సబ్ ఫీచర్

జాషువా గ్రంథాలు.. పద్య సుమగంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సాహిత్య చరిత్రలో కవిగా ప్రజాపక్షం వహించి, తన కలాన్ని ఝుళిపించి, సాహిత్యాన్ని సామాన్యుని ముంగిట అసామాన్యం చేసినవాడు, నవీన వాఙ్మయ రత్నగర్భలో గుండెలను కరిగింపగల భావావేశ పూరితములైన కావ్యములను రచించినవాడు తెలుగుజాతి గర్వించదగ్గ తెలుగు తల్లి ముద్దుబిడ్డ గుఱ్ఱం జాషువా. గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో వీరయ్య, లింగమాంబ దంపతులకు 1895 సెప్టెంబర్ 28న జన్మించాడు. జాషువా ప్రాథమిక విద్యాభ్యాసము వినుకొండలోనే జరిగింది. సమాజంలో జరుగుతున్న అమానవీయ సంఘటనలకు ఎదురొడ్డి నిలిచి కష్టాలు, కడగండ్లను అధిగమించి జీవితంలో మడమతిప్పని వీరుడిలా ముందుకు నడిచాడు. వినుకొండలోనే ఉపాధ్యాయుడిగా జీవనాన్ని ప్రారంభించి, టూరింగ్ సినిమాలకు వ్యాఖ్యాతగా, ప్రభుత్వ సాంగ్ అసిస్టెంట్ పబ్లిసిటి ఆఫీసర్‌గా బాధ్యతలను నిర్వర్తించి, ఆల్ ఇండియా స్పోకెన్ వర్ట్ ప్రొడ్యూసర్‌గా, గుంటూరు లూథరన్ హైస్కూల్‌లో తెలుగు పండితునిగా విధులు నిర్వహించాడు. సమకాలీన సమాజానికి దర్పణాలైన గాథలను కథావస్తువులుగా గ్రహించి కవితావ్యాసంగంలో అందెవేసిన చేయిగా అగ్రతాంబూలాన్ని అందుకొన్నాడు. అందుకే నవయుగ చక్రవర్తి, కవి కోకిల, మధురశ్రీనాథ, పద్మశ్రీ, కవితావిశారద, కవిదిగ్గజ, కళాప్రపూర్ణ వంటి బిరుదులు వారికి అలంకారాలయ్యాయి. కనకాభిషేక గండపెండెర సత్కారాలతోపాటు పగలు దివిటీల మధ్య ఏనుగు అంబారీపై ఊరేగి కవికులానికే గౌరవాన్ని తెచ్చాడు.
ఖండకావ్యాలు జాషువా కవికి అఖండ ఖ్యాతిని, అనంతవ్యాప్తిని తెచ్చాయి. ఆయన రచించిన ఏడు ఖండకావ్య సంపుటాల్లో దాదాపు 200పైగా ఖండికలున్నాయి. గబ్బిలము, పిరదౌసి, స్వప్నకథ, కొత్తలోకము, నేతాజి, బాపుజి, ముసాఫిరులు, ముంతాజమహలు, కాందిశీకుడు, నా కథ, స్వయంవరము, రాష్ట్ర పూజ, నాగార్జునసాగర్. క్రీస్తు చరిత్ర, నవలికల్లో చిన్ననాయకుడు, నాటకాల్లో ధృవ విజయము, హిమద మార్క పరిణయము, చిదానంద ప్రభాతము, రుక్ష్మిణీకల్యాణము, మీరాబాయి, తెరచాటు మొదలగు రచనలు చేశాడు. మతాచారాల్లోని అంధ విశ్వాసాలను జాషువా ఖండించాడు. ఆయనకు పేదరికం సహనాన్ని నేర్పితే కులతత్వం ఎదరించే లక్షణాన్ని నేర్పింది. అందుకే కులమతాలు గీచుకున్న గీతల నడుమ కట్టుబడకుండా విశ్వనరుడిగా మానవతావాదాన్ని తన ప్రబోధంగా విశ్వవ్యాప్తం చేశాడు. ఆయన రచనలు సంస్కృత, ఆంగ్ల, హిందీ, కన్నడ జర్మన్ భాషల్లోకి అనువాదమయ్యాయి.
జాషువా వచన గ్రంథాలతోపాటు, పద్మగద్యాత్మకమైన నాటకాలు కూడా వ్రాశాడు. జాషువా కీర్తిప్రతిష్ఠలకు, ప్రధాన కారణాలు ఆయన పద్యగ్రంథాలే. వాడియైన కత్తికి మనుషులను ఆహారంగా ఇచ్చే రాతి గుండెగల తురుష్క భూపతి కుటిల స్వభావాన్ని, బంగారు కవిత్వాన్ని వెండితో తూచే కఱకు మనస్కుడ్ని వివరించే గాథను ‘ఫిరదౌసి’ కావ్యంగా, అంతరించిపోతున్న దేశభక్తిని ప్రేరేపించే రీతిగా మహరాష్ట్ర భూపతి చరిత్రను ‘శివాజీ’ ప్రబంధంగా మలచాడు. పేదల కడగండ్లను గాంచి కార్చిన వేడి కన్నీటి బిందువైన ’’అనాధ’’ను, పుణ్య హృదయులకు పుణ్యలోకాలు లభిస్తాయనడానికి సాక్షీభూతంగా ‘‘స్వప్నకథ’’ను రచించాడు. జగదేకసుందరి, భువనైక మోహిని ముంతాజ్ సౌందర్యాన్ని వర్ణించే ప్రసిద్ధ కావ్యం ‘‘ముంతాజ్ మహల్’’ను ప్రేమజీవుల పవిత్ర ప్రణయ చిహ్నంగా చిత్రించాడు. తన జాతి దీనగాథలను పరమేశ్వరునకు వినిపించుటకై జాషువా వ్రాసిన హృదయ విదారకమైన సందేశ కావ్యము ‘‘గబ్బిలము’’ను, హింసా హింసావాదాలకు ప్రతీకగా ‘‘కాందిశీకుడు’’ను, తన గుండెలలో గూడు కట్టుకున్న దేశాభిమానానికి నిదర్శనంగా వ్రాయబడిన కావ్యాలు ‘‘బాపూజీ, నేతాజీ, స్వయంవరం. ‘‘రాష్ట్ర పూజ’’ కావ్యాన్ని వ్రాసి తనకున్న ఆంధ్రాభిమానాన్ని చాటుకున్నాడు. ఆ కోవలోనే వ్రాయబడిన మరో కావ్యం ‘‘నాగార్జున సాగరం’’. క్రైస్తవుల ఆరాధ్యదైవం ప్రభువును గూర్చి ‘‘క్రీస్తు చరిత్ర’’ కావ్యంలో వివరించగా, లోపరహిత సమాజాన్ని గుర్తించి ‘‘కొత్తలోకము’’లో, వర్ణవ్యవస్థను విమర్శిస్తూ వ్రాసిన ‘‘ముసాఫరులు’’ను సువర్ణసేతువుగా, రెండాత్మలు, ఇహానికీ, పరానికీ ప్రయాణించే సమావేశంగా అభివర్ణించారు. ఒక పంచమ కవి మనోవేదనను వివరిస్తూ తన జీవితంలోని సాధక బాధకాలను వివరణాత్మకంగా వ్రాసిన జాషువా ఆత్మకథయే ‘‘నా కథ’’. ఈ కావ్యాలన్నింటిని రసికజన మనోభిరామంగా అనేక శీర్షికలతో అనేక ఖండ కావ్యాలను రసభరితంగా వెలయించాడు. సమాజం అవహేళన చేసినా తనను వరించిన కవితాకన్య తనలోని లోకోత్తర ప్రతిభను వెల్లడి చేసింది. ఆధునికాంధ్ర కవులలో అగ్రగణ్యుడ్ని చేసింది. జాషువా రచనలన్నియు పాఠకుల కానందామృతమును, ఆలోచనామృతమును కలిగించినవే. జాషువా రచించిన గబ్బిలము, ముంతాజ్ మహలు, ఫిరదౌసి కావ్యాలు మూడు సహృదయ హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించాయ. పద్య కావ్యాలు మకుటాయమానంగా చిరకాలం నిలిచిపోయే పద్య పారిజాతాలు. పద్య సుమగంధాలు జాషువా పద్య గ్రంథాలు.

- డా. నూనె అంకమ్మరావు, 9397907776