సబ్ ఫీచర్

తెలంగాణ కవి వాణి - అంతర్వాహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్వాహిని
పేజీలు: 145 వెల: రూ.100
ప్రతులకు:
దాస్యం సేనాధిపతి,
ఎంఐజి-2-90, హౌసింగ్‌బోర్డ్ కాలనీ
కరీంనగర్- 505001. సెల్: 9440525544
*
పుస్తకం హితమేదో చెబుతుంది. సహేతుకమైన మార్గనిర్దేశనం చేస్తుంది. స్ఫూర్తినిస్తుంది. తలెత్తుకుని బతికేలా చేస్తుంది. అలాంటి ఒక మంచి పుస్తకమే ‘అంతర్వాహిని’. సాహిత్యకారుల మనోగతాలను పొందుపరచిన ఈ పుస్తకకర్త దాస్యం సేనాధిపతిగారు. ఇంతవరకూ 12 గ్రంథాలను వెలువరించిన సేనాధిపతిగారి 13వ పుస్తకమిది. దాదాపు 3 సంవత్సరాలు ఆంధ్రభూమి దినపత్రికలో దాస్యంవారు నిర్వహించిన ‘మెరుపు’ శీర్షికన తెలంగాణ సాహితీకారుల మనోగతాలను ఆవిష్కరించే ‘అంతరంగం’ నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖాముఖి ద్వారా 53 మంది కవులు, రచయితల సంక్షిప్త పరిచయాన్ని వారు ఇందులో పొందుపరిచారు. అందువల్ల కొద్దిమంది సాహిత్యమూర్తుల వివరాలనే తప్ప అందరివీ తెలుసుకోలేకపోయానని రచయిత ఈ పుస్తకంలో తెలియజేసారు. ఆయా సాహితీకర్తల పరిచయం, వారి వ్యక్తిత్వం, రచనలను ముందుగానే పరిచయం చేయడం ద్వారా సాహిత్య సభల్లో తరచుగా కనిపించే ఈ వ్యక్తులు ఇంత గొప్పవారా అనే ఆశ్చర్యం, మరింత గౌరవం కలగక మానదు. వారి రచనల పరంపరను చూసి తెలంగాణ రాష్ట్ర సాహితీ సంపద ఎంత గొప్పదో అవగాహనకు వస్తుంది.
సేనాధిపతిగారు సాహిత్యం గురించి సంధించిన ఎన్నో ప్రశ్నలు, వాటి సమాధానాలు నేటి తరానికి, భవిష్యత్ తరానికీ ఎంతో ఉపయుక్తంగా, ప్రేరణాత్మకంగా ఉంటాయి. మనకాలపు వట్టికోటగా భాసిల్లుతున్న డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్యగారి వయసు ఎనభై దాటినా పేదోళ్ళకు అండగా ఉండే పెద్ద మనసుతో గ్రంథాలయాన్ని స్థాపించడమే కాకుండా తన ఇంటినే గ్రంథాలయంగా మార్చేసిన భువనగిరి సాహిత్య శిఖరం. పద్యం కంటే పాట ముందు పుట్టింది కాబట్టి తాను పాటవైపే మొగ్గు చూపానన్నారు ప్రముఖ కవి వడ్డేపల్లి కృష్ణ. మరుగున పడిన తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావడానికి రచయితలు ఏంచేయాలనే అమూల్యమైన ప్రశ్నకు ప్రస్తుత తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా.నందినీ సిధారెడ్డిగారు స్పందిస్తూ మన నేలమీద పుట్టిన ఎందరో గొప్ప రచయితలున్నారు, వారి సాహిత్యాన్ని పరిశోధించి వెలుగులోకి తేవాల్సిన సమయమిది. ఇందుకు తీవ్ర కృషి, పట్టుదల, అంకితభావన ఉంటే మంచి దశ, దిశ సాధ్యం, ఇందుకు విస్తృత అధ్యయనం అవసరమని అన్నారు. విశేషించి బడులు, కళాశాల విద్యార్థులకు ఇవి చేరాలని, అన్ని ప్రభుత్వశాఖలలో తెలుగునే అధికార భాషగా ఉపయోగించాలని తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావుగారు అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ సాహిత్య సంబంధ అంశాలపైనే పరిశోధనలు జరిగేలా విద్యార్థులను ప్రోత్సహించాలని తమ అసమాన ప్రతిభతో ఎందరో రచయితలను ప్రభావితులను చేసిన దివంగతులు డా.కపిలవాయి లింగమూర్తి అభిప్రాయపడ్డారు. తెలంగాణ కథారచయితల మాగాణమని, పత్రికల వివక్షవల్ల వారు వెలుగులోకి రాలేదని, ఇప్పటికైనా రచయితలు తమ వర్గదృక్పథాలను పక్కకుపెట్టి అన్నివర్గాల వారినీ ప్రోత్సహించి తెలంగాణ సాహిత్యాన్ని వెలికితీయాలని కథాకళానిధి ఐతా చంద్రయ్య అన్నారు. తెలంగాణ సంస్థానాలలో నాడు వెల్లివిరిసిన సాహిత్యం, మన ప్రాంత సంచారజాతుల సాహిత్యం వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని డా.పల్లేరు వీరాస్వామి అభిప్రాయపడ్డారు. అనుభవజ్ఞులు, శ్రద్ధాళువులైన సాహితీ జిజ్ఞాసువులతో కమిటీలను ఏర్పరచి ముద్రితాముద్రిత రచనలను వెలికితీసి ప్రక్రియల వారీగా విభజించి, కంప్యూటరీకరించాలని నిర్మల్‌కు చెందిన పద్యకవి మడిపల్లి భద్రయ్య అన్నారు. తెలంగాణ సాహిత్య చరిత్రను అందరూ కలిసికట్టుగా పునర్నిర్మించాలని ప్రముఖ రంగస్థల నటులు గన్నమరాజు గిరిజా మనోహరబాబు అభిప్రాయం. తెలంగాణ సాహిత్యకారుల అద్భుత రచనలన్నీ బహిర్గతపరచాలని వ్యాకరణ శిరోమణి అయాచితం నటేశ్వరశర్మ. పుస్తక ప్రచురణ సంస్థలు విస్తృతంగా రావాలని ప్రముఖ కథారచయిత రేగులపాటి కిషన్‌రావు అన్నారు. ముందుగా మరుగునపడిన తెలంగాణ సాహిత్యాన్ని వెలుగులోకితెస్తున్న వారిని, వారి రచనలను ప్రచురించి, ప్రోత్సహించి ప్రత్యేక గుర్తింపునివ్వాలని ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి నామని సుజనాదేవి అభిప్రాయపడ్డారు.
వ్యక్తిత్వంతోపాటు పరమార్థాన్ని నిర్దేశించేది కవిత్వమని, యువతను నాస్తికులు, పిడివాదులుగా తయారుచేసే కవిత్వానికి దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు మసన చెన్నప్పగారు. వస్తువును దాచడం కాదు, పొరలుపొరలుగా విప్పుతూ పాఠకుల్ని తన్మయుల్నిచేసేది కవిత్వమన్నారు కవి, సమీక్షకులు శ్రీరమణ వెలమకన్నిగారు. విషయ సాహిత్యాన్నంతా పదబద్ధంగా సూక్ష్మీకరించడమే కవిత్వమని ప్రముఖ కవి ఆచార్య కడారు వీరారెడ్డి అభిప్రాయపడ్డారు. వస్తువు, శిల్పం కవిత్వపుబండికి వలపటదాపటగా రెండెడ్లలాగా నడవాలన్నారు ఆధునిక వచన కవిత్వంలో 2018 సంవత్సరానికిగానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అందుకున్న కందుకూరి శ్రీరాములుగారు. తెలంగాణ ఉద్యమానికి తన రచనల ద్వారా ఊపిరులూదిన కవి దామెర రాములుగారు. పదాడంబరాలు లేనిదై అట్టడుగువర్గాల జనగోసకు అద్దంపట్టేదిగా కవిత్వం ఉండాలన్నారు తెలంగాణ ఆత్మఘోష పద్యకావ్యకర్త వేణుగారు.
ఎవరి ఇజం ఏదైనా హ్యూమనిజంకు ప్రాధాన్యతనిచ్చే రచనలు కావాలన్నారు ప్రముఖ పద్యకవి సముద్రాల వేణుగోపాలాచార్య. ఏ ఇజమైనా రచనలు జాతీయభావాలతో ఉండి జనచైతన్యానికి కృషిచేసేవిగా ఉండాలన్నారు కవి వరికొండ కాంతారావుగారు. పురస్కారాలు గుర్తింపును, ప్రోత్సాహాన్నిస్తాయి. ఒక్కరికే అందరూ పురస్కారాలివ్వడం కాకుండా యువతకు, మంచి రచనలు చేస్తున్నా ఎలాంటి గుర్తింపురాకుండా ఉన్నవారికి గౌరవం ఇవ్వాలన్నారు తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్యగారు. మిగతా రాష్ట్రాలకన్నా ఎక్కువగా తెలంగాణ సాహిత్యకారులకు అవార్డులిచ్చి ప్రోత్సహిస్తుండడం గర్వించదగిన విషయమన్నారు కాళోజీ పురస్కార గ్రహీత అమ్మంగి వేణుగోపాల్‌గారు. మంచి ప్రమాణాలున్న ఆంగ్లసాహిత్యాన్ని చదవడం ద్వారా అనువాద రచనలుచేసే పట్టు సాధించాలంటారు కవి ఎలనాగ. కవితల కార్ఖానా అని ఇందూరువారు పిలుచుకునే కవి కందాళై రాఘవాచార్య గీతాంజలిని అనువదించారు.
స్ర్తివాద కవిత్వం అవసరమే అని మహిళా రచయిత్రులందరి ఏకభావన. ఐతే స్ర్తివాద సాహిత్యం వారిలో చైతన్యం కలిగించడానికి మాత్రమేకాదని, మహిళాభ్యుదయానికి మార్గనిర్దేశనం చేసేదిగా ఉండాలని వర్థమాన కవయిత్రులు ల్యాదాల గాయత్రి, హనుమాండ్ల రమాదేవి అభిప్రాయపడ్డారు. టీవీ సీరియల్స్‌లోని సాహిత్యం భిన్నంగా, స్ర్తి స్వభావానికి విరుద్ధంగా ఉంటోందని, వారు సాహిత్యపరంగా సామాజిక చైతన్య అంశాలపై దృష్టిపెడితే బాగుంటుందని కవయిత్రి గరిశకుర్తి శ్యామల అభిప్రాయపడ్డారు. తమ అభీష్టరంగాల్లో వచ్చిన రచనలను అధ్యయనం చేస్తే తమ రచనాపద్ధతిలో నవ్యదృష్టి వస్తుందని యువతకు మార్గనిర్దేశనం చేస్తున్నారు ఆచార్య రావికంటి వసునందన్. స్పష్టమైన దృక్పథం కలిగిఉండి కీర్తికాంక్షను పక్కనపెట్టి, జాగృతపరచే రచనలు చేయాలని సలహాఇచ్చారు కవులు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, శలం జగతీధర్. బీడీ కార్మికుల గురించిన ‘బతుకుపోరు’ నవల రచించిన తెలంగాణ రాష్ట్ర బి.సి. కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు తెలంగాణ రచయితలు విస్తృత పరిధిలోకి వచ్చేలా రచనలు చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఎన్నో వేల కథలు తమకు అక్షర రూపమివ్వాలని ఘోషిస్తున్నాయని, రాయగలిగిన సమర్థత ఉన్నవారు ఆ పనికి పూనుకోవాలని పిలుపునిచ్చారు రచయిత డా.దేవరాజు మహారాజు.
తెలంగాణకు అంతర్వాహినిగా ఉండి జీవధారనిస్తున్న సాహిత్యం, కృషీవలుల వివరాలు, అభిప్రాయాలు, వారి రచనావ్యాసంగం ఇత్యాది వివరాలతో వచ్చిన ఈ పుస్తకం ఇతర పుస్తకాలకు భిన్నంగా ఉండి ఉపయుక్తంగా, ఆస్వాదయోగ్యంగా ఉంది. సాహిత్య సమాచార సేకరణను పొందుపరచి సృజనాత్మక పుస్తకంగా తీసుకొచ్చినందుకు రచయిత అభినందనీయులు. పుస్తకం చివరన ఇందులోని కవులు, రచయితల చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇవ్వడం బాగుంది. అక్కడే చిన్నగా వారి ఫొటోలను కూడా ఇస్తే తరచూ చూసే వారిని గుర్తుపట్టేలా ఉండేది. కొత్తవారికి పూర్తి పరిచయాన్ని చేసినట్లుగా ఉండేదని అనిపించింది. అలాగే ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ముఖాముఖి జరిపి పుస్తకంగా తీసుకొచ్చిన కవి, రచయిత, విమర్శకుడు దాస్యం సేనాధిపతి కూడా వీరిలో ఒకరిగా తమ పరిచయం, సాహిత్యసేవను పొందుపరిస్తే బాగుండునని అనిపించింది. అంతర్వాహిని పుస్తకం మరెంతోమందికి ఎన్నో రకాలుగా ప్రేరణనిస్తూ స్ఫూర్తిగా ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

- డా. సరోజ వింజామర, 8099721928