సబ్ ఫీచర్

అచ్యుత దేవరాయలూ అష్టదిగ్గజ కవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన, మధ్యయుగ చరిత్ర నిర్మాణానికి శాసనాలు, ముఖ్యమైన ఆధారాలు కొత్త శాసనాలు వెలుగులోకి వచ్చినప్పుడు చరిత్రను పునర్నిర్మించుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో తప్పక చేర్చాల్సిన మరోకవి ‘కృష్ణదేవరాయ భూషణ అచ్యుత దేవరాయ భూషణుడు’ మరో శాసనం ద్వారా వెలుగులోకి వచ్చాడు. దీనివలన కృష్ణదేవరాయల ‘్భవన విజయం’ లోని అష్టదిగ్గజ కవుల గురించి మరోసారి చర్చించుకోవాల్సిన అవసరం కలిగింది. ఆ విశేషాలను ఇప్పుడు పరిశీలిద్దాం. శ్రీకృష్ణదేవరాయల ‘్భవన విజయం’ లోని అష్టదిగ్గజ కవులెవరు? అనే విషయంగా చాలామంది సాహిత్య, చరిత్రకారులు అనేక చర్చలుచేసి విభిన్న అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పట్టికను తయారుచేశారు. అయితే ఇప్పటికీ అష్టదిగ్గజ కవులెవరనే విషయంలో పండితుల్లో ఏకాభిప్రాయం లేదు. ఇప్పటికీ చలామణిలోఉన్న, చాలామంది అంగీకరించిన అష్టదిగ్గజ కవులు -
1. అల్లసాని పెద్దన (మనుచరిత్ర), 2. నంది (ముక్కు) తిమ్మన (పారిజాతాపహరణం), 3. ధూర్జటి (కాళహస్తి మహాత్మ్యం, కాళహస్తీశ్వర శతకం), 4. తెనాలి రామలింగ కవి (పాండురంగ మహాత్మ్యం, ఉద్భటారాధన చరిత్ర), 5. భట్టుమూర్తి (రామరాజభూషణుడు)- (నరస భూపాలీయం, వసు చరిత్రం), 6. పింగళి సూరన (కళాపూర్ణోదయం, రాఘవ పాండవీయం, ప్రభావతీ ప్రద్యుమ్నం), 7. మాదయగారి మల్లన (రాజశేఖర చరిత్రం), 8. అయ్యలరాజు రామభద్రుడు (రామాభ్యుదయం)
వీరుకాకుండా పండితులు చర్చించి పక్కనపెట్టిన కవుల్లో శంకరకవి, కవిరాట్టు, కందుకూరి రుద్రకవి, సంకుసాల నృసింహకవి ముఖ్యులు. పైన పేర్కొన్న అష్టదిగ్గజ కవుల్లో చాలామంది కృష్ణదేవరాయ కాలానికి చెందినవారు కాదు. వీరిలో కొందరు తమ కావ్యాలను తరువాతి కాలానికి చెందిన పాలకులకో, మంత్రులకో, ఉన్నతాధికారులకో అంకితమిచ్చారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మనల విషయంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. వారికి సంబంధించి శాసన ప్రమాణాలు కూడా ఉన్నాయి. వీరు తమ కావ్యాలను కూడా కృష్ణదేవరాయలుకే అంకితమిచ్చారు. మాదయగారి మల్లన, ధూర్జటి కూడా అష్టదిగ్గజాల్లోని కవులేనని కొందరు నిరూపించారు. మిగతావారి విషయంలోనే పండితుల్లో ఏకాభిప్రాయం లేదు.
పింగళి లక్ష్మీకాంతంగారు అష్టదిగ్గజాల్లో తెలుగు కవులేగాకుండా ఇతర భాషాకవులు కూడా ఉన్నారనే కొత్తవాదాన్ని తీసుకొచ్చాడు. ‘కృష్ణదేవరాయలు మొత్తం దక్షిణ భారతదేశానికంతా పాలకుడని, సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ భాషల్లో పాండిత్యం ఉండే రాయలు అష్టదిగ్గజ సారస్వత సింహాసనాలపై కేవలం తెలుగుకవులనే కూర్చోబెట్టాడంటే అది అతనికి అపచారం చేసినట్లవుతుందని పింగళి భావించాడు. భువన విజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి తెలుగు కవులని మిగతా ముగ్గురు ఇతర భాషాకవులని పేర్కొన్నాడు. చాగంటి శేషయ్య కూడా ఈ వాదాన్ని సమర్ధించాడు. పెద్దన, తిమ్మన, మల్లన, ధూర్జటి, కృష్ణదేవరాయ భూషణుడు అనే అయిదుమంది తెలుగువారని, కృష్ణావధానులు అనే సంస్కృత కవి, కర్ణాటక కవికుల సార్వభౌముడు తిమ్మణ్ణ, కన్నడ భాగవతకర్త చాటు విఠలనాధుడు కలిసి అష్టదిగ్గజాలుగా ఉండేవారని కొర్లపాటి శ్రీరామమూర్తి అభిప్రాయపడ్డాడు.
ఈ వాదాన్ని చాలామంది తెలుగు సాహిత్య విమర్శకులు అంగీకరించలేదు. ఎందుకంటే అష్టదిగ్గజ ప్రశంస, సాంప్రదాయం కేవలం ఒక్క ఆంధ్రదేశంలో తప్ప సంస్కృత, కన్నడ, తమిళ భాషల్లో లేదు. విజయనగర సామ్రాజ్యానంతరం కూడా ఈ సాంప్రదాయం ఆంధ్రదేశంలో కొనసాగింది. ఆంధ్ర రాజులైన తంజావూరు నాయక రాజులు, తరువాతి కాలంలో పెద్దాపురం, కార్వేటినగరం, గద్వాల లాంటి సంస్థానాలు ఈ సాహితీ సాంప్రదాయాన్ని కొనసాగించాయి. కాబట్టి తెలుగువారికే సొంతమని, అష్టదిగ్గజ కవులంతా తెలుగువారేనని మరికొందరు వాదించారు.
ఈ విషయాలను అటుంచితే, ఇప్పుడు అష్టదిగ్గజ కవుల్లో తప్పక చేర్చాల్సిన మరో కవి కృష్ణదేవరాయ భూషణ అచ్యుత దేవరాయ భూషణుడు. కడప జిల్లా పులివెందుల తాలూకాలోని లోమడ గ్రామంలో లభించిన క్రీ.శ.1547నాటి సదాశివరాయల కాలంనాటి ఒక శాసనం ద్వారా మొదటిసారిగా ఇతని పేరు వెలుగులోకి వచ్చింది. గండికోట సీమలోని నిట్టూరు గ్రామం ద్వారా వచ్చే మార్గసుంకం, సుంకం, గ్రామ కట్నం, మగ్గ స్థావరాలు మొదలైన పన్నులను కృష్ణదేవరాయ భూషణ అచ్యుత దేవరాయ భూషణునికి బహుమానంగా ఇచ్చినట్లు ఈ శాసనం పేర్కొంటున్నది. ఈ శాసనాన్ని పరిష్కరించిన ప్రముఖ శాసన పరిశోధకులు పి.వి.పరబ్రహ్మశాస్ర్తీ కృష్ణదేవరాయ భూషణ కొడుకైన అచ్యుత దేవరాయ భూషణుడని పేర్కొన్నాడు. ఇతను కృష్ణదేవరాయల, అచ్యుత దేవరాయల ఆస్థానాల్లో ఒక ఆభరణం లాగా వెలిగిన కవి అనే ఆలోచన పరబ్రహ్మశాస్ర్తీగారికి తట్టలేదు. ఈ శాసనాన్ని పునఃపరిశీలించి ఇతన్ని అష్టదిగ్గజ కవుల్లో ఒకనిగా చేర్చిన మొదటి వ్యక్తి-ప్రముఖ చరిత్ర పరిశోధకులు చెళ్ళపిళ్ళ సోమసుందరరావు. సాధారణంగా శాసనాల్లో రెండు పేర్లు పక్కపక్కన వచ్చినప్పుడు మొదటిది తండ్రి పేరుగా, రెండోది కొడుకు పేరుగా పరిగణిస్తారు. అందువలనే పరబ్రహ్మశాస్ర్తీ కూడా అలా భావించారు. అయితే ఈ శాసనంలో ఇవి బిరుదులు. ఈయన అసలు పేరు తెలియదు. ఈ బిరుదులనుబట్టి ఇతడు కృష్ణదేవరాయలు, తరువాత అచ్యుత దేవరాయల ఆస్థానాల్లో ఆభరణంలాగా ఉండేవాడని భావించవచ్చు.
ఇలా రాజాస్థానాల్లో ఆభరణాలుగా భాసించిన కొందరు కవులు మనకు విజయ నగరరాజుల కాలంలో కనిపిస్తారు. వేంకటరాయ భూషణుడు, అచ్యుతదేవరాయల కొడుకు వెంకటరాయల (క్రీ.శ.1542) ఆస్థానంలో రామరాజ భూషణుడు అళయ రామరాయల (సదాశివరాయల రాజప్రతినిధి క్రీ.శ.1542 -1565) ఆస్థానంలో ఆభరణాలుగా ఉండేవారు. అలాగే కృష్ణదేవరాయ భూషణ అచ్యుత దేవరాయ భూషణుడు అటు కృష్ణదేవరాయలు, ఇటు అచ్యుతదేవరాయల ఆస్థానంలో ఉండేవాడని, అష్టదిగ్గజ కవుల్లో ఒకడని నిస్సందేహంగా భావించవచ్చు.
లోమడ శాసనం వెలుగులోకి రాకముందే కొర్లపాటి శ్రీరామమూర్తి కృష్ణదేవరాయ భూషణుడనే కవిని అష్టదిగ్గజ కవుల్లో ఒకడిగా చేర్చాడు. అందుకతను చిత్రాంగద చరిత్రను ప్రమాణంగా తీసుకున్నాడు. పైడిమర్రి వెంకటపతి (సుమారు క్రీ.శ.1650-1700 ప్రాంతం) తన చిత్రాంగద చరిత్ర కావ్యంలో మొదటిసారిగా కృష్ణదేవరాయ భూషణుని పేర్కొన్నాడు. ఇందులో కవి తన గురించి చెప్పుకునే సందర్భంలో తాను పర్వతరాజు కొడుకునని, కేశవరాజు మనవడినని, రామరాజు మునిమనవడినని, కృష్ణదేవరాయ భూషణ వంశానికి చెందిన వాడనని పేర్కొన్నాడు. అయితే ఇతని ముత్తాతకు, కృష్ణదేవరాయ భూషణునికి మధ్య ఉన్న సంబంధం తెలియదు. బిరుద నామాన్నిబట్టి కృష్ణదేవరాయల ఆస్థానంలో ఆభరణంలాగా ఉండేవాడని కొర్లపాటి నిర్ధారించి అష్టదిగ్గజ కవుల్లో ఒకడుగా చేర్చాడు. ఇతని పాండిత్యం గురించి కానీ, రాసిన కావ్యాల గురించి కానీ వివరాలేమీ తెలియవు. కడప జిల్లాలోని లోమడ గ్రామంలో లభించిన శాసనంద్వారా ఇతను కృష్ణదేవరాయలు (క్రీ.శ.15-9-1529) అచ్యుతదేవరాయలు (క్రీ.శ. 1529 - 1542) ఆస్థానాల్లో ఉండేవాడని అందుకే శాసనంలో కృష్ణదేవరాయ, అచ్యుతదేవరాయ భూషణ అని ప్రస్తుతింపబడ్డాడని నిర్ధారించవచ్చు. కృష్ణదేవరాయ భూషణుని అష్టదిగ్గజ కవుల్లో ఒకడని పేర్కొన్న కొర్లపాటి. విజయనగర రాజులందరిలాగే అచ్యుత దేవరాయల ఆస్థానంలోకూడా ఒక అచ్యుతదేవరాయ భూషణుడు కూడా ఉండి ఉంటాడనే సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఈ శాసనంద్వారా అతని ఊహ నిజమైంది. అతను పేర్కొన్న కృష్ణదేవరాయ భూషణుడే అచ్యుతదేవరాయ భూషణుడు కూడా అయ్యాడు. ఇలా ఒకే కవి ఇద్దరు రాజుల ఆస్థానాల్లో ఆభరణంగా ఉండడం తెలుగు సాహిత్యంలో ఒక అరుదైన విషయంగా భావించవచ్చు.

- డా. నాగోలు కృష్ణారెడ్డి 9441112636