సబ్ ఫీచర్

ఆంధ్ర సాహిత్యంపై చెరగని ముద్ర ఆరుద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుద్రలో అడ్డెడు చల్లిన పుట్టెడు పండుననేది నేటికి ఆంధ్ర దేశంలో ప్రతి నిత్యం విన్పించే నానుడి. కార్తెల్లో ఆరుద్ర అంతటి విశిష్టమైనదన్న మాట. సాహితీ చరిత్రలో ఆరుద్రగా చెరగని ముద్ర వెయ్యగలిగిన భాగవతుల శివశంకరశాస్ర్తీ ఉత్తరాంధ్ర నివాసి ఐనప్పటికి పత్రికలో చదివిన కథనానికి స్పందించి త్వమేవాహమ్ కావ్య రచన చేసి తెలంగాణ పోరాటంలో పాల్గొనక పోయినా పోరాటం పట్ల ప్రగాఢ సానుభూతిని కావ్యనామంలోనే ప్రతిధ్వనించారు. సాటి మనిషి సమస్యల పట్ల ఎంతో సానుభూతి వుంటే తప్ప నీవే నేను అని హృదయ పూర్వకంగా ప్రకటించడం సాధ్యమయ్యే పనికాదు. కాని, ఇందులో నీవే నేను అనుకుంటున్నది మనిషి మరో మనిషితో కాదు. చిరంజీవి మానవునితో మృత్యువు నీవేనేనని అంటుంది. మృత్యువు అంతగా భయపడవలసిన విషయము కాదని, పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదని, మరణించినప్పటినుండి జీవించసాగునని, అందువలన మృత్యు జీవితములకుగల సంబంధమునకు వెరవరాదని త్వమేవాహమ్‌లో ధ్వని ప్రాయమైన ప్రబోధము. తెలంగాణాలోని జమీందారీ వ్యవస్థను, రజాకారుల నిరంకుశత్వాన్ని ప్రతిఘటించి ప్రజలు జరిపిన విప్లవం ‘‘త్వమేవాహమ్’’ కావ్యానికి ప్రోద్బలమైనప్పటికీ, మానవుడనుభవిస్తున్న కష్టనష్టాలకు, నిరాశా నిస్పృహలకు కారణమైన వ్యవస్థ పూర్తిగా మారాలని, ప్రజలందరికీ పనికొచ్చే నూతన వ్యవస్థ స్థాపించబడాలని ఆరుద్ర ఆకాంక్షించారు.
నువ్వు ఎక్కదలచుకున్న రైలు / ఎప్పుడూ ఒక జీవిత కాలం లేటు / నువ్వు వెళ్ళదలచుకున్న ఊరు / నువ్వు బ్రతికుండగా చేరదీ రైలు - అనడంలో మానవుడు నిత్య జీవితాన్ని మోయలేక తప్పనిసరి పరిస్థితుల్లో మోస్తున్నాడని చెప్పడంలో నిరాశా నిస్పృహలు కనిపిస్తున్నప్పటికీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలు నేర్పే పాఠంలో ఇది నిజమేనని అంగీకరించక తప్పని స్థితి.
తొయ్యోయ్, తొయ్యోయ్, తొయ్ / మొయ్యోయ్, మయ్యోయ్, మొయ్ / లాగండర్రా బాబు, లాగండర్రా బతుకు / లాగండర్రా గన్ను ముందేముందోగాని లాగండర్రా తండ్రి / సర్వం అయోమయం ప్రమాదం, ప్రళయం, నరకం - మృత్యువు మాత్రం చిరంజీవి మానవుడా త్వమేవాహమ్ అంటుందిట.
కింకర్తవ్య విమూఢులైన కవిగారు మృత్యువునిలా ప్రశ్నిస్తున్నారు.
ఏం చెయ్యాలి మృత్యువూ ఏం చెయ్యాలి? / నీతోనా సమస్యలనుండి విముక్తి, / నీతోనా మా ఆశయాలు సమాప్తి / వాటీజ్ టు బి డన్? వాటీజ్ టు బి డన్? - సమస్యల మయమైన నిత్య జీవితంలో ఒక సమస్య తీరీ తీరకముందే మరో సమస్య ఎదురవుతుంది కదా.
ఆంధ్రప్రదేశ్ అవతరణకోసం పొట్టి శ్రీరాములు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా కలాన్ని చిత్తశుద్ధితో కదిపిన కవుల్లో ఆరుద్ర ఒకరు.
వేదంలా గోదావరి ప్రవహిస్తుందే చెల్లీ / వెనె్నల వలె కృష్ణవేణి విహరిస్తుందే చెల్లీ- అని ఆంధ్ర దేశంలోని గోదావరి, కృష్ణమ్మలను కీర్తించినా - విజరుూభవ, విజరుూభవ, విశాలాంధ్ర జననీ / ప్రజలంతా సుఖాలతో బ్రతుకంతా మననీ- అంటూ విశాలాంధ్ర అవతరంచిన సందర్భంలో మంగళాశాసనము పలికారు ఆరుద్ర. 1950నుంచి 1960 దాకా వివిధ సందర్భాల్లో వ్రాసి పత్రికల్లో ప్రచురించిన కవితలను 1960లో సినీ వాలి పేర ప్రచురించారు. సినీ వాలి అంటే చంద్రకళ కన్పించు అమావాస్య అని కదా! ఇందులో కథానాయకుడు సూర్యారావు మధ్యతరగతి విద్యావంతుడు. నాగరికుల పతనాన్ని చూసి బాధపడే సూర్యారావు రాజకీయాల ద్వారా వ్యవస్థను మార్చవచ్చుననుకుంటాడు కాని రాజకీయాల్లోని దిగజారుడుతనాన్ని చూసి-
పాడుతాను నాకు తెలిసిన నగరం గురించి / నగరంలోని నీతి గురించి, నీతి గురించి / రకరకాల సన్నివేశాలలో ఆవేశాలలో / ప్రకటించుతాను మనలాంటి మనుషుల గురించి పాడటమే గాక / ఎన్నికల ప్రచారం లాగ ఎందుకూ పనికిరాని రాకపోకలు / ఎవరూ నమ్మని వాగ్దానాలవలె ఎందుకో తెలియని ట్రాఫిక్కు - ఈ వాక్యాల్లో కవితాంశకంటే విషయ ప్రాధాన్యం, చెప్పదలచుకున్న విషయం సూటిగా స్పష్టంగా, సరళంగా చెప్పడం విశేషం. ఎన్నికల ప్రచారాలెన్ని విధాలుగా జరిగినా అందులో అమలుకు నోచుకునే హామీల సంఖ్య అతి స్వల్పమని పల్లెనుంచి పట్టణం దాకా ఎవరి నడిగినా చెబుతారు. రాకపోకల్లో సైతం పనికొచ్చే రాకపోకలు, తనకు, ఇతరులకు ప్రయోజనం చేకూర్చే రాకపోకలు కూడా పరిమితమే. అందుకే వాగ్దానాలు చేసే వారికి వివేకం లేకపోయినా వినే వారిలో వివేకముంటే నమ్మదగినవి ఎంతమాత్రం కాదని నిర్ధారించుకోవడం కష్టమేమీ కాదు. ట్రాఫిక్ సంగతి కూడా అంతేకదా. కవి భావనలెలా ఎవరి చిన్నపనులైనా వారికంత ప్రాధాన్యత కలవని ఇక్కడ విస్మరించకూడని విషయం. సమాజంలో భార్యాభర్తలున్నపుడే కుటుంబ జీవనం. కుటుంబంలోని ఇతరత్రా విషయాలన్నీ, ఎవరెక్కువ ఎవరు తక్కువనే ఆలోచనకే చోటుండకూడదు. చదవున్నా లేకున్నా ఎవరి ప్రాముఖ్యత వారిదే. జీవితమనే రేడియో సెట్టుకి భర్త ఏరియల్, భార్య ఎర్తు. సులభశైలిలో వ్రాసిన శుద్ధ మధ్యాక్కరలు ప్రత్యేకంగా పేర్కొనదగినవి. సాహిత్య వ్యాసాలతో, జనరంజకమైన సినీ గేయాలతో ప్రాతఃస్మరణీయుడు ఆరుద్ర.

- డా. కొల్లు రంగారావు