సబ్ ఫీచర్

పలనాటి వాల్మీకి.. ముటుకుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలనాటి గడ్డ గొప్ప పోతుగడ్డ అనీ, విద్వత్కవులకూ, అవధాని వరేణ్యులకూ అన్నింటినీమించి సదాచార సంప్రదాయపరాయణులకు పుట్టినిల్లనీ నాలాంటి కవి నట గాయక సామాన్యుడు గొంతెత్తి ఆరున్నొక్కటి శ్రుతిలో అరవనక్కరలేదు. నిన్న మొన్నటివరకూ మన కళ్ళముందే నడయాడిన అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులూ, కనె్నగంటి సోదర కవులూ, యింకా నిండు వృద్ధాప్యంలో మన కళ్ళముందే తిరుగాడుతున్న గామాలపాడు వాస్తవ్యుడూ అయిన చిటిప్రోలు కృష్ణమూర్తిగారి లాంటి విద్వత్కవివరేణ్యులెందరెందరికో జన్మనిచ్చిన పుణ్యధాత్రి పలనాటి సీమ. ఏదో కించిత్తు క్షుద్బాధతో రెడ్డిరాజుల ఆస్థానకవీ, సకల విద్యాసనాధుడూ, చింతామణీ మంత్ర విద్యవిశారదుడూ, ఈశ్వరార్చన కళాశీలుడూ అయిన శ్రీనాథుడు ‘పలనాటికి మాటికి పోవనేటికిన్?’ అన్నాడు గదా అని మనమేమీ బాధపడనక్కర్లేదు. గింజుకోనక్కర్లేదు. నిజానికి అక్కడి తిండి తినబట్టే, అంతటి సుకుమార భోజనప్రియుడు ‘పుల్లసరోజనేత్రయల పూతన చన్నులచేదుద్రావి’ అనే పద్యం వ్రాయగలిగాడనేది నా నిశ్చితాభిప్రాయం. నిర్వివాదాంశం అన్నా తప్పులేదేమో? నిజానికి పలనాటి సీమ చాలా గొప్పది గాబట్టే... ఆ శ్రీనాథుడే ‘‘కారెమపూడి పట్టణము కాశిగదా పలనాటి వారికిన్’’! అన్నాడు. నైషధం, కాశీఖండం లాంటి విద్వదౌషధాలు, అయఃపిండాలు వెలయించినట్టి శ్రీనాథుడేంటి? ‘ద్విపద’లో ఈ పలనాటి చరిత్ర వ్రాయడమేంటి? అసలది ఆయన రచనే ‘గాదుపో’ అన్న ప్రబుద్ధులూ ఉన్నారు. శైవ వైష్ణవాల మధ్య జరిగిన ఘర్షణే పలనాటి యుద్ధం అనిగూడా సర్వలోక విదితం. ఇటువంటి పలనాటి సీమలో యిప్పటికీ నాగమ్మ, మాంచాల, హనుమంతు, బ్రహ్మన్న మొదలైన పేర్లు వినబడుతూనే ఉంటాయి. మాచెర్ల చెన్నకేశవుణ్ణి గురించి విడిగా చెప్పాల్సిన పనేలేదు. ‘మాచెర్ల చెన్నుని మదిలోన దలచి’ అని అంతటి విద్వత్కవే చెన్నుణ్ణి ప్రార్థించి శ్రీకారం చుట్టాడు. ఆ వీరచరిత్ర కావ్యానికి- ఈ పరంపరలో ‘జానపాటి పట్ట్భారామశాస్ర్తీ’ అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులూ, మా గురువర్యులైన లంకా సీతారామశాస్ర్తీ మహోదయుల గురించి ఎన్ని పుటలైనా వ్రాయవచ్చు. కానీ విషయం ‘ముటుకుల పద్మనాభరావు’ కవివరేణ్యుల గురించి గాబట్టి విస్తర భీతితో వాళ్ళను గురించి చర్చించే అవకాశం లేదు-
నిన్నగాక మొన్న అంటే 17-2-19 (మాఘ శుద్ధ ద్వాదశి)నాడు, 90 సం.ల నిండు వృద్ధాప్యంలో ఈ లోకాన్ని వీడి పరమేశ్వరుని దివ్య సన్నిధికి వెళ్ళిన ముటుకుల పద్మనాభరావుగారు బహుగ్రంథకర్తయేమీ గాదు. గొప్ప లోక సంచారి అంతకన్నాగాదు. విపరీతమైన విద్యార్హతలు అసలు లేవు. నిజంగా చెప్పాలంటే ఆయన ఒక ఋషితుల్యుడు. శుక్ల నామ సం. జ్యేష్ఠ శుద్ధ నవమి, 1929 సం.లో పలనాటి సీమలోని, మాచెర్ల మండలార్గతమైన ఆత్మకూరు అనే కుగ్రామంలో శ్రీమతి శేషమ్మ, నరసయ్య అనే పుణ్య దంపతులకు గర్భశుక్తిముక్త్ఫీలంగా జన్మించిన ఈ మహామనీషి నిజానికి అందరిలాగా స్కూలుకు వెళ్ళి ఉపాధ్యాయులవద్ద చదివిన వ్యక్తిగూడా గాడు. ఆతని ఆనాటి కుటుంబ పరిస్థితి అది. వారు రచించిన ‘పద్మనాభ రామాయణము’ పీఠికలో, అంటే వారి ముందు మాటలోనే యిటువంటి ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. ప్రైవేటుగా స్వంతంగా 8ఆ్ద స్టాండర్డ్ పరీక్ష వ్రాసి (ఆరోజుల్లో అదొక పరీక్ష) ఉత్తీర్ణుడై హయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ (ఇదొక పరీక్ష) పూర్తిచేసి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి, ప్రైవేటు మేనేజిమెంట్ స్కూలులో పనిచేసి, అటు పిమ్మట మరలా ప్రైవేటు గానే ఎస్.ఎస్.ఎల్.సి వ్రాసి సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా అనేకచోట్ల విద్యారంగానికి పలనాటి సీమలోనే సేవలందించిన వీరికి గొప్ప శిష్యగణం ఈనాటికీ ఉంది. నిగర్వి, మృదుభాషి, గొప్ప సంస్కారవంతుడైన ముటుకుల పద్మనాభరావుగారికి నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళూ, అందరూ విద్యాధికులే! పద్మనాభరావుగారు గొప్ప ఆయుర్వేద వైద్యుడు గూడా! గొప్ప ఈతగాడు. వారు 80 సం.ల ప్రాయంలో గూడా సాగర్ కాలువలో ఉదయంవేళల్లో ఈతగొట్టడం నాకు తెలుసు. గొప్ప సాహిత్య గోష్ఠీప్రియుడు. ఎప్పుడూ ఒకళ్ళిద్దరైనా చుట్టూ ఉండాల్సిందే! పనికిరాని విషయాలతో కాలహరణం చేయకుండా, తన రచనలలోని ఏదో ఘట్టాన్ని వినిపిస్తూండేవారు. నేను నరసరావుపేట నివాసిని గావడం మూలాన, మాచర్ల, మావూరికి మార్గమధ్యంలో ఉండడంవలన, కావాలనే పనిగట్టుకుని మాచర్లలో దిగడం నాకు అలవాటయింది. నేనన్నా, నా పద్యపఠనమన్నా ఎంతో మక్కువగల రావుగారు మాచర్లలో నా నాటక ప్రదర్శనలు గూడా కొన్ని ఏర్పాటుచేసినవారే! పద్మనాభరావుగారి పెద్ద కుమారుడు డా.కమలాసనరావు మంచి గాయకుడు. ఆతని అర్ధాంగి లక్ష్మి శ్రీమతి అనూరాధ ఇద్దరూ వైద్య వృత్తిలోనే ఉన్నారు. విచిత్రమేమిటంటే శ్రీ పద్మనాభరావుగారు తమ ఉద్యోగ విరమణానంతరం 50 ప్రదేశాలలో అష్టావధానాలు చేశారు. అవధానిగా మారిన తర్వాతే ‘పద్మనాభ రామాయణ’ రచయితయైనారు. 2002 సం.లో వెలుగులోనికి వచ్చిన ఈ రామాయణాన్ని, అందులో కొన్ని ఘట్టాలను నాకెన్నిసార్లు వినిపించారో నేను చెప్పలేను. తనను ఆనాడు ప్రోత్సహించిన గోలి వేంకట్రామశర్మ, చింతలపాటి బుచ్చి వేంకటప్పేశ్వరశర్మ, తమ పెద్ద తల్లి కుమారుడైన గోపాలుని సుబ్రహ్మణ్యశర్మ గారి లాంటి వారికి అనేకానేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. అవధాన రంగంలో, కవితారంగంలో, వ్యాఖ్యాన రంగంలో ఈనాటికీ లబ్ధప్రతిష్ఠులయిన బేతవోలు రామబ్రహ్మం, మైలవరపు శ్రీనివాసరావుగారల వంటి ఉద్దండుల ముందు మాటలు ఈ రామాయణంలో కనబడతాయి. పండితాభిప్రాయాలు సకాలంలో రావడానికి, అంటే అవి తన చేతికి అందడానికి ముఖ్యంగా కారణభూతులైన చంద్రవౌళి రామనాధశర్మగారి లాంటి జాతీయవాదులను మరీమరీ ప్రశంసించారు ముటుకులువారు. రామనాధశర్మగారుగూడా ఉపాధ్యాయ వృత్తిలో కాకలుదీరిన యోధుడే! ముటుకులవారు పలనాటి సీమలోని ముటుకూరు, మండాది, శిరిగిరిపాడు, ఏక్‌నాంపేట మొదలైన చోట్ల ఉపాధ్యాయుడిగా సేవలందించారు. దుర్గి, రాజంపల్లి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్, జమ్మలమడక, రెంటచింతల మొదలైన ప్రదేశాలలో అనేక అవధానాలు చేశారు. సాహితీ రూపకం ‘్భవనవిజయం’లో ‘అల్లసాని’ పాత్రధారణ చేస్తుండేవారు. అయ్యా! మీ ప్రత్యేకతలేమన్నా ఉన్నాయా? అని ఎవరైనా అడిగితే... ‘నా త్రోవలో నేను పోవడం, పేరుప్రతిష్ఠలకు ప్రాకులాడకపోవడం, అడ్డదారులు తొక్కకపోవడమే’ నా జీవిత ధ్యేయం అని బదులిచ్చేవారు. ఒక ప్రక్క విద్యారంగంలో సేవచేస్తూనే, మరోప్రక్క ఆర్.యం.పి.గా నమోదై గ్రామాలలో అనేక దీర్ఘకాలిక వ్యాధులను రోగులకు నయం చేసిన ఘనత వీరిది.
వీరు అనేక గ్రంథాలు వ్రాయలేదని ముందే చెప్పాను. ‘త్రిపురాంబికేశ శతకం’ వీరి రచన ప్రతి తెలుగు కవీ, ముఖ్యంగా శివార్చనా ప్రియులు చదవాలి. ఒక పాల్కురికి సోమన, ధూర్జటి, శ్రీనాథుడు, యధావాక్కుల మొదలైనవారు తళుక్కున మనసులో మెదులుతారు. ‘పద్మనాభ రామాయణం’లోని వైశిష్ట్యం అంతా చెప్పాలంటే శూలికైనను, ‘‘తమ్మిచూలకైనను’’ అని ఆయనెవరో వెనుకటికి చెప్పినట్లు నిజంగానే సాధ్యంగాదేమో? మన తెలుగుదేశంలో రామాయణాలు కొల్లలు వచ్చాయి. ఒకళ్ళని మించిన ఒకళ్ళు పోటీపడి వ్రాశారా? అని అనిపిస్తుంది. తిన్నతిండే, చేసిన సంసారమే తింటూ చేస్తూ ఉండే మనకు నిజంగానే ‘రాముడి కథ’ అంటే ఎందుకంత మక్కువో అది ఈ జన్మకు తేలే సమాధానం గాదు. అదీ గాకుండా రామాయణాల గురించి పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా పెద్దపెద్ద మాటలు చాలా ముద్దు ముద్దుగా చెప్పారు. గొప్ప కథా రచయిత, గొప్ప పండితుడూ, కథకుడూ అయిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు, మానవుడికి, ముఖ్యంగా, కవి అనే ముద్ర వేసుకున్నవాడికి అరవై సంవత్సరాలు నిండిన తర్వాతనైనా వాడి మనస్సు, రామాయణం వైపు ఆకర్షితంగాకపోతే, వాడిలో ఏదో లోపం ఉన్నట్లే అన్నాడు. పద్మనాభరావుగారు పురవర్ణనలలో, ఋతువర్ణనలలో, యుద్ధ వర్ణనలలో అచ్చంగా పూర్వ కవులనే అనుకరించారు. అనుకరించారనుగూడదేమో? ఆ మార్గానే్న పయనించారనడం సమంజసం. బాల్యంలోనే అమరకోశాన్ని అటునుంచి యిటూ, యిటునుంచి అటూ జిహ్వాగ్రాన నిలుపుకున్న సరస్వతీపుత్రుడు ముటుకులువారు. ఆశ్వాసాంతాలలో గూడా మనకొక సంప్రదాయం ఉన్నది. పురాణ కవులూ, ప్రబంధ కవులూ అందరిదీ ఒకే మార్గం. వీరు గూడా ఆ మార్గంనుంచి బయటకు రాలేకపోయారు. యుద్ధకాండ సమాప్తంలో ఈ రామాయణంలో కనబడే పద్యాలు నిత్యం స్తోత్రం చేస్తే ఎప్పటికైనా పరమేశ్వర సాక్షాత్కారం కలుగక పోదు. గొప్ప పద్య శిల్పిగాబట్టే నేను నా ‘వైదేహమ్మా’ అనే కంద పద్య శతకంలో ఈ కవిని గూర్చి కవి స్తుతిలో ఇలా అన్నాను, అనగలిగాను -
కం॥ అదెమా పలనాటను, స
ద్బుధుడై కీర్తిగన్న ‘ముటుకుల’వరకో
విదు ‘పద్మనాభరావు’ని
పదయుగ్మము కంజిలింతు- వైదేహమ్మా!

- డా. అక్కిరాజు సుందర రామకృష్ణ, 9703553510