సబ్ ఫీచర్

‘నానారుచిరార్థసూక్తినిధి’గా నన్నయ పాత్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానా (వివిధములైన) రుచిర (స్ఫూర్తివంతములైన) అర్థ (్భవములతో నిండినవైన) సూక్తి (మంచి మాటల) నిధి (నిధి - వంటివాడు) మనకు నన్నయ భట్టారకుడు. ఆదికవిగా ప్రసిద్ధుడు. ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ అన్న పేరుతో సంస్కృత భాషలో వున్న తెలుగు వ్యాకరణానికి కర్త. అది లక్షణ గ్రంథ కాగా, లక్ష్య గ్రంథంగా సంస్కృత వ్యాస భారతాన్ని తెలుగులో రచించే ప్రక్రియను మొదలుపెట్టి ఆ కావ్యాన్ని అరణ్యపర్వం, చతుర్థాశ్వాసం 141వ పద్యం దాకా పూరించిన కవిశేఖరుడు. ఈ ప్రక్రియలో అక్షర రమ్యతను పాటిస్తూ నానా రుచిరార్థసూక్తినిధిత్వాన్ని కూడా పోషిస్తానని ఆయన తన పోషక ప్రభువు రాజరాజ నరేంద్రునికి ఆరంభంలోనే మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో, ఆ పాత్రను సమర్థవంతంగా పోషించడంలో నన్నయ ఎలా సఫలీకృతుడయినదీ ఆయన రచించిన ఆంధ్ర భారత భాగాన్నుంచి మచ్చుకి కొన్ని పద్యాలను ఉదహరించి వివరించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.
కడుకొని కడు దుఃఖములై
నెడ నుచితమె? యాత్మనింద యెయ్యెడల మనం
టెడలక యేకాకృతి నె
ప్పుడు నుండుట సూవె పురుషు పురుషార్థ మిలన్.
అరణ్యపర్వం, చతుర్థాశ్వాసం, 113వ పద్యం, కందం.
ఆత్మనింద అనుచితమని, అది వ్యక్తిని కార్యోన్ముఖత్వాన్నుంచి విముఖుడిని చేస్తుందనీ, ఆధునిక మేనేజ్‌మెంట్ సూత్రాలలో కూడా చెబుతారు. నన్నయ పై పద్యంలో చెప్పినది కూడా అదే! కష్టాలు వచ్చినపుడు కృంగిపోయి ఆత్మనింద చేసుకోవడం తగని పని; కష్టాలలోనూ సుఖాలలోనూ ఒకేవిధమైన మనఃస్థితితో వుండడం సరైనది అని పై పద్యం భావం.
జనులు నిగ్రహానుగ్రహశక్తుడైన
రాజు శాసనమున జేసి రమణతోడ
నోలి దమ తమ మర్యాద లొక్కనాడు
దప్ప నోడుదు రిమ్మహీతలమునందు
ఆరణ్యపర్వం, తృతీయశ్వాసం. 350వ పద్యం. తేటగీతి.
నిగ్రహానుగ్రహశక్తుడైన రాజు - దయజూపడంలోనూ దండించడంలోనూ సమాన విచక్షణ గలిగిన సమర్ధుడైన రాజు చేసే శాసనం వలన ప్రజలు తమతమ విధులను భయభక్తులతో నిర్వర్తిస్తారు. ఆ కారణంచేత రాజ్యంలో అందరూ సుఖసంతోషాలతో ఉంటారు అని పై పద్యం భావం. అయితే, రాజుల రోజులు ఎప్పుడో పోయి, ప్రజలే రాజులైన ఈ ప్రజాస్వామ్యపు రోజులలో ఈ పద్యం యొక్క ఔచిత్యం ఏమిటని సందేహం వస్తుంది గాని, నిజానికి, ప్రజలు ఎన్నుకోవాల్సి ప్రభుత్వం ఎలాంటిదై వుండాలన్న ప్రశ్నకు సమాధానం, నన్నయ ఈ పద్యంలో చెప్పినట్లుగా, నిగ్రహానుగ్రశక్తుడైన రాజులాంటిదై వుండాలన్నది సారాంశం.
గురుశుస్రూష యొనర్చుచు
పరమక్లేశమున జేసి పడసిన విద్యల్
స్ఫురియించుగాక; గురుముఖ
నిరహితముగ బడసినవియు వెలయునె యెందున్?
అరణ్య పర్వం, తృతీయాశ్వాసం, 282వ పద్యం, కందం.
భక్తిశ్రద్దలతో గురువుగారికి పరిచర్యలు చేస్తూ అభ్యసించిన విద్య శోభిస్తుంది గాని, అలా నేర్వని విద్య అవసరానికి స్ఫురించక శోభించదు అని ఈ పద్యం భావం. పూర్వ విధానంలోనే కాదు, ఇప్పటికీ ఈ పద్యంలో చెప్పబడిన పద్ధతి సంగీతాది విద్యల విషయంలో తప్పక వర్తిస్తుంది.
అలయక యేండ్లు గడుం బె
క్కులు జీవించుట నర గలుగుటయుం దగు వృ
ద్ధుల లక్షణమే? జ్ఞానము
గల డేనిన్ బాలుడయిన గడు వృద్ధు మహిన్
అరణ్యపర్వం, తృతీయాశ్వాసం, 248 పద్యం, కందం.
వయసు పెరగడం, వెంట్రుకలు నెరవడం, జ్ఞానత్వానికి లక్షణమా? అంటే కానేకాదు అని ఈ పద్యం తాత్పర్యం. జ్ఞానం కలవాడైతే బాలుడైనా వృద్ధుడే, అంటే వృద్ధునితో సమానంగా ఆయా సన్నివేశాలలో సందర్భోచితంగా పూజార్హుడే అని నన్నయ నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పిన మాట.
పరహిత ఫలవంతులు సు
స్థిరమూలాన్వితు లపాపధీరతులు పర
స్పరసంశ్రయమున జీవిం
తురు మనుజులు వనములోని ద్రుమములపోలిన్.
ఆదిపర్వం, షష్ఠాశ్వాసం, 183వ పద్యం, కందం.
తోటివారికి మేలు చేయడమే లక్ష్యంగా కలవాళ్ళు, స్థిరమైన నివాసం కలిగి వుండి పాప చింతనతో ప్రమేయం లేని వాళ్ళు, వనంలో వృక్షాల వలె ఒకరినొకరు ఆశ్రయించి కలిసిమెలసి జీవిస్తారు అని పద్యం భావం. ఇతరులు ఆహారంగా తీసుకోవడానికి వీలయ్యే ఫలాలను ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుని పెరిగే వృక్షానికి, పరోపకారమే ఆశయంగా జీవితాన్ని గడిపే సజ్జనునికి ఈ పద్యంలో మనోరంజకమైన పోలిక కూర్చి చెప్పాడు నన్నయ.

ఆపద యైనను ధర్మువ
ప్రాపుగ రక్షింపవలయు పరమార్థాము; ధ
ర్మాపాయమ ధార్మికులకు
నాపద జన్మాంతరమున అనుగత మగుటన్.
ఆదిపర్వం, షష్ఠాశ్వాసం, 221వ పద్యం, కందం.
తన ప్రాణానికి ఆపద వాటిల్లే విపత్కర సందర్భాలలో సైతం, ధర్మాన్ని రక్షించే విధంగా ప్రవర్తించడమే ధర్మాన్ని పాటించడమంటే! ఎందుచేతనంటే, ధర్మం రక్షించబడని విధంగా ప్రవర్తించడమే ధార్మికునికి నిజమైన ఆపద. జన్మాంతరంలో కూడా అదే వెంట వస్తుంది కనుక ఎల్లప్పుడూ ధర్మం రక్షించబడే విధంగానే ప్రవర్తించాలి అన్నది సారాంశం.
అడవులు నేరులు నివి నీ
పడసిన యవి యట్టె; పుణ్య భాగీరిథి యి
ప్పుడమి గల జనుల కెల్లను
నెడపక సేవ్యంబ కాక యిది నేయదియే?
ఆదిపర్వం, సప్తమాశ్వాసం, 41వ పద్యం, కందం.
అడవులు, నదులు ఈ భూమి మీద ఏ ఒక్కరి సంపాదనా ఫలితాలా? పుణ్య భాగీరథి (గంగానది) ఈ భూమి మీద అందరూ సేవించడానికి తీసుకొనిరాబడినదే గానీ, ఏ ఒక్కరు సేవించడానికో కాదు గదా? ప్రకృతి సిద్ధంగా ప్రాప్తించిన సంపదైన నదులూ, అరణ్యాలూ ఈ భువిపై జనులందరి ఉమ్మడి ఆస్తి తప్పితే, ఏ ఒక్కరి సొత్తో కాదు అన్న సామ్యవాద సామాజిక భావన వెయ్యేళ్ళ క్రితమే నన్నయచే విశదీకరించబడింది.
కీర్తి లేని వానికిని జీవనంబు ని
రర్థకంట చూవె! యవనిమీద
నిత్య మయిన ధనము నిర్మల కీర్తియ;
యట్టి కీర్తి వడయు టశ్రమంటె?
ఆదిపర్వం, ఆష్టమాశ్వాసం, 31వ పద్యం, ఆటవెలది.
మరణించిన తరువాత కూడా మనిషి బ్రతికి వుండాలంటే, బ్రతికుండగా మంచి పనులు చేసి కీర్తి గడించాలి. ఈ భూమి మీద నిత్యమైన ధనం ఏదంటే నిర్మలమైన కీర్తి మాత్రమే! అలాంటి సంపదను పొందాలంటే ఎంతగా శ్రమించాలి? శ్రమ లేకుండా సాధ్యపడేది కాదని భావం.
అనుపమ నియమాన్వితులై
యనూనదక్షిణల గ్రతుసహస్రంబులు సే
సినవారికంటే నక్రో
ధనుడ గరం బధికుడండ్రు తత్త్వవిధిజ్ఞుల్.
ఆదిపర్వం, ద్వితీయాశ్వాసం. 146వ పద్యం, కందం.
‘తన కోపమె తన శత్రువు. తన శాంతమె తనకు రక్ష’ - అని సుమతి శతకంలో చదువుకుంటాం. దీనికి మూలమైన భావ సందోహం నన్నయ భారతంలోని ఈ పద్యంలోనూ, ప్రథమాశ్వాసంలో ‘క్రోథమ తపముంజెరరచును’ అనే పద్యంలోనూ ఉన్నాయనిపిస్తుంది. అతి కఠినమైన నియమనిష్టలతో భూరిదక్షిణలిచ్చి వేలకొలది యజ్ఞాలు చేసిన వారికంటే, అక్రోధనుడు - అంటే కోపం రాకపోవడమే ధనముగా కలవాడు మిక్కిలి గొప్పవాడు, పరమార్థం తెలిసిన వాడు అని ఈ పద్యం చెబుతుంది.
ఎరుక గలవారి చరితలు
గరుచుచు, సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెరుగుచు, నెరిగిన దానిని
మరువ కనుష్ఠించునది సమంజసబుద్దిన్
ఆదిపర్వం, తృతీయ శ్వాసం, 203వ పద్యం, కందం.
జ్ఞానవంతులుగా ప్రసిద్ధులైన వ్యక్తుల చరిత్రలు మక్కువతో అభ్యసిస్తూ, సజ్జనులతోటి సమావేశమైన సందర్భాలను విడవక ధర్మాధర్మాలను గురించి తెలుసుకుంటూ, అలా తెలుసుకున్న దానిని అలాగే వదిలేయకుండా న్యాయమైన బుద్ధితో ఆచరణలో పెట్టాలని పై పద్యం ద్వారా నన్నయ చేసిన ఉపదేశం ఎంతైనా అనుసరణీయమైనది.
ఆంధ్ర మహాభారతంలో మొత్తం గద్యపద్య సంఖ్య 21,507. అందులో నన్నయ భట్టారకుని భాగం 3,998. అందులోంచి ఏరి కూర్చిన 10 పద్యాల సూక్తి కదంబం ఈ చిరు వ్యాసంలోనిది. కొండను అద్దంలో చూపే ప్రయత్నం లాంటిది. అయినా, ఇందులోని ప్రతి పద్యంలోనూ నన్నయ రుచిరార్ధసూక్తి దక్షత ద్యోతకమై కనబడుతూ, రాజరాజుకు తానిచ్చిన మాటను ఆయన ఎంత సమర్ధవంతంగా నిర్వహించాడో విశదమవుతుంది.
నేటికి ఒక తరం క్రితం దాకా, భాగవతంలోనివో, సుమతి వేమన శతకాల్లోనివో కనీసం పది పద్యాలన్నా నోటికి రాని తెలుగువాడు ఉండేవాడు కాదని చెప్పుకొనేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కారణాలేవైతేనేం, పద్యం తెలుగువారు పోగొట్టుకుంటున్న ఆస్తిగా తయారయింది. అలా జరగడం తెలుగువారి సాంస్కృతిక, సాహిత్య చరిత్రలో ఒక శోచనీయమైన ఘట్టంగా పరిణిమంచి మిగిలిపోతుంది. మొత్తంగా తెలుగు జాతికే అది అనర్ధదాయకం. అది జరకుండా చూడడం ప్రతి తెలుగువాడి బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఒక భాగం పూర్వకవి విరచిత కావ్యాలలోంచి పద్యాలను స్మరణం చేయడం, అందుకు అన్ని విధాల అనుకూలమైనవిగా అనుపించే పద్యాలు ప్రథమంగా నన్నయ భారతంలోనివే అయి వుంటాయనడంలో ఏ సందేహమూ వుండబోదు.

- భట్టు వెంకట్రావ్