సబ్ ఫీచర్

మహిళా మార్గదర్శి ముత్తులక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నింటా పురుషాధిక్యమే యుండిన ఆ కాలంలో విద్య, వైద్య, రాజకీయం, సాంఘిక రంగాలలో ముందడుగు వేసి, మహిళా లోకానికి అపారమైన సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, బహువిధ సేవకురాలైన డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి గుఱించి తమిళనాట తెలియని వారుండరు. సాంఘిక సంస్కరణోద్యమంలో కూడా పాల్గొని రాణించిన మహిళా నాయకమణి ముత్తులక్ష్మి. ముత్తులక్ష్మి 1886 జూలై 30న పుదుకోటలో జన్మించారు. తండ్రి నారాయణస్వామి, తల్లి చంద్రమ్మ. బాల్యంనుండే చదువుపై ఆసక్తి, ఇతరులకు సేవచేయాలనే తపన ముత్తులక్ష్మికి వుండేది. కాని ఆ కాలంలో స్ర్తివిద్యను ప్రోత్సహించేవారే కారు. అందువల్ల ముత్తులక్ష్మి ప్రాథమిక విద్యను ఇంటియందే కొనసాగించింది. తరువాత ఉన్నత విద్యనభ్యసించి పట్ట్భద్రురాలు కావాలనేది ఆమె కోరిక. పుదుకోట రాజావారి కళాశాలలో చేరడానికి దరఖాస్తు పెట్టుకున్నది. అప్పటివఱకు ఆ కళాశాలలో పురుషులు తప్ప ఒక్క స్ర్తికూడా చేరియుండలేదు. కళాశాలవారు ముత్తులక్ష్మి పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించనే లేదు. ముత్తులక్ష్మి కళాశాలలో చేరడానికి అంతరాయం కలిగింది. ముత్తులక్ష్మి తండ్రి నారాయణస్వామి పుదుకోట మహారాజుగారి దగ్గఱకు వెళ్లి తన కుమార్తె కోరికను విన్నవించుకున్నాడు. అది విన్న రాజావారు అప్పటికి ఆ కళాశాలలో వున్న విద్యానిబంధనలను సడలించి, ముత్తులక్ష్మిని కళాశాలలో చేర్చుకొనడానికి అనుమతించారు. పుదుకోట రాజాగారి కళాశాలలో విద్యనభ్యసించిన ‘మొదటి మహిళ’ అనే ఘనత ముత్తులక్ష్మికే చెందుతుంది. స్ఫురద్రూపి అయిన ముత్తులక్ష్మికి కళాశాల చదువు చదివి, డిగ్రీ పుచ్చుకున్నాక, తానూ ఒక డాక్టరయి రోగులకు ఉచిత రీతిన చికిత్సలందించాలనే కోరికతో మద్రాసు వైద్యకళాశాలలో, పట్టుదలతో చదివి 1912లో డాక్టరయింది. వైద్యరంగంలో పట్ట్భద్రురాలైన ‘మొదటి భారతీయ మహిళ’ డా.ముత్తులక్ష్మిగారే. యుక్తవయస్కురాలైన డా.ముత్తులక్ష్మి మరొక డాక్టరయిన సుందరంరెడ్డిని వివాహం చేసుకున్నారు. అప్పటినుండి ఆమె పేరు డా.ముత్తులక్ష్మిరెడ్డి అయింది. ఇలావుండగా పట్ట్భద్రురాలైన డా.ముత్తులక్ష్మికి 1929లో ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం, మద్రాసు రాష్ట్ర శాసనసభ యందు శాసనమండలి సభ్యురాలిగా నియమించింది. శాసన మండలికి సభ్యులయిన మొదటి భారతీయ మహిళ ముత్తులక్ష్మి. అనంతరం శాసనసభకు ఉపాధ్యక్షురాలుగా తన విధులను సక్రమంగా నిర్వర్తించారు. స్ర్తిలకు ఓటు హక్కు, ఆస్తిహక్కు ఉండాలని శాసనసభలో చిత్తశుద్ధితో పోరాడారు. దేవదాసి నిరోధక చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టించారు. కొంతమంది ఛాందసవాదులు ఆ చట్టాన్ని తీవ్రంగా ఎదిరించారు. ఆనాడు దేవదాసి విధానమునకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేసిన ముత్తులక్ష్మిరెడ్డి, గాంధీగారిచే విశేష ప్రశంసలందుకొనింది. ఆ తర్వాత క్రమంగా ముత్తులక్ష్మి న్యాయమైన వాదనకు బలం చేకూరి ‘దేవదాసి నిరోధక చట్టం’ శాసనసభచే ఆమోదింపబడింది.
ఆ రోజుల్లోనే వుండిన మరొక దురాచారం బాల్య వివాహం. అనె్నంపునె్నం ఎరుగని అబలల ముద్దుముచ్చట్లకు విఘాతంగా నిలిచిన బాల్యవివాహాలను అరికట్టడానికి ముత్తులక్ష్మి ‘శారదా చట్టాన్ని’ ప్రభుత్వంచేత అమలుచేయించి ఆడబిడ్డలకు అండగా నిలిచారు. ముత్తులక్ష్మి సహోదరి 1923లో క్యాన్సర్ వ్యాధితో మరణించింది. తన సహోదరి మరణాన్ని జీర్ణించుకోలేక క్యాన్సర్ రోగులను రక్షించడానికి కంకణం కట్టుకొన్నది. వారికి శాయశక్తులా పాటుపడగలనని శపథం చేయడమేకాదు, లండన్‌కు ప్రయాణం కట్టింది. లండన్‌లో వున్న రాయల్ క్యాన్సర్ వైద్యశాలలో చేరి విద్యనభ్యసించింది. అనుభవజ్ఞులైన అక్కడి డాక్టర్లతో విధేయతతో మెలగి, ఆ వ్యాధిని గురించి ఎన్నో విషయాలను ఆకళింపు చేసుకొనింది. భారతదేశంలో క్యాన్సర్ రోగులను రక్షించడమే తన ధ్యేయమని, అందుకే లండన్ వచ్చానని దృఢసంకల్పాన్ని తెలియజేసింది. ముత్తులక్ష్మియొక్క సేవాతత్పరతను, విశాలభావాన్ని, పట్టుదలను గుర్తించిన డాక్టర్లు క్యాన్సర్ వైద్యంలో పాటించవలసిన మెళకువలను ముత్తులక్ష్మికి తెలియజేసి, తమ పూర్తి సహకారాన్నందించి ప్రోత్సహించారు. ముత్తులక్ష్మిరెడ్డి లండన్‌నుండి తిరిగి వచ్చాక, మద్రాసు అడయారులో ఒక క్యాన్సర్ వైద్యశాలను ప్రారంభించారు. ఈ క్యాన్సర్ వైద్యశాల నేటికీ గణనీయంగా సేవలందిస్తూ ముత్తులక్ష్మి కీర్తిని దశదిశల నిలబెడుతోంది. దేశ స్వాతంత్య్ర సముపార్జనలో కూడా ముత్తులక్ష్మి పాత్ర అమోఘం. స్వాతంత్య్ర ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు. రాజకీయ రంగంలోనూ రాణించిన ముత్తులక్ష్మి 1930లో అఖిల భారత మహిళా సమావేశంలో పాల్గొని ప్రముఖ పాత్ర వహించారు. 1933 వరకు భారత మహిళా సంస్థకు అధ్యక్షురాలిగా పనిచేశారు. సంఘ సంస్కరణాభిలాషియైన ముత్తులక్ష్మి స్ర్తి జనోద్ధరణకై పాటుపడ్డారు. సమాజ సేవయే ప్రధానంగా భావించి, జీవించిన ఆణిముత్యము ముత్తులక్ష్మికి కేంద్ర ప్రభుత్వము 1956లో ‘పద్మభూషణ్’ బిరుదునిచ్చి గౌరవించింది. ముత్తులక్ష్మి అటు వైద్యరంగములోను, ఇటు రాజకీయ రంగములోను విశేషకృషి చేయడమేగాక, సాంఘిక సంస్కరణలలోను, శ్రద్ధవహించి, ప్రజాక్షేమం కొఱకు అవిశ్రాంతంగా పాటుపడి అందరి మన్ననలందిన మహిళామణి. తమిళనాడు ప్రభుత్వం ఆమె పేరిట ‘డా.ముత్తులక్ష్మిరెడ్డి ప్రసూతి పథకము’ అనే సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మానవతావాదిగా పేరుగాంచిన ముత్తులక్ష్మి తన 82వ యేట 1968 జూలై 22న మరణించింది.
*
(డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన
‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి...)
*

- జి. హరికృష్ణయ్య