సబ్ ఫీచర్

నాచన సోమన.. శాసన విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక కవి పాండిత్యం, ప్రతిభా, పాటవ విశేషాలు అతను రాసిన కావ్యం ద్వారా తెలుస్తాయి. అతనికి సంబంధించి వ్యక్తిగత విషయాలు, పొందిన గౌరవాలు, స్వీకరించిన పురస్కార వివరాలు అతనికి సంబంధించిన శాసనాల ద్వారా తెలుస్తాయి. అంటే ఒక కవికి సంబంధించిన అనేక అంశాలను అధ్యయనం చేయడానికి శాసనాలు విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తాయని సాహిత్య, చరిత్రకారులు గుర్తించారు. తెలుగు సాహిత్యంలో లబ్దప్రతిష్టులైన నన్నయ, శ్రీనాథుడు, అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన లాంటి కవుల విశేషాలు వారి శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి చేరిన కవి నాచన సోముడు.
ఉత్తర హరివంశాన్ని లోకోత్తరంగా రాసిన నాచన సోమునికి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానముంది. నాచన సోమన వసంత విలాసం, హరివిలాసం, హరవిలాసం, ఆదిపురాణం కావ్యాలను కూడా రాశాడని పండితులు భావించారు. ఉత్తర హరివంశం తప్ప మిగతావన్నీ అలభ్యాలు. కొందరు లాక్షణికులు, సంకలనకర్తలు తమ గ్రంథాల్లో ఉటంకించిన పద్యాలను ఆధారం చేసుకుని ఈ కావ్యాలను నాచన సోముడు రాశాడని చెప్పారు. అతని పాండితీ ప్రకర్షకు ఉత్తర హరివంశమే సజీవ సాక్ష్యం. నాచన సోమన ఉత్తర హరివంశంలో కొత్త విషయాలు ఎన్నో ఉన్నాయి. సోమన తిక్కనను గురువుగా భావించి అతనిలాగే కవిత్వాన్ని కొత్త పుంతలుతొక్కించి కొత్తదనాన్ని కోరుకున్నాడు. సజీవమైన జాతీయాలను, వ్యావహారిక పదాలను విరివిగా వాడాడు. కావ్యంలోని పురాణ పురుష పాత్రలను తన కాలంనాటి మనుషులుగా సృష్టించాడు. కావ్యంలో సమకాలీన దృశ్యాలను వర్ణించాడు. అనేక విషయాల్లో తరువాతి కవులకు మార్గదర్శకుడైనాడు. తెలుగు సాహిత్య చరిత్రలో పేరెన్నికగన్న చాలామంది పండితులు నాచన సోమన గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడారు. ఇంత గొప్పగా సంవిధాన నిర్వహణం చేసిన కవి మరొకడు లేడని, ‘ఒకే ఒక్కడు’ నాచన సోమనని తేల్చారు.
అటువంటి నాచన సోమన గురించి శాసనాలు మరికొన్ని వివరాలు అందిస్తున్నాయి. ఇతనికి సంబంధించి మొత్తం నాలుగు శాసనాలు లభించాయి. అందులో రెండు శాసనాలు కర్ణాటకలో, రెండు కడప జిల్లాలో లభించాయి. కర్ణాటకలో లభించిన శాసనాల్లోని తేదీలు పండితుల్లో కొంత గందరగోళానికి గురిచేశాయి. ఈ శాసనాల ఆధారంగా నాచన సోమన పిన్నవయసులోనే కావ్యాలురాశాడని, చాలా సంవత్సరాలు జీవించాడని భావించవచ్చు. కర్ణాటకలో లభించిన రెండు తామ్ర శాసనాలు కోలారు జిల్లాలో లభించాయి. ఈ రెండు శాసనాలు విజయనగర సంగమ వంశానికి చెందిన మొదటి బుక్కరాయలు (క్రీ.శ.1344-1377)కు చెందినవి. గుత్తి రాజ్యానికి చెందిన కోడూరు సీమలోని పెన్న మాగాణికి చెందిన పినాకినీ తీరంలోని బుక్కరాయపురమనే నామాంతరంగల పెంచికలదినె్న అనే గ్రామాన్ని ఏకభోగ అగ్రహారంగా మొదట బుక్కరాయలు నాచన సోమునికి దానంగా ఇచ్చినట్లు ఈ శాసనాలు పేర్కొంటున్నాయి. ఈ శాసనాలు మొత్తం సంస్కృత భాషలో, దానానికి సంబంధించిన విషయం మాత్రం తెలుగు భాషలో ఉంది. తేదీ ఉండాల్సినచోట ‘అలంకృత శకస్యాబ్ధే రసర్తు నయనేందుభిః’అని ఉంది. ఇట్లా పదాలతో తేదీని చెప్పే పద్ధతిని క్రోనోగ్రామ్ అంటారు. ఇందులో ‘రసర్తు’ అంటే ‘రసాలు’ (మొత్తం ఆరు), ‘రుతు’అంటే రుతువులు (మొత్తం ఆరు), ‘నయన’ అంటే కళ్ళు (రెండు), ‘ఇందు’ అంటే చంద్రుడు (ఒకటి, చంద్రుడొక్కడే కాబట్టి). ‘రసర్తు నయనేందుభి.’ అంటే 6 రసాలు, 6 రుతువులు, 2 కళ్ళు, 1 చంద్రుడు. దీన్ని అంకెల్లో రాసుకుంటే 6621 అవుతుంది. దీనికి ‘అంకానాం వామతో గతి’ అనే సూత్రాన్ని అన్వయించి ఎడమవైపుకు అంకెల్ని మార్చిరాస్తే 1266 అవుతుంది. ఇది శక సంవత్సరం 1266. దీనికి 78 సంవత్సరాలు కలిపితే క్రీ.శ.1344 అవుతుంది (శక సంవత్సరం 78లో ప్రారంభమైంది కాబట్టి శక సంవత్సరానికి 78 సంవత్సరాలు కలిపితే క్రీ.శ.వస్తుంది). అంటే ఈ శాసనం క్రీ.శ.1344 నాటిది. ఇంత స్పష్టంగా ఈ శాసనంలో తేదీ ఉంది. ఈ శాసనం నాచన సోమనను ‘మహాకవి’యని, ‘సకలాగమవేది’యని, ‘అష్టాదశ పురాణాల సారం తెలిసిన వాడ’ని ‘అష్ట భాషల్లో కవిత్వంచెప్పే నేర్పుకలవాడ’ని ‘సకల భాషా భూషణుడ’ని, ‘సాహిత్య రసపోషకుడ’ని, ‘సంవిధాన చక్రవర్తి’యని, ‘నవీన గుణసనాధుడ’ని గొప్పగా వర్ణించింది.
మిగతా రెండు శాసనాలు కడప జిల్లాలోని తుడుములదినె్న గ్రామంలో లభించాయి. ఇందులో మొదటి శాసనం సంగమ వంశానికి చెందిన ప్రౌఢ దేవరాయల కాలానికి చెందింది. ఇందులో తేదీ లేదు. ఈ ప్రౌఢ దేవరాయలే మొదటి దేవరాయలు ఇతని పాలనాకాలం క్రీ.శ.1406-1422. తురుమిళ్ళదినె్న (తుడుముల దినె్న) గ్రామాన్ని ఏక భోగాగ్రహారంగా నాచన సోమనకు ఇచ్చినట్లు ఈ శాసనం పేర్కొంటున్నది. నాచన సోముడు బుక్కరాయలనుండి పెంచుకలదినె్న అగ్రహారాన్ని స్వీకరించింది క్రీ.శ.1344లో. ప్రౌఢ దేవరాయలు రాజైంది క్రీ.శ.1406లో. అంటే మొదటి అగ్రహారాన్ని స్వీకరించడానికి రెండో అగ్రహారాన్ని స్వీకరించడానికి మధ్య 62 సంవత్సరాల కాలవ్యవధి ఉంది. అప్పటికి నాచన సోమన వయసు దాదాపు 90 సంవత్సరాలపైనే ఉంటుంది. మొదటి అగ్రహారాన్ని స్వీకరించినపుడు అతని వయసు కనీసం 30 సంవత్సరాలనుకున్నా, రెండో అగ్రహారాన్ని మొదటి దేవరాయల మొదటి పరిపాలనా సంవత్సరం (క్రీ.శ.1406)లో స్వీకరించినా, నాచన సోమన వయసు 92 సంవత్సరాలవుతుంది. అంటే నాచన సోమన దాదాపు నూరు సంవత్సరాలు జీవించినట్లు భావించవచ్చు.
ఇక కడప జిల్లాలో లభించిన రెండో శాసనం శ్రీకృష్ణదేవరాయలు (క్రీ.శ.1509-1529)కు చెందింది. ఈ శాసన కాలం క్రీ.శ.1529. ఈ శాసనం కృష్ణదేవరాయలు నాచన సోమనకు అగ్రహారం ఇచ్చినట్లుగా గాక, తుడుములదినె్న గ్రామాన్ని నాచన సోమన అగ్రహారంగా పేర్కొంటూంది. అంటే ప్రౌఢదేవరాయల కాలంనుండి, కృష్ణదేవరాయల కాలంవరకు ఇది నాచన సోమన అగ్రహారంగానే ఉంటుంది. నాచన సోమన తరువాత దాదాపు నూరు సంవత్సరాలవరకూ అతని కుటుంబ సభ్యులే దీన్ని అనుభవించే వారనడానికి ఈ శాసనమే నిదర్శనం. మొదటి బుక్కరాయల శాసనానికి (క్రీ.శ.1344), కృష్ణదేవరాయల శాసనానికి (క్రీ.శ.1529) మధ్య 185 సంవత్సరాల కాలవ్యవధి ఉంది. దాదాపు మూడు తరాలుగా సోమన వారసులు విజయనగర రాజులు ఇచ్చిన అగ్రహారాలను అనుభవించేవారని భావించవచ్చు. అతని వారసులు కడప జిల్లాలోని తుడుములదినె్నలోనే స్థిర నివాసం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే సోమన వారసుల పేర్లుగానీ, వారి రచనలుగానీ మనకేమీ తెలియడంలేదు.
సాధారణంగా అగ్రహారాలను దానంగా ఇచ్చేటప్పుడు అన్ని హక్కులతో అష్ట్భోగ తేజస్వామ్యంగా ఇవ్వడం ప్రాచీన కాలంనుండీ వస్తున్న సాంప్రదాయం. ఒక రాజు దానంగా ఇచ్చిన అగ్రహారాన్ని అతని వారసులు గౌరవించేవారు. ఎటువంటి ఆటంకాలు కల్పించేవారు కాదు. అందువల్లనే దానగ్రహీత పోయినా అతని వారసులు అన్ని హక్కులతో అగ్రహారాలను అనుభవించేవారు. ఇట్లా తెలుగులో ఒక ప్రసిద్ధకవి పేరు 185 సంవత్సరాల సుదీర్ఘకాలంలో, విభిన్న సందర్భాల్లో శాసనాల్లో పేర్కొనబడడం ఒక అపురూపమైన, అరుదైన విషయంగా భావించవచ్చు.

- డా. నాగోలు కృష్ణారెడ్డి, 9441112636