాయకుడు. తల్లి మూర్తిమాంబ. రఘునాధ నాయకుని ముందు అచ్యుతప్పనాయకుడు. అతనికి ముందు అతని తండ్రి చెవ్వప్పనాయుడు. తంజావూరు రాజ్యాన్ని పాలించారు. ఈ రాజ్యస్థాపన క్రీ.శ.1550 ప్రాంతంలో జరిగినా రఘునాథ నాయకుడు రాజ్యపాలనకు వచ్చేవరకు సాధారణ రాజ్యంగానే ఉంది. 1614లో రఘునాథ నాయకుడు తంజావూరు పీఠాన్ని అధిరోహించిననాటినుండి తంజావూరు వైభవం నలుదిశలకు విస్తరించింది. వీరి కాలంలో తంజావూరు రమానటి నర్తక రంగశాల, సరస్వతి విలాసాలకు ఆలవాలంగా నిలిచింది.
రఘునాథ నాయకుడు కవి పండిత పోషణలోను, సరస సాహిత్య రంగాలలోను, పరమత సహనంలోను ఇలా ఎన్నో విషయాలలో విశేషమైన విశిష్ట వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి బహుముఖ ప్రజ్ఞాశాలిగ కీర్తికెక్కారు. కనుకనే తెలుగు నాయకరాజులు అన్న వెంటనే స్ఫురించే పేరు రఘునాథ నాయకుడు.
తంజావూరు రఘునాథ నాయకుడు యుద్ధానికి వస్తున్నాడన్న సంగతి పెనుగొండ కోటను ముట్టడిస్తున్న గోల్కొండ సైన్యాలకు తెలిసి కలవరపడ్డాయంటే, రఘునాథ నాయకుని శక్తిసామర్థ్యాలు ఎలాంటివో అర్థమవుతుంది. రఘునాథుడు యుద్ధంలో పాల్గొనడంతో వెంకటపతి రాయలకు ఎనలేని ధైర్యంవచ్చినట్లు అయినది. అంతేకాదు సైన్యంలో కూడా ఎంతో ఉత్సాహం ఏర్పడి ఆ యుద్ధంలో విజయం సాధించేలా చేసింది. చిన్నవాడయినా అపార శక్తిసామర్థ్యాలు చూపి తనకు విశేష విజయాలు అందించిన రఘునాథ నాయకుని ఎంతగానో అభిమానించి వెంకటపతిరాయలు సన్మానించారు.
రఘునాథ ఖ్యాతిని విన్న చెంజి అంతఃపుర స్ర్తిలు రఘునాథుని కలిసి తమ రాజు వెంకటపతి రాజుగారి చెరసాలలో బంధింపబడినాడని, విడిపించమని ప్రాధేయపడగా చెంజి కృష్ణప్పను విముక్తున్ని చేయమని రఘునాధుడు వెంకటపతి రాయలను కోరాడు. తనకు అపారమైన విజయాన్ని అందించిన రఘునాథుని కోరిక అంగీకరించడమేకాక, తన కోసమేకాకుండా పరులకోసం అలాకోరడాన్ని అభినందించి చెంజి కృష్ణప్పను విముక్తుడుని చేస్తారు. అందుకు కృతజ్ఞతగా చెంజి కృష్ణప్ప తన కుమార్తె లక్ష్మమ్మను రామనాధునికి ఇచ్చి పెళ్లిచేస్తాడు. ఈ వార్త విన్న నేపాళ రాజకాంతలు ఆపదలో ఉన్నవారిని రఘునాధుడు రక్షిస్తాడని మొరపెట్టుకోగా వారిని ఆపదలనుండి రక్షించి తన విశాల స్వభావాన్ని ప్రకటిస్తాడు. (నేపాల్ అంటే హిమాలయాల దగ్గర ఉన్న నేపాల్ కాదు. సింహళంలోని జాఫ్నాను పాలించేవారు.) ఇలా రఘునాథుడు యుద్ధానికివెళ్లి పెళ్లికొడుకుగా తిరిగి రావడం అచ్యుతప్ప నాయకునికి ఎంతో ఆనందం కలిగింది. అందుకు కొడుకు ఎదురేగి స్వాగతం పలికాడు. తమ్ముడి గొప్పతనాన్ని అసూయపడిన పెద్దకొడుకును చెరసాలలో పెట్టిస్తాడు. ఇలా అసమాన ప్రావీణ్యం కలిగిన రఘునాథునకు తంజావూరు రాజ్యపట్ట్భాషేకం చేసిన ఆనందంతో తన 370 మంది భార్యలతో అచ్యుతప్ప నాయకుడు వానప్రస్థానంకొరకు శ్రీరంగం తరలిపోయాడు.
ఇలా రఘునాథ నాయకుని ఖ్యాతి నలుదిశలకు విస్తరించింది. శత్రురాజులు తంజావూరుపై దండెత్తడానికి వెనుకాడారు. ఇలా 10 సంవత్సరాలపాటు దిగ్విజయంగా పాలన సాగించారు. అయితే తంజావూరు రాజులకు ప్రక్కనేఉన్న మధుర నాయకులకు విరోధం ఉండేది. మధురను పాలించే కృష్ణప్ప నాయకుని మరణంతో ఆతని కుమారుడు ముద్దు వీరప్పనాయకుడు తంజావూరుపై దండెత్తగా రఘునాథుడు ఆతన్ని జోడించి ఘోరంగా పరాభవిస్తాడు. ఈ విధంగా తంజావూరు నాయక రాజుల చరిత్రలో రఘునాథ నాయకుని కలం స్వర్ణయుగంగా పేరుప్రఖ్యాతులు కావించింది. ఆ తర్వాత కొంతకాలానికి రఘునాథ నాయకుని మరణానంతరం తంజావూరుకు విజయరాఘవ నాయకుడు రాజ్యపాలకులుగా నియమితులయ్యారు. రఘునాథ నాయకునికి యుద్ధం అంటే ఎంత ఇష్టమో అలాగే సంగీత, నాట్యకళలన్నా అంతే మక్కువ. కేవలం మక్కువ మాత్రమేకాదు. అందులోను చక్కని ప్రతిభాపాటవాలు కలిగినవాఠు. వీణావాద్యంలో వీరికి ఎంతో నైపుణ్యం ఉంది. వీరి ప్రతిభను చూసి సాక్షాత్తు ఆ కలహభోజుడు నారదుడే గురువైవచ్చి రఘునాథునికి ఈ నైపుణ్యాన్ని అందించాడా అన్నంతగా ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు తన కొలువు కూటంలో విదుషీమణులు కీచులాడుకునే సన్నివేశాలను సైతం సజీవ చిత్రాలుగా మలిచేవాడు. వారి నోటపలికే సంగీత కళారహస్యాలను కూడా చక్కగా పలికించాడు. ఇలా సంగీత నాట్యకళలంటే అభిరుచి మాత్రమేకాక ఆయా రంగాలలో మహారాజు ప్రత్యేక ప్రతిభను కనబరచడం విశేషంగా చెప్పవచ్చు.
యుద్ధ విద్యలు, సంగీత నాట్య కళలలోనే కాక సాహిత్య రంగంలో కూడా విశేషమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అంటే రాజ్యపాలనలోను, సాహిత్య రచనలోను, కవి పండిత పోషణలోను, గాయనీ గాయకులకు ఆశ్రయం ఇచ్చే దానిలోను ఇలా అనేక విధాలుగా సాహిత్య రంగానికి సేవచేశారు. రఘునాథ నాయకుడు కవిపోషకుడే కాదు అంతకుమించిన గొప్ప సాహితీవేత్త. వీరి కలం నుండి ఎన్నో విశిష్ట రచనలు వెలువడినాయి. ఆరుద్ర మాటలలో చెప్పాలంటే ‘రఘునాథుని రచనలలో కూడా నయం, రసోదయం, నుడికారం అను మూడు త్రివేణిలాగా ప్రవహిస్తూ ఉంటాయి’ అంటారు. దీనినిబట్టి వీరి సాహిత్య సృజన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రఘునాథ నాయకుని కావ్య రచనలో ఎంత నేర్పుకలదో ఆశుకవిత్వం చెప్పడంలో కూడా అంత దిట్టగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ఒకరోజు రాత్రి చుట్టూ లేఖకులను కూర్చోబెట్టుకుని పారిజాతాపహరణము అనే ప్రబంధాన్ని ఆశువుగా చెప్పుకుంటు పోయాడు. వ్రాయసగాళ్ళు వ్రాయలేకపోయారు’’ అనే ప్రశంస ప్రజాబాహుళ్యలో ఉంది. ఇలా సాహిత్య సృష్టిలో రఘునాథ నాయకులు 11 రచనలు చేసినట్లు తెలుస్తుంది. సంస్కృత రచనలు మూడు. అవి భారత కథా సంగ్రహం, రామాయణ కథాసారం, సంగీత సుధ అనే రచనలు. ఇక తెలుగు గ్రంథాలు ఎనిమిది. వాటిలో ప్రబంధాలు మూడు. అవి పారిజాతాపహరణం, రామాయణం, వాల్మీకి చరిత్ర, ద్విపద కావ్యాలు మూడు. అవి అచ్యుతాభ్యుదయాలు, గజేంద్రమోక్షం, నలచరిత్ర, యక్షగానాలు రెండు. అవి జానకీ పరిణయం, రుక్మిణీకృష్ణ వివాహం మొదలైన రచనలు చేసినట్లుగా తెలుస్తుంది.
వీరి కొలువులో కవులేకాక కవయిత్రులు కూడా అనేక రచనలు చేశారు. రామభద్రాంబ, మధురవాణి మొదలైన కవయిత్రులు వీరి కొలువుకూటంలో ఉన్నారు. అంతేకాక రఘునాథ నాయకుడు దాదాపు 20 గ్రంథాలను కూడా అంకితం తీసుకున్నారు. ఇలా అనేక విధాలుగా సాహిత్య రంగంలో తన నైపుణ్యాన్ని చాటి పలువురిచేత ప్రశంసలు అందుకున్నారు. రఘునాథ నాయకుడు రాజకీయ పాలనలోను, యుద్ధ తంత్రాలలోను, సంగీత నాట్యాది కళలలోను, సాహిత్య రంగంలోను తనదైన ప్రత్యేక ప్రతిభను ప్రదర్శించి ఆంధ్రదేశ చరిత్రలోనేకాక తెలుగు సాహిత్యంలో కూడా విశిష్టమైన స్థానాన్ని అలంకరించారు. చరిత్రలో వనె్నకెక్కి, కీర్తించబడుతున్న శ్రీకృష్ణదేవరాయలు, భోజమహారాజుల ఇద్దరి విశిష్ట లక్షణాలను పుణికి పుచ్చుకున్న ప్రత్యేక వ్యక్తిగా రఘునాథ నాయకుడు నిలిచిపోతారు.

(డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన
‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి...)

- డా.విస్తాలి శంకరరావు