సబ్ ఫీచర్
తెలుగు భాషోద్యమశీలి పుష్పరాజ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు భాష పట్ల ప్రజలకు మమకారాన్ని పెంచి, తమిళ భాష ఆధిపత్యాన్ని గూర్చి ఆలోచింప చేసిన వ్యక్తి బి.జె.డబ్ల్యూ. పుష్పరాజ్. భాషావ్ఢ్యౌ ప్రభావాన్ని ఎదుర్కొని ఎదురీదిన యోధుడు. అవి ఉగాది వేడుకలు. చెన్నపురి ఆంధ్ర మహాసభ వేదిక. నేను నా మిత్రుడు ఆ కార్యక్రమానికి వెళ్ళాము. సభ ప్రారంభమైంది. కాని ఏ ఒక్కరూ తెలుగులో మాట్లాడడం లేదు. హేమాహేమీలైన తెలుగు రాజకీయ నాయకులూ అందులో ఉన్నారు. సభామర్యాదలకై ఓపికపట్టారు. కాని ఓపిక నశించింది. ఉన్నచోటునుండే ఇది తెలుగువారి పండుగా లేక ఏదైనా రాజకీయ బహిరంగ సభ అని ఎలుగెత్తి అరిచాను. నా అరుపులు విన్న ఒకాయన నా దగ్గరకు వచ్చారు. ‘ఏమండీ! కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. నాకు తెలుగు స్పష్టంగా మాట్లాడడం తెలియదు. అయితే తెలుగంటే నాకు ప్రాణం’ అని ఏదో సర్దిచెప్పబోయారు. వచ్చిరాని తెలుగులో ‘ఏమండీ! ఈ మాట్లాడే తెలుగే ఆ వేదికపై మాట్లాడండి. అదే మాకు ఆనందం’ అనటంతో ఆయన సంతోషించి నాతో చేతులు కలిపారు. ఎంత చిత్రంగా జరిగిందో చూడండి ఆయనతో నా పరిచయం. ఆయనే పుష్పరాజ్. ఆ చెప్పిన మాటల్లో ఎంత వినయం, ఎంత సహనం, మరెంత వివేకం.
ఆ తర్వాత వారితో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. వారు వారి ఉద్యోగరీత్యా తమిళనాడులోని పలు ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేది. అయినా ఆయన ప్రయత్నాలు కొనసాగేవి. తమిళనాడులో దాదాపు 300 పైచిలుకు తెలుగు సంఘాలు ఉండేవి. వారు తమ స్వంత ఖర్చుతో కరపత్రాలను ముద్రించి ప్రతి తెలుగు సంఘానికి పంపేవారు. దాదాపు 1972నుండి సాగిన ఈ ప్రయత్నాలు 10 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగాయి. సుమారు 70 సంఘాల నుండి మాత్రమే స్పందన లభించినట్లు చెప్పేవారు. అయినా నిరాశ చెందక తన ప్రయత్నాన్ని కొనసాగించేవారు.
మాంటెగ్ ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల ఫలితంగా తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన వారందరూ తెలుగువారే. కాని కామరాజ్ నుండి ఎం.జి.ఆర్. మొదటిసారి ముఖ్యమంత్రి అయినంతవరకు, వారి మంత్రివర్గాలలో ఒక్క తెలుగువారికి కూడా మంత్రి పదవి దక్కలేదు. దానికి స్పందిస్తూ పుష్పరాజ్‌గారు ‘సదరన్ తెలుగుపీపుల్స్ ప్రోగ్రెసివ్ యూనియన్ సంస్థ’ ద్వారా దాదాపు 700 విన్నపాలు పంపేవారు. దాని ఫలితంగా తర్వాతి మంత్రివర్గాలలో తెలుగువారికి మంత్రి పదవులు దక్కాయి. తెలుగు భాషను విస్తృతపరచాలనే ఉద్దేశంతో పుష్పరాజ్‌గారు 1993లో ‘తెలుగు భాషా ప్రచార సమితి’ అనే సంస్థను స్థాపించారు. వావిలాల గోపాలకృష్ణయ్య గౌరవాధ్యక్షులుగాను, ఆరుద్ర అధ్యక్షులుగాను, వై.యస్.శాస్ర్తీ ప్రధాన కార్యదర్శిగాను, కె.హరిప్రసాద్‌రెడ్డి కోశాధికారిగాను, పుష్పరాజ్‌గారు కార్యదర్శిగాను నియమితులయ్యారు. కాని ఆ ప్రయత్నంలో ఆశించినంతమేరకు ఫలితం దక్కలేదు. అది అలానే మరుగునపడిపోయింది. అందుకు కొందరి సహాయ నిరాకరణే కారణం.
పుష్పరాజ్‌గారు పెద్దవారు. 1935 సంవత్సరంలో జన్మించారు. పైగా ప్రభుత్వ ఉద్యోగి. మంచి అనుభవంగలవారు. మా మాటల్లో వారు అనేవారు. తమిళనాడులో భాషాపరంగా తెలుగువారు మూడురకాలుగా ఉన్నారు. ఒకరు ఇప్పటికీ తెలుగు చదవడం, రాయడం తెలిసి ఆచార వ్యవహారాల్లో తెలుగును పూర్తిగా నిలబెట్టుకుంటున్నవారు. రెండవవారు తెలుగు చదవడం రాకపోయినా ఇంట్లో మాట్లాడుకుంటున్నవారు. మూడవవారు ఏవో కొద్ది మాటలను తప్పించి తెలుగును దాదాపు మరిచిపోయినవారు. ఈ మూడు రకాలలో మొదటి తరగతివారికి తెలుగు భాషను గురించి చెప్పాల్సిన పనిలేదు. రెండవ రకానికి చెందిన వారికి కొంచెం శ్రద్ధతీసుకుంటే తెలుగును నేర్పించవచ్చు. ఇక మూడవ తరగతి వారిని గురించే శ్రమపడాలి. ఆంధ్రప్రదేశ్‌లో అనేక మాండలికాలు ఉన్నప్పటికీ అక్కడో ప్రామాణిక భాష ఉంది. ఆ ప్రామాణిక భాష తెలిసిన వ్యక్తి ఇక్కడి వీరి మాండలికాలను కాస్త అర్థంచేసుకుని కొంత శ్రమతీసుకొని తెలుగును నేర్పగలిగితే వీరూ తెలుగు నేర్చుకుంటారు. ఎందుకంటే దక్షిణ తమిళనాడులో తెలుగు లిపే తెలియని ఎందరో తెలుగువారు ఉన్నారు. అయితే వారు తెలుగువారమని ధైర్యంగా చెప్పుకుంటారు. అదే నాకు ఎంతో ఆనందం. కాని ఈ ప్రయత్నానికి ఎవ్వరూ సహకరించకపోవడం దురదృష్టకరం అంటూ వాపోయేవారు పుష్పరాజ్‌గారు. ‘ఏ ప్రభుత్వం కూడా నేరుగా ఏ భాషకు వ్యతిరేకత చూపడం కుదరదు. తమిళనాడులో తమిళం తప్ప ఇతర భాషలను చదివితే ఉద్యోగాలు రావని, బ్రతుకుదెరువు దొరకదని కొందరు అధికారులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. వారి భాషపై వారికి ఉన్న మక్కువ ఇతర భాషలను అణగద్రొక్కుతున్నాయి. ఇటువంటి విధానాలవల్ల తెలుగు ప్రజలలో భీతి ఏర్పడింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేకనే ‘వేలాది తెలుగుబడులు మూతబడ్డాయి’ అని అంటూ తన ఆవేదనను వెలిబుచ్చేవారు.
వారు ఎప్పుడు నాతో మాట్లాడినా తెలుగు భాష, తెలుగువారి సమస్యలో ప్రస్థావనకు వస్తాయి. తమిళనాడులో 40 శాతం పైగా తెలుగువారే ఉన్నారు. కాని ప్రభుత్వం 7.1% మాత్రమే అంటున్నది. ఇది తప్పు. వారు చెప్పే సంఖ్య తెలుగురాయడం, చదవడం గలవారికి సంబంధించినది. మరి భాష రాయడం, చదవడం రాకపోయినా మాట్లాడే వారి సంగతి ఏంటీ? అందువల్ల అందరిని కలుపుకుంటే మనంచెప్పే ఆ నలభై శాతం సంఖ్యే నిజమైనది అని అంటారు పుష్పరాజ్‌గారు. తెలుగుభాషా పరిరక్షణకై వారు నిర్వహించిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి. అపుడు నందమూరి తారకరామారావుగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడులోని తెలుగువారి సమస్యలు ఆయనకు బాగా తెలుసుకాబట్టి వారికి విన్నవించుకునేందుకు తమిళనాడు నుండి ఒక ప్రతినిధి బృందం వెళ్ళాలని పుష్పరాజ్‌గారు నిర్ణయించారు. వారు, వారితోపాటు వి.ఎస్. రామానాయుడుగారు, కీర్తిశేషులు పి.ఆర్.అనంతయ్యగారు, నేను ఆ బృందంలో సభ్యులం. ముఖ్యమంత్రిని కలిసేముందు హైదరాబాద్‌లో పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించాం. అందు తమిళనాడులోని తెలుగువారి సమస్యలను ఏకరవుపెట్టాము. ఇలాకూడా తమిళనాడులో జరుగుతుందా! అని ఆశ్చర్యపడే కొందరు విలేకరులను గమనించాం. దాదాపు 25 మంది తెలుగు, ఆంగ్ల పత్రికలకు చెందిన విలేకరులు పాల్గొన్నారు. సమావేశం బాగానే జరిగినది. మరుసటిరోజు నందమూరివారితో సమావేశం. వెళ్ళాము. సమస్యలను ముఖ్యమంత్రిగారికి వివరించారు. వెంటనేవారు కొన్ని సమస్యల పరిష్కారానికై మాముందే చర్యలుతీసుకున్నారు. అది నిజంగా పుష్పరాజ్గారికి దక్కిన చక్కటి ఫలితం. కాని దురదృష్టవశాత్తు వాటిని కూడా ఆచరణలో పెట్టలేని దుస్థితి. పుష్పరాజ్‌గారు అందుకు చాలా కుంగిపోయారు. అందువల్ల కొంతకాలం వౌనం పాటించారు కూడా. అయినా తమ పోరాటాన్ని కడవరకు కొనసాగించారు.
అటువంటి పోరాటయోధుడు కర్తవ్యమే పరమావధిగా భావించే బి.జె.డబ్ల్యూ.పుష్పరాజ్గారి పూర్తిపేరు బాలస్వామి జోసఫ్ విలియమ్స్ పుష్పరాజ్. వీరు 1935 సెప్టెంబర్ 21న ఆర్.ఎం.బాలస్వామినాయుడు, జోసెఫిన్ క్యాథరిన్ పద్మాగార్లకు తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలోని శ్రీరంగరాజాపురంలో జన్మించారు. వీరు అక్కడే బి.ఏ.వరకు చదువుకున్నారు. పుట్టినప్పటినుంచి 1958లో ఉద్యోగంలో చేరేవరకు అనగా ఇరవై ఏండ్లకు పైగా తమిళనాడులో తెలుగు భాషాసంస్కృతిని గురించి అవగాహనే లేదంటున్న పుష్పరాజ్‌గారు యావత్తు తమిళనాడులోని తెలుగు ప్రజల భాషా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై నడుంగట్టి ఉద్యమం నిర్వహించడం ఎంత ఆశ్చర్యం! ఎంత సాహసం! అటువంటి పోరాటయోధుడు, ప్రజల మనిషి, నిరాడంబరుడు 2012 అక్టోబర్ 31న చెన్నైలో కన్నుమూయడం తెలుగు భాషోద్యమానికే గొడ్డలిపెట్టు.
(డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన ‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి...)