సబ్ ఫీచర్

గుణాఢ్య గర్జనకు శతజయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌజన్యంబను మేకతోలు మెయినాచ్ఛాదించుకొన్నట్టి రుూ
రాజుల్ రాజులె? దొంగ బెబ్బులులు; వీరా? మా శ్రమ స్వేద పా
థోజాలంబు హరియించువారు; కృతియిత్తున్ మెచ్చి గైకోగదే!
నీ జిహ్వాగ్రములన్ ధనంజయుడ! రాణింపన్ జిరస్థాయిగన్‌॥
ఆధునికాంధ్ర పద్య పంచ కావ్యాలలో ఒకటిగా పేరుపొందిన ‘ఆంధ్ర పురాణము’ శాతవాహనపర్వం - గుణాఢ్యుని కథలోనిది ఈ పద్యం. హాల చక్రవర్తికి ఆరు నెలల్లో ప్రాకృత భాషను నేర్పించలేక అనుకున్న పందెం ప్రకారం దేశ బహిష్కార శిక్షకు గురియైన గుణాఢ్యుడు బృహత్క్థను రచించి అంకితంగా ఆ చక్రవర్తికి పంపగా అతడు (ఆ రాజు) భాషా బహిర్ద్వేషాన్ని పూని తిరస్కరించాడు. ఆ పరాభవానికి తట్టుకోలేక గుణాఢ్యుడు తన కావ్యానికి చెందిన తాళప్రతులలోని ఒక్కొక్క ప్రతిని చదివి అగ్నికి ఆహుతి చేస్తున్న సందర్భంలో గుణాఢ్యుని భాషణోక్తిగా చెప్పబడిందే పై పద్యం.
‘‘సౌజన్యమనే మేకతోలును కప్పుకొని తిరిగే ఈ రాజులు రాజులా? కారు. దొంగలైన పెద్దపులులు. మావంటి కవుల శ్రమను ఏమాత్రమూ గుర్తించలేరుగదా! పైగా మా చెమట చుక్కల్ని హరించి, మమ్మల్ని గౌరవించేవారు - వీరా? కాబట్టి అగ్నిదేవా! నా కావ్యాన్ని నీకంకితం చేస్తాను. మెచ్చి, నీ జ్వాలికల నాలుకలతో స్వీకరించు’ అని భావం.
పురాతన శాతవాహన కాలం నాటికే తమను ఆదరించని రాజులపై కవుల, కళాకారుల ఆగ్రహజ్వాల ఎంతటిదో తెలుస్తోంది. కవులకూ, కళలకూ సరియైన గౌరవం లభించకపోతే ధిక్కార స్వరం ఎలా పైకి లేస్తుందో పై పద్యంలోని అక్షరాక్షరమూ చాటిచెబుతోంది.
తెలుగు పద్యం పూర్తిగా బూర్జువా వ్యవస్థకే పట్ట్భాషేకం చేసిందనీ, ఆ స్థితి యొక్క అడుగులకే మడుగులొత్తిందనీ, అసలు పద్యఛందం కానీ, గమకం గానీ అందుకే సరిపోతుందనే ఓ అల్పమైన పసిభావన అనాదిగా సాహిత్యలోకం హృదయంలో పాతుకుపోయి ఉంది. ఆ భావాన్ని బద్దలు కొట్టింది ఈ పద్య ఛందస్సు. ఇందలి నడక, పదాల పోహళింపు అన్నీనూ. ఈ పద్య ఛందం శార్దూలం.
ఇందలి గుణాఢ్యుని భాషణం శార్దూల (పులి) గర్జనంలా విసురుగా ఉంది. ముఖ్యంగా ఈ రాజుల్ రాజులె? దొంగ బెబ్బులులు; వీరా? మా శ్రమ స్వేద పాథోజాలంబు హరించువారు’ అనడంలో ఆ శార్దూల గర్జనంలోని తీవ్రత ప్రశ్నార్థకంలోని విసురూ మన ఎదలకు సరితాకుతుంది. అటువంటి రాజులు కేవలం క్రూర స్వభావం కలిగిన పెద్ద పులులే కారు. దొంగలైన పెద్దపులులట. ఇక్కడ ‘దొంగ బెబ్బులులు’ అన్న అచ్చ తెలుగు సమాసం సాభిప్రాయం - సార్థకం - పరికరాలంకార రూపం. ఔచితీ మహితం. దొంగలైన రాజుల్లో స్వచ్ఛత ఎక్కడ ఉంటుంది? ఉండదు గదా! అగ్నిలో ఉంటుంది. కాబట్టే అగ్నికి ఆహుతి రూపంలో అంకితంగా కావ్యహోమం చేస్తున్నాడు - గుణాఢ్యుడు - లోకంపై కసితో ఆయన కసి - కరుణ రసంలోనికి పర్యవసించి, పఠితల డెందాలను కదలించి వేసింది - చివరకు ఆ కావ్యం చాలావరకు ఆహుతి కాగా...
ఇంతకీ తెలుగు పద్యం - లోకానికి దూరమై కేవలం మడీ దడీ కట్టుకొని ఉండదు. అవసరమైతే ఆ పద్యం అడుగు (పాదం) చిచ్చరపిడుగై విజృంభిస్తుంది - ఏ భావ రూపంలోనైనా అని అనడానికి పై పద్యమే హృద్య నిదర్శనం. ఇంతకీ పై పద్య కావ్య రచయిత - పరమ సౌమ్యులు, అభినవ నన్నయ, ఆంధ్ర కల్హణ - బిరుదులు కలిగిన బ్రహ్మశ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారు. ఆంధ్ర పురాణ బాదరాయణులైన వారిలో ఈనాటి కొంతమంది రచయితల ఉద్దేశాలకు కనువ్పిను కలిగించే రీతిలో శ్రీకారం చుట్టిన ఆ పద్ధతిలో శ్రీ.శ్రీ. కనిపించడం లేదా? ఆ గుణాఢ్య గర్జన శతజయంతికి ఇదే అక్షర కళాజ్యోతి.

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ, 9866944287