సబ్ ఫీచర్

శ్రీనాథుని సంసారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనాథుని చాటువులుగా చెప్పబడే కొన్ని పద్యాలను పరిశీలిస్తే ఆయన ‘సంచారి’ ఏమో అన్న భావన కలగడం సహజం. సూక్ష్మంగా పరిశీలిస్తే ఎన్నో అతివేలమైన శృంగార పద్యాలను, అశ్లీలమైన పద్యాలనూ శ్రీనాథునికి అంటగట్టి ప్రచారంలో పెట్టారనిపిస్తుంది. నిజానికి ‘శృంగార వైషధం’ అని పేరు పెట్టినప్పటికీ ఆ గ్రంథంలో శ్రీనాథుడు ఎంతో అందమైన, సున్నితమైన వర్ణనలు చేశాడే గాని ఎక్కడా అసభ్యతకూ, అశ్లీలతకూ ఇసుమంత కూడా తావివ్వలేదు. నిజానికి ‘హర్షనైషధం’ లో ఉన్నంత శృంగారంపాలు కూడా మనకు శ్రీనాథుని శృంగార నైషధంలో కనిపించదు. శ్రీనాథుడు వేదవేదాంగ పారంగతుడు. బహుపురాణ మర్మజ్ఞుడు. ఈ విషయాన్ని ‘అధ్వర్యువేదశాఖాధీతినిష్ణాతు’ అనే పదం తెలియజేస్తుంది. అధ్వర్యు వేదశాఖ యనగా కృష్ణయజుర్వేదము. కావున కృష్ణ యజుర్వేదాధ్యాయయైన శ్రీనాథుణ్ణి, శ్రీనాథ కవిసార్వభౌముడు, శ్రీనాథభట్టారకుడు అని పిలిచినట్లుగానే వేదపండితులకుచితమైన ‘శ్రీనాథావధాని’ అని కూడా అనవచ్చునని కీ.శే. వేటూరి ప్రభాకరశాస్ర్తీ గారు చమత్కరించారు. తాను శ్రీనాధుని కూరిమి మరదినని నాసికేతోపాఖ్యాసంలో దగ్గుపల్లి దుగ్గన చెప్పుకున్నాడు. ఇంకా కొన్ని విషయాలు వేటూరి వారిలా ప్రస్తావించారు. ‘శ్రీ వంగూరి సబ్బారావు’ పంతులుగారు ‘శ్రీరామాభిషేక’ గ్రంథమొక్కటి తమ దగ్గర కలదని దాని నుండి కొన్ని పద్యములను నాకొసగినారు. ఆ శ్రీరామాభిషేక గ్రంథకర్త ఇప్పటికి సూరేండ్ల క్రిందటి వాడగునేమో! ఆ పద్యములు మిక్కిలి దుష్టములుగానున్ననూ శ్రీనాథ కవీశ్వరుని కుటుంబ విషయము నెరిగించుచున్నవి. ఆ పద్యముల సారమిది- ‘కొండవీటి వాస్తవ్యుడగు ఆత్రేయస గోత్రజునకు శ్రీనాథుడు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసెను. వారికి పుత్ర సంతతి కలిగెను. శ్రీనాథుడా దౌహిత్రులను ఇంటనుంచుకొని పెంచెను. ఆ కారణమున దత్సంతతికి శ్రీనాథుని వారని ఇంటి పేరు వచ్చెను. వారి వంశపరంపరులు మిక్కిలి పెంపొందెను. ఆ పరంపరలో మాధవమంత్రి ప్రఖ్యాతుడయ్యెను. అతని కైదవతరమువాడు శ్రీరామభిషేక గ్రంథకర్త.’ ఇంకనూ శ్రీనాథుని అనే ఇంటిపేరు కలిగినవాడే శ్రీనాథుని వెంకటరామకవి. ఇతడు ‘ఆశ్వారాయ చరిత్రం’ అనే గ్రంథం వ్రాశాడు. ఆధునికాంధ్ర కవితాపితామహుడైన గురజాడ అప్పారావు పంతులు గారికి శ్రీనాథుని ఇంటిపేరు గలవారితో దగ్గరి బాంధవ్యం ఉంది. గురజాడ వారి ప్రపితామహుడు (ముత్తాత) పట్ట్భారామయ్య గారి భార్య శ్రీనాథుని కోదండరామయ్య గారి కుమార్తె. అనగా గురజాడ అప్పారావు పంతులుగారి ప్రపితామహి (ముత్తవ్వ) శ్రీనాథుని వారి ఆడపడుచే. పై వృత్తాంతం వల్ల శ్రీనాథుడు సలక్షణమైన గృహస్థ జీవితమును గడిపిన వాడేనని తేలుతోంది.

- డి.వి.ఎం. సత్యనారాయణ, అద్దంకి, 9885846949