సబ్ ఫీచర్

భావ కవితా చక్రవర్తి కృష్ణశాస్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వంలో భాష, భావ శిల్పాలలో పరాకాష్టనందుకొని మహాకవిగా, భావ కవితా చక్రవర్తిగా, వక్తగా, దేశభక్తుడిగా, గాయకుడిగా, మానవతవాదిగా, హాస్యప్రియుడిగా, సహృదయుడిగా ప్రజల మనస్సుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న విశిష్ట కవి దేవులపల్లి కృష్ణశాస్ర్తి గారు. వీరి కవిత్వం ఎప్పటికీ నిత్యనూతనమే. ఆకాశంలో మిలమిల మెరిసే తార కృష్ణశాస్ర్తి కవిత. కృష్ణశాస్ర్తి పాండిత్యం కంటే ప్రతిభ నవ నవోనే్మషంగా ఉంటుంది. తన కవిత స్వేచ్ఛా ప్రీతితో ఉయ్యాలలూగించడమే కాకుండా, విరహాన్ని, విషాదాన్ని, ప్రకృతిని తిలకించగానే కలిగే భావావేశాన్ని, ఆవేదనను, ఆర్తిని, ఉరకలు వేసే ఉత్సాహాన్ని సమపాళ్ళలో నింపుకొని కవితాగానం చేసిన భావకవులలో వీరు అగ్రగణ్యులు. భావకవిత్వం 1910లో పురుడు పోసుకుంది. దీనికి సాహిత్యంలో తొలి బీజాలు నాటిన వారు రాయప్రోలు, అబ్బూరి. అయితే దీనికి 1920లో అఖిలాంధ్ర ప్రాచుర్యం కల్పించిన వారు కృష్ణశాస్ర్తి.
‘ఆంధ్రా షెల్లీ’గా కీర్తింపబడిన కృష్ణశాస్ర్తి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర్లోని రామచంద్రపాలెంలో 1897 నవంబర్ 1న జన్మించారు. పండిత వంశంలో జన్మించిన వీరికి చిన్నతనంలోనే సాహిత్య బీజం పడింది. పసిప్రాయంలోనే సామర్లకోటలో జరిగిన సాహిత్య సభలో గళం విప్పి ఆశుకవిత్వం చెప్పి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. రాశి కంటే రమ్యతకే ప్రాధాన్యం ఒసిగిన కృష్ణశాస్ర్తి కాలము మారినప్పుడు కవిత్వం మాత్రం మారకుండునా అని కవిత్వంలో నూతన భావాలకు కవాటాలు తెరిచిన భావప్రియుడు. కృష్ణపక్షం, ప్రవాసము, ఊర్వశి, కన్నీరు, నిశ్రేణి, పల్లకి లాంటి ఖండకావ్యాలు, గేయ నాటికలు, సంగీత రూపకాలు, లలిత గీతాలు, సినీ గీతాలు, అనువాదాలు చేపట్టారు. ప్రకృతి కవిత్వాన్ని, ఆత్మాశ్రయ కవిత్వానే్న కాకుండా హాస్యాన్ని పండించడంలో చతురుడు. వీరు పద్యమే కాకుండా చక్కని వ్యాసాన్ని రాయడంలో సిద్ధహస్తులు. ఆ రోజుల్లో పుట్టి ఉంటే, బహుకాల దర్శనం, పుష్పలావికలు పేర్కొనదగినవి.
కృష్ణశాస్ర్తి రాసిన కొన్ని గేయాలు ప్రకృతి కవిత్వానికి, స్వేచ్ఛా భావనకు, విషాద యోగానికి ఎత్తిన పతాక. దేవులపల్లి ప్రకృతి ప్రీతికి, స్వేచ్ఛా కాంక్షకి, స్వేచ్ఛా విహారానికి కృష్ణపక్షంలోని స్వేచ్ఛాగానం చిహ్న పతాక.
‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు
నా ఇచ్ఛయే గాక నాకేటి వెఱపు
పక్షినయ్యెద చిన్న ఋక్షమయ్యెదను
మధుపమయ్యెద చందమామ వయ్యెదను
మేఘమయ్యెద వింత మెరపు నయ్యెదను’’
- అంటూ తన స్వేచ్ఛా ప్రియత్వాన్ని చాటారు.
‘‘తిమిర లత తారకా కుసుమముల దాల్చ
కర్కశ శిలయు నవ జీవ కళల దేర
మ్రోడు మోక చివురు లెత్తి మురువు సూప
జగము నిండా స్వేచ్ఛాగాన ఝరుల నింతు’’ అంటున్న పంక్తుల్లో దట్టమైన చీకటిని తారక తానై లోకాన్ని వెలుగుతో నింపి ప్రజల జీవితాల్లో పువవులు పూయిస్తూ, కఠిన శిలవలె పడిఉన్న జనాన్ని తన కవితతో చైతన్యపరిచి వారిలో జీవత్వం ఉట్టిపడేలా, మ్రోడుబోయిన చెట్ల లాంటి వారి జీవితాల్లో నిరాశను దూరం చేసి వారి కొరికల సాధనకు కృషి చేస్తానంటాడు కవి.
‘‘ఒక్క సేరు మాంస మూదేయ గలరయా
ఏటి కొక్క బిడ్డ నిట్టె కందు
రసలు యోధవరులు సిసలైన శ్రీవారు
విశ్వదాభిరామ వినుర వేమ’’ అని గడుసరి ఇల్లాలు తన మగడితో వేళాకోళమాడిన సన్నివేశం బహు చమత్కారం.
‘‘జయ జయ ప్రియభారత / జనయిత్రీ దివ్యధాత్రి / శత సహస్ర నరనారీ / హృదయనేత్రి’’ అంటూ దేశభక్తిని, దేశం పట్ల తనకు గల మక్కువను ఈ గేయం ద్వారా తెలియజేశారు. విశ్వకవి రవీంద్రుని స్నేహాన్ని, అతని సాహిత్య అభిరుచులను చవిచూశాడు కావుననే మన జాతీయగీతం తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పై గేయాన్ని రచించాడు. కృష్ణశాస్ర్తి చలన చిత్రరంగంలో ప్రవేశించి తనదైన శైలిలో సినీ గేయాలు వ్రాసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. వీరి ప్రతి పాటలో భావ సౌకుమార్యం, పద లాలిత్యం స్పష్టంగా కనబడుతుందనడానికి వారు రాసిన పాటలే నిదర్శనం. భావ కవులను ముద్దు కృష్ణ జ్వాల, కొంపెల్లి జనార్దనరావు ఉదయిని పత్రికల ద్వారా ప్రోత్సహించారు. భావకవిత్వానికి కొందరు గొడుగు పడితే, పని గట్టుకొని భావకవిత్వం అసలు కవిత్వమే కాదని నిరసనలు వెలిబుచ్చిన వారిలో ముఖ్యులు అక్కిరాజు ఉమాకాంతం, అనంత పంతుల రామలింగస్వామి. వీరు ‘నేటి కాలపు కవిత్వం’, ‘శుక్లపక్షము’ కావ్యాల ద్వారా భావకవిత్వంపై నిరసనలు తెలిపారు. ఇలాంటి సమయంలో మీరేమైనా సమాధానం రాయకూడదూ వీళ్ళ నోళ్ళు కట్టేలా అని కొందరడిగితే పద్యాలు రాసుకుంటూ పోవడమే దానికి జవాబు అని గంభీరమైన తన గానంతో పలువురి భావకవుల కవనాలను ఊరూరా తిరిగి ప్రచారం చేశారు కృష్ణశాస్ర్తిగారు.
‘‘నాకుగాదులు లేవు నాకుషస్సులు లేవు
నేను హేమంత కృష్ణానంత శర్వరిని’’ అని పూర్వజన్మ స్మృతి గుర్తుకు తెచ్చుకుని, తానొక గంధర్వునిగా భావించుకున్నాడు. తన దుఃఖాన్ని వెలిబుచ్చుతూ ప్రేయసి కోసం అనే్వషించాడు.
‘‘ఏను మరణించుచున్నాను, ఇట నశించు
నా కొఱకు చెమ్మగిలిన నయనమ్ము లేదు..
అందుకే వెళ్ళిపోతున్నాను భువినుండి దివికి,
ఇక దిగిరాను దిగిరాను దివినుండి భువికి’’ అంటూ సుప్రశాంత సుందర తీరాలకు ప్రవాసిగా వెళ్ళిపోయిన కృష్ణశాస్ర్తిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కృష్ణశాస్ర్తి బాధ ప్రపంచానికి బాధ అన్న చలం మాటల వెనుక దాగిన ఆంతర్యాన్ని గ్రహిద్దాం.

*
నవంబర్ 1న దేవులపల్లి జయంతి సందర్భంగా...

- డా. వి. గంగారావు 9948875892