సబ్ ఫీచర్

తెలుగు భాషా సేవకులు.. పేరిశెట్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు తమకొరకే జీవిస్తారు. మరికొందరు ఇంకొకరికోసం బ్రతుకుతారు. ఆ ఇంకొందరు తాము బ్రతకరు. ఇంకొకరిని బ్రతకనివ్వరు. జీవితం అశాశ్వతమని తమకొరకుకాక, ఇంకొకరికొరకు జీవిస్తే తాము చనిపోయినా ప్రజల హృదయాలలో పదిలంగా ఉంటామనే సత్యాన్ని తెలుసుకోలేనివాళ్ళు ఈ జగాన కోకొల్లలు. ఆయనో తెలుగు శ్వాస. ఆయనో తెలుగు ఊపిరి. వినే మీకు అతిశయోక్తిగా అనిపించినా ఇలా చెప్పక తప్పదు. ఇవి నా హృదయాంతరాళ నుండి వెలువడుతున్న నిత్య సత్యాలు. తెలుగు భాస్కరుడుగా, తెలుగువారి హృదయాలలో నిలిచిపోయిన పేరిశెట్ల భాస్కరుడు తనకొరకు కాక పరులకోసం పాటుపడిన పరమ దయాళుడు. వీరు ధనవంతులు కాదు. పెద్ద చదువరీకాదు. ఉన్నతోద్యోగీ కాదు. కానీ అంతకుమించిన భాషాసేవకుడు. ధనవంతుల దగ్గరనుండి మహా మహామేధావుల వరకు అందరికి తాను అందుబాటులో ఉంటూ వారి సూచనలను పాటిస్తూ, వారి సహకారాలను అందుకుంటూ ఆ తెలుగుతల్లి సేవలో తమ జీవితాన్ని పునీతం చేసుకున్న పుణ్యమూర్తి భాస్కరుడు. తాను స్థాపించిన సంస్థద్వారా ఆంధ్ర రాష్ట్ర అవతరణ, సామాజిక కార్యక్రమాలతోపాటు ఉగాది, సంక్రాంతి వంటి మన సంప్రదాయపండుగలను కూడా వేడుకగా నిర్వహించే దీక్షాదక్షుడు భాస్కరుడు.
తెలుగు భాషకై, తెలుగు సంప్రదాయానికై, తెలుగు సంస్కృతికై అవిరళ కృషిచేసిన అనేక తెలుగు ప్రముఖులను, పండితులను తమ సంస్థద్వారా ఆహ్వానించి ఆ తెలుగుతల్లి కీర్తిప్రతిష్టలను కరిగి, తరిగిపోతున్న ఈ తమిళనాడులో ముఖ్యంగా మద్రాసు మహానగరంలో తెలియచేసే కార్యక్రమాలను అనేకం నిర్వహించిన పట్టువదలని విక్రమార్కుడు ఆయన. ఇక్కడ వారి ప్రత్యేకత ఒకటి చెప్పుకోవాలి. తప్పదు. వారు ప్రచురించే ఆహ్వాన పత్రికలలో ఇతర సంస్థలు ప్రచురించే ఆహ్వాన పత్రికలకు భిన్నంగా ఉంటాయి. సహజంగా ఆహ్వాన పత్రికల్లో సంస్థపేరు, చిరునామా, ఆహ్వానించబడే వక్తల పేర్లు ఉంటాయి. ఇది ఎక్కువ సంస్థలు పాటించే పద్ధతి కూడా. మరికొన్ని సంస్థలైతే కాస్త తెలుగు భాషపై అభిమానంకొద్ది కొన్ని వాక్యాలు తెలుగుభాష గొప్పతనాన్ని తెలిపేవి ప్రచురిస్తాయి. వీరి విధానం ఏమిటంటే కరపత్రమైనా, ఆహ్వాన పత్రమైనా, ఆఖరికి వారు ఉచితంగా అందచేసే నోటు పుస్తకాలైనా అందులో పైభాగాన, దేశ భాషలందు తెలుగు లెస్స! ఆ తెలుగే మన మాతృభాష అంటూ, జాతీయతా భావానికి ప్రతీకగా భారతజాతి ప్రగతికే మా అంకితభావం అంటూ కూడా ప్రచురిస్తారు. వారు ప్రస్తావించే వాక్యాలు జాగ్రత్తగా గమనించండి. ఇంటాబయటా మన మాతృభాష తెలుగు మాట్లాడుకుందాం. మన తెలుగు భాషలోనే ‘అమ్మ’, ‘నాన్న’ అని మన పిల్లలచే పలికిద్దాం. భారతదేశంలోనూ, తమిళనాడులోనూ, తెలుగుభాషకున్న రెండవ స్థానాన్ని నిలుపుకుందాం. తమ పిల్లలను పాఠశాలలో చేర్చు సమయాన మరియు దరఖాస్తుల్లోను తమ మాతృభాష తెలుగు అని గుర్తింప ప్రార్థన. జనాభా సంఖ్య తీయు సమయంలో మన మాతృభాష తెలుగు అని వ్రాయింప ప్రార్థన. మన ప్రాంతాలలోని దేవాలయాల్లో, విద్యాసంస్థల్లో, భవనాలు, వైద్యశాలలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, కర్మాగారాలు మొదలగువాటి నామఫలకముల మీద పేర్లను తెలుగులో కూడా వ్రాయింప ప్రార్థన. ఈ విధంగా ఉంటుంది వారి అభ్యర్థన. ఇక్కడ ప్రత్యేకించి చెప్పదగినదేమంటే ఆ ప్రచురించిన ఆ అభ్యర్థన తెలుగుకే పరిమితమైతే పరవాలేదు. ఎంచక్కా తమిళములోనూ ముద్రిస్తారు. ఎంత ధైర్యం! తమిళనాడులో నివసిస్తూ తమిళులకు అర్థమయ్యేలా వారి భాషలోనే ముద్రించడం ఎంత సాహసం. నాలుగు గోడలమధ్య ధైర్యంగా మన భాషను గురించే చెప్పలేని దుస్థితి మనది. మరి వీరి సాహసాన్నిగూర్చి ఏమని చెప్పాలి?
అంతేకాదు పాంచాలకురిచి సింహం ఆంగ్లేయులను ఎదిరించి నిలిచి అశువులు బాసిన అమరవీరుడు వీరపాండ్య కట్టబొమ్మన్ జయంతి వేడుకలను నగరంలోని నాలుగురోడ్ల కూడలిలో బహిరంగ సభగా నిర్వహించి ఆయన పేరు కట్టబొమ్మన్ కాదు, గట్టి బ్రహ్మయ్య అని తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాన్ని నిర్వహించే సాహసి ఆయన. ఇవేకాక వీరు ప్రతి స్వాతంత్య్ర దినోత్సవంనాడు ఎక్కడో ఏమూలోఉన్న స్వాతంత్య్ర సమరయోధులను ఆహ్వానించి వారిని సముచిత రీతిన సత్కరించకపోతే వారికి ఆరోజు నిద్రపట్టదు. అంతటి జాతీయత భావంగల దేశభక్తి పరాయణుడు. చెప్పినవి చేయడం, చేసేవే చెప్పడం ఆయన నైజం. వీరు కీర్తిశేషులు ఇంటూరి వెంకటేశ్వరరావు మొదలు నేడు చెన్నై నగరంలో నివసిస్తున్న అనేకమంది తెలుగు భాషకు చెందిన గొప్పగొప్పవారిని ఆహ్వానించి ఆ తెలుగు తల్లికి వారిద్వారా నీరాజనాలు అర్పించిన భాషాసేవకుడు. తెలుగు భాషాసేవలోనే కాదు. సామాజిక స్పృహకలిగిన వ్యక్తిగా అనేక మంది పేదలకు నగదు బహుమతితోపాటు, వారికి నోటు పుస్తకాలు, పుస్తకాలు అందచేసి తద్వారా ఎంతోమంది పేదలకు సహాయం అందించిన పరోపకారి. నేటి నగరంలోని అనేక సంస్థలతో వారికి అనుబంధం ఉన్నా, ప్రముఖులు అందరితో పరిచయం ఉన్నా, వారిలో ఏ ఒక్కరినీ తన కార్యక్రమాలకు తానుగా పది రూపాయలు ఇమ్మని అడిగినవాడు కాదు. అంతటి ఆత్మాభిమాని. కార్యక్రమాల నిర్వహణకు తన సంపాదననే ఎక్కువగా వినియోగించిన నిస్వార్థజీవి. ఇక్కడో గమ్మత్తు చెప్పాలి - వీరు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకు సంబంధించి ఆహ్వానాలూ పంపిస్తారు. అంతటితో ఆగడు. సరాసరి అందుబాటులోనున్నవారి ఇంటికి వెళ్ళి ఓ నమస్కారం పెట్టి మన తెలుగు కార్యక్రమం జరుగుతుంది. దయచేసి రండి అని మరీ మరీ ప్రాధేయపడి అభ్యర్థిస్తారు. ఇది వారి వినమ్రతకు నిదర్శనం. వీరు మితభాషి. మృదుభాషి కూడా. ఎక్కువగా మాట్లాడరు. మాట్లాడే వారిని మాట్లాడిస్తారు. అది వీరి ప్రత్యేకత.
ఇక ఆయన మంచితనం గురించి మచ్చుకు ఒకటి - అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అందరిలా సభలు, సమావేశాలు నిర్వహించరు వీరు. చెన్నైలోని తెలుగు ప్రముఖుల శిలా విగ్రహాలు ఎన్ని ఉంటాయో తెలుసుకుంటారు. అనే్న పూలమాలలు కొంటారు. అవి ఉన్నచోటుకే వెళ్ళి ఆయా శిలావిగ్రహాలకు పూలమాలలు వేయడం పరిపాటి. అదీ వీరు చేయరు. నగరంలోని తెలుగు ప్రముఖులు ఎవరైనా ఆహ్వానించి వారిచేత ఆ పూల మాలలు వేయిస్తారు. ఆ పూలమాలలను తాను వేయకపోయినా, వేసే ఆ ప్రముఖుని, ఆ శిలావిగ్రహాన్ని చూసి, ఆ సందర్భాన్ని తలుచుకుని ఆయన పొందే ఆనందం వర్ణనాతీతం. ఆకాశమంత సేవచేసి కూడా ఆవగింజంతైనా ఫలితాన్ని ఆశించని భాస్కరుని ఏమనాలి. ప్రతిఫలాపేక్ష రహితుడని అనే తీరాలి మరి. తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన తెలుగు భాషకు మరలా పూర్వవైభవాన్ని తీసుకురావాలనేదే నా ఆశయం అంటారు పేరిశెట్ల భాస్కరుడు. దాదాపు నలభై ఏండ్ల క్రితం స్థాపించబడిన మదరాసు తెలుగు అభ్యుదయ సమాజం సంస్థ ద్వారా అనేక సాంఘిక, సాంస్కృతిక సమావేశాలు నిర్వహిస్తూ, చెన్నైలోని అనేకమంది తెలుగు ప్రజల, ప్రముఖుల ప్రశంసలు పొందిన పేరిశెట్ల భాస్కరుడు 1943 ఆగస్టు 12న తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాకు చెందిన ఆరణి కుమ్మరిపేట గ్రామంలో పేరిశెట్ల వెంకట రామయ్యశెట్టి, రామలక్ష్మన్న దంపతులకు జన్మించారు. ఇక మాతృమూర్తికంటే మిన్నగా చూసుకోవాలనే తపన కలిగిన భాస్కరుడు పసిపిల్లల్లో మాతృభాషపై మమకారం తగ్గకూడదనే అభిప్రాయంతో వారికి తెలుగు అక్షరాలతోపాటు సుమతీ శతకం, వేమన పద్యాలను నేర్పించడం, తన దినచర్యలలో ఒకటిగా చేసుకున్న కార్యశూరుడు. తమిళనాడు పి.డబ్ల్యు.డి.లో రోడ్డు ఇన్స్‌పెక్టర్‌గా ఉంటూ కూడా తెలుగుభాష ఉన్నతికోసం కృషిచేస్తూ దాని మాధుర్యాన్ని అనేక ప్రక్రియలద్వారా తెలియజేస్తూ భాషను గురించి సభలు, సమావేశాలు నిర్వహిస్తూ తానూ పాల్గొంటూ ఆ భాషకు ఎనలేని సేవచేసిన ఏకైక వ్యక్తి భాస్కరుడు అంటే అతిశయోక్తికాదేమో.
అటువంటి భాషాసేవకుడు, నిష్కళంకుడు, పరోపకారి అయిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ పేరిశెట్ల భాస్కరుడు 09-02-2009న మరణించడం తెలుగుతల్లికి తీరని శోకం. తెలుగు భాషకి తీరని లోటు. తెలుగు భాషకు, తెలుగువారికి ఆయన చేసిన సేవ మరువలేనిది మరపురానిది.
*
(డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన
‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి...)

- గుడిమెట్ల చెన్నయ్య