సబ్ ఫీచర్

భాషాభివృద్ధికి స్ఫూర్తి కోదండరామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువాడుగా పుట్టడమే గొప్పదనంగా భావించక నిండైన తెలుగుదనంతో ఆదర్శవంతమైన జీవితం నెరపిన మహానుభావుడు కీ.శే.హోసూరు కె.ఎస్.కోదండరామయ్యగారు. బహుముఖమైన గొప్ప మూర్తిమత్వం వారిది. 1968వ సంవత్సరం చిత్తూరులో జిల్లా రచయతల తొలి సమావేశాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని కోదండరామయ్య ప్రసంగించారు. హోసూరు ప్రాంతపు తెలుగువారు ప్రవాసాంధ్రులు కారు. స్థిర నివాసాంధ్రులని పేర్కొంటు అచటివారి సమస్యల్ని ఏకరువుపెట్టారు. నేను వారిని చూడడం అదే మొదటిసారి. ఆనాటి సాహిత్య చర్చాగోష్ఠులలో వారు మాతోబాటు నేలమీద ఆసీనులు కావడం చూసి మేం అబ్బురపడ్డాం. కోదండరామయ్య సన్నగా, పొడుగ్గా కొంచం వంగిన శరీరంతో ఉండేవారు. తెల్లటి పంచె, చొక్కా, ఖండువా ధరించేవారు. కాళ్లకు హవాయి చెప్పులు వేసుకొనేవారు. చేతిలో వార్తాపత్రిక పుస్తకం ఉండేది. ధనబలం, కండబలం లేకున్నా గుండె బలంతో నిండిన సాత్వికమూర్తి ఆయనది. కోదండరామయ్య అప్పటి సేలంజిల్లా (ఇప్పటి కృష్ణగిరి జిల్లా) హోసూరు తాలూకాలోని (జాగీరు) కారుపల్లెలో సౌమ్యనామ సంవత్సరం 1909 ఆగస్టు 6 బుధవారం జన్మించారు. రామాంబ, శివరామదాసులే వారి జననీ జనకులు. విజయనగర రాజుల కాలంలో బహుశా కొన్ని వందల ఏండ్లకు పూర్వం ములికినాడు (నేటి కడప మండలం)లోని ఒక కుటుంబం హోసూరు సమీపంలోని కారుపల్లి గ్రామం చేరి స్థిరపడింది. ఆ ఇంటి పేరు రాయపెద్దివారు. వారు తమ ప్రత్యేకతల్ని నిలుపుకొంటూనే తమ ఇంటి పేరు కారుపల్లిగా మార్చుకొన్నారు. తమిళుల పద్ధతి ప్రకారం తండ్రి పేరును కూడా చేర్చుకోవడంవల్ల కోదండరామయ్య పూర్తిపేరు కారుపల్లి శివరామదాసు కోదండరామయ్య అయింది.
బడిలో ఉత్తమ విద్యార్థిగా పరిమళించిన కోదండరామయ్య కళాశాల చదువులు సాగించలేక 1929 సంవత్సరం చిత్తూరులోని ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలలో చేరి తర్ఫీదు పొందారు. సారస్వత సమావేశాల్లో పాల్గొని అందరి మెప్పుకు పాత్రులయ్యారు. శిక్షణానంతరం వీరికి సౌభాగ్యవతి సీతమ్మతో వివాహమయింది. వీరికి ముగ్గురు పుత్రులు, ముగ్గురు పుత్రికలు. కుమారులు గోపాలకృష్ణయ్య తండ్రి మార్గంలో సమాజసేవ చేస్తున్నారు. 1932 సంవత్సరం హోసూరు సమీపంలో చాగలూరు ప్రాథమిక పాఠశాలలో తాను ఉత్తమంగా భావించే ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. ఆకర్షణీయమైన బోధనతో విద్యార్థుల్ని, రాత్రివేళల్లో పురాణపఠనల ద్వారా గ్రామస్థుల్ని ఆకట్టుకోగల్గారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ, పాఠశాల భవన నిర్మాణం, బడి తోటల పెంపకం, విద్యార్థులచే నాటకప్రదర్శనలు మొదలైనవి చెప్పదగిన వారి పలు సేవలలో కొన్ని మాత్రమే. వారి విశిష్టసేవల్ని ఉపయోగించుకోవాలని హోసూరు ఉన్నత పాఠశాలకు అధ్యాపకుడుగా వారిని బదిలీ చేశారు. కోదండరామయ్య ప్రైవేటుగా ఎం.ఏ., బి.ఏ.యల్., బి.టి. పట్టాలను సంపాదించారు. వీరిని 1952లో వేపనపల్లి హైస్కూలుకు హెడ్మాష్టరుగా నియమించారు. అచటి విద్యార్థులలో స్థానికులలో తెలుగు భాషాభిమానాన్ని ప్రేరేపించడం సహించని అధికారులు ఆయనను సేలం సమీపంలోని ఆత్తూరులోని తమిళ బడికి బదిలీచేశారు. అచట తన వృత్తిని చక్కగా నిర్వహించారు. అయినా పరిస్థితులకు ఇమడలేక కొంతకాలానికి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సరిహద్దు సైనికుడుగా పనిచేశారు కోదండరామయ్య. తమిళనాడు సరిహద్దులోని హోసూరు, డెంకణికోట, వేపనపల్లి ప్రాంతాలలో అత్యధికులు తెలుగువారున్నారు కనుక ఆ ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంతో కలపాలని ఉద్యమించి ‘ఆంకుశగిరి ఆంధ్ర సరిహద్దు సంఘాన్ని’ స్థాపించారు. అన్ని గ్రామాలు తిరిగి, జనాభాలెక్కలు, మ్యాపులు సేకరించి సరిహద్దు సమస్యల పరిష్కారంకోసం నియమించిన ‘కమిషన్’కు సమర్పించారు. ఫలితం లేదు. 1955లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధి బృందంలో కోదండరామయ్య ఒకరు. టంగుటూరి ప్రకాశంగారిని కలిసి తమ గోడును వినిపించారు. ప్రకాశంగారు హోసూరు పక్షాన నిలిచారు. ఈ విషయంగా వావిలాల గోపాలకృష్ణయ్య సంపూర్ణ సహకారాన్ని తీసుకొన్నారు. అయినా పటాస్కర్ అవార్డు అమలులో హోసూరు ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కాలేదు. విజ్ఞాన వ్యాప్తికోసం వారు పొట్టి శ్రీరాములు సేవాసమితిని స్థాపించారు. హోసూరులో తెలుగు ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలను ఏర్పరచారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు పక్షాన పరీక్షలు నిర్వహించి తెలుగు పండితుల్ని ఎందరినో తయారుచేశారు. వెనుకబాటుతనంతో ఉన్న తన ప్రజలకు సేవచేయాలనే తపనతో వారు ఉద్దనపల్లి నియోజకవర్గంనుండి 1967లో ఒకసారి, 1971లో మలిసారి ఎన్నికలలో నిలబడి ఎం.ఎల్.ఏ.గా గెలిచారు. తమిళనాడు శాసనసభలో మొట్టమొదటిసారిగా తెలుగువాణి వినిపించిన ఘనధీరుడు కోదండరామయ్య. వీరి ప్రయత్న ఫలితంగా కలవరపల్లి రిజర్వాయరు మొదలైన ఆనకట్టలు చెరువులు ఎన్నో నిర్మింపబడ్డాయి. రైతుల బ్రతుకులు మూడు పువ్వులు ఆరుకాయలయ్యాయి. రోడ్ల్డు రవాణా వైద్య సదుపాయాలు హెచ్చుగా సమకూరాయి. కొత్త పాఠశాలలు నెలకొన్నాయి. ఆంధ్ర భాషోద్యమమే కోదండరామయ్య ఊపిరి. తల్లి భాషను కాపాడుకోవడానికి ‘దక్షిణ భాషా రక్షణ సమితి’ని స్థాపించారు. మాజీ ఎం.ఎల్.ఏ. బి.వెంకటస్వామి, గెంగుస్వామినాయుడుగార్లు వారికి సహకరించారు. తత్ఫలితంగా భాషా అల్పసంఖ్యాకులైన తెలుగువారికి కొన్ని ప్రయోజనాలు చేకూరాయి. నేటికీ ఆ సంస్థ పనిచేస్తోంది.
తెలుగు గ్రామనామాల్ని తమిళీకరణ కాకుండా అడ్డుకోవడం, ఎన్నికల ఓటర్ల జాబితా స్థానిక తెలుగు, కన్నడ భాషలలో వెలువరించేటట్లు చేయడం చెప్పుకోదగ్గ విషయాలు. తెలుగును తమిళనాట రెండవ అధికార భాషగా చట్టంచేయాలని వారు నిరంతరం పోరాడారు. ఆంధ్ర సాంస్కృతిక సమితి స్థాపన కోదండరామయ్య సేవలలో కీర్తిపతాక. హోసూరు ప్రాంత తెలుగువారికి సాంస్కృతిక కేంద్రంగా పనిచేయడానికి ఒక సొంత భవనం కావాలని దీర్ఘదర్శనం చేశారాయన. ఆంధ్ర, తమిళ ప్రభుత్వాలిచ్చిన కొంత ఆర్థిక సహాయంతో ప్రారంభించిన ఆ భవన నిర్మాణం ఆగిపోయింది. వారి తర్వాత దాతలు, ఉపాధ్యాయులు ఆ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి శ్రీలక్ష్మీనారాయణగారి తోడ్పాటు మెచ్చుకోదగినది.
వారు స్థాపించిన సాంస్కృతిక సమితి కార్యక్రమాలకు రాష్ట్ర అంతర్‌రాష్ట్ర వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులెందరో విచ్చేసి, జయప్రదం చేశారు. సాహిత్య ప్రసంగాలు, హరికథలు, అష్టావధానాలు, భువన విజయం వంటి నాటికలు, కళాప్రదర్శనలు మొదలైన కార్యక్రమాలు ప్రాంతీయులలో మాతృభాషాభిమానాన్ని ఇనుమడింప చేశాయి. నేటికీ ఆ సమితి సేవలు వనె్నతరగకుండా నిర్వహింపబడుతున్నాయన్నది గమనార్హం.
కోదండరామయ్య సాహితీ సేవ మహత్తరమయినది. వీరి వ్యాసాలు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, భారతి వంటి పలు ప్రముఖ పత్రికలలో ప్రచురించబడి ప్రశంసించబడ్డాయి. తన అభిమాన చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల చరిత్రను సమగ్రంగా రాశారు. అందుకు వందలాది ఆంధ్ర, ఆంగ్ల గ్రంథాల్ని ఆకరాలుగా చేసుకొన్నారు. వారు రాయల చరిత్రను 1. కృష్ణదేవరాయల కుటుంబము 2. వంశాధికము 3. యుద్ధ విజయములు 4.్భక్తి-దేవాలయ కైంకర్యాలు 5. సాహిత్య పోషణ 6. పరిపాలన- అనే ఆరు భాగాలుగా విభజించుకొన్నారు. అందులో మొదటి భాగము మాత్రమే ముద్రితమైనది. వీరు రాసిన మహాత్మాగాంధీ చరిత్ర విద్యార్థులకు ఉపవాచకంగా నిర్దేశింపబడింది. వీరి అష్టదిగ్గజ కవి సమాజంలో రాయలను ఆశ్రయించిన తొలి కవి ఎవరు? అన్న రచన ముద్రణకు నోచుకొంది. ఆంధ్రకేసరి ప్రకాశంగారి శత జయంత్యుత్సవ సంచిక వీరి సంపూర్ణ పర్యవేక్షణలో ప్రకటింపబడింది. వీరి జానకీపతి శతకం, అచ్యుతరాయ శతకాలు ముద్రితం కావలసి ఉంది. కోదండరామయ్య చక్కని పరిశోధకులు, నిశిత విమర్శకులు కూడా. ఆదికవి నన్నయ్య మైసూరు రాష్ట్రంలోని నంజంగూడు ప్రాంతానికి చెందినవాడని సోపపత్తికంగా వివరించారు. నంజుండయ్య, నంజుండప్ప మొదలైన పేర్లనుండే నన్నయ్య అనే పేరొచ్చిందని, అటువంటి పేరు ఆంధ్రలో ఎక్కడా లేదన్నారు.
శాసనసభా బాధ్యతలు తీరిన పిమ్మట వారు ఎక్కువకాలం చరిత్ర పరిశోధనకు వినియోగించారు. సోదరులు సత్యనారాయణ, నరసింహమూర్తి మిత్రులు సీతారామయ్య మొదలగు వారిని వెంటబెట్టుకొని కాళ్లరిగేటట్లు గుట్టరాళ్లు, పలకరాళ్లు ఎక్కడున్నా వెదికి, వాటిపై బొగ్గుతో రుద్ది ఏవైనా అక్షరాలు కనిపిస్తే సంతోషించి ఆ శాసనాలకు నకళ్లు తయారుచేసుకొన్నారు. అలాగే గ్రామస్తులనుండి దాదాపు 400 తెలుగు- సంస్కృత తాళపత్ర గ్రంథాలను సేకరించారు.
చివరి క్షణంలో కూడా తెలుగు... తెలుగు... అని పలవరించిన తెలుగులెంక కోదండరామయ్య తన అనారోగ్యాన్ని సైతం లెక్కించక అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనడానికి 1984 జూన్ 4న హైదరాబాదు కార్యాలయానికి వెళ్లినవారు కుర్చీలో కూర్చుని ఒరిగిపోయి శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. తన ఆరు దశాబ్దాలు జీవితాన్ని జాతికోసం ధారవోసిన ధన్యజీవి ఆయన.
ఎందరెందరికో స్ఫూర్తిప్రదాత కోదండరామయ్య. గొప్ప విలువల్ని నేర్పిన ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులకు, నిబద్ధతతో బోధించడం, అటు అధ్యాపకులకు ఆయన ఆదర్శం. సేవానిరతి కల్గిన ఆయన ప్రజాప్రతివాదులకు దిక్సూచి. రాయల పట్ట్భాషేక ఉత్సవాలు వంటివి నిర్వహించడంలో వారు పొరుగు రాష్ట్రాలకు గొప్ప స్ఫూర్తి. కొత్త తెలుగు సంఘాల ఆవిర్భావానికి వారి ప్రేరణ. తెలుగు సాంస్కృతిక పరిరక్షణకు వారొక గొప్ప మార్గదర్శి. వారి స్ఫూర్తితో తమిళనాట తెలుగును పాఠశాల స్థాయిలో నిలబెట్టుకోవడం తెలుగువారి ప్రప్రథమ కర్తవ్యం. తెలుగుకు రెండవ అధికార భాషస్థాయి సాధించాలి. హోసూరులో తెలుగు అకాడెమీ శాఖ నెలకొల్పాలి. కోదండరామయ్య పేరిట తెలుగు విశ్వవిద్యాలయంలో పీఠాన్ని నెలకొల్పాలి. ఇటువంటి కర్తవ్యాలనెన్నింటినో ఐక్యతతో నిర్వహించడానికి ఉద్యమించడమే తెలుగువారు కె.ఎస్.కోదండరామయ్యకు ఇచ్చే నిజమైన నివాళి.
*
(డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన
‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి...)

- కలువకుంట నారాయణ