సబ్ ఫీచర్

అచ్చు నుదుట తెలుగు సిందూరం ( వావిళ్ల రామస్వామి శాస్ర్తీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విళ్ల... ఈ పేరుకు ఒక ప్రత్యేక పుట లేకుండా తెలుగు అచ్చు చరిత్రను మనం ఎంత మధించినా అది అసంపూర్ణమే. తెలుగు బీజాక్షర జగతిని అచ్చుల్లో అందంగా ముస్తాబుచేసి తెలుగు జాతి అరచేతుల్లో పెట్టిన మహానుభావుల్లో వావిళ్లవారు అత్యంత ముఖ్యులు. నేడు తెలుగు అచ్చుపుస్తకం చదువుతున్న ప్రతి తెలుగువారికీ ప్రాతఃస్మరణీయులు వావిళ్ల రామస్వామి శాస్ర్తీగారు. వారి గురించి ముద్రణా రంగంలో ప్రత్యేకించి తెలుగు జాతికి వారు చేసిన అవిశ్రాంత కృషి గురించి నేటి తరానికి తెలిసింది చాలా తక్కువనే చెప్పాలి. రామస్వామిశాస్ర్తీ ఊరు వావిళ్ల. అదే వారింటి పేరైంది. వారి పూర్వీకులకు ఆ గ్రామం దత్తమైనందువల్ల, వారు ఆ గ్రామంలో జన్మించినందువల్ల వారి ఊరి పేరే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. మొదటి పల్లవుల కాలంలో కాంచీపురంవద్ద ఉడాలి వంశీయులకు చెందినవారు వావిళ్ల కుటుంబంవారు. విజయనగర రాజ్యం హీన దశలో ఉన్నప్పుడు నాటి రాజ్యపాలకుడు రామదేవరాయల క్షేమాన్ని కోరుతూ అప్పటి వేంకటగిరి జమీందారు వెలుగోటి యాచమనాయుడు వావిలి చెట్లు విస్తారంగా ఉన్న బీడు భూమిని తిరుమలరాయుని కండ్రిగ అని పేరుపెట్టి ఉడాలి వంశీయులకు బ్రహ్మదేయంగా సమర్పించారు. ఆ వావిలి చెట్లున్న ప్రాంతం తరువాత కాలంలో వావిళ్ల గ్రామంగా మారింది. ఆ ఊళ్లో వేంకటేశ్వరశాస్ర్తీ, మంగమ్మ దంపతులకు ఐదుగురి సంతానం తర్వాత 1826లో వావిళ్ల రామస్వామిశాస్ర్తీ జన్మించారు. తన అన్న అనంతనారాయణ శాస్ర్తీతో కలిసి తండ్రి వద్దే ప్రారంభ విద్యను ఉపాసించారు. తదుపరి చెన్నపురికి చేరి తండియార్ పేటలోని తంజావూరు రామానాయుని సంస్కృత పాఠశాలలో ఉన్నత విద్యను ఆర్జించారు.
ఏ ప్రయాణం కూడా విఘ్నాలు ఎదురవకుండా సాగించడం ఎవరికైనా కష్టమే. వావిళ్లవారి అచ్చుకూట ప్రయాణం కూడా అందుకు మినహాయింపు కాదు. ఎన్నో ఆటంకాలు సమస్యలు ఎదుర్కొని, ఏ మాత్రం చలించకుండా ఆయన తన ముద్రణాలయాల గమ్యాన్ని సాగించారు. చెన్నపురిలో ఉన్న వావిళ్లవారికి ప్రాచీన సంస్కృత గ్రంథాలంటే ఎంతో ఇష్టం. అవి చెన్నపురిలో అందుబాటులో లేకపోవడంతో మైసూరులో ఉన్నాయని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. అక్కడే కన్నడ భాష కూడా నేర్చుకున్నారు. సంస్కృత గ్రంథాలను కన్నడ లిపిలో అచ్చువేసి అందిస్తే బాగుంటుందని తలంచి మైసూరులోనే రామశాస్ర్తీ తన అన్నగారితో కలిసి ఒక అచ్చుకూటం ఏర్పాటుచేసుకుని కొన్ని గ్రంథాలను అచ్చువేశారు. అలా అచ్చు ప్రపంచంలోకి తొలి అడుగువేశారు. అది తప్పటడుగైంది. మైసూరులో వారి ప్రయత్నాలకు స్థానికులనుండి కించితు ఆదరణ కూడా కనిపించలేదు. రాజాదరణ కరవై అక్కడ వావిళ్లవారికి బతుకు దుర్భరమైపోయింది.
ఆ స్థితిలో రామస్వామిగారికి చెన్నైలో ఉంటున్న వారి మేనమామ వేదం వేంకటాచలంనుంచి పిలుపొచ్చింది. చెన్నైలో అచ్చుకూటాన్ని ఏర్పాటుచేసుకుని అదృష్టం పరీక్షించుకోవాలని ఆయన కబురుచేశారు. అప్పటికే అచ్చుకూటం ఆరంభించి దెబ్బతిన్న రామస్వామిశాస్ర్తీ చెన్నపురికి వెళ్లడమా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. ఆ సమయంలో మైసూరుకు వచ్చిన శ్రీ శృంగేరి పీఠాధిపతి సచ్చిదానంద నృసింహ భారతీస్వామిని అన్నదమ్ములు అనంత నారాయణ, రామస్వామిశాస్ర్తీ దర్శనం చేసుకోవడం గొప్ప మలుపుతిప్పింది. స్వామివారు వారిద్దర్నీ చెన్నపురికే వెళ్లమని చెప్పి, తొలి కానుకగా కొంత ధనమిచ్చి మార్గనిర్దేశం చేశారు. దాంతోపాటు చెన్నపురిలోని శృంగేరిమఠ బాధ్యతలను కూడా వారికి అప్పగించారు. దాంతో సోదరద్వయం ఇంకేమీ ఆలోచించకుండా మద్రాసుకు చేరుకున్నారు. చెన్నపురిలో అప్పటికే పుదూరువారి ముద్రణాలయాలు నెలకొని ఉన్నాయి. సీ.పీ.బ్రౌన్ దొర కోరిక మేరకు పుదూరు సీతారామశాస్ర్తీ 1836లో ‘సరస్వతి’ అచ్చుకూటాన్ని ఏర్పాటుచేసి తాను రాసిన ‘బాలశిక్ష’ బాల బాలికల విశ్వకోశాన్ని ప్రచురిస్తున్నారు. అదే ఇప్పటికి పెద్దబాలశిక్షగా కోట్లాది మంది తెలుగు హృదయాలలో వెలుగొందుతోంది. పురాణం హయగ్రీవశాస్ర్తీ ‘వివేకా దర్శనం’ అనే ప్రచురణాలయాన్ని ఆరంభించి రామాయణ, మహాభారతాలు తదితర గ్రంథాలను తెలుగులో ప్రచురిస్తూ ఉండేవారు. ఇక వావిళ్ల మేనమామ వేదం వేంకటాచలశాస్ర్తీ తన మేనళ్లులతో కలిసి 1847లో ‘వివేకారత్నాకరము’ అనే అచ్చు కూటాన్ని స్థాపించారు. ఇందులో అనుభవం గడించిన వావిళ్ల సోదరులు తరువాత 1849లో ‘హిందూ భాషా సంజీవని ముద్రాక్షరశాల’ను ఆరంభించారు.
రామస్వామి సహా మొత్తం 22 మంది భాగస్వాములు కలిసి ఆరంభించిన ఈ వ్యాపారంలో భాగస్వాముల మధ్య అభిప్రాయబేధాలు వచ్చి కేవలం రెండేళ్లలోనే ‘సంజీవని’ మూతపడాల్సి వచ్చింది. అప్పటివరకూ రామస్వామి శాస్ర్తీతో కలసిఉన్న అనంత నారాయణశాస్ర్తీ ఈ వ్యాపారంలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువని భావించి ఉపాధ్యాయ వృత్తివైపు వెళ్లిపోయారు. దాంతో ఒంటరివాడైన రామస్వామిశాస్ర్తీ తన మేనమామకు చెందిన వివేకారత్నకరములో పనిచేస్తూనే సొంతంగా మరో ముద్రణాలయం ప్రారంభించాలని భావించారు. అలా 1851లో నెల్లూరుకు చెందిన పండితులు సరస్వతి తిరువేంగడాచార్యులుతో కలిసి ‘సరస్వతీ నిలయం’ అనే కొత్త ముద్రణాలయం ఆరంభించారు. ఇది ఆయన నాలుగో ప్రయత్నం. ఇది కూడా పురిటిసంధికొట్టి అర్ధాంతరంగా ఆగిపోయింది.
సరస్వతీ మాతను అచ్చుల్లో చూసుకుని మురిసిపోయే స్వభావమున్న రామస్వామి శాస్ర్తీకి అచ్చుకూటపు పిచ్చి వదల్లేదు. అదే తెలుగువారికి వరమైంది. నాలుగో ప్రయత్నం బెడిసికొట్టినా ఏమాత్రం నీరుగారిపోని వావిళ్లవారు ఐదోసారి ఒంటరిగా మరో ప్రయత్నం మొదలుపెట్టారు. 1854లో తండయారుపేట హైరోడ్డులోని తన సొంత ఇంట్లో అదే ‘సరస్వతీ నిలయము’ పేరిట మళ్లీ ముద్రణాలయం ఆరంభించారు. దేనికీ వెరవని రామస్వామి ధైర్యం, తనపట్ల ఉన్న భక్తిని చూసి సరస్వతీమాత పులకించిందేమో ఆయన్ను అనుగ్రహించింది. ఆ ముద్రణాలయం ఇక వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు పరుగులుతీసింది. ఎన్నో పుస్తకాలను తెలుగు అచ్చులోకి మార్చి తెలుగుజాతికి అందించింది. ఆ సరస్వతీ నిలయానే్న 1906లో రామస్వామిశాస్ర్తీ తనయుడు వావిళ్ల వేంకటేశ్వరశాస్ర్తీ ‘వావిళ్ల ప్రెస్’గా మార్చాడు. రామస్వామి నిరంతరం రేయింబవళ్లూ అచ్చుకూటపు యంత్రాల మధ్యే గడిపేవారు. అది సరస్వతీ నిలయాన్ని ఆయన ఒంటరిగా కష్టపడి నడిపిన రోజులున్నాయి.
రామస్వామిశాస్ర్తీ రాచపుండు (క్యాన్సర్) వ్యాధితో బాధపడుతూ 1891లో తెలుగు వారినందర్నీ దుఃఖసాగరంలో ముంచి మరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన తెలుగుభాషకు చేసిన అజరామరమైన సేవలు ఆయన పేరును నిత్యం స్మరించేలా నిలిపాయి. అది సరస్వతీ నిలయం ముద్రణాలయంనుంచీ ఎన్నో విలువైన పుస్తకాలను ఆయన అచ్చువేశారు. పింగళి సూరన రచించిన రాఘవ పాండవీయము, అప్పకవీయము, చెన్నపురీ విలాసము, నరకాసుర విజయ వ్యాయోగము, మనుచరిత్ర, ఆముక్తమాల్యద, శ్రీమదాంధ్ర మహాభారతములాంటి అనేక తెలుగు పుస్తకాలను తెలుగులో అచ్చువేశారు. అలాగే అనేక సంస్కృత పుస్తకాలను అచ్చురూపమిచ్చి తెలుగు అచ్చుకూట చరిత్రలో ఎన్నటికి చెరగిపోకుండా తన పేరును సుస్థిరంచేసుకున్న ధన్యజీవి వావిళ్ల రామస్వామిశాస్ర్తీ. ఆయన తరువాత కుమారుడు వావిళ్ల వేంకటేశ్వరశాస్ర్తీ కూడా తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ వావిళ్ల ప్రెస్‌ను పరుగులు పెట్టించారు. స్వాతంత్య్రోద్యమంలోనూ స్వదేశీ ఉద్యమంలోనూ వావిళ లప్రెస్ ఒక ఉత్తేజశక్తిగా మార్చడమేకాకుండా నాటి బ్రిటీషు ప్రభుత్వంపై పోరాడుతున్న ఎంతోమంది దేశభక్తులకు ఆసరాగా నిలిచి సహాయ సహకారాలు అందించిన దేశభక్తుడిగా కీర్తిపొందారు. తెలుగు ముద్రణాచరిత్ర గురించి చెప్పాలంటే వావిళ్ల వారిని ప్రస్తావించకుండా ముందుకు సాగలేం. తెలుగు అచ్చుకూటపు ప్రపంచాన ‘వావిళ్ల’ శబ్దం ‘ఓం’కారమే.

(డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన ‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి...)

- ఎ. కిషోర్‌బాబు